[శీలా సుభద్రాదేవి గారు రచించిన ‘సాహిత్య ప్రాంగణంలో కవయిత్రులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
19వ శతాబ్దానికి ముందు స్త్రీలకు సంబంధించినది కవిత్వమే తప్ప మరొక సాహిత్య ప్రక్రియ లేదనే చెప్పాల్సి ఉంది. అవి కూడా మౌలికమైన స్త్రీల పాటలు ఒగ్గు కథలు వంటి రూపాలలో ఉండి ఉండొచ్చును.
ఆలోచన మనిషిని నిలవనీయనప్పుడు, వ్యక్తిగత అనుభూతి పరిధుల్ని అధిగమించి విశ్వవ్యాప్తమైన ఆత్మగతానుభూతు సమకాలీన సామాజికాంశాలని జోడించి అక్షరీకరణం చేసి మానవ జీవితాన్ని పరిపూర్ణంగా చూపించే ఏ ప్రక్రియా రూపమైనా సరే మంచి సాహిత్యమే అవుతుంది.
కథా, నవలలకు చాలా ముందుగానే కవిత్వం పద్యం, గేయంగా పరిణామం చెందింది.
పద్యకవిత్వంలో అప్పటి నన్నయాది కవుల తరంలోనే 13వ శతాబ్దంలోనే చానమ, ప్రోలమ పద్య రచన చేసినట్లు కొన్ని గ్రంథాలలో ప్రస్థావించబడినా తాళ్ళపాక తిమ్మక్కనే మొదటి కవయిత్రిగా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు తమ ఆంధ్రకవయిత్రుల సంకలనంలో పేర్కొన్నారు. తెలుగులో మొదటి మహాకావ్య రచయిత్రిగా మొల్ల (16వ శతాబ్దం)నే చెప్పాలి. అనాటి కవులవలే వీరంతా భక్తి తత్త్వాన్నే తమ రచనలలో వర్ణించారు. రంగాజమ్మా, ముద్దుపళని వంటి కవయిత్రులు కూడా భారత రామాయణాది పురాణేతిహాసాల నుండే వస్తువును గ్రహించి కవులకు దీటుగా వర్ణనాత్మకంగా కావ్యాలు రచించారు. వీరి తర్వాత కారణం ఏమిటో తెలియలేదుగాని తిరిగి 18వ శతాబ్దం వరకూ అంతగా కవయిత్రులు సాహిత్య చరిత్రలో కనిపించినట్లు లేదు.
స్వాతంత్రోద్యమం, సంస్కరణోద్యమాల ప్రభావంతో కొన్ని వర్గాల స్త్రీలకు విద్య అందుబాటులోకి రావటంతో చైతన్యవంతులైన స్త్రీలు తిరిగి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టారు. హిందూ సుందరీ, గృహలక్ష్మి వంటి పత్రికలు స్త్రీల కొరకు వెలువడడంతో వారి భావాలు వెలుగుచూశాయి. ఆనాటి దేశకాల పరిణామాలను అనుసరించి దేశభక్తి, దైవభక్తి పూరితమైన రచనలు చేశారు.
కొటికలపూడి సీతమ్మ, సీరము సుభద్రయాంబ, వింజమూరి వెంకటరత్నమ్మ, పులిగుర్త లక్ష్మీనరసమాంబ, జూలూరి తులసమ్మ మొదలైన వారు రచనలు చేశారు. వీరి ప్రభావంతో మరికొందరు మహిళలు సామాజిక సమస్యలకు స్పందిస్తూ చక్కటి అభివ్యక్తితో పద్యరచనలు చేశారు. అదే కోవలో కాంచనపల్లి కనకాంబ, గుడిపూడి ఇందుమతీదేవి, కనపర్తి వరలక్ష్మమ్మ, స్థానాపతి రుక్మిణమ్మ, దేశిరాజు భారతి మొదలైన వారి సాహిత్యసేవ గుర్తించదగినది. అనంతరం చావలి బంగారమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, భావకవిత్వ ఛాయలతో మరికొంత ఆధునికతను జోడించి దేశభక్తి కవితలు మాత్రమే కాక స్నేహం, ప్రేమని అభివ్యక్తీకరించిన కవితలు మంచి కవితాత్మకతని కలిగిఉండి హర్షించదగినవే అయినా సమకాలీన రాజకీయ సామాజికాంశాల ప్రతిస్పందన చాలా తక్కువగా ఉండి భావకవిత్వోద్యమ ప్రభావం ఎక్కువగా కన్పించటాన్ని గుర్తించవచ్చు.
