[విశ్వర్షి వాసిలి గారి ‘సాహిత్య ప్రసంగ కౌముది’ అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠాన్ని సమీక్షగా అందిస్తున్నారు శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్.]
నాంది: సమీక్షకు పునాది
సభాయై నమః. ముందుగా మాన్యులు శ్రీ విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారికి సప్తతి శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లూ ఈ విధంగానే ప్రతి ఏడూ పుట్టినరోజు పండుగను జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్పగా ఈ పండుగను జరుపుతున్న వారి కుటుంబ సభ్యులకు నా మనఃపూర్వక అభినందనలు. సభకు విచ్చేసిన గురువులకు, సాహితీ దిగ్గజాలకు, ప్రత్యక్షంగానూ-పరోక్షంగాను తిలకిస్తున్నటువంటి ఎందరెందరో మహానుభావులకు నా వందనాలు. నా సమీక్షోపన్యాసాన్ని ప్రారంభించే ముందర, రెండు మాటలు చెప్పటం సబబుగా భావిస్తున్నాను.
మొదటిది, మా గురువుగారు కీర్తిశేషులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి “సాహిత్య చరిత్రతో సహయానం” లో వారు ప్రస్తావించిన వారి గురువు గారి మాట. “సమయం వెచ్చించి ఒక ఉపన్యాసాన్ని వింటేనో, ఓ పుస్తకం చదివినప్పుడో కనీసం ఒక కొత్త అంశమైనా తెలియకుంటే ఒక కొత్త ఆలోచనకు ప్రేరణ కలగకుంటే ఆ మేరకు నా జీవిత భాగాన్ని చంపేయడం కాదా? ఇది బయటకు తెలియని హత్య [ఆధునికత సమకాలికత కొన్ని పార్శ్వాలు, ఆ.గం. శె. ల.నా పుట v]”. ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఇక రెండవదీ ఇంకా అతి ముఖ్యమైనదీ ఏమిటంటే, ఇవాళ ఏ కన్జ్యూమర్/ కస్టమర్ రైట్స్ లేకుండా అనామకంగా నిల్చున్న అభాగ్యుడు, అమాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే.., అది ఒక్క శ్రోత మాత్రమే!
కనుక, నాకు కేటాయించిన ఈ 20-30 నిమిషాల పాటు సూక్ష్మేక్షికతో చేసే సమగ్రమైన ఈక్షకుడిగా.., సమీక్షకుడిగా నేను ఈ వేదిక సాక్షిగా తెలియజేసేదేమిటంటే.., మీ అందరి చెవులూ వాచేలా రాచిరంపాన పెట్టనని,బూచి లా పట్టి పీడించనని, శుచి-శుభ్రంగా ఒక ధావళాన్ని ధరించి, ఆచి-తూచి మాత్రమే మాట్లాడతానని, ‘ సాహిత్య ప్రసంగ కౌముది ‘ అనే పుస్తకానికి మీతో విహంగ వీక్షణం చేయించి, రుచి మాత్రమే ఏ పేచీ లేకుండా చూపిస్తానని, అజీర్ణం పట్టుకునేలా మొత్తం కుంభంలా గుమ్మరించనని నాదీ పూచి! ఎందుకంటే సమీక్ష ఓ రచనని పరిచయం చేయాలి. అది ఎత్తుకున్న ఇతివృత్తాన్ని వివరించాలి. రచయిత కృషిని చెప్పాలి. పరిచయించడమే దాని పని.., పరిచర్య కాదు. నా కర్తవ్యం, వక్తవ్యం అంతవరకే. అదే నేనూ చేయదలుచుకున్నాను!
పరిచయంతో పాటు మరో గూడార్ధమైన విషయం – పుస్తక ప్రయోజనాన్ని కూడా ఈ సమీక్షలో మిళితం చేసి మీ ముందుంచటం నా విధి. మన సంపరాయంలో, సంప్రదాయంలో ఆచార్య శ్రీ శలాక రఘునాథ శర్మగారు సెలవిచ్చినట్టుగా, “జ్ఞానము – విజ్ఞానము” అని రెండు అంశాలు ఉంటాయి. మొదటిది పరమాత్మకు, రెండవది ప్రపంచానికీ సంబంధించినవి అన్నది జగద్విదితం. పారిభాషికంగా రెండవ దానిని ‘అవిద్య’ అని, మొదటి దానిని ‘విద్య’ అని అంటారు. – అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృత మశ్నుతే – అంటుంది ఉపనిషత్తు. అవిద్యతో మృత్యుతరణం అంటే అజ్ఞానాన్ని రూపుమాపుకోవటం, విద్యతో అమృతాన్ని అనుభవించటం అని ఋషి వాక్కు [యాజ్ఞవల్క్య, శ్రీ వేలూరి కృష్ణమూర్తి, పుట 13-14] సాహిత్య ప్రసంగ కౌముది లో శ్రీ వాసిలి మహాశయులు పైన ప్రస్తావించిన విద్యావిద్యలను సరి సమానంగా తూకం వేసిన తీరు, తపన శ్లాఘనీయం కనుక, ఈ పుస్తకాధ్యాయనం ప్రయోజన కారి అని తెలియజేయడం. నా ప్రసంగ తాపత్రయమంతా దాగివున్న ఈ సిరిని, అంతః రచనను ఆవిష్కరించడమే!
