[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]
అధ్యాయం-1-మొదటి భాగం
వివశసంధ్య, నిరాధార తారలు
స్పందనరహిత గాలిరహస్యాలు
అటుతిరిగి నిలిచిన ఒక యువతి
కష్టతరమైన బాధాహృదయంతో.
తనపేరు తలచుకుంటూ,
నిట్టూరుస్తున్నది సైరంధ్రి;
మున్నెన్నడూ లేని పరిహాసాన్ని,
హస్తినాపుర మహారాణి సహించింది.
విరాటరాజు, విరాటనగరం,
అజ్ఞాత, అనూహ్యదేశం,
రహస్యజీవితం, తిరుగులేని పరిచయం,
అసత్యమైన స్నేహంలేని వేషం;
కొంచెంకూడా అడుగు పడటంలేదు,
క్షణంకూడా చకోరనేత్రాలు నవ్వటంలేదు,
విధివంచితులు, తుదిలేనినష్టం, విచలితం,
చంచల మానసం కఠినమైనది;
నిజమేనా లేక మోసమా?
ప్రతిక్షణం అంతులేని భ్రమ.
అధైర్య హృదయంలోని చీకటి
ఎప్పుడు తొలగిపోతుందో?
మనోవేదనతో మృగనయని
వికల అసహాయగా నిలబడింది
ఇవాళ హస్తినాపుర సామ్రాజ్ఞి,
దాసీగా మారిందయ్యో!
దృపదసుత, ధృష్టద్యుమ్న సోదరి,
పాండవపత్ని కూడా..
గౌరవాలన్నీ మాయమవటమే,
అన్నిటికన్నా ఘోరపరాజయం!
అజ్ఞాతవాస కఠిన కవచంతో,
ప్రతి శ్వాసా కుములుతోంది.
అసలు అస్తిత్వం వదులుకొని, తనకు తానే,
విధించుకున్న కారాగారం.
కంపిత యవ్వనతాపాన్ని, మది వేదనతో మోస్తూ,
గుప్తావేశంతో పోరాడు పాపాలన్నీ భరించి నిలబడి;
ప్రశ్నలన్నింటినీ మధ్యదారిలో వదిలేసి,
చివరికి అంతఃపురంలో ఆమె అడుగుపెట్టింది. (1-1)
అందమైన అంతఃపురం శోభాయమానంగా,
అతి ఠీవిగా, రోజూ సరికొత్తగా,
సంధ్యా సమయాలంకృతగా;
మదనుని లాలనలో సుధేష్ణ!
విరాటరాజును స్మరించు రాణి
సైరంధ్రితో అంటున్నది:
‘నన్ను అలంకరించు ఓ దాసీ!
రాజును కలవటానికి అభిలాషిని,
నువ్వందగత్తెవే, నేనింకా సుందరిని,
దేహాచ్ఛాదలన్నీ తొలగించు;
నేడు మా కలయికరేయి.
చిక్కటి చీకటి పండగ,
ఆవరించిన రాత్రి ఉత్సవంలో,
మదిలో పదిరకాల ఉన్మత్తత;
పూర్ణ విలాస రసజ్ఞుడు రాజు,
ప్రతిక్షణమాతని తనియించాలి’.
హాయిగా నలుగును అలదుకుని,
దాసీజన విశేష సేవలంది;
స్నిగ్ధ సుగంధిత కేశాలంకరణలతో,
పులకాంకిత అభిసారికారూపం.
నఖశిఖావృత మనోహరి సుధేష్ణ,
కోమల కంపిత మధురాధరాలు;
ఉప్పొంగిన స్తనమండలాలు,
పులకితగాత్రాన్ని అలంకరించుకుంది కృష్ణా!
మదన ప్రఫుల్ల ప్రకటిత తనువున,
రాత్రి తొలిజాము మొదలైంది;
సంధ్య మత్తుగా జారిపోయింది,
రాత్రి ఆనందంగా ఒళ్లు విరుచుకుంది.
హాయైన సందర్భం ఆపినా ఆగదు,
సైరంధ్రి తనలో ఆలోచించింది;
దగ్గర ఏ పతీ లేరు,
స్త్రీధర్మం పలువిధాలుగా అమ్ముడుపోయింది.
త్వరగా ఆజ్ఞ వినిపించింది: రాజుగారు దగ్గరికి వేంచేస్తున్నారు,
ఓ సైరంధ్రీ! వెళ్లిపో, ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు;
పరస్పర కలయిక ఉత్సవం మన్మథుడు ఇప్పుడే చేసుకున్నాడు,
హరివిల్లు వర్ణాలను దేహమంతా నింపాలి. (1-2)
సైరంధ్రి ఏకాంతంగా ఉన్నది,
నీటిమీద నెమ్మదిగా నడిచే నెమలిలా;
పాండవకులాలంకృత-గౌరవనీయ స్త్రీ,
చేటుకాలాన్ని అతి భారంగా సహిస్తూ.
భగ్నస్వప్నాలను తలదాల్చి,
తెలియని దారిలో నడిచింది;
మదిలో తనపేరును మరిచింది,
కొంచమైనా మనసులో మమకారం లేదు.
ఉన్మాద యవ్వనం, పండగకోలాహలం,
తనువు-మనసులకు ఎప్పుడూ వసంతమే;
కానీ అనుచరులను నిరోధించలేము,
మారువేషంతో విసుగు- కోపం కలుగుతోంది.
కొంతతడవు అంతర్గమన,
బాహిరద్వారం కడ ఆసీన;
నిత్యం సత్యభారం మోయటం,
మార్గమధ్యాన ఎడబాటు కలగటం.
సుధేష్ణ జ్ఞప్తికి వస్తున్నది,
హృదయంలో విచిత్రాలోచనల వెల్లువ;
నేనూ స్త్రీనే, వందరెట్లు సుందరిని,
నేనూ నిరంతరం పురుషుని అనురక్తనే.
సుగంధ శరీర చుంబనాలింగనాలు,
మన్మథమాయా నిట్టూర్పులు;
పారవశ్య ప్రఫుల్ల విలాసాలు,
సహజానందానికి అభిలాషిని;
నేను సైరంధ్రి, కేవలం దాసీని,
నేనిప్పుడు ఒక ప్రతిబింబాన్ని;
దాగిఉన్న పాండవ పట్టపురాణిని,
కానీ దృపదసుతనని తెలియదు!
నేనూ స్త్రీనే, అందమైన శ్యామలాంగిని,
మనోహర యవ్వన లావణ్యవతిని;
పేరేదైనా నేనో పడతిని
పురుషుని కోరగ హక్కుదారును.
అంతఃపురం నుండి ఆంతరంగిక ద్వారానికి,
ఎక్కడికీ చేరలేదు: తనను దాటి పోలేదు;
కాళ్ళు మాత్రం నడుస్తున్నాయి, కానీ చిత్రశాల స్థిరం,
భీషణభ్రాంతిని ఛేదించటానికి, అబల అధీర. (1-3)
(సశేషం)