ప్రబంధ కవిత్వం వల్లా, భావకవిత్వం వల్లా ప్రయోజనం లేదనే భావనతో సందేశమే ప్రధానమనే వాదనతో అభ్యుదయోద్యమ ప్రచారం వలన స్త్రీలు కూడా ప్రభావితులయ్యారు. కవయిత్రులు కూడా భావకవిత్వంతో పాటుగా ప్రభోదాత్మక కవితల్నీ అడపాదడపా రాసారు.
60వ దశకంలో కవయిత్రుల ఆలోచనా దృక్పథంలో సామాజిక ప్రతిస్పందన మొదలైంది. అయితే ఎక్కువ మంది మహిళలు సాహిత్యరంగంలో గుర్తింపే కాక ఆర్థికంగానూ ప్రయోజనకరమైన నవలారచన పట్ల ఆకర్షితులైయ్యారు. దీని వలన పాఠకుల సంఖ్య పెరగటానికి దోహదమయ్యింది. కానీ, కవయిత్రుల సంఖ్య చెప్పుకోతగినంతగా లేదు. నాయని కృష్ణకుమారి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ధర్భా భాస్కరమ్మ, లక్ష్మీ రమణ, సి.వేదవతి, యశోదారెడ్డి వంటి వారు కేవలం కవిత్వరచనకే ఇష్టపడ్డారు. వీరు కూడా భావకవిత్వ పోకడలతో పర్వదినాల కవితలకే ఎక్కువ పరిమితమైనట్లు కన్పించినా సామాజికాంశాల స్పర్శకూడా వారి కవితల్లో ఉంటుంది.
దేశంలోని విభిన్న పీడనలకు గురిచేసే సంఘటనల్నీ, దృశ్యాల్నీ స్పందనల్నీ అక్షరీకరించి ప్రశ్నించటానికైనా, సామాన్యజనానికి సంఘీభావం తెలియజేయటానికైనా, ప్రాపంచిక దృక్పథాన్ని పాఠకులకు అందించటానికి అనువైన రూపంగా ఉండే కవిత్వరచన చేసే కవయిత్రులు ఆ రోజుల్లో అతి తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు.
70వ దశకానికి వచ్చేసరికి కాలానికి అనుగుణంగా, సామాజికంగా, రాజకీయంగా వ్యక్తి జీవితం అనేక మార్పులకి లోను కావటం మొదలైంది. మనిషి మనిషిగా మనలేకపోతోన్న సంక్షోభ పరిస్థితుల్లో కవులు అనేక సంఘర్షణలకి లోనవుతున్నారు. అందులో కవితాహృదయం ఉన్న కవయిత్రి ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురౌతూ జీవన పోరాటాలతో పెనుగులాడుతూ తమ విధ్వంసాన్నీ సంచలనాన్నీ సున్నిత మానవీయ స్పందననే కాక, తీవ్ర కంఠస్వరంతో తనదైన ముద్రని కవితారంగంలో ప్రకటించే ప్రయత్నం చేయటం మొదలైంది.
ప్రతీకలు భావచిత్రాలు కవిత్వానికి ప్రాణం. అవి అనుభూతి కవిత్వానికైనా వివిధ అస్తిత్వ ఉద్యమ కవితలకైనా ఒకేలా విభిన్నసందర్భాలుగా వివిధ రూపాలుగా వ్యక్తీకరింపబడి కవిత్వంలో ఒదిగిపోతోంది. అందుచేతే కవిత్వం జీవితంతో మమేకమౌతోంది. జీవితాన్ని కవిత్వం ప్రతిబింబిస్తోంది.
ఇటీవలి కవయిత్రులకు ఏ కావ్యవస్తువుని ఎంచుకోవాలో తెలియజేయనవసరం లేదు. ఎందుకంటే మన పరిసరాలలోనూ, మన నిత్యజీవితంలోనూ, ప్రతీవ్యక్తీ వర్ణ, జాతి, మతపరంగా ప్రపంచవ్యాప్తంగా అనేకానేక సంక్లిష్ట సందర్భాలను, వివక్షలను ప్రతిరోజూ ఎదుర్కొంటున్నారు. అని మానసికమైనవి కావచ్చు, జండర్ పరమైనవి కావచ్చు. సామాజిక, ఆర్థిక రాజకీయపరమైనవీ కావచ్చు, ప్రతిక్షణం పోరాటం తప్పటం లేదు. అందుకే ఈనాడు కవయిత్రులకు కవితా వస్తువుకి కొదవలేదు. జీవితాన్ని శాసిస్తున్న సందర్భాలన్నీ కవిత్వమయమయ్యాయి. అభ్యుదయ కవిత్వానంతరం ఈనాడు శిల్ప ప్రాధాన్యత కల కవితారూపం వచ్చింది.