అవతారిక: శీర్షిక సార్థకత
‘తాపత్రయం’ అని అన్నాను గనుక, సమీక్షకుపక్రమించే ముందు కొంత స్వేచ్ఛ తీసుకుని ఈ సభా ప్రాంగణాన, ఈ పర్వదినాన సప్రశ్రయంగా ఇంకొక మాట మనవి చేస్తాను. ఈ సప్తతి సమారోహం లో మూడు పదాలు ప్రముఖంగా ప్రథ తో (ఖ్యాతి) మనకు కనిపిస్తున్నాయి. ‘వ్యక్తిత్వం’ – ‘అక్షరం’ – ‘యోగం’ అని. ఈ పదాలను జాగ్రత్తగా అవలోకిస్తే ఈ మూడు కూడా తద్యథః (defacto) వరుసగా మూడు తాపత్రయాలనూ ప్రతిబింబిస్తున్నాయని నాకన్పిస్తోంది. వ్యక్తిత్వం- ఆధిభౌతికాన్ని, అక్షరం -ఆది దైవికాన్నీ తెలియబరచితే, యోగం- ఆధ్యాత్మికత్వాన్ని చూపుతోంది. తాపత్రయాలను తొలగించే తల్లికి శ్రీ లలితా సహస్రనామాలలో 357వ నామంగా, “తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా” అని కీర్తి. పాపములు మూటిచే కలిగిన సంసారమనెడి అగ్నిలో మిక్కిలి తపించిన వారికి ఆనందమును కలుగజేయు వెన్నెల వంటిదని “సౌభాగ్య భాస్కర భాష్యము”లో శ్రీ రాయలవారి ఉవాచ[శ్రీ సౌభాగ్య భాస్కర భాష్యం పుట 553]. ఆలాగుననే, ఏ రచన కైనా మూడు తాపాలు ఉంటాయి. జాతి చేతన/ప్రతిభ (Race), కాలఘట్టం (Moment), పరిసరం (Milieu). ఈ దృక్కోణాల నుంచి చూస్తేనే రచన యొక్క సమ్యక్ స్వరూపం, విశిష్ట వ్యక్తిత్వం, ప్రయోజనం, ఆవశ్యకత అవగాహన లోకి వస్తాయి [ఆధునికత సమకాలీనత, ఆ.గం. శె. పుట 381 ]. ఈ మూటితాపాలనూ సమగ్రంగా సమాధాన పరుస్తోంది గనుక, ఈ రచన కూడా ఒక చల్లటి వెన్నెలే! ఇంకోలా ఆలోచిస్తే, ఆయన ప్రత్యక్షంగా చేసిన ప్రసంగాలు సూర్యతేజస్సు. పరోక్షంగా పొత్తంలో ఒద్దికగా చల్లగా వెల్తురు ప్రతిఫలిస్తూనే ఉంటాయి కనుక సాహిత్య ప్రసంగ కౌముది అన్న శీర్షికనుంచటం నూటికి నూరుపాళ్ళు సమంజసం, సార్ధక నామధేయం.
రూపు రేఖలు Synopsis
ఈ పుస్తకం రూపు-రేఖలు పరికిస్తే, ఇందులో మొత్తం 19 ప్రసంగాలు ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలలో జరిపిన కీలకోపన్యాసాలు, కొన్ని సందర్భోచితంగా, అంటే షష్టిపూర్తి లాంటి సభలలో చేసినవి, మరికొన్ని అంతర్జాల సదస్సులలో పలికిన మాటలు. వీటన్నింటిలో ప్రధానంగా 44 పేజీలు “నేను – నా నేను కావ్యరచనా ప్రత్యేకతలు” అన్నది అతి విస్తారంగా కనబడితే, అప్రధానంగా “జానపద గీతాలు – ఒక చిరు అవలోకన” అనే చిన్న వ్యాసం మూడు పేజీలలోనే మనతో ముచ్చటిస్తుంది.
విశ్వర్షి వారి తనతనం, తపం, తపన, తలంపు నిలుపుకుంటూనే, ‘భువన చంద్రం’గా తొట్టతొలుతే ఈ పుస్తకం భాసిస్తుంది. అంతలోనే, ‘ఆశాజ్యోతి’గా తళుక్కుమని, తెలుగు సాహిత్య రీతులను ఆమూలాగ్రం ప్రగాఢంగా పట్టి పఠితుడి మనసుల్లోకి నెట్టుతుంది. దృగంశువులతో దీర్ఘ కవితా విన్యాసాలు పోయి, ఆగాగి ఆత్మీయుల నాలింగనం చేస్కుంటూ, జీవనాక్షర స్వారస్యాన్ని పెంపొందిస్తుంది. అస్తిత్వపు నది ఆవలి తీరాన వెలసిన ‘మునిపల్లె’కు మౌనంగా తీసుకెళ్లి మానసిక సింహాసనంపై ఆ ‘రాజు’ని పట్టాభిషిక్తుణ్ణి చేస్తుంది. తెలుగులకు సరికొత్త వెలుగుల ‘సాక్షాత్కార’ సందర్శనం చేయించి, దేహము-విజ్ఞానము- బ్రహ్మోపదేశం ఒసంగిన జనకుని సంపూర్ణాక్షర ప్రస్థానాన్ని భక్తితో కైమోడ్చి, లోకార్పణం కావించి, సాహిత్యంతో తన సహవాసాన్ని నెరపుతుంది. నేస్తులైన శ్రీ వెలుదండగారికి పూలదండ కాదు, గండపెండెరమే గద్యంగా నిలువెల్లా తొడుగుతుంది. అతి ప్రాచీన సూఫీ సిద్ధాంత పీఠాధిపతిని పరిచయం చేసి, ఆర్ష ధర్మ సూత్రాల ఆశంసనం అందిస్తుంది. నాటి ఆలోచనల నుండి రేపటి ఆచరణల వరకు వాసిలి వారి బాణీతోనే వరుస ప్రసంగాలను అందిస్తుంది. అయితే ఇదంతా శుష్క సైద్ధాంతికాసక్తిగా కాకుండా అనువర్తితాల (applications) వైపుగా జరిగిన అంతర్ముఖ ప్రయాణంగా వ్యాస సంపుటి కొనసాగుతుంది. మన బుద్ధిని, హృదయాన్ని ‘కైవారం నుంచి కేంద్రానికి’ చేయి పట్టుకు నడిపించే అవగాహన, కృషి, శిక్షాప్రణీతాలతో పరిఢవిల్లుతుంది.
