[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]
అధ్యాయం-5 – రెండవ భాగం
బలహీనదీపం చీకటితో పోరాడుతున్నది,
ప్రతిబింబానికి మధ్యలో అంతరాయం కలిగిస్తుంది;
అబల నిలబడింది, పాపాన్ని తొలగించింది,
శిథిలాలోచనల గొడుగును పడేసింది.
కాలాన్ని లెక్కలేనన్ని ముక్కలు చేసి,
విలయమనే నవ్య మంత్రాన్ని సృష్టించారు;
గతం-భవితల మధ్య కాలం అలంకరించబడింది,
వర్తమానంలో క్షణానికి రెండు ప్రవాహాలు.
దైవయోగం ఒక అబద్ధపు వంక,
ఎత్తును తగ్గించుకుంటూ వెళ్ళాలి;
ప్రతిక్షణం మౌనంగా మరణించాలి,
చివరికి ఊపిరాడక బతకటమెందుకు?
తెరవెనుక అంతా మేల్కొన్నారు,
మున్ముందు అన్నీ ఆటలూ ఉంటాయి;
పెద్ద నాటకం, నటన చిన్నది,
ముఖాలు కూడా ముసుగులుగా అనిపిస్తున్నాయి.
భ్రమ ఎప్పుడూ అంటుకునే ఉంటుంది,
ప్రతిక్షణం నమ్మకం జారిపోతున్నది;
చివరకు ఆమె మనసులో నిశ్చయించుకున్నది,
స్వయంగా సమస్యను పరిష్కరించుకోవాలని.
స్త్రీ ఆధారపడదు లేదా నిర్బల కాదు,
సకల సృష్టికి ఆమె అధికారిణి;
మానవమాత్రునికి తులలేని తల్లి,
అత్యంత నిర్మల సౌందర్య హృదయిని.
సంపాదించిన నకిలీవేషం కనురెప్పపాటులో వదిలి,
కేవలం సత్యంతో బంధం జోడించుకున్నది;
భార్య కాదు, అనుచర దాసీ కాదు,
ఇప్పుడు వినాశనం లేని వ్యక్తిత్వం.
జటిల విషయాన్ని తానే పరిష్కరించుకున్నది,
పండగను తనతోనే జరుపుకున్నది;
ఇప్పుడామె ద్వారం దగ్గరికి వెళ్ళింది,
స్వయంగా తనకు తానే రక్షకిగా మారింది.
నిజంగానే అక్కడ ఎవరో ఉన్నారు, మళ్ళీ ఒక సమీక్షావలోకనం,
మనసులోనే నిర్ణయించుకున్నది: పోరాడాలని;
చివరికి ద్వారం తెరిచింది, బయటికి వచ్చింది,
వెంటనే దగ్గరిగా వచ్చిన ధూళిధూసరిత రూపం. (5-5 )
పసిగట్టలేనివాడిని చూడు,
అతని నీడ వేగంగా వచ్చింది;
అర్జునుడు కాదని క్షణంలో తెలిసింది,
వెంటనే కీచకుడిని గుర్తించింది.
సైరంధ్రి క్షణకాలం అప్రతిభురాలయింది,
వెంటనే తనకు తానే కాపలాగా మారింది;
అధిక చైతన్యవంతంగా, భయం లేకుండా,
కనీస భ్రమలు లేని స్వావలంబితగా.
సందేహించి దగ్గరిగా చూసింది,
కళ్ళల్లో మెరుపు రేఖలు
మద్యం మత్తులో చాలా ఉత్తేజితుడు;
మన్మథతాప రంజితుడైన పురుషుని చూసింది.
ఎదుట మనోహరమైన వస్తువులా,
దాసీని తేరిపార చూస్తున్నాడు;
ఆశయం మలినతను అలంకరించుకుని వచ్చింది,
సైరంధ్రి శరీరం ముడుచుకుపోయింది.
