Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం-3

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

అధ్యాయం-2 – మొదటి భాగం

అక్కడే మేలుకొన్నది ఆలోచనాలోకం,
ఎక్కడికో పరిగెడుతున్నది మనసు;
భిన్నభ్రమలను కూడదీసుకుని,
తనకుతానే ఒంటరిగా నిలిచింది!

నిత్య వికసిత యవ్వనదీప్తి,
ముగ్ధవాసంతిక, బాల్యవిముక్త;
అరుణచాప అపూర్వ సౌందర్యం,
ఎగిసిపడింది యజ్ఞజ్వాలలా!

కలత చెందిన కోరికలు,
క్రూర వాస్తవ విలోకనలు;
సర్వం కరిగిన కాలంతెరలు,
స్వరబద్ధాలంకృత శిధిలవాద్యం!

లోపలి నిద్రిస్తున్న సూర్యుని నిద్రలేపింది,
వడిగా చీకటిని పారద్రోలింది;
ఎప్పటినుంచో హత్తిన నీడ,
అన్నిటినుండీ క్షణంలో విడివడింది.

సకల అస్మితలు ఓడిపోయాయి,
మాన్యతాయుత మకుటం తీసేశాడు;
యాచన కోరిన శరణాగతిగా,
వికృతరూపాన్ని దీక్షగా గ్రహించాడు!

అటు ఇటు ఏవో ఆలోచనలు,
అతులిత సమయస్మృతి కదిలింది;
స్వయంవరం అది ఎవరి కోసమో,
ఆమే నేడు అభిశప్త భాగ్య!

జనకుడు వరుని వెదకినప్పుడు,
ఆహ్వానించెను రాజవీరులను;
చివరకు పడింది దావానలంలో,
నూతనరూప శపిత కపటంలో.

పరమ ప్రియతముని వరించాలి,
అయినా లభించలేదు మనోహరుడు;
పాండుపుత్రుని ప్రతిష్ఠ పెరిగింది,
సూతపుత్రుని మీదే కళంకం.

అక్కడ నిలిచారు ఇద్దరు పురుషులు, పరిపూర్ణ దీప్తిమంతులు,
రాధేయుని దూరంతోసి, విజయునే వరించాలి,
క్షాత్రతేజమున విరాజిల్లినా, నాథుడు మాత్రం కాలేడు,
కిరీటికి సరిసమానుడు, వివశవదనుడయ్యాడు. (2-1)

ఊహల్లో మళ్ళీ స్వయంవరం,
కర్ణుడు శోభాయమాన సుందరుడు;
దివ్యనగరంనుండి వచ్చినట్లు,
సూర్యుడే స్వయంగా ఆకాశం నుండి దిగివచ్చాడు.

విశాల వక్షస్థలంతో భుజబలశాలి,
విద్యుత్ ప్రకాశమాననేత్రాలు
వెంటనే పాంచాలి మోహించింది,
మనసుతో పూర్ణప్రణాళికతో పరిణయమాడింది.

రాజులందరిలో స్వయంవరోత్సాహం
కర్ణుడొక్కడే అక్కడ ఆ కారణంగా;
అందరికన్నా ఉన్నత స్థానమిది,
అందరూ పరాక్రమించాలని కోరుకుంటున్నారు.

ధృష్టద్యుమ్నసోదరుడు సరికొత్తగా,
మత్స్యయంత్ర భేదన వివరించాడు;
అంతా కలలో జరుగుతున్నట్లు అనిపిస్తున్నది,
కర్ణుడు మందహాసంతో స్థిరంగా ఉన్నాడు.

ఇద్దరి చూపులు అద్భుతంగా కలిశాయి,
నఖశిఖపర్యంతం పులకించింది పాంచాలి;
బాహుబలిని అర్జునునిలో కోల్పోతున్నది,
మనసులో ముత్యాలు ఏరుకుంటున్నట్లున్నది.

వజ్రదేహపు అద్భుతకాంతి,
మోమున పరచిన అతి విశ్రాంతి;
నిజతేజోమయ ఆదిత్యుని ధిక్కరిస్తూ,
ప్రతిక్షణం అసలైన పురుషునిలా అనిపిస్తున్నాడు.

మన్మథ తపిత ఆలోచనలో నిమగ్నమైంది,
కళ్ళలో అనురాగం చిగురిస్తున్నది;
పెదవుల వణుకు చిందులాడింది,
నటనానుభావాలు శరీరాన శోభించాయి.

లోలోపల తన స్వామిగా అనుకుంది
ఆలోచిస్తున్నది: కల నిజమౌతుందని;
అవలోకనమంతా పరిసమాప్తి అయింది,
ఇతని కోసమే నిరీక్షిస్తున్నది.