విశ్లేషాత్మక దృష్టి (Analytical Eye)
పుస్తక సారాంశాన్ని మీకు విశదీకరించినా, ‘ఈ పుస్తకం ఎందుకు చదవాలి?’ అన్న మీమాంస కలగాలి కదా? ఒక చిన్న ఉదంతం చెబుతాను. సాహిర్ లూథియాన్వి అని ఒక గొప్ప హిందీ పాటల రచయిత ఉండేవాడు. అతనితో ముఖాముఖి ప్రారంభిస్తూ విలేకరి, “సార్ మీరెక్కడ పుట్టారు?” అని అడిగాడట. ఆయన నవ్వి, ‘ఇదొక రొటీన్ ప్రశ్న. కనీసం నన్నెందుకు పుట్టావనైనా అడగాల్సింద’ని అన్నాడట. Aye jidat pasand naujawaan, yeh to bada rawayyati sawal hai ! Is rawayyat ko aagey badhate huye is mein itna izaafa aur kar lo, kyun paida hua?
అలాగే రొటీన్ గా ఈ ప్రసంగం చేశారు, ఆ మాట మాట్లాడారని కాస్త కవిత్వపు మసాలా జల్లి పుస్తకపు సారాంశాన్ని ముగించేసినా ఒక విశ్లేషాత్మక దృష్టితో, ఎందుకు రాశారు? ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది? ఎవరికిది చదవడం వల్ల లాభం? సాహితీపరంగా పరిశోధక విద్యార్థులకు ఏమైనా ఉపయుక్తమౌతుందా? అని మనం తప్పక ఆలోచించాలి. కనుక, ఒక్కొక్క వ్యాసాన్నీ తీసుకొని ఈ ప్రశ్నలకనుగుణంగా వివిధ విభావాలు (determinants), అనుభవాలు (consequences), భావాలు (moods), సత్యభావాలు (involuntary emotions), కాల్పనికత(Romanticism), శైలి(style), భాష (diction) అన్న సూత్రాల ప్రాతిపదికతన జల్లెడ పట్టాల్సిన అవసరం ఉన్నది. EM Forster సెలవిచ్చినట్టు, Literature with its power has to transform the readers by fostering a creative impulse. చదివినాక- అలలు కదిలి, కలలు మెదిలి, పట్టి బంధించిన తామసికమైన వలలూ వదిలి, ఏ కావ్యమైనా, గ్రంథమైనా చిలువలు పలువలుగా చైతన్యపు వలువలను చేతికందించాలి. కాని యెడల అలాంటి పుస్తకాలకు నెలవులు పూర్తిగా కరువైపోతాయి!! ‘ఈ పుస్తక పఠనం అలాంటి నిరూపణకు నిలుస్తుందా?’ అన్న నిగ్గు మనమిప్పుడు తేల్చాలి.
ఎంతో చురుకుదనం పాటించినా, 19 ప్రకరణాలుగా ఉన్న 250 పుటల ఈ పుస్తకంలో పొందుపరిచిన సాహితీ సౌరభాన్ని పూర్తిగా తెరిచి పరిచి చూపించటం సాధ్యం కాదు, సమంజసమూ కాదు. కనుక, సమయపాలనా – సారగ్రాహి న్యాయమూ పాటిస్తూ కొన్నింటినే ఉటంకించి, అందునా; యోగిక విషయాలలోకి నా పరిమితుల కారణంగా చొరబడక నా ఎనాలసిస్ ని పరిపుష్టం కావిస్తాను!
సిలజిసం(Syllogism)
బహుముఖీనమైన ఒక సాహితీవేత్త శ్రేష్ఠత్వాన్ని ఎలా కొలవాలి? అతడి సారస్వతమూర్తిని ఎలా నిలపాలి? అన్నది తెలియాలంటే శ్రీ భువనచంద్ర గారిపై వెలువరించిన మొదటి ప్రసంగం చదవాలి. ‘ఎత్తుగడల ఎత్తరి-విస్తారి’ అనే శీర్షికే మనల్ని కట్టిపడేస్తుంది. ఈ వాక్యాలు గమనించండి.
… “ఇంతకీ ఈ ఎత్తుగడ వర్ణనాత్మకమా? వాక్యాత్మకమా? ప్రశ్నార్ధకమా? మనోవ్యాకులతా? వర్తమానవర్తనమా? సంభాషణాత్మకమా? సంఘర్షణాత్మకమా? నన్నడిగితే, నీ – నా మన అస్తిత్వపోరు మలపులలో స్రవించిన కన్నీటి చుక్కలివి” అంటారు [పుట 14]. అలాగే ఆ ప్రసంగపు ముగింపు వాక్యాలను చూద్దాం.. “మీరు పాదచారిగా ‘ఒకే ఒక్క రహస్యం చెప్పా.. నీ చెవిలో.., లక్ష నాళికలకెలా తెలిసింది క్షణంలో?’ అని ఓ 50 ఏళ్ల క్రితం అనగా లేనిది, ఐదు దశాబ్దాల తరువాత ఈ నాలుగు మాటలను ఆ ఒక్క రహస్యంలో పొదవి, నాలుగు కోట్ల తెలుగులకు అందించలేమా..” అన్నారు. ఎంత గొప్ప మాటలివి?