ఉద్యమ ప్రభావాల వలన కొన్ని నినాదప్రాయంగా ఉన్నా శిల్పరీత్యాగానీ, అభివ్యక్తి రీత్యాగానీ, సామాజిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వస్తున్న కవిత్వం ఉన్నత ప్రమాణాల్ని కలిగే ఉంటుంది. అయితే ఎవరిని లక్ష్యంగా పెట్టుకొని రాస్తున్నామో వారిని చైతన్యవంతుల్ని చేసినా చేయకపోయినా ఒక అవగాహనని ఒక ఆలోచనని మేల్కొల్పటానికి కవిత్వం ఉపయోగపడాల్సి ఉంది.
వర్తమాన జీవితంలోని, మార్పుకు లోనవుతోన్న జీవనపోరాటాన్ని, సమకాలీన పరిస్థితుల్నీ, సంఘర్షణల్నీ ప్రతిబింబించే రచనే నిలబడుతుంది.
సంకుచితత్వానికి చోటివ్వకుండా విశ్వదృక్పథం ఉన్నప్పుడు మాత్రమే ఏ చిన్న సంఘటనకైనా, మనసును సంచలింప జేసే చిన్న కదలికకైనా, ఏ దృశ్యానికైనా స్పందించగలుగుతారు. ఆ స్పందనని కవిత్వీకరించగలుగుతారు. ఎదుటివారి హృదయస్పందనని, బాధని, కష్టసుఖాల్ని ఒడిసి పట్టుకోలేనివారు వారితో కలిసి జతకలిపి అడుగువేయలేని వారు కవి కాలేరు.
కవులతో సమానంగా, స్పష్టంగా, సూటిగా, నిబద్ధతతో కూడిన కవితాత్మక ప్రతీకలతో నిండిన కవిత్వాన్ని వెలుగులోకి తెస్తున్న కవయిత్రులు ఈనాడు ఉన్నారు.
ఒకప్పుడు నవలా ప్రపంచంలో రచయితలకన్నా రాసిలో వాసిలో పేరొందిన రచయిత్రులు ఉన్నట్లే ఇటీవల కవయిత్రుల సంఖ్య కూడా పెరిగింది. కానీ ప్రధాన కవితాస్రవంతిని చీలుస్తూ వివిధ అస్తిత్వాలు పాయలు పాయలుగా చీలిపోతుండటంతో ఏకీకృత సంఘటనం కన్పించటంలేదు. ఎవరి మట్టుకు వారు ఒక పరిధికి నిబద్ధులై పోవటంతో కవిత్వ ప్రవాహం ఆగి ఆగి మందగమనంతో సాగుతోన్నట్లుగా ఉంది. అస్తిత్వ పోరాటాలు ఉండాల్సిందే. ఉన్నప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి వెలుగుచూడని, అనేక వాస్తవాలు తెలుస్తాయి. మనం ఎంత అభివృద్ధి చెందినా మన మూలాల్ని మరచిపోనట్లుగానే ప్రధాన సాహిత్య ప్రవంతిలోకి దృష్టి సారించాలని నా ఉద్దేశ్యం.
నిజానికి స్త్రీల సమస్యలు వర్గ, జాతి, మత, దేశాంతరాలలో అనేకానేక భేధాలతో వివిధ రూపాంతరాలతో ఉంటూనే ఉన్నాయి. ఇంకా అసంఖ్యాకమైన సమస్యలు కవిత్వీకరించబడటం లేదు. అనేక విధాలుగా స్త్రీ మనుగడని ప్రశ్నార్ధకం చేస్తున్న అవరోధాల్ని, అస్తిత్వరూపవైవిధ్యాల్ని స్పందించాల్సినంతగా కవయిత్రులు ఇంకా పట్టుకోవటం లేదు. అందువల్ల, వస్తువులో మొనాటని వచ్చే ప్రమాదం కూడా ఉంది.
అందుకేనేమో వివిధ సంకలనాలలో చేర్చబడే కవయిత్రుల సంఖ్య అత్యల్పంగా ఉంటోంది. ఆ పరిమిత సంఖ్యవారినే విమర్శకులు కూడా మరల మరలా ప్రస్తావించటం జరుగుతోంది. అందుచేత కవయిత్రుల సంఖ్య విస్తృతి పెరుగుతోన్నా చాలామంది కవిత్వరంగంలో గుర్తింపబడటం లేదు.
నేనూ, డా॥ భార్గవీరావు కలసి వివిధ వాదాల కతీతంగా వంద మంది కవయిత్రుల రచనలని సంకలనంగా 2001 సంవత్సరంలో ‘ముద్ర’ పేరుతో మా సంపాదకత్వంలో తీసుకువచ్చాము.
