Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సహాయం

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘సహాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

టీవీలో వార్తలు చూస్తున్న విజయ్, భార్య అరుపు లాంటి పిలుపుకి ఉలిక్కి పడ్డాడు.

“ఏమండీ ఏం జరిగిందో తెలుసా?” అంది రాధ.

టీవీ కట్టేసి, “చెప్పు, వింటాను” అన్నాడు.

రాధ సంగతి తెలుసు అతనికి. ఆశ్చర్యాన్ని, ఆవేశాన్ని, ఆవేదనని తట్టుకోలేదు. వెంటనే భర్తతో పంచుకోవాల్సిందే.

“నిన్న రాత్రి కూడా వుంది గొలుసు, పొద్దున్న నేను పూజకి వెళ్ళేటప్పుడు గమనించుకోలేదు, పూజ చేసుకుని బయటకి వచ్చేటప్పుడు కాంతమ్మ వచ్చిందని, తలుపు తీసి బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయాను..” అంటూ సీరియల్ లాగా చెపుతోంది.

విజయ్‌కి గుండె వేగంగా కొట్టుకుంది. కొంప తీసి ఆ 10 తులాల గొలుసు పోయిందా?.. కంగారు పడిపోయాడు.

విజయ్‌కి తెలుసు రాధ ఏ విషయం చెప్పినా, కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీసి చెప్తుంది. వినే వాళ్ళ నరాలు తెగాల్సిందే. చివర వరకు వస్తే కానీ, అసలు విషయం తెలియదు.

ఇంక ఆపుకోలేక “ఏంటీ! ఆ గొలుసు పోయిందా?”  ఆందోళనగా అడిగేశాడు.

“పోయిందన్న విషయం నేను కూడా గమనించ లేదండీ..” మళ్ళీ సస్పెన్స్ కంటిన్యూ చేస్తూ చెప్తోంది రాధ.

అడ్డొచ్చేడు. “అది సరేనోయ్ ..ఇంతకీ పోయిన గొలుసు దొరికిందా లేదా” అన్నాడు.

“దొరికింది కాబట్టే వివరంగా చెప్తున్నాను, మీ కంతా కంగారు” అంది.

ఆమె మాటల్లో ఒక్క విషయం అర్థం అయింది.. ‘పోయిన నగ దొరికింది, పోన్లే’ అనుకున్నాడు.

‘కొంపతీసి దొరకక పొతే చెప్పదు కాబోసు’ అనుకున్నాడు మనసులో.

వివరంగా మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది రాధ.

“నేను బట్టలు మార్చుకుని బెడ్‌రూం లోంచి వచ్చే సరికి, కాంతమ్మ హాలు తుడిచేసి, చీపురు పక్కన పెట్టి నిల్చుంది. ‘ఏం పని ఆపేసి నుంచున్నావేమి’ అని అన్నాను

‘చూడండమ్మా, ఆ మూల దివాను కింద దొరికింది, మీరు అంత విలువైన గొలుసు అలా పాడేసుకుంటారేటమ్మా’ అని అంది. గొలుసు దాని చేతిలో చూడగానే, మెడ తడుముకున్నాను. గుండె ఝల్లుమంది. ఎప్పుడు జారి పోయిందో అనుకుని, ఆమె చేతిలోంచి నా గొలుసు తీసుకున్నాను. లక్షల విలువ చేసే గొలుసుని ఆమె అలా తీసి ఇవ్వడం నాకు చాలా ఆనందం అనిపించింది. యెంత నిజాయితీ చెప్పండి” అంది రాధ.

అప్పుడు విజయ్‌కి గుర్తుకు వచ్చింది. కాంతమ్మ పనితనం, నిజాయితీ, నెమ్మదితనం రాధ విజయ్ దగ్గర చాల సార్లే ఏకరువు పెట్టింది.

ఇదివరకు ఒకసారి తాను పెరటిలో బాత్రూంలో దుద్దులు మర్చిపోయిందని, అప్పుడూ కాంతమ్మ తన దుద్దులు తెచ్చి ఇచ్చిందని చెప్పింది రాధ.

రాధకి తెలిసిన ఆవిడ కాంతమ్మని తీసుకొచ్చి 2 సంవత్సరాలకి పూర్వం పనిలో కుదిర్చింది. అప్పటి నుండీ నమ్మకంగా పని చేస్తూ ఉంటుంది.