“సిలజిసం (Syllogism)” అని మూడు అంగాలు గల అరిస్టాటిల్ తర్కమొకటి ఉందని చాన్నాళ్ల క్రితం చదివాను. దానికి శ్రీ నండూరి వారు పోలిక తెస్తూ, మన భారతీయ ఋషి గౌతముడి తర్కం ఇంకా ఉచ్ఛమైనదనీ, అది ఐదు అంగాలను కలిగి ఉంటుందనీ [నండూరి రామ్మోహన్ రావు, విశ్వ దర్శనం, పుట 280] తెలియజేశారు. ఈ ఉపన్యాసమంతా ప్రతిజ్ఞ (Statement), హేతువు (Reason), ఉదాహరణ (Example), ఉపనయం (Analogy), నిగమనం (Conclusion) అన్న ఆ ఐదు విభాగాలలో అమ్మ ఒడిలో ఒదిగిన పసిబిడ్డలా చక్కగా చేరిపోతుంది.
కీలకం
మనం రోజూ పారాయణం చేసే స్తోత్రాలలో కూడా ఒక పదం వస్తుంటుంది “కీలకం” అని. మంత్రశాస్త్రం ప్రకారం ప్రతీ మంత్రానికి షడంగన్యాసం ఉంటుందిట. వివరించాలంటే,ఆ ఆరు.., ఋషి (Seer), ఛందస్సు (Meter), దేవత (Diety), బీజం (Seed Syllable), శక్తి (Power) ఇంకా కీలకం(Pin/Lock). వీటన్నింటిలో ఈ ఆరవది అత్యంత ముఖ్యమైనదిట. బీజాక్షరాలు నిగూఢంగా ఉన్న ఆ స్తోత్రంలో మంత్రం యొక్క శక్తిని ఋషి కీలితం (మేకు కొట్టేయడం) చేస్తాడు. అది అవవగతం కావాలంటే, గురువు ద్వారానే సాధ్యం. గురువే ఆ తాళాన్ని తెరువగలడు. ఇదే రీతిలో, ‘కీలకాంశాలపట్టు తెలిసిన ఆశాజ్యోతి గారి ఉపన్యాసాల సారం’ విశ్వర్షి మహాశయులు తాళం విప్పి మనకు అజరామరంగానో, ఓ భౌతిక అమరత్వంతోనో (physical immortality) అందజేశారు. ఈ ఉపన్యాసం పరిశోధక విద్యార్థులకు ఒక తరగని గని. ఇందులో పది అంశాలలో మొత్తం పాఠాన్ని బోధించారు వాసిలి గారు [పుట 25, 26]. వరుసగా, 1. సిద్ధాంతీకరణం (Theoritization), 2. విషయ వస్తు సేకరణ (Data collection), 3. పరిమితులు (Limits), 4. అధ్యాయ విభజన -కుప్పలు తెప్పలుగా శ్రమించి తెచ్చుకున్న విషయాన్ని క్రోడీకరించి, విభజించటం( Chapterization), 5. ప్రయోజనం (Kindling thought/ purpose), 6. సమర్థవంతమైన సన్నివేశ / పాత్రల నిర్మితి (Creating effective characters/ scenarios) , 7 శ్రోతలకు రంజకంగా అందజేయడం(Presentation), 8. చెప్పే విషయానికి కట్టుబడి ఉండటం ( Sticking to the core), 9. ధారాశుద్ధి (Maintaining the flow), 10. తన పరిధిని ఎరిగి ఉండటం(Knowing the boundaries). ఆమె అత్యంత సమర్థవంతంగా ఈ పది అంశాలను తన కీలకోపన్యాసాలలో నిలబెట్టిందంటారు. వారే చెప్పినట్టు [పుట 30], “ ఒక వ్యక్తి యొక్క వైయుక్తిక , వ్యవస్థాగత, మానసిక, అధిమానసిక ప్రవృత్తిని అక్షరాల నుండి జల్లెడ పట్టగలిగితేనే ఇటువంటి నిర్ధారణ సాధ్యపడుతుంది.”
దీర్ఘకవితా విన్యాసం
ఆచార్య మలయవాసిని గారు ఒక ప్రసంగంలో, “ఇవాళ నలుగురు పరిశోధక విద్యార్థులను దీర్ఘకవితా లక్షణాలను వివరించమని ప్రశ్నిస్తే, సరిగా జవాబు చెప్పలేరు” అన్నారు. అదే శ్రీ విశ్వర్షి వారి వ్యాసం చదివిన వారికి, దీర్ఘకవితా సంవిధానం, దాని సామర్థ్యం పట్టుబడడమే కాక, సంగ్రహమూ బోధపడుతుంది. శుద్ధ వచనం [పుట 43] దీర్ఘకవితకు ప్రాణం అన్నారు శ్రీ వాసిలి. ఇది నిజం. శబ్దశాస్త్రజ్ఞులు ఈ వాక్యంతో విభేదించినా, ఇది సత్యం అని నిరూపించే వరదలా ముంచెత్తుతున్న నేటి వచన కవితా ప్రవాహమే ఈ వాదనకు నికషోపలం. వచనంలోనూ అర్థవంతమైన శబ్దాల కూర్పు (Morphological arrangement), ధ్వనుల కూర్పు(Phonological arrangement) ఉంటాయి. పద్యంలో పడే పదాంత విరామము (word juncture) గణాంత విరామము, ఉనిక (Stress) లయ కోసం దీర్ఘ కవితలో అవసరం లేదు.