ముద్రకి ముందు నీలిమేఘాలు స్త్రీ వాద సంకలనం, ముద్ర తర్వాత వెలుగుచూసిన దళిత, బహుజన, ముస్లిం, మైనారిటీ కవయిత్రుల సంకలనాలు వెలువడ్డాయి. బలమైన గొంతుతో, ఒక ఖచ్చితమైన దృక్పథంతో వెలువడిన సంకలనాలే కాక అనేక కవయిత్రుల కవితాసంపుటాలు కూడా వస్తూనే ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే ముద్ర తర్వాత అసంఖ్యాకమైన కొత్త కవయిత్రులు వెలుగులోనికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది హర్షించదగిన పరిణామమే. ఇందులో సమకాలీన పరిస్థితులకు స్పందిస్తూ రాస్తున్న వారు కూడా తక్కువగా లేరు.
అందుకే ఇటీవల నేను 250 మంది కవులతో కూర్చిన ‘శీలాక్షరాలు’ సంకలనంలో వందమంది కవయిత్రుల కవితలను చేర్చాను.
అయితే ప్రపంచీకరణ పరిణామాలలో అతి వేగంగా మార్పుకు లోనవుతోన్న జీవన సందర్భాలలో, సంక్షోభసమయంలో కూడా ప్రతిభావంతులుగా గుర్తింపు పొందిన కవయిత్రులు కూడా అనుకున్నంతగా స్పందించటం లేదేమోననిపిస్తోంది. అరుదుగా రాస్తున్నా కొన్నిట్లో వస్తువైవిధ్యం కొరవవటం కూడా గమనించవలసిన విషయం.
వస్తువులోనే కాక కవిత్వ రూపాలలోనూ కూడా కొత్త పుంతలు తొక్కుతోన్న దశ యిది. ప్రముఖకవులు అనేక మంది దీర్ఘ కవిత్వ రచనల్లో కృషి చేసి గ్రంథాలు వెలువరించారు. హైకూలు మినీకవితలు, నానీలు పుంఖానుపుంఖాలుగా పుస్తకరూపంలో వెలువరించారు.
కానీ కవయిత్రులు అతి తక్కువ మంది తప్ప దీర్ఘ కావ్యరచన చేయటానికి ఉత్సాహం చూపటం లేదు. ఇంటిచాకిరి, మానసిక కల్లోలం నుండి, దేహస్పృహ, దాని నుండి జండర్ వివక్ష, అక్కడనుండి కుల, వర్గ, జాతి మత విద్వేషాలు దాటి దేశ పొలిమేరలు దాటి, ప్రపంచ కుగ్రామాల్లోకి మన ఆలోచనల్ని విస్తరించాల్సిన అవసరం చాలానే ఉంది. కవిత్వాన్ని సార్వజనీనం చేయాల్సిన పరిస్థితిఉంది.
ఎందుకంటే గుజరాత్ గాయాలూ, ఆఫ్ఘన్ యువతుల కన్నీళ్ళు తాలిబన్, పాలస్తీనా, గాజా మహిళల గుండెకు తగిలిన కముకుదెబ్బలూ, యుద్ధబీభత్సములో తల్లుల కడుపుకోతలూ, గిరిజన మహిళల వెల్లడి కాని ఆవేదనలు ఇంకా ఇంకా చాలా విషయాలు కవయిత్రుల కవితల్లో రేఖామాత్రంగానే ఉన్నాయి: విషయవైవిధ్యం లేకుండా అనేకం చర్విత చర్వణం కావటానికి కారణాలు అన్వేషించాలి.
సాహిత్యరంగంలో పెరిగిపోతున్న అనేకానేక వివక్షల వలన కావచ్చు, కవయిత్రుల రచనల్ని సమీక్షించటానికి మహిళ విమర్శకుల కొరత కావచ్చు, సీరియస్గా కవిత్వరచన పట్ల దృష్టి సారించలేనంతటి పని ఒత్తిడి కావచ్చు. కవయిత్రుల కవిత్వాన్ని చదవటానికి నిర్లక్ష్యధోరణి కావచ్చు, అనేక మంది కవయిత్రుల రచనలు పూర్తి స్థాయిలో సాహిత్య చరిత్రలో నమోదు కావటం లేదు.
కవిత్వానికి సంబంధించిన సాహిత్య వ్యాసాలలో లోతుకు పోయి కవిత్వాన్ని చదివేందుకు సమయం వెచ్చించలేక కొంత, పక్షపాత ధోరణి వలన కొంత, కొందరు కవయిత్రుల రచనలకు విశాలదృక్పథంతో సమగ్రమైన విశ్లేషణ కరువైపోతున్నాయి. దాంతో చాలామంది కవయిత్రులకు తమ కవిత్వం తామే మోసుకు తిరగక తప్పటం లేదు.