కాంతమ్మ కుటుంబ విషయాలు పెద్దగా తెలియవు కానీ, భర్త లేని స్త్రీ అని, కొడుకు అవిటివాడు అని, ఆమె పూరి గుడిసెలో తన తల్లితో ఉంటుందని, కుటుంబ పోషణ కోసం ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటోందని తెలుసు విజయ్‌కి.

తానూ కూడా ఏదో ఒక ధన సహాయం చేయి రాధా అనడం, దానికి సమాధానంగా “కాంతమ్మ వూరికే డబ్బు తీసుకునే రకం కాదు, ఆత్మాభిమానం గల మనిషి కాబట్టి, ఏదయినా ఆమెకి శాశ్వతంగా వుండే సహాయం చేయాలి” అంటూ ఉండేది రాధ.

గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే వితంతు పెన్షన్ కోసం, కొడుకుకి వికలాంగుల పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరుగు తోందని ఆ మధ్య రాధ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.

ఇన్నాళ్లూ తానూ పని హడావిడిలో పట్టించుకోకుండా, సర్లే చూద్దాం అంటూ వచ్చేడు. ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చేయి విజయ్‌కి. మళ్ళీ రాధ గుర్తు చేసే లోపలే ఆ పనేదో చేస్తే బెటర్ అనుకున్నాడు.

“ఆమెని ఒకసారి రేపు నాకు వివరాలు చెప్పమను, నేను ఆమెకి వితంతు పెన్షన్, ఆమె కొడుక్కి వికలాంగుల పెన్షన్ వచ్చేలా ప్రయత్నం చేస్తాను” అన్నాడు.

రాధకి కూడా ఆ విషయం అప్పుడే మళ్ళీ గుర్తుకు వచ్చినట్లుంది.

“నేను అదే మళ్ళీ అడుగుదాం అనుకుంటున్నా.. అమ్మయ్య, ఇన్నాళ్ళకి దృష్టి పెట్టేరు అయ్యగారు. ఇంకా పని అయిపోయినట్లే” అంది సంతోషంగా. ఆమెకి విజయ్ మీద నమ్మకం. విజయ్ ఏ పనయినా పట్టుకోవడం ఆలస్యం కానీ, పట్టుకుంటే, ఏదో విధంగా సాధించే రకం.

విజయ్ ఒక ఐటీ కంపెనీ నడుపుతున్నాడు. ఉద్యోగ రీత్యా, పెద్ద పెద్ద కంపెనీలకి, గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్లి వస్తూ ఉంటాడు. కస్టమైజ్డ్ ఐటి ప్యాకేజెస్ సప్లై చేస్తూ ఆఫీస్ ఆటోమేషన్ బాగా చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు.

మర్నాడు సాయంత్రం విజయ్ ఏదో ఫైల్ చూసుకుంటున్నాడు.

పని చేసుకుని వెళ్లి పోతూ వచ్చి నుంచుంది కాంతమ్మ. చేతిలో బాగ్, కాగితాలతో వచ్చింది.. బహుశా రాధ వివరంగా చెప్పినట్లుంది.

కాంతమ్మ చేతులు కట్టుకుని నుంచోవడం చూసి, “ఏంటి కాంతమ్మ? నీకు వితంతు పెన్షన్, మీ అబ్బాయికి వికలాంగుల పెన్షన్ శాంక్షన్ అవడం లేదుట?” అన్నాడు.

“అవును అయ్యగారూ, ఆ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ బాగానే మాట్లాడుతున్నాడు బాబూ, కానీ, పంచాయతీ సెక్రటరీ తిక్క ప్రశ్నలు వేసి, చాలా అవమానిస్తున్నారు. మా అప్లికేషన్స్ ఎండిఓ దాక చేరనివ్వటం లేదు. ఎండిఓ గారిని చేరితే కదా, మా శాంక్షన్ ముందుకు వెళ్ళేది” అంది.

“మాకు ఇంక పెన్షన్ రాదని నిర్ణయానికి వచ్చేసేం బాబూ, ఈ మధ్య ఎండిఓ ఆఫీస్‌కి వెళ్లడం మానుకున్నాము” అంది.

“నీ వివరాలు చెప్పు” అని నోట్ చేసుకుని, ఆమె ఆధార్, వైట్ రేషన్ కార్డు కాపీలు, అలాగే పిల్లవాడి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాడు.

“సరే నేను ప్రయత్నిస్తాను, నువ్వేమీ దిగులు పడకు” అన్నాడు.

“సరే బాబూ, మీ దయ” అని వెళ్లి పోయింది.

