Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సహచరి

“మేడం! రేపు సాయంత్రం అయిదింటికి వస్తాను.” అంది అరుణ.

“ఓకే అరుణా డిన్నర్‌కి వచ్చేయి. పొద్దున్నే వెడువుగాని” అన్నాను.

“ఓకే మామ్” అని ఫోన్ పెట్టేసింది.

అరుణ నా స్టూడెంట్. విద్యార్థి స్థాయిని మించిన ఒక స్నేహబంధం కూడా మా మధ్య ఏర్పడింది. ఇప్పుడు అరుణ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది.

నేను లెక్చరర్‌గా రిటైర్ అయ్యాను. పిల్లలు ఎవరు జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక, నేను నా భర్త రావు గారు సంతోషంగా జీవించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. చిన్న ఇల్లు, పూల మొక్కలు ఉన్న పెరడు, పుస్తకాలు, సంగీతం, ఆత్మీయంగా పలకరించే స్నేహితులతో ఇలా కాలం గడిచిపోతోంది మాకు.

కాలింగ్ బెల్ మోగింది… అరుణ వచ్చింది

వస్తూనే కవరు లోంచి విరజాజుల మాల తీసి హాల్లో ఉంచిన రాధాకృష్ణుల విగ్రహానికి వేసింది. రాత్రి డిన్నర్‌కు కావాల్సిన ఏర్పాట్లు నేను రావు గారు కలిసి చేసుకున్నాము. “అంకుల్‌కి కాఫీ ఇచ్చి రామ్మా!” అన్నాను అరుణతో. రెండు కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని శ్రావణ సంధ్య వెలుగుల్ని ఆస్వాదిస్తూ వరండాలో కూర్చున్నాము ఇద్దరం.

“పెళ్లి చూపులు అయ్యాయా?” అడిగాను.

కాఫీ తాగుతూ అవునన్నట్లు తల ఆడించింది అరుణ.

సీ గ్రీన్ కుర్తి, వైట్ కలర్ పైజమాలో అరుణ అందంగా ఉంది. అరుణ ఇప్పటి తరం ఆడపిల్ల. ఆమెలోని ఆత్మవిశ్వాసం, పాజిటివ్ యాటిట్యూడ్ నాకు ఒక ఆకర్షణ.

“వాళ్లకి నచ్చానని చెప్పారు మేడం” అంది.

“మరి నీ మాట? ఎలా ఉన్నాడు అబ్బాయి?”

“మా పేరెంట్స్‌కు నచ్చింది సంబంధం”అంది. ఫ్యామిలీ గురించి అడిగాను కాఫీ కప్పు లోపలుంచి వచ్చింది అరుణ.

“నీ సంగతి చెప్పు” అడిగాను.

“అప్పుడే పెళ్లా! నాకు కొన్నాళ్లు ఉద్యోగం చేసుకుంటేనో అనిపిస్తోంది.”

“ఏం వాళ్లు ఉద్యోగం చేయకూడదు అన్నారా?”

“లేదు మేడం, వాళ్ళు ఎలాంటి షరతులు పెట్టలేదు.”

“అబ్బాయిని చూస్తే నీకు ఏమనిపించింది? అతనితో మాట్లాడావా ?”

“బాగానే ఉన్నాడు. మాట్లాడాను. బాగా మాట్లాడతాడు కూడా”

.అరుణ మాటల్ని బట్టి ఆ సంబంధం తనకు కూడా నచ్చిందని అర్థం చేసుకున్నాను.

“కానీ మేమ్…”

“చెప్పు అరుణా నీ సందేహం ఏమిటి?”

“అబ్బాయి పేరు జయంత్….. తమ్ముడు శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నాడు.. తల్లి తండ్రి తనతోనే ఉంటారు అని చెప్పాడు.” అంది.

“మంచిదేగా….” అన్నాను.

“అరుణా! నేను నీకు ఒక కథ చెప్తాను.తర్వాత మనం పెళ్లి విషయం మాట్లాడుకుందాం” అన్నాను.

“ఓకే మేడం” అంది.

***

“పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు దగ్గర వడ్లవానిపాలెం అన్న ఒక పేరుతో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం కరణం గారికి నలుగురు మగపిల్లలు. నాలుగవ అబ్బాయి పేరు సూర్యనారాయణ మూర్తి. అతనికి దొడ్డిపట్ల గ్రామానికి చేరువలో ఉన్నపెనుమర్రు అనే గ్రామ కరణం గారి అమ్మాయి సుబ్బలక్ష్మితో పెళ్లి జరిగింది. ఆనాటి వారి వయసు పది, పదమూడు అనుకుంటాను.

