Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం-2

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

అధ్యాయం-1 – మొదటి భాగం

మృదంగ తరంగాలను అలాగే విన్నది,
మధురసంగీతం హాయిగా లలితంగా;
ధాతిన్ దిన్ తాతధిన్ తినత్ ధా –
ఒక్క క్షణంలో ఆసక్తి కలిగింది.

ఆ ధ్వని దిశగా చూసింది,
నౌకాదళ దిశలో నర్తనశాల;
తెలియని నిశ్శబ్దంతో ద్వారం దగ్గరికి వెళ్ళింది,
ఒక యువతిని ఆమె చూసింది.

నృత్య లాస్యాన్విత కటి శోభ,
భావగాఢత అభినయ ప్రదర్శన;
మంగళప్రద రసాన్విత శుభాంగి కన్య,
అనితరమైన మదనస్ఫూర్తిలా.

నూపురధ్వనితో మది పులకింత,
క్షణంలో మారే అందమైన భావాలు;
చంచల శోభిత సుందరనారి,
స్వర్ణపాత్రలా మెరుస్తున్నది.

మన్మోహన తరంగిణి,
సుదీర్ఘ సుందర శ్యామలకేశిని;
గళమందగించు రేఖావళి,
లోతైన నాభి, సువేగచాలిని.

హరిణనేత్రి మృదు మధురంగా నవ్విందిలా,
జలతరంగిణీ నాదంలా;
కన్నులసైగ ఒక అభివ్యక్తి,
అర్థవంతమైనా అపరిచితం.

కదళీతరుసమ శ్యామవర్ణదేహం,
నాకలోక మధుమయ మోహిని;
ఉన్మత్త అతుల కమలలోచని,
అపరిచితానంద రతిస్వరూపిణి.

మోగింది సహోన్మాదక మృదంగం ,
ఎదుట వాద్యకారుడు కనిపించడు;
కళ్ళకు కమ్మినదేదో భ్రాంతి,
అచ్చెరువేదో మనసునాపినది.

శీఘ్రమే సైరంధ్రి చాటున దాగింది,
కౌన్తేయ మహావీరుని వింతరూపది;
ధనుర్ధారి గాండీవి చేతుల్లో మృదంగనాదం,
మత్స్య్యయంత్ర ఛేదక వీరుని నూతనఠీవి. (1-4)

సంగీతనర్తనాలు నిర్విరామంగా ఉన్నాయి,
ప్రతిపదం ప్రస్ఫుటిత భావస్ఫోరకం;
తాళబద్ధ అనన్య లయాత్మకం ,
కన్యకు లభించిన సాంగత్యలయలు.

స్తంభిత స్వరాన వాద్యం ఆగింది,
క్షణకాలం నర్తకి కూడా ఆగింది;
పొరపాటును సరిదిద్దిన అర్జునుడు,
నర్తనానికి చేతికి చేయి కలిపె!

ఇరుతనువులు అతిసమీపంగా చూసి,
సైరంధ్రి మానసం అగ్నిగుండం;
సంశయగ్రస్త వ్యాకులగా మారింది,
నేను ఉనికిని కోల్పోయిన ఉపేక్షిత వనితను!

కనకదేహమయి ఈ సుకన్య ఎవరు?
ముగ్ధ, మత్త మంజులమూర్తి;
మధుర కృపాదృష్టి ప్రసరిస్తున్నది!
వివర్ణవదనంతో చూస్తున్నది.

నర్తకిని కౌగలించుట అనుచితం,
అది తన భార్యను చేసే మోసం;
మన్మథలీల సదా అనాలోచితం,
ప్రబలమైనది మోహచాపల్యం!

కర్ణవీరునికి వేదన పంచి,
మత్స్యఛేదనా విలువను పెంచె;
సూతపుత్రునిలో ఉత్సాహం చూసింది,
పాండుపుత్రునితో బంధం కలిసింది!

పరపురుషునిగ చేతిలోచేయి కలపటం,
కాదా ఇది నరుని అపరాధం?
అంతా నన్ను అబలా, దాసీ అంటారు;
ఆజ్ఞాధీనను, అయినా సబలను.

వ్యాకులపత్ని ఆలోచిస్తున్నది,
అపుడే విన్నది అధిక కుతూహలం;
ఉచ్చస్వరాన కన్య అన్నది:
“ఓ కిన్నరుడా!, నా దోషం కాదు!”

పూర్ణపురుషుడు తన నాథుని చిరునవ్వులు చూస్తున్నది,
రణరక్షకుడు గాండీవిని, మృదంగం హసిస్తున్నది;
కంపిత పతినిచూసి, రెప్పవేయని సతి యోచిస్తున్నది,
విరూపాన్నీ, నిశ్చల నియతిభారాన్నీ సహించే వీరుడు! (1-5)

ఆ ముగ్ధ తటాలున నిలిచింది,
మళ్ళీ అన్నది అనాదరంగా;
‘నేను విరాటరాజు కుమార్తెను,
నా ధన్యనామం ఉత్తర!