మర్నాడు ఆ ఎండిఓ ఆఫీస్ కి వెళ్లి, ఆయన రూమ్‌లో ఆయన ముందు కూర్చున్నాడు.

అంతకు ముందు ఎండిఓ ఆఫీసులకి తన కంపెనీ నుండి ఐటి సాఫ్ట్‌వేర్ సప్లై చేసిన గుర్తుంది. కానీ, ముందు ఇప్పుడున్న ఎండిఓ ఎలాంటి వాడో, కాంతమ్మ ఫైల్ పొజిషన్ ఏమిటో తెలుసుకుని అవసరమయితే సిఇఓ ద్వారా, లేదా ఎం.ఎల్.ఎ. ద్వారా ఒక సారి ప్రత్నించవచ్చు అన్నది విజయ్ ఉద్దేశం.

ఎండిఓని విష్ చేసేడు. తన విజిటింగ్ కార్డు ఇచ్చేడు. అతను కార్డు చూస్తుండగా, అతనికి ఫోన్ వచ్చింది.

అవతలి వ్యక్తి స్నేహితుడేమో, చాలా సరదాగా, రిలాక్సింగ్‌గా మాట్లాడుతున్నాడు.

చేసేది లేక, వెయిట్ చేస్తూ, మాటలు వింటున్నాడు విజయ్.

ఎండిఓ ఇలా అంటున్నాడు:

“సరేరా సుధాకర్, 15 రోజుల్లో బొబ్బిలి మీటింగ్‌కి అన్ని ఏర్పాట్లు చెయ్యండి. నేను ఎల్లుండి వస్తాను. ఇప్పటి దాకా కలిసిన మన క్లాసు క్రికెట్ టీమ్‌లో 9 మంది సెల్ నంబర్స్ సంపాదించగలిగేమ్. 10వ వాడు రాజు గాడు. వాడు చనిపోయాడని తెలిసింది. వాడి కుటుంబ వివరాలు తెలియలేదు. ఇకపోతే, 11వ వాడు విజయ్. వాడి వివరాలు సంపాదించు. మన మీటింగ్ లోపల వాడిని పట్టుకోగలిగితే, మన క్లాస్ టీం 10 మంది అయినా ఆ రోజు బొబ్బిలిలో కలుసుకోవచ్చు.”

అటువైపు ఏదో అన్నట్లున్నారు.

“అవును రా.. మన ఫాస్ట్ బౌలర్ విక్కీనే. ఎస్.వి.ఆర్. స్కూల్ టీం అంటే పక్క స్కూళ్ళు అన్నీ గడగడలాడేవి అప్పట్లో.. వాడి బౌలింగ్‌కి” అన్నాడు.

ఉలిక్కి పడ్డాడు విజయ్. విక్కీ అనేది తన ముద్దు పేరు, తాను ఎస్.వి.ఆర్. స్కూల్ టీంలో ఒకప్పుడు బెస్ట్ ఫాస్ట్ బౌలర్.

అప్పుడు పరిశీలనగా చూసేడు అతన్ని. గుర్తు పట్టేడు. వెదక బోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే.

ఇంతలో ఫోన్ పెట్టేసి, విజయ్ వైపు తిరిగేడు ఎండిఓ. “చెప్పండి” అన్నాడు.

“మీరు..” అని ఆగి… “నువ్వు.. గోపాల్ కదా” అన్నాడు విజయ్. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు.

‘అవును’ అన్నట్లు తల ఆడించేడు. “మనం 1996లో ఎస్.వి.ఆర్. హై స్కూల్‌లో 10th క్లాస్ చదువుకున్నాం” అన్నాడు విజయ్.

“నేను మిమ్మల్ని గుర్తుపట్టలేక పోతున్నాను” అన్నాడు అతను.

మళ్ళీ ఇలా అన్నాడు విజయ్:

“నువ్వు బొబ్బిలి ఎస్.వి.ఆర్. స్కూల్ ఓపెనింగ్ బాట్స్‌మన్‌వి కదా, నేను రా విక్కీని.. అదే విజయ్‌ని.”

గోపాల్ కళ్ళల్లో మెరుపు.

“ఒరేయ్ విజయ్! ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి?”…నమ్మలేనట్లు చూస్తున్నాడు. “నిజంగా నిన్ను గుర్తు పట్టలేక పోయాను. జుట్టు ఊడి పోయిందేమిటి” అన్నాడు విజయ్ బట్టతల కేసి చూస్తూ.