ఇలా దీర్ఘ కవిత గురించి వివరిస్తూనే తెలుగు సాహిత్యంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ 63 దీర్ఘకవితా దీపాల వివరాలనందజేశారు వాసిలి. దీర్ఘకవితలను వ్రాయాలనుకునే వారికే కాదు, చదవాలనుకునే వారికి, సమీక్షించాలనుకునే వారికీ ఇదొక కరదీపిక. ఆఖ్యాయిక రాశిపై అభాసికంగా ఆధారపడి, ఒక సంఘటన పూర్వాపరాలను గ్రహించి, లోక వృత్త పరిశీలన, వ్యవహారజ్ఞత, మానవ వ్యక్తిత్వంలోని భాహ్యాభ్యంతరాల వైరుధ్య దర్శనం, సందర్భోచిత పద గుంఫన చామీరకత్వంతో తెలుగునాట పలువురు దీర్ఘకవితలు వ్రాశారు. కానీ, తెలంగాణ గడ్డపై నిల్చుని మాట్లాడుతున్నాను గనుక, ఇప్పటికీ కొంత అస్పష్టత ఉన్నా, డాక్టర్ పెళ్లూరి సునీల్ గారు ఒక వ్యాసంలో చెప్పినట్టుగా కుందుర్తి గారు 1956 లో రచించిన “ తెలంగాణ “ నే మొట్టమొదటి తెలుగు దీర్ఘకవితగా విజ్ఞులు నిర్ధారణ చేశారు. అంతకుమునుపే 1951-52 ప్రాంతంలో సర్వదేవభట్ల రచించిన “ మహైక “ తొట్ట తొలుతదని కొందరి వాదన. దీని పునర్ముద్రణ 2017లో జరిగిందట. సభలో ఆశీనులై ఉన్న ఆచార్యులెవరైనా ఈ విషయాన్ని తరువాత విపులీకరించవచ్చు. ఈ రెండు పుస్తకాలు నేనైతే చదవలేదు.
కథ వ్రాయాలంటే..?
“కథ వ్రాసేవారు ముందర బోలెడంత వినాలి. తర్వాత కనాలి, లోకాన్ని చూడాలి.. కన్న తర్వాత తెలుసుకోవాలి.. కన్నవి, విన్నవి, తెలుసుకున్నవీ కలగలుపు చేసేసి చెప్పాలి” అన్న ఆరుద్ర మాటల్ని [పుట 49] ఉటంకించారు వాసిలి. నిజమే కదా! మనమందరం చిన్నప్పటినుంచీ కథలు విని, వినీ పెరిగిన వాళ్ళమే! కథంటే కవ్వించేది, కమ్మగా ఉండేదే కాదు.., కన్నీళ్లు తెప్పించేది, కడాన- కదిలించేదీ కూడా! కథ కాకీ పిచ్చుకదైనా, కరుణ నిండిన లాలిపాటతో పెనవేసుకున్నదైనా, కథ- సమాజం, సంతోషం, సంఘర్షణ, సంతృప్తం! కథ.., మన బ్రతుకు. కథ ఒక మహాకథ( grand narrative) అయితే, అదే మన చరిత్ర!
Kuppuswamy Writing Stories Made Easy అని అనను గానీ, 15 పుటలలో పుటం పెట్టి మరీ అదే రీతిన కథకులందరికీ మార్గోపదేశం చేసేశారు విశ్వర్షి వారు. తను కన్న లేత కాదు.. ముదురు కలనేతగా, అరనూరుకు పైగా సూత్రాలను నిర్దేశించిన కథానేత గా, కథల పోతగా దర్శనమిచ్చేట్టు నిలిచిన వ్రాత వారి ఈ ప్రజెంటేషన్. ‘కథలు ఎలా వ్రాయాలని?’ తలపోసే వారందరికీ, తెలియక కుస్తీ పట్లు పడుతున్న భీరువులకీ ఇదొక కరతలామలకం. దారిదీపం. అంజనం వేసి రాకుమారిని అద్దంలో చూపినట్టు, అర్ధవంతంగా అన్ని పార్శ్వాలను స్పృశించి…”కథ సహ ధర్మ చారిణి [పుట 62]”.. అన్న సినారె వాక్కుతో ముగించారు. కథన కుతూహలం ఉన్న కుర్రవారైనా వెర్రివారైనా ఇది చదివి, పదండి ముందుకు, వ్రాయండి మీ కలాలతో, టైపు చేయండి మీ మొబైళ్లలో అనడం ఇక తథ్యం!
