[రాజమండ్రిలో జరిగిన ‘సాహితీవేదిక’ వార్షికోత్సవం నివేదికని అందిస్తున్నారు మల్లాప్రగడ రామారావు.]
రాజమహేంద్రవరం లోని శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, కుప్పిలి పద్మ అధ్యక్షతన 25-12-25 న జరిగిన ‘సాహితీవేదిక’ వార్షిక సమావేశాలు ముప్పేటగా సాగాయి.
ఇష్టాగోష్టి:
ఉదయం సరిగ్గా 10: 00 గంటలకు సమావేశకర్త కుప్పిలి పద్మ స్వాగత వచనాలతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యుల స్వీయ పరిచయం తరువాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు ‘ఇష్టాగోష్టి’ కార్యక్రమం సాగింది.
ఇష్టాగోష్టి ప్రారంభించిన ఎమ్మెస్ సూర్యనారాయణ సూచన మేరకు సభ్యులు గత ఏడాదిలో తమ సాహిత్య కృషి గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రమంగా పుస్తక ప్రచురణ వెనుకబడి, అంతర్జాల మాధ్యమంలో రచనలు వెలువడడం అనివార్యం కావడం గురించి సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ పరిణామం పుస్తకాల లభ్యతకీ, భద్రపరచడానికీ మరింతగా దోహదపడుతుందని చెప్తూ , అందుకై కృషి చేస్తున్న కొన్ని సంస్థల గురించి వాడ్రేవు చిన వీరభద్రుడు తెలియజేసారు.
పుస్తకావిష్కరణలు:
భోజన విరామం తర్వాత యథావిధిగా మధ్యాహ్నం మూడు గంటలకే తిరిగి ప్రారంభమైన కార్యక్రమంలో ఐదు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
మొదటిది ప్రసిద్ధ కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా వినుతికెక్కిన వాడ్రేవు చిన వీరభద్రుడు 1986 లో కొన్ని నెలలలో, కొన్ని రోజులు మట్టుకే వ్రాసుకున్న ‘రాజమండ్రి డైరీ’.
మరొకటి 1982-92 మధ్య ప్రచురితమైన భద్రుడి తెలుగు కవితల స్వీయ ఆంగ్లానువాదం ‘సాంగ్ ఆఫ్ మై విలేజ్’.
ఈ రెండు పుస్తకాలనూ ‘సాహితీవేదిక’ సహ వ్యవస్థాపక సమావేశకర్త మల్లాప్రగడ రామారావు, రచయిత్రి మల్లాప్రగడ బాలాత్రిపురసుందరి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన రామారావు – ‘రచయితగా భద్రుడు గారు సాటిలేని రచయితగా సాహితీలోక విదితమని, తనని గాఢంగా ప్రభావితం చేసినది మాత్రం వారొక ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారిగా తన విధులను నిజాయితీగా, నిర్భయంగా నిర్వర్తించి, గిరిజనాభివృద్ధికీ, విద్యార్థుల వికాసానికి చేసిన నిరంతరకృషి’యని కొనియాడారు. ‘అందరం కథలు వ్రాస్తున్నాం. కానీ, భద్రుడు కథానాయకుడయ్యారం’టూ అట్టాడ అప్పలనాయుడు నవల ‘పునరావాసం’ ప్రస్తావించారు.
మూడవది మళ్లీ మల్లాప్రగడ రామారావే ఆవిష్కరించిన, కల్లూరి భాస్కరం కథల సంపుటి ‘నది నడిచిన దారి’. రామారావు తన ప్రసంగ వ్యాసంలో ‘ప్రతిభావ్యుత్పత్తుల కలబోత కల్లూరి భాస్కరం గారనీ, కవిగా, కథకుడిగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా సాధారణ పాఠక లోకమే కాదు విద్వజ్జనుల జేజేలు అందుకున్నార’నీ, తానారోజు ఆవిష్కరించిన ‘నది నడిచే దారి’ లోని ‘నాలుగు బెర్తుల నడిమి ప్రపంచం’ కథలో ఒక పట్టుచీరలో అగ్గిపెట్టెని ఇమిడ్చినట్టు, ఒక రైలు పెట్టెలో వర్తమాన భారతదేశాన్ని రూపు కట్టించార’ని ప్రశంసించారు.