“అవునురా ఏం చేస్తాం, ఇదే మా ఆస్తి” అని నవ్వేడు విజయ్.

ఇక్కడ వాళ్ళ గతం గురించి చెప్పాలి.

విజయ్ 10th క్లాస్ ఎస్.వి.ఆర్. హై స్కూల్, బొబ్బిలిలో 1996 లో చదువుకున్నాడు.

ఆ సమయంలో గోపాల్, విజయ్, రాజు, సుధాకర్, షబ్బీర్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. విజయ్ మంచి ఫాస్ట్ బౌలర్, గోపాల్ మరియు షబ్బీర్ లు బెస్ట్ ఓపెనింగ్ బాట్స్‌మెన్‌, రాజు వికెట్ కీపర్, సుధాకర్ బెస్ట్ స్పిన్నర్.

వాళ్ళు 5 గురు కాక మరో 6 మంది బెస్ట్ ప్లేయర్లతో కూడిన వాళ్ళ క్రికెట్ టీమ్ అంటే, చుట్టుపక్కల స్కూళ్లలో హడల్. అంత మంచి క్రికెట్ టీం వాళ్ళది. ఆ రోజుల్లో కప్పులన్నీ ఎస్.వి.ఆర్. స్కూల్ టీమువే అంటే అతిశయోక్తి కాదు. 10th క్లాస్ అయ్యేక, ఎవరి చదువుల్లో వాళ్ళు విడిపోవడం, అందరూ బొబ్బిలి వదిలి వచ్చేయడం జరిగింది.

“చాలా సంతోషంగా వుంది రా నిన్ను ఇలా చూసి. మనది యెంత బెస్ట్ క్రికెట్ టీమ్, ఆ రోజులే వేరు. 10th క్లాస్ అయ్యేక విడిపోయాము రా” అన్నాడు విజయ్.

“అవును నిజమే, ఆ రోజుల్లో ఇప్పటి కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోవడంతో, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియకుండా పోయింది. వాట్సాప్ పుణ్యమా అని ఇప్పుడు మళ్ళీ పాత ఫ్రెండ్స్‌ని కలుసుకోగలుగుతున్నాం..”.

కుశల ప్రశ్నలు అడిగేడు గోపాల్. అన్నీ విన్నాక, ఇలా అన్నాడు:

“నేను ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడింది మన క్లాసుమేట్ సుధాకర్ తోనే. గుర్తుందా.., వాడు మన స్పిన్ స్పెషలిస్ట్. ఈ మధ్యే ఒక వాట్సప్ గ్రూప్ పెట్టేడు, అందులో మన మిత్రులందర్నీ కలుపుతున్నాడు. వాడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చెక్ చేసి, ఇతర ప్రయత్నాలు చేసి, మొత్తానికి మన క్లాస్ క్రికెట్ టీం అంతటినీ పట్టుకోగలిగేడు. 9 మంది నంబర్స్ దొరికేయి. రాజు నెంబర్ దొరకలేదు కానీ, వాడి వివరాలు తెలిసేయి. అదేరా.. మన వికెట్ కీపర్.. వాడు చనిపోయాడుట. 2 వారాలలో మన ఫస్ట్ రీయూనియన్ మీటింగ్. నువ్వు అనుకోకుండా ఇలా కలవడం చాలా బావుంది. నీ నెంబర్ ఇవ్వు.. మన గ్రూప్‌లో యాడ్ చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలి” అన్నాడు గోపాల్.

“తప్పకుండా వస్తాను” అన్నాడు విజయ్

గోపాల్ మళ్లీ ఇలా అన్నాడు: “సుధాకర్‌కి ఫోన్ చేద్దామా, నువ్వు కలిసిన విషయం చెప్తాను” అన్నాడు ఉత్సాహంగా ,

“ఇప్పుడొద్దులే, రాత్రి మాట్లాడు. నాకు వేరే క్లయింట్‌ని కలిసే పని వుంది. ముందు నీ దగ్గరకి వచ్చిన పని చెప్తాను, నీ వల్ల అయింది చేసి పెట్టు” అన్నాడు విజయ్.

“సరే, నువ్వొచ్చిన పని చెప్పు” అన్నాడు గోపాల్

విజయ్ తన ఇంట్లో పని మనిషి వివరాలు, ఆమె వితంతు పెన్షన్, ఆమె కొడుకుకి వికలాంగుల పెన్షన్ అప్లై చేయడం, రాకపోవడం తదితర వివరాలన్నీ చెప్పేడు.