పరిశీలనా యజ్ఞం
ఒకసారి టెండూల్కర్, “When I walk into bat, I should know that, Yes I have prepared to the best of my ability. That is when I feel that I am ready to go out and play” అన్నాడు. ఒక కీలకోపన్యాసం లేదా సమీక్ష చేయడానికి ఒకటో,రెండో పుస్తకాలు తిరిగేసి ముక్కున పట్టేసుకుని, ఒకరి literary capabilities, calibre ను అంచనా వేయడం ఆషామాషీగా చేసేయొచ్చు అనుకుంటారు సాధారణ సమీక్షకులు. అయితే, ఒక సారస్వతమూర్తిని శాశ్వతంగా నిలపాలంటే, అతడు రాసిన శీర్షాలు, ఉపశీర్షాలు (sub heads), విషయ సంక్షేపాలు/ సారసంక్షేపాలు, ఘోర పరిశ్రమ, cross references ‘ఇన్ని తెలిసియుండిన గాని.., ఊరక సమీక్ష చేయుట శక్యమే!?’ అన్నది శ్రీ వాసిలి గారి సిద్ధాంతం. అమనస్కస్థితుని జీవనాక్షర స్వారస్యం లో 92 వసంతాలు చవిచూసిన త్రిభాషా ప్రముఖులైన శ్రీ టి. ఆర్. సుబ్రహ్మణ్య శర్మ గారి జాతీయ సదస్సులో, శర్మ గారి సాహిత్యాన్ని వేయి పుటలకు పైగా జిరాక్స్ తీసుకుని మరీ పరిశీలనాయజ్ఞం జరిపాననడం వారి నిబద్ధతకు ఒక తార్కాణం. ఇది ఏ సమీక్షకుడికైనా ఒక సవాలు. నిజంగానే పైన టెండూల్కర్ చెప్పినట్టు, అంత లోతుగా అవతలి వారిని పరిశీలించి,అదే రీతిన తనను తాను సానపెట్టుకుంటేనే గాని శ్రీ వసంత కుమార్ గారు ఒక ప్రసంగానికి వెళ్లరని మనకు ఈ సంఘటనతో తేటతెల్లమౌతోంది. ఈ అలవాటే వారి వ్యక్తిత్వమనే కిరీటంలో కలికితురాయిలా తళుక్కుమంటుంది. ఇదీ, మనం తెలుసుకొని సాధన చేయవలసిన మరొక అంశం.
సర్వం ఖల్విదం బ్రహ్మ(ఇదంతా నిశ్చయంగా బ్రహ్మమే)!
నవవిధ భక్తి మార్గాలున్నట్టు, తొమ్మిది పేజీలలో, “డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యం – శాసన సభ్యత్వ ధార్మిక ప్రస్థానం” ఈ పుస్తకంలో దీక్షగా తపమాచరిస్తుంది. అంతర్జాతీయ పత్రంగా సమర్పించిన డాక్టర్ ఆలీషా గారి మతాతీత ప్రస్థానాన్ని మరోమారు మన ముందర ప్రతిష్ఠిస్తుంది. ఇందులో సమర్థవంతంగా వేదవాంజ్ఞ్మయ ఆధారిత వచనాలు మాత్రమే కాకుండా, ప్రాపంచికమైన, సామాజికపరమైన శాసనసభా విశేషాలు, వాదనలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బ్రహ్మర్షుల శాసనసభా ప్రస్థానం సైతం, సాహిత్య ప్రస్థానమై, మతాతీతంగాను, విద్యాత్మకంగాను, విజ్ఞానాత్మకంగానూ సాగింది. కచ్చితంగా ఒక కవికి, రచయితకు ఉండవలసిన విశాల దృష్టి , ఒక వైపుకే ఒరిగిపోని తీర్పరితనం, నేర్పరితనం ఇందులో నేను గ్రహించిన సారాంశం.
నేను.. నేనే!
“నేను” లెన్ని అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? నా మటుకు నాకు తెలిసి భగవాన్ శ్రీ రమణుల, “నేను ఎవరు?- నాన్ యార్ హూ ఐ యామ్ ఐ” ను పక్కకు పెట్టేస్తే..; తెలుగు సాహిత్యంలో రెండు “నేను”లు కన్పిస్తాయి. ఇందరి పెద్దల ఎదుట మాట్లాడేటటువంటి సువర్ణావకాశం కనుక, ఒక సాహసం చేసి మరీ చెబుతున్నాను. శ్రీ వాసిలి గారు ‘తాత్వికత- ఆధ్యాత్మికత – కవితాత్మకత’ రంగరించి అంతరంగంలోంచీ వారి నేను ను ఆవిష్కరించారు..బాగుంది. అంత హంగూ-పొంగు, రంగు- రుచి- వాసన లేకున్నా నా మొదటి సంపుటికి నేను కూడా నేననే నిర్ణయం చేసుకొని, దానిని నేను గా ముద్రించాను. అప్పటికి శ్రీ వాసిలి వారి మహాకావ్యం ఇంకా ముద్రింపబడలేదు. లేకుంటే, బహుశా నా నేను నా మేనును దాటి బయటికి వచ్చేదే కాదేమో..!ఇంకో శీర్షిక నెంచుకునేదేమో?! సరే, నాది భావుకతతో బరువైన ఒక కవితా సంపుటి. వారిది అమృతోపమానంగా అతుల్యమైన దీర్ఘ కవితా సంగతి..సంగటి! నాది వేరు.. వారిది వృక్షం..!
ఈ నేను సుదీర్ఘప్రసంగపాఠం 44 పేజీలలో ‘విశ్వం దర్పణ దృశ్యమానం’గా చూపించి భగవాన్ రమణుల బలీయమైన భావనను ఎన్నో విధాలుగా ప్రదీప్తం చేస్తూ, తొలగిన తెర.., అంతర్ముఖీన ధార అని ముందే తెలియజేశాను. దాని గురించి ఇక తర్కించకుండా తదుపరి విషయానికి ఉపక్రమించే ముందు మర్యాదపూర్వకంగా తలవంచి, నమస్కరిస్తూ పెద్ద చనువునే తీస్కుంటూ.., “సార్ ఏది ఏమైనా, నీ నేను నీ నేనే! నా నేను నా నేనే! నీ నేనుని నా నేననీ, నా నేనుని నీ నేననీ నేను అనలేను.. అనను!” అని మాత్రం చెప్పి ముగిస్తాను.