“మై గాడ్! చైల్డ్ మ్యారేజ్”అంది అరుణ.

అవునన్నాను నవ్వుతూ…… కొన్నాళ్లు గడిచాయి. సూర్యనారాయణ మూర్తికి డాక్టర్ చదువుకోవాలనే కోరిక పుట్టింది. అతనికి తండ్రి లేడు. అన్నకు చదివించే స్థోమత లేదు. కానీ సూర్యనారాయణ తన పట్టు వదలలేదు.

ఆత్మీయుడు అయిన ఆ ఊరి గుడి పూజారి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. పూజారి తన వద్ద నున్న బంగారు మురుగు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుతో భార్యని తీసుకొని చెన్నపట్నం…. నేటి చెన్నైకు చేరిన అబ్బాయి, ఆయుర్వేదంతో బాటు అల్లోపతి కూడా బోధించే కిల్పాక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ని కలిసి సీటు ఇమ్మని కోరాడు. ఆయన నిరాకరించడంతో, బాధపడి కాలేజీ ముందే బైఠాయించి ఐదు రోజులు నిరాహారదీక్షను కొనసాగిస్తాడు. సూర్యనారాయణ పట్టుదలను మెచ్చి ప్రిన్సిపాల్ సీటు ఇవ్వడం జరుగుతుంది.

అటు అత్తింటి నుంచి,ఇటు పుట్టింటి నుంచి, తెచ్చుకున్న కొద్దిపాటి వంట సరుకులు, బియ్యం, సామాన్లతో ఏడాది బిడ్డను ఎత్తుకొని భర్తతో కలిసి అడుగులు వేసింది సుబ్బలక్ష్మి. భార్యాభర్తలనబడే ఈ ఇద్దరు పిల్లలు మరో పసిబిడ్డతో మహానగరంలో కాపురం పెడతారు. వారికి ఇరుగు పొరుగున ఉన్న తమిళ తల్లులు సహకారాన్ని ఇచ్చారు. ముచ్చటపడి బాలగోపాలుని గోకులం అంతా పెంచినట్లు ముద్దు చేశారు.

అలా సూర్యనారాయణ డాక్టర్ చదువు పూర్తి చేసుకొని భీమవరం పక్కన ఉన్న ఉండి గ్రామంలో వైద్య వృత్తిని ప్రారంభిస్తాడు. సహజ జిజ్ఞాసువు, ప్రతిభ ఉన్నా సూర్యనారాయణ మెడికల్ జర్నల్స్ చదివి, సీనియర్ డాక్టర్లతో సంప్రదింపులు చేస్తూ, వైద్యరంగంలో తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మంచి హస్తవాసి కల డాక్టర్‌గా ఊరి ప్రజలకు సేవలందిస్తూ గొప్ప పేరు ప్రతిష్ఠలను, డబ్బును కూడా సంపాదిస్తాడు. ఈ దంపతులిద్దరూ ఆరుగురు సంతానంతో, కొడుకులు, కోడళ్ళు, మనవలతో పూల పందిరిలా అల్లుకుపోయారు.

అయితే ఇందులో నేను చెప్పేది సుబ్బలక్ష్మి పాత్ర గురించి. సుబ్బలక్ష్మి పన్నెండేళ్ళ పిల్లగా కాపురానికి వచ్చిన రోజే పెరట్లో దూడ పరుగెత్తుతూ మాటిమాటికీ తల్లి పాలు తాగడానికి పారిపోతున్న దాన్ని పట్టుకుని, అజీర్తి చేయకుండా మూతికి బుట్ట తగిలించి, పలుపు తాడుతో దాన్ని బంధించి వస్తున్న సుబ్బలక్ష్మిని చూసి అత్తగారు సుబ్బలక్ష్మిలో ఉన్న సమర్థతని చూసి సంతోషపడింది.

ఆవిడను అందరూ సుబ్బమ్మగారు అనేవారు. డాక్టర్ గారు అంటే ఎంత గౌరవం ఉందో ఆ ఊరి ప్రజలకు సుబ్బమ్మ గారు అంటే అంతే ప్రేమాభిమానాలు చూపించేవారు. జాలి దయ కలిగిన తల్లి అనేవారు.