వీరవరేణ్యులైన రాజులు వరుసగా వస్తున్నారు,
మత్స్యయంత్రభేదనం ఎవరివల్లా కాలేదు;
చివరికి తానే లేచాడు వీరవరుడు కర్ణుడు,
‘ముందు నీ కులం ఏదో చెప్పు’: ధృష్టద్యుమ్నుడన్నాడు. (2-2)

ఘడియ విఘడియలో యోధులు అడ్డగించారు
అంతరంగంలో వెంటనే పెనుతాకిడి:
ఆప్తులంతా గుర్తింపులో చిక్కుకున్నారు,
సూతపుత్రుడు, కుంతికుమారుడు.
క్షాత్రధర్మం వహించాడు,

పరశురాముని వద్ద విద్య నేర్చాడు;
కాంతిమయం దివ్యశరీరం,
సహజ కవచ కుండలధారుడు.

దివ్య మంత్రవిద్యాధారి,
నిపుణ ధనుర్ధనుడు శత్రుసంహారకారి;
శతసహస్ర సైన్య సంహారకుడు,
కూల్చిన కోటల్ని కూడా ఉద్ధరించినవాడు.

హతాశురాలైన తల్లిహృదయం తల్లడిల్లింది,
తనయుని మీద కన్నీరు వర్షించింది;
తీరానికి చేరింది కేవలం శరీరమే;
మధ్యలో ముంచింది కులంనీడ.

పుత్రుడు వీరత్వం నిరూపించాడు,
కులగౌరవం పనికిరాలేదు;
తన మనసులో అవలోకించాడు,
నీడని క్షణంలో తుడిచేశాడు.

పెంచినకొడుకు తేజోఛాయ,
వారసుడు కానివాడు బదులిచ్చాడు:
‘రథసారధి రాధేయ వశంవాడిని,
అన్నీ వేదనలను నాశనం చేస్తాను.

అతి పరాక్రమ అలంకృతుడిని,
సూతపుత్ర కిరీటధారిని;
కులం ముసుగు అర్థం లేనిది,
వీరుడనేదే నా పరిచయం’.

ఆత్మీయులంతా అంగీకరిస్తూ మాట్లాడారు,
పాంచాలి మనసులో ఆశ ఉదయించింది,
హృదయపుష్పం హాయిగా వికసించింది;
అది శరీరమంతా అనుభవిస్తున్నది.

ఇలా గర్వంగా పలికి, పనికి పూనుకున్నాడు,
కర్ణుడు కూడా దగ్గరికి వచ్చాడు, మత్స్యభేదస్తంభం;
వీరకర్ణుడిని వెంటనే ఆపాడు ధృష్టద్యుమ్నుడు:
‘ఉన్నతవంశజులకే ఆహ్వానం, అతనే ఎప్పుడూ వీరుడు’.

భరతవంశం అందరికీ తెలుసు,
కర్ణుడు కులీనుడయినా తెలియనివాడు;
సోదర కటుభాషణం విని,
ద్రౌపది మనసు నిలవకున్నది.

వరమాలను గట్టిగా పట్టుకుంది,
తృటికాలంలో వికలశ్వాస కంపించింది;
బాధాచిత్తం చిక్కుల్లో పడిపోయింది,
హృదయాన్ని భీషణాహతం కుదిపింది.

వ్యాకుల ద్రౌపది ఆలోచిస్తోంది,
అనంతతృష్ణ తీవ్రంగా బాధిస్తోంది;
మనసున కోరిన మొదటి పురుషుడు,
జీవితాన ఇక లభించడా?

కుమార్తె, భార్యా, సోదరిలా,
కారాగృహాన బతుకుటెలా?
వక్ష, నితంబ స్వర్ణకటియుక్త,
నేను ప్రత్యేకతలేని స్త్రీనే.

యాజ్ఞసేనిని, శ్యామలగాత్రిని,
చరాచరాల ఏకలయాత్మికను;
జ్వాలారూప అనన్యకన్యను;
సకలలోకాన సర్వధన్యను,

ప్రశ్నించి బదులురాక ఓడింది,
తొలిప్రేమ బంధంవీడి;
చివరకు దృపదకుమారి స్థిరపడింది,
మదిలో సవ్వడిలేక నిలిచింది.

అజేయ వీరకర్ణుని అనురాగవతి,
ప్రతిపక్షంలా ఒక బహిష్కృత;
అంతరాగ్నిని అణచివేసుకున్నది,
అగోచరద్వంద్వం మనసున నిలుపుకుంది.

ఎవరు కలుపుతారు? మళ్ళీ ఎవరు తెంపుతారు?
ఎవరు విడదీస్తారు? మళ్ళీ కలుపుతారు?
విధివిధానం తెలియరానిది,
రాగ-త్యాగాలకు చోటులేనిది.

శీఘ్రంగా అర్జునుడు లేచాడు, స్తంభం దగ్గరికి వెళ్ళాడు,
సూతపుత్రుని సోదరుడే, కానీ కులదీపకుడైనాడు;
వెంటనే క్రీడలా మత్స్యయంత్రం భేదించాడు,
ద్రౌపది పాండుపుత్రునిదైనది, కాదనలేకపోయింది. (2-4)

(సశేషం)

Exit mobile version