పూర్ణమదః పూర్ణమిదం
పద్ధెనిమిది పురాణాల సంగ్రహమా అన్నట్టు, 18 పుటలలో శార్వరీయ సంపూర్ణాక్షర ప్రస్థానాన్ని,”ఆత్మావై పుత్రనామాసి!” అన్న ఋగ్వేద శ్లోకం లా పట్టి అందించారు వసంత కుమార్ గారు. ఆ ప్రగాఢానుభూతిని అనుభవించడమే గాని నేనేమీ ఇంక పలుకలేను. ఆ ప్రసంగపు నిగ్గు తేల్చాలని కట్టడి చేస్తే మాత్రం.., శార్వరి గారి “వివేకానందం” లోని మున్నుడి వైపు మొగ్గుచూపి [పుట 174] నెగ్గుతాను…. “ధ్యానాక్షరి అంటే ధ్యానక్షేత్రం! పరేంగితంగా ధ్యానక్షేత్రం అంటే యోగ చైతన్యం! అది ద్వైతమూ కాదు, అద్వైతమూ కాదు, విశిష్టాద్వైతమూ కాదు. అది చైతన్య విస్ఫోటనం. ఆ విస్ఫోటనానికి ‘నేను’ నేపథ్యం. ‘నేను’ అస్తిత్వం. ఆ ‘నేను’ కు నేను ఎంత దగ్గరవుతుంటే అంతలా ‘నేను’ విస్పోటమవుతూనే ఉంటాను.
అస్తిత్వాత్మక జ్వాల : అక్షయ పరిణామ శీలుల హేల
ప్రసంగాలు 13, 17, 18 లలో జీవితపు ప్రతిబంధిత క్షేత్రం (restricted area)లో, “జీవితం ఎంతకీ తరగని స్వయంజలిత హారతి కర్పూరమని [పుట 177] అస్తిత్వాత్మక హిమజ్వాల గీత గీసి, ‘సశేషం జీవితమే!’ అన్న ధర్మగీతను బోధించారు. ‘నాలుగు వేలపుటల మ్రాను శ్రీ వెలుగొండ గారంటూ’[ పుట 226] వారొక వ్యాసపీఠం అనే వరిష్ట షష్టిపూర్తి ప్రసంగం ఇష్టంగా చేశారు. అదే స్ఫూర్తితో, ఆచార్యులు శ్రీ మాడభూషి వారి షష్టిపూర్తి ప్రసంగమూ ‘అజేయుని విజయ విలాసమంటూ’ కులాసాగా చేశారు.
శీలానికి ప్రతిఫలితమే శైలి
వ్యక్తిత్వానికి అభివ్యక్తీకరణం శైలి. వీరి శైలి, భాష విభిన్నమైనవి, ప్రౌఢమైనవి. దీనికి కారణం వారి 14వ, 15వ ప్రసంగాలలో మనకు ఎరుకలోకి వస్తుంది. ఆ ప్రౌఢి అదేమీ ఊరికనే వచ్చింది కాదు! అకుంఠితమైన దీక్ష, శ్రమ, ఎన్నో నిద్ర లేని రాత్రులలో తనను తాను సానబెట్టుకున్న ఒక సాహిత్య విద్యార్థి సంగ్రామ ఫలితమది! ఆదిలో తరగతి గదిలో తాను చేసిన తొలి 72 తప్పుల వ్యాసానికి ప్రతిగా వారి 72 వేల నాడులూ స్పందించి, అహరహం సల్పిన మేథో యజ్ఞ ఫలమది. “సాహిత్యంతో నా సహవాసం”లో ఈ విషయాన్ని వారే స్పష్టీకరించారు [పుట 215]. తన సహాధ్యాయిని, నేస్తురాలు బి.ఏ. గోల్డ్ మెడలిస్ట్ తో పోటీపడి ఒక అవుట్ స్టాండింగ్ విద్యార్థిగా వారు తనను తాను మలుచుకున్న పరిణామం..అనూహ్యం! వారి అసిధారావ్రతానికి, మొక్కవోని పంతానికి దొరికిన ఫలితం ఈ భాష – భావం! విద్యార్థులకే కాదు, ప్రతి మనిషికి ఒక ప్రేరణాత్మకమైన సందేశాన్ని ఇచ్చేదీ ఉదంతం. వారి భాష సొగసులో, భాషా శాస్త్రం వివరించే వర్ణనాత్మక (descriptive), చారిత్రక (historical), తులనాత్మక (comparative), పరావర్తనిక బేధాలు (reflective differences) అన్నీ కూడా కలగలిసి ఉంటాయి. వారి భావజాలపు సొగసులలో బడుగు బ్రతుకు ఆశ – మల్లెతూగు శ్వాస మిళితమై ఉంటే, వారి తత్వపు సొగసులో.., ‘శ్రేయో మార్గము – ప్రేయోమార్గము’ రెండూ లతల్లా పెనవేసుకుని ఉంటాయి.
ముగింపు
విద్యా విధాన ఏకీకరణ దిశగా కొన్ని ఆలోచనాత్మకమైన పరిణామాల గురించిన చర్చతో ఈ కౌముది పరిపూర్ణమౌతుంది. ఐనా, ఇది ఆరేది కాదు, ఆగేదీ కాదు. కాళిదాసు వాక్రుచ్చిన ‘నిత్య జ్యోత్స్న’ ఇది. స్వస్తి పలుకులు పలికే ముందర వాసిలి వారి వ్యక్తిత్వం (personality) గురించి ఈ పుస్తకాలను ముద్రిస్తున్న యోగాలయ రీసెర్చ్ సెంటర్ వాతావరణం (environment) గురించీ కూడా ప్రస్తావించకపోతే నేను నా కర్తవ్యం లో వైఫల్యం పొందినట్లే.