ఆమె యవ్వనంలోకి అడుగిడే సరికి సంసారం పెద్దది అవ్వడమేకాక వైద్యం కోసం వచ్చే బంధు జనాలతో ఇల్లు హోరెత్తిపోయేది. ఉన్న పొలం అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్లు, మగ పిల్లలకు చదువులు చెప్పించారు తల్లిదండ్రులు. సంసారపు ఒత్తిడిని అనుభవిస్తూనే జీవితానందాన్ని ఆస్వాదించే ఒక గుణం ఉండేది సుబ్బమ్మ గారిలో. ఆమె ముఖం ఎప్పుడూ పున్నమి చందమామే. చిరునవ్వుతో మెరిసే తాంబూలం వేసుకున్న పెదములు, విసుగు కోపం లేని కార్యనిర్వహణ. ఈరోజు మీరు నేర్చుకునే టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. చదివింది పెద్దబాలశిక్ష, తుకారాం అభంగాలు, త్యాగరాజ కీర్తనలను హృదయంతో పాడేది. ఇంటి ఆవరణను రకరకాల ఫల వృక్షాలతో, పూల మొక్కలతో నందనవనంగా మార్చింది. సూర్యనారాయణకు వైద్య విజ్ఞానంతో పాటు తాత్విక జిజ్ఞాస మెండు. ఆ ఊరి శివాలయంలో గీతా మందిరం కట్టించడమే గాకుండా పండితులను, ప్రవచనకారులను పిలిపించి ఊరి ప్రజల్లో చైతన్య వికాసాన్ని కలిగింప చేసేవారు. అది సుబ్బమ్మ గారి నేర్చుకునే స్వభావానికి మంచి అవకాశం అయింది. రామాయణ భారతాలతో పాటు ఉపనిషత్తుల సారాన్ని అర్థం చేసుకునేది. వ్యవహార జ్ఞానం కొంచెం కూడా తెలియని భర్తకు ముందుచూపు లేదు. సుబ్బమ్మ గారి మనసూ,చెయ్యి కూడా పెద్దవి కావడంతో ఫలితంగా దంపతులు ఆర్థికమైన ఇక్కట్లలో పడ్డారు. ఇబ్బందుల్లో కూడా చందమామ ముఖంలో నవ్వుపోలేదు ధైర్యం, సమయస్ఫూర్తి ఆమెకు రెండు కళ్ళు.ఇది ఆమె జీవించిన తీరు.

చెప్పడం ఆపి టైం చూసాను. ఎనిమిది అయింది. రావు గారు టేబుల్ దగ్గర కూర్చుని చపాతీలు కూర ప్లేట్లో పెట్టుకున్నారు.

“భారతీ! నువ్వు అమ్మాయి కూడా వస్తారా…?” పిలిచారు. “మేము కాసేపాగి తింటాం మీరు తినండి” అన్నాను.

అరుణ లేచి లైట్ వేసింది. సన్నగా వర్షం పడుతోంది. చల్లని గాలి జాజిపూల పరిమళాలను తీసుకొస్తోంది. “అరుణా! ఇదంతా సుబ్బమ్మ గారి వ్యక్తిత్వం, నిబద్ధత. ఆవిడ నాకు అమ్మమ్మ” అన్నాను.

“అవునా మేడమ్! వెరీ ఇంట్రెస్టింగ్” అంది.

మా తాతగారి చెల్లెలు కొడుకు తాగుడుకు అలవాటు పడి చెయ్యి విరిగి ఇంటికి వచ్చి ఏడుస్తుంటే అతన్ని ఊరడించి, అన్నం కలిపి తినిపించిన దృశ్యం చిన్నతనంలో నా మనసు మీద పెద్ద ప్రభావాన్ని కలిగించింది. అరుణా!… ఇంతే కాదు ఆమె మనసుని ఓ స్త్రీగానేను అర్థం చేసుకోగలిగాను. ఆమె ఎంత వేదనను అనుభవించింది. పురుషాధిక్య సమాజంలో సహజంగానే స్త్రీలు అనుభవించే బాధను రెప్పచాటునే దాచుకుంది. తనలోని వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకుంది.”

“అరుణా!.. నువ్వు చేస్తున్నా ఉద్యోగం తర్వాత చీఫ్ కన్సల్టెంట్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్, డైరెక్టర్, సీ.ఈ.వో పదవిల్లాగానే కూతురుగా, భార్యగా,కోడలిగా, అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా, స్త్రీగా, ఒక మనిషిగా ఎన్నో బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించింది, బీరపాదులా ఆమె జీవితమంతా పచ్చగా విరిసింది. ప్రేమ, సంస్కారం అనే విత్తుల్ని మా గుండెల్లో కూడా నాటింది. ఆనందానికి, సుఖానికి ఉన్న తేడాను అర్థం చేసుకునే లాగా తన సంతానాన్ని తీర్చిదిద్దింది. తనలోని సామ్యవాదాన్ని, తాత్విక దృష్టినీ,కళారాధనను తన జీవితంలో కూడా ప్రతిఫలింప చేసుకుంది.