చరణచాలనం లేశం మరువలేదు,
కేవలం మృదంగదోషమే జరిగింది;
‘హే కిన్నెరుడా! పొరపాటు నాదికాదు,
నేను రాజకుమారిని, నీవో కింకరుడవు’.

సైరంధ్రి అతిగా వ్యాకులపడింది,
శరణాగతి గురించిన వేదన పడుతున్నది;
తనలో తానే అనుకుంటున్నది;
అకారణంగా వ్యర్థయోచన ఎందుకు!

కాలం ఎప్పుడైనా గాండీవం ధరించిందా,
లేదా మృదంగంతో నర్తిస్తుందా;
అస్తవ్యస్త గ్రహచక్రాలన్నీ అస్థిరాలే,
ఎన్నడూ నిజకారణాలెరుగవు!

ప్రకటితమవటం దాగిపోవటం,
ఇది నిత్యచతురతా నిర్వహణం;
సర్వరూపమిలా విశృంఖలం,
సదా జీవనమెలా అసంపూర్ణం?

పాండవులు సహించే అతిపీడన,
నిరంతరమది విధివిలాసం;
క్షణంలో ప్రాప్తి, మరుక్షణం నాస్తి,
భూతలంలో లేదు శాశ్వత తృప్తి!

వ్యగ్రమానసి స్వామిని చూసింది;
మధ్యకాలంలో విడివడని గీత;
వ్యాకుల మానసంతో ప్రచ్ఛన్నంగా,
సమాంతర నిరంతర వేదన అనుభవిస్తున్నారు!

వైభవ విచ్ఛిత్తయి వెలుగు నశించింది,
దానిమీద కాలం చీకటిని పరిచింది.
నడిచేనీడ ఆగిపోయింది,
బాధితదేహం తానుగా సంకోచిస్తోంది.

చివరకు ఆలోచిస్తూ కలలకుటీరం చేరింది,
మూసినతలుపుల మాటున, మదిలో ఏకాంతం తెరుచుకుంది;
నేను మహారాణి ద్రౌపది; నేడు సైరంధ్రిని,
నాలో దాగిన స్త్రీ ఎప్పుడూ ప్రకటితం కాలేకపోయింది! (1-6)

వస్తువులా అబల నిద్రించింది,
వర్తమానం మార్పుచెందబోదు;
వ్యర్థవేదన దుస్సహంగా అన్పిస్తున్నది,
నిశి మారినది శిలాసదృశంగా!

నిరంతరం శ్వాసాభారాన్ని మోస్తూ
హృదయస్పందనకు ఏమని నచ్చచెప్పాలి?
చీకటి కుప్పని అలంకరించుకుని,
నిర్దయి నిద్ర రాదు కంటికి!

రాత్రింబవళ్ళు కోరికలు జ్వలిస్తున్నాయి,
అంతరంగద్వారం తెరుచుకోవటంలేదు;
నిన్న – రేపులమధ్య చిక్కుకుని
సమయానికి పరిష్కారం ఎప్పటికీ లభించదు.

వికలచిత్తంలో కష్టాలు నిండిపోయాయి;
అత్యంత వ్యథతో కూర్చున్నది;
మూడోజాముతో రాత్రి గడిచింది,
స్వాంతఃసుఖం దూరమైన ఆమె!

సోమరికాలం అలసటతో అతి నెమ్మదిగా నడుస్తున్నది,
బాహ్యాంతర నిరంతర యుద్ధం;
ఎప్పుడెవ్వరూ ఓడినా గెలిచినా,
తీరాల నడుమ మునకలేస్తున్నారు.

జనన మరణాలు రెండూ తెలియలేనివి,
సదా చురుకుగా కాలం పరుగులు;
అంతులేని అంచనాలను మోయటం,
వికట మార్గాన విడిపోవటమే!

సుధేష్ణ స్మరణ బాధిస్తున్నది,
అదృష్టంలో నిశ్శబ్దం రాసిఉన్నది;
కుదించుకుంటూ నిలచిన అబల,
మందప్రకాశిత దీపశిఖలా!

అర్ధరాత్రిలో ద్వారం తెరిచెను,
పిల్లగాలుల స్పందన హాయినిస్తోంది;
పతులు ఐదుగురున్నా ఒంటరి,
క్లిష్ట ప్రహేళిక విడివడకుంది!

ఎవరు ఇక్కడ నన్నిలా బాధిస్తున్నది? నిరుపయోగంగా చింతఎందుకు?
గుప్తవేషము చాటున, ప్రశ్నించుట ఎలా?
మధ్యద్వారాన నిలిచింది ఏకాంతంగా,
లోపలా బయటా కాదు, చిక్కుకుంది దిగ్భ్రమలోనే! (1-7)

(సశేషం)

Exit mobile version