శ్రీ వాసిలి వారిది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. He is a very well read man. He himself is a Yoga Sadhaka and a Guru to many. వారిని పరిపూర్ణంగా పట్టుకోవాలంటే వారి అన్ని పార్శ్వాలనూ మనం ఎరిగి ఉండాలి. లేకపోతే ‘తత్త్వమసి’ కి బదులు ‘తత్వమసి’ అని కార్ల వెనకాల రాసేసుకుని సంబరపడిపోతూ మసిపూసుకున్నట్టే అవుతుంది! ఎందుకంటే, వారి సాహిత్యాన్ని తరిచి చూసినప్పుడు ఒక ఆలోచన (thought), హేతువు (reason), క్రమం (order) కలిసి మెలిసి ముప్పేటగా సాగుతుంది. వీరి రచనల విషయపుష్టికి – వస్తువు, రూపం, భాష, అలంకార ప్రక్రియలు, తర్కం, ఆంగ్ల పదాలు, కొటేషన్లు కలివిడిగా కలిసిమెలిసి అందగిస్తాయి.
రస్కిన్ అనే ఆంగ్ల విమర్శకుడు Modern Painters అనే తన గ్రంథంలో వ్యక్తులను ఐదు విభాగాలుగా విభజించాడని శ్రీ సినారె గారు ఉదహరించారు [ఆధునికాంధ్ర సాహిత్యం, సినారె, పుట 43]. Persons who see- Seers, Persons who talk- Prophets, Persons who make – poets, Persons who think – philosophers, Persons who do – believers. ఈ ఐదు విభాగాలలో సరిసమానంగా వారి విశిష్ట వ్యక్తిత్వంతో, బహుముఖీన ప్రతిభతో శ్రీ వాసిలి వారు రాణించారు, రాణిస్తున్నారు, ఇంకా రాణిస్తారు!
ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి చెప్పుకునేటప్పుడు అతని లోపాలను కూడా మనం చర్చించుకోవాలి. వారి అభిమానులు అందరూ సావధానంగా విందురు గాక! వాసిలి గారు ఎంత కష్టపడ్డా, ఎంత లావు గ్రంథాన్ని ప్రచురించినా అచ్చుతప్పులు ఉంచడం వారికి చేతకాదు. అక్షర దోషాలూ ఉండవు. భాషలో దిగజారుడుతనం లేదు. శిష్టమైన భాష , భావంతో ఎవరినీ అనుకరించలేని, ఎవరి ఛాయ వారిపై లేని కంఠదఘ్నంగా సహజమైన (indigenous) తనదైన కఠినమైన శైలి..వారిది! మచ్చుకైనా మెప్పుకోసం అరువు తెచ్చుకోలేరు.
“యోగాలయ” అనబడే ఈ దేవాలయం లాంటి రీసెర్చ్ సెంటర్ మాధ్యమంగా ఎన్నో పుస్తకాలు ప్రచురితమౌతున్నాయి. తెలుగు సాహిత్యం, సంస్కృతి, వ్యక్తిత్వ వికాసం, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం వంటి ఎన్నో అంశాల వికాసం లక్ష్యంగా ఏర్పడ్డ సంస్థ ఇది. ఈ లక్ష్యంలో భాగంగా గ్రంథ ప్రచురణతో పాటు, అంతర్జాల సమావేశాలు, సాహితీ సభలు, నేటి పండుగ సందర్భాలు వంటి చతుర్ధీన మార్గాలను యోగాలయ అనుపమానంగా సుసంపన్నం కావిస్తోందని మనందరికీ విదితమే! దీనికి విశ్వర్షి గారే ముఖ్య భూమిక వహిస్తూ ఎందరికో మార్గదర్శకత్వం చేస్తున్నారు. అది వారి పూర్వజన్మ సుకృతం! ఆ పరాత్పరుడు వారికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి, ఈ సాహితీ సేవను మరింత ఔన్నత్యంతో జరిపే దార్శనిక శక్తి, సామర్థ్యాలను ఇచ్చుగాక! నాకు ఈ ప్రసంగానికి అవకాశం ఇచ్చిన శ్రీ వాసిలి మహాశయులకు, వారి ప్రియమైన కుటుంబ సభ్యులకు, ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ నా ధన్యవాదపూర్వక నమస్సులు.
ప్రకాశాత్మికయా శక్త్యా ప్రకాశానం ప్రభాకరః! ప్రకాశయతి యో విశ్వం ప్రకాశోయం ప్రకాశతాం!!
స్వస్తి!!!
***
రచన: విశ్వర్షి వాసిలి
ప్రచురణ: యోగాలయ రీసెర్చ్ సెంటర్
పేజీలు: 264
వెల: ₹ 400/-
ప్రతులకు:
యోగాలయ రీసెర్చ్ సెంటర్
ప్లాట్ నెంబర్ 90, కృష్ణా ఎన్క్లేవ్, మిలిటరీ డైరీ పారమ్ రోడ్,
కానాజీగుడా, తిరుమలగిరి,
సికింద్రాబాద్ 500015.
ఫోన్: 9393933946, 9889885354
ఈమెయిల్: drvaasili@yahoo.co.in
yogaalaya.publishing@gmail.com