తన పదునైన ఆయుధాన్ని దాచిపెట్టి,
కళ్ళు పైకెత్తి అక్కడే నిలబడింది;
అతడు ముందుకు దూకి ఆమెను పట్టుకున్నాడు,
అందగత్తె పరిచారికను పట్టుకున్నాడు.
ఆలస్యం లేకుండా ఒక భయంకర స్త్రీ
వెనక్కి తిరిగి బలమైన దెబ్బకొట్టింది;
రహస్య ఛురిక మొనదేలి పదునైనది,
మర్మస్థానంలో దిగబడిపోయింది.
ఒక్కక్షణంలో పెద్ద కేక వెలువడింది,
ఆకాశంలో మెరుపు మెరిసింది;
కారునలుపు చీకటి వణికిపోయింది,
గనంలో మేఘాలు కమ్ముకున్నాయి.
రక్షింపబడే సమయం వచ్చింది,
స్వీయ మోక్షమార్గం తెలిసింది;
కమలవదనం మీద వెలుగు చిందింది,
నిన్నటి అధ్యాయం పూర్తయింది.
వెనువెంటనే ఖాళీకుటీరంలోకి జ్వాలలా తిరిగొచ్చింది,
దీపం ఆర్పేసి నీడను అంతంచేసింది;
మళ్ళీ ద్వారం మూసేసి, ప్రశాంతంగా శయ్యపై పడుకుంది,
సాటిలేని పరమ ప్రశాంతంగా నిలువెల్లా నిద్రను కప్పుకుంది. (5-6)
సుప్రభాతమురళి మోగింది,
విజయగాథను పాడటం ఆరంభించింది;
పక్కకు ఒత్తిగిల్లి శరీరాన్ని కదిలించింది,
నిద్రాశయ్య బంధనాన్ని ఛేదించింది
రెండుకళ్ళు కొత్తక్షణంలోకి తెరుచుకున్నాయి,
పూర్వప్రేమను స్మరణలో నింపుకుంది;
తనలో నిజస్థానాన్ని తయారుచేసుకుంది,
చివరకు స్వీయశక్తిని పొందింది.
చీకటి తనువునుండి నలుపును తొలగించింది,
లోపలికాంతిని ధరించింది;
అవగాహన చేసుకోవటం సామాన్యం:
ప్రతిక్షణం సంభాషణల్లో సత్యం ఉంటుంది.
అందరికీ తనరూపం ఒప్పించాలి,
పరిచితులైనా అపరిచితులైనా;
బంధాలను భుజాలకెత్తుకోవాలి,
శ్వాస బిగబట్టి మళ్ళీ అలసిపోవటం.
జనన మరణాల కల్పనాతీరంలో,
రాలినపూలు మృతదేహాన్ని అలంకరించాయి!
రాత్రి ముగింపు నిర్థారితం,
కాలమెప్పుడూ ఒడిపోదు.
మనసు ప్రయాణాన్ని ఆపేసింది,
కళ్లవేడి రూపుమాసింది;
అప్పుడే ఒక విషాద కోలాహలం వినిపించింది,
‘రాజుగారి బావమరిది బహుశా చనిపోయాడు’
తలువు తెరిచి ఆమె నిలిచింది,
ప్రజలు హంతకురాలు అనటం ప్రారంభించారు
పట్టణంలో విని-వినిపించటం జరిగినది,
‘కీచకుడు మార్గమధ్యంలో చంపబడ్డాడు’.
రక్షకభటులు తుఫానులా పరిగెత్తారు,
ఆమెను పట్టుకుని సంకెళ్ళు వేశారు;
నిందితురాలిని వెంటనే నెట్టేశారు,
సైరంధ్రిని కారాగృహంలోకి.
కఠినమైన కారాగారవాసంలో ద్రౌపది దుఃఖించింది,
భేదం లేకుండా ఒక గోడలా మారిపోయింది;
ఉదయాన్నే పాండవులు నిద్రలేచారు, మళ్ళీ శాపాన్ని వహిస్తూ,
వాళ్ళు నిద్రిస్తున్నా తమలో తాముగా ఉన్నారు. (5-7)
(సశేషం)