నాలుగవది చినవీరభద్రుడు ఆవిష్కరించిన మల్లాప్రగడ బాలాత్రిపురసుందరి కథల, కవితల సంకలనం ‘ఆరనీకుమా ఈ తడి’. తన ప్రసంగంలో వీరభద్రుడు ‘పుస్తకంలోని కవితలు, కథలు రచయిత్రి హృదయ సంస్కారాన్ని వెల్లడిస్తున్నాయనీ, ఆమె సంధిస్తూ వచ్చిన నిష్ఠుర వాస్తవాలను దాటి, ఆమె సంధిస్తూ వచ్చిన తీవ్రమైన ప్రశ్నల్ని దాటి, వాటి వెనుక వెన్నలా కనిపిస్తున్న నిర్మల హృదయం ద్యోతకమవుతుంద’న్నారు.
ఇక ఐదవది, సత్య భాస్కర్ కవితా సంపుటి ‘మళ్లీ మొదలైన వాన’. ఈ పుస్తకాన్ని కూడా మల్లాప్రగడ రామారావు ఆవిష్కరించి, రచయితను అభినందించారు.
‘నది నడిచిన దారి’ పుస్తకాన్ని ప్రఖ్యాత విమర్శకులు, అనువాదకులు రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, ‘ఆరనీకుమా ఈ తడి’ పుస్తకాన్ని ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత జంధ్యాల శరత్ బాబు సమీక్షించారు.
సాహితీ పురస్కార ప్రదానం:
సభ్యుల ఉపాహారం, తేనీరు సేవనం తర్వాత ఠంచనుగా సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 7 దాటే వరకూ జరిగిన సమావేశంలో ‘సాహితీవేదిక’ ఈ ఏడాది నుండే ప్రారంభించిన వార్షిక పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించబడింది.
2025 సంవత్సరానికి గాను ప్రఖ్యాత సాహితీవేత్త, ఉద్యమకారుడు, అద్దేపల్లి ప్రభును సన్మాన పత్రం, జ్ఞాపిక, ₹ 20,000 నగదు బహుమానంతో ‘వేదిక’ సభ్యులు సత్కరించారు.
ఈ సందర్భంగా, ప్రభు కవిత్వం పై ప్రసంగించిన ప్రసిద్ధ విమర్శకులు సుంకర గోపాలయ్య ప్రభు కవితాప్రతిభను విశ్లేషించడంతో పాటు, ఆ కవితలలో వ్యక్తమవుతున్న ప్రభు సామాజిక అవగాహనా పరిణామాన్ని కూడా వివరించారు.
కుప్పిలి పద్మ కథా రచనలలో ప్రభు విశిష్టతను, విలక్షణతను విశదీకరించారు.
తన స్పందనలో ప్రభు పురస్కారాలకు తాను దూరంగా ఉంటాననీ, కానీ, ‘సాహితీవేదిక’ను తాను ఆ సంస్థ ప్రారంభ దినాలలో ఎరిగి ఉన్నాననీ, ఆ సంస్థ పట్ల తనుకున్న సదవగహన కారణంగా తాను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నానన్నారు.
ప్రఖ్యాత కవి, పరిశోధకుడు, ‘సాహితీవేదిక’ మరో సహ వ్యవస్థాపక సమావేశకర్త, కొప్పర్తి వెంకటరమణమూర్తి వందన సమర్పణతో సభ జయప్రదంగా ముగిసింది.
ప్రముఖ సాహితీవేత్త, సభానిర్వహణకు ఆసాంతమూ వెన్నుదన్నుగా నిలిచిన అరిపిరాల నారాయణరావుకు అందరూ కృతజ్ఞతలు అందించారు.
శ్రీయుతులు జోరా శర్మ, పి. సురేష్ బాబు, రాణి శివశంకర శర్మ, పులుగుర్త వెంకట కృష్ణారావు, ఎర్రాప్రగడ రామకృష్ణ, మేడిశెట్టి తిరుమల కుమార్, బి.వి రాఘవరావు, నల్లగొండ రవి ప్రకాష్, మరికొందరు ‘వేదిక’ సభ్యులు, సాహిత్యాభిమానులు, విఖ్యాత రచయిత్రి మందవరపు హైమవతి కూడా ఈ సమావేశాలలో పాల్గొన్నారు.