“నువ్వు నాకు చెప్పేవు కదా, ఇంక నాకు వదిలేయ్, వాళ్లకి అర్హతలు అన్నీ ఉంటే తప్పక వచ్చేలా చూస్తాను.. వర్రీ అవకు” అన్నాడు.

తాను తెచ్చిన కాగితాలు ఇచ్చి, థాంక్స్ చెప్పి బయటకి వచ్చేసాడు విజయ్.

ఆ రోజు నుండీ విజయ్ గోపాల్, మిగిలిన ఫ్రెండ్స్ మధ్య ఫోన్ సంభాషణలు, కలుసుకోవడాలు జరిగేయి.

ఓ వారం గడిచింది. కాంతమ్మ ఇంటికి వెరిఫికేషన్‌కి ఎవరినో పంపించారని చెప్పింది. ఆమె చాలా ఆశావహంగా వుంది.

రాత్రి పడుకుందామని సిద్ధం అవుతుండగా, గోపాల్ నుండి ఫోన్ వచ్చింది విజయ్‌కి.

“విజయ్! కాంతమ్మకి, వాళ్ల అబ్బాయికి పెన్షన్ శాంక్షన్ అవుతుంది. నేను సిఇఓ గారికి ఫైల్ పంపడం జరిగింది, ఫోన్ చేసి మాట్లాడ్డం కూడా జరిగింది. ఒక నెల పడుతుంది. శాంక్షన్ గారంటీ. త్వరలో ఆర్డర్స్ వస్తాయి. కానీ ఒక సస్పెన్స్ విషయం తెలిసింది” అన్నాడు.

ఏమిటిరా ఆ సస్పెన్స్?” అన్నాడు విజయ్.

“ఆ కాంతమ్మ ఎవరో కాదు, మన వికెట్ కీపర్ రాజు భార్య.” అని.. ఆగేడు గోపాల్.

ఆశ్చర్యపోయాడు విజయ్.

‘మన చుట్టూ వుండే వాళ్ళ గురించి మనకే తెలియదు, యెంత స్పీడ్ జీవితాల్లో వున్నాం’ అని మనసులో అనుకున్నాడు

గోపాల్ మళ్ళీ ఇలా చెప్పేడు:

“మా వెరిఫికేషన్‌లో ఆమె కథ తెలిసింది. రాజు మనతో బాటు 10th క్లాస్ చదివేక, పాలిటెక్నిక్ లోకి వెళ్ళేడు. కానీ తండ్రి మరణంతో చదువు సాగలేదు. చీపురుపల్లిలో బైక్ మెకానిక్‌గా జాయిన్ అయిపోయేడుట. చాలా ఏళ్ళు పెళ్లి చేసుకోలేదుట. 30 ఏళ్ళ వయసులో తల్లి బలవంతం మీద అక్క కూతురు కాంతని వివాహం చేసుకున్నాడు. తల్లి తన వద్దే ఉండేది. తల్లికి అనారోగ్యం వల్ల వాడి పేదరికం మరింత పెరిగింది. 2 సంవత్సరాలకి పూర్వం, కొడుకుని, తల్లిని తీసుకుని వైజాగ్ వస్తూంటే, ట్రైన్ ఆక్సిడెంట్‌లో వాడు, తల్లి చనిపోయేరు, కొడుకుకి కాళ్ళు పోయేయి. అప్పటి నుండి కాంతమ్మ కుటుంబ పోషణ కోసం, వూరు వదిలి, పట్నం వచ్చేసి, తన తల్లితో కలిసి ఉంటోంది. బ్రతుకు తెరువు కోసం, ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటోంది” అన్నాడు.

విజయ్ మనసు వికలమైంది. భార్యతో ఆ విషయాలు అన్నీ చెప్పేడు.

“పోనీ లెండి మీ బాల్య స్నేహితుడి భార్యకి, కొడుక్కి పెన్షన్ వచ్చేలా చేసి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు” అంది.

విజయ్‌కి యింకా ఏదో చెయ్యాలని అనిపించింది. మళ్ళీ వారం స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ మీటింగ్‌కి రాజు భార్యని కూడా తీసుకుని వెళ్లి, ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేయడం ద్వారా, అందరూ కలిసి కొంత ధన సహాయం చేయచ్చు అనిపించింది.

గోపాల్‌తో ముందు ఈ ప్రొపోజల్ చెప్పాలి అనుకున్నాడు.

సమాప్తం

Exit mobile version