అది ఆమె సమర్థవంతంగా నిర్వహించిన అర్ధాంగి పోస్ట్.

ఈనాడు జీవితాలను నడిపేవి చట్టాలు. నాడు జీవితానికి చుక్కాని ధర్మం. పరోక్షంగా మా దాంపత్య జీవితం బావుండేందుకు, సంసారాలు చక్కగా సాగిపోయేఎందుకు కావలసిన బాటను ముందు తరాలకు వేసింది. ఇలాంటి సుబ్బమ్మ లు దేశమంతా ఉన్న కాలం అది.

అరుణ!… నా ముఖం లోకి చూస్తూ వింటోంది శ్రద్ధగా.

“అరుణా!.. నేటికీ మనందరకు కుటుంబం కావాలి. కుటుంబంలో బలవంతులు,బలహీనులు అందరూ భద్రంగా బతికే అవకాశం ఉంది. వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ అనేది కుటుంబ వ్యవస్థ. దానికి మూలం వివాహం దానికి కావలసింది అర్ధాంగి మాత్రమే కాదు అర్ధాంగుడు కూడా. స్నేహధర్మం తో,పరిపక్వతతో నడిచే జంట కావాలి”.

“అరుణమ్మా!… నిబద్ధత లేని పెళ్లి పెళ్లే కాదు. పూర్వంలా కాదు ఇరువురు మాట్లాడుకుని ఆలోచించుకుని నిర్ణయించుకుంటున్నారు. నేటి కాలంలో ఇష్టపడి చేసుకున్న పెళ్లి కూడా వైఫల్యం చెందడానికి కారణం నిబద్ధత లోపించడమే. బరువు అనుకుంటే అడుగుపెట్టొద్దు. ప్రేమ ఉంటే నిలబడండి స్నేహంగా, ధర్మంగా హాయిగా జీవించండి. ఆలోచించి అడుగు పెట్టమ్మా.

”అరుణ మౌనంగా ఉండి పోయింది. నేను లేచి ఇద్దరికీ భోజనం వడ్డించాను.

***

హాల్లో గోడకు ఉంచిన అమ్మమ్మ ఫోటోను చూస్తోంది అరుణ. “ముక్కుకు బులాకి, మెడలో గొలుసులు, బుట్ట చేతుల జాకెట్టు చాలా అందంగా ఠీవిగా మహారాణిలా ఉన్నారు ఈ సీ.ఈ.వో అమ్మమ్మ గారు” అంది అరుణ.

అరుణా!.. నేను చెబుతున్నది అంతా చాదస్తంగా అనిపించవచ్చు నేను నిన్ను సుబ్బమ్మ లాగా జీవించమని చెప్పడంలేదు. భార్యగా నీకు ఉండవలసిన నిబద్ధత గురించి, ముఖ్యంగా తల్లిగా నీకు ఉండవలసిన అవగాహన గురించి చెప్పానమ్మా. నేటికీ అమ్మ నాన్న ఇద్దరూ కావలసిన సమాజంలోనే పిల్లలు ఉన్నారు. కాదంటావా? …..అవునన్నట్టు తలూపింది అరుణ.

***

పొద్దున్నే అరుణ ఇంటికి బయలుదేరుతూ అడిగింది.

“మేడం వ్యక్తి అస్తిత్వానికి అవకాశం లేని వ్యవస్థా ఇది?”

“కాదు కాదు స్వేచ్ఛ ఉంది కానీ నిబద్ధత మాటేమిటి?”

“అమ్మమ్మ ఆ అవరోధాలతో పోరాడింది కానీ వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. ఆమె వ్యక్తిగా కూడా నిలబడింది. వ్యవస్థలో తన పాత్రను ఉదాత్తంగా నడిపించింది. వ్యక్తి బలంగా ఉంటేనే కథ పాత్రను నడిపించ గలదు.”

అవునన్నట్టు తలూపింది అరుణ.

అరుణను దగ్గరగా తీసుకుని చెంప మీద ముద్దు పెట్టాను. “ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ అరుణా” అన్నాను ఆప్యాయంగా.

“థాంక్యూ మేడం” అంది. “ఆఖరుగా ఒకటి చెప్పండి మేడం! ఇన్నింటిని భరించే శక్తి దేని వల్ల వస్తుంది?” అంది.

“ప్రేమ వల్ల…… ప్రేమించే గుణం వల్ల” అన్నాను.

“థాంక్యూ వెరీ మచ్ మేడం” అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది అరుణ.

అరుణోదయం వైపుగా సాగిపోతున్న అరుణ ని చూస్తూ నిలబడ్డాను.

Exit mobile version