Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం-4

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

అధ్యాయం-2 – రెండవ భాగం

ఒక ప్రవేశికపై మనసుపడి,
మరోద్వారం దాకా నడిచి;
వివశురాలై తనలోకే ప్రవేశించింది,
బదులుతో శపితవనంలో.

ద్వైతం నిలిపిన ప్రబల వికృతం,
ద్వంద్వాతీతం ఏదీలేదు;
ఎవరికైనా ఈ ప్రశంస ఉంటుంది,
కోరుకున్నది అక్కడే దొరకటంలేదు.

ఇక్కడ తనకు భార్యపదవి లభించింది,
అక్కడే ప్రియస్వప్నం కోల్పోయింది;
ఎదుట ఉన్నది ధూళిదర్పణం,

వెనుక వదిలేసింది సహజ సమర్పణం.
మనసెప్పుడూ ఇష్టమైనదే కోరుకుంటుంది,
ఎక్కడైనా నిత్యం నిలవదు;
ప్రాప్తం-లుప్తాల అర్థం ఏమిటి?
ఎందుకని ఆశ ఒక నిర్విరామ పాశం?

పరిష్కార హామీని ధరించింది,
కానీ హృదయం ఒప్పుకోదు;
మదిలో స్వేచ్ఛాభావాల పట్టుదల,
శరీరంలో రసభావనలు దాగిఉన్నాయి.

అడుగడుగునా స్వామిని అనుసరించింది,
జీవించకముందే మరణిస్తున్నది;
వేదనతో వెళ్తున్నది తులలేని వనిత,
పాండవశేషానికి సహచరిగా మారింది.

ఏదో శారీరిక భారం,
నడుస్తున్న శ్వాస ఇంకా భీకరం;
కర్ణుని వరించటంలో ప్రాప్తంలేదు,
లోపల నిలిచాడు, కానీ జ్ఞాపకంగా.

పాండవులంతా తమఇంటికి చేరారు,
ఆనందంతో అర్జునుడు ఆత్రంగా పిలిచాడు;
“అమ్మా ! అందమైన వస్తువు తెచ్చాను,
తలుపుతెరు, శుభాకాంక్షలివ్వు”

లోపలినుండి కుంతి అన్నది : “అందరిపైనా ప్రేమ ఉన్నది
అంతా సౌహార్దంతో తీసుకోండి, మీలోమీరు సమాభాగాలుగా;”
కృష్ణ అప్పుడే ఉలిక్కిపడింది, హృదయంలో జ్వాల రేగింది,
ఒక్క అర్జునునికే భార్య, పతులు ఐదుగురయ్యారు. (2-5)

నిస్సహాయంగా ద్రౌపది నిలిచింది,
లోపలినుండి తననే ధిక్కరించుకుంది;
“నేను కేవలం భర్తకే భోజ్యాన్ని,
ఎప్పటికీ ఉమ్మడి భార్యను కాలేను.

నేను అంగాంగ తరంగిత స్పందితను,
నేను ఉన్నత కామనమండితురాలిని;
నేను క్రయ-విక్రయ ద్రవ్యాన్నికాను,
నేను స్వీయాభ్యుదయవ్యాఖ్యను.

మలయజ మంజుల పూతశరీరిణిని,
నేను అగ్నితేజాన్ని, గాఢ గాంభీర్యాన్ని;
నేను స్త్రీని, స్వీయానుచారిణిని
నేనెప్పుడూ నాకే ప్రతీహారిని.

భర్తా, భార్యా; కూతురు,సోదరుడు-
ప్రతిబంధం ఆరోపితమే;
నీడలతో అందరూ అనుబంధితులు,
రోజూ విధి సంకల్పాలను భరిస్తుంటారు’.

ద్రౌపది దిగ్భ్రాంతి చెందలేకపోయింది,
ఇప్పుడామె పాండవపత్ని అయిపోయింది,;
భార్యా పదవీభారం వహించి,
తనను ఎక్కడికో నెట్టేసుకుని జీవించాలి.

క్షణమాత్రంలో నూతనదిశను అనుసరించింది,
తనలోనే బదులును అన్వేషించింది;
మనసు నూతనసంకల్పాన్ని తీసుకుంది,
కొత్తనీటిలో అవగాహనను వెదికింది.

మళ్ళీ పిలిచినప్పుడు ద్వారం తెరుచుకుంది,
అమ్మ అప్పుడు వస్తువును చూసింది;
మనస్ఫూర్తిగా సముచితంగా స్వాగతించింది,
అనుకోని పద్ధతికి మనసులోనే అంగీకరించింది.

ఇప్పుడామె గడప దాటింది,
గృహప్రవేశం అతిభారంగా ఉంది;
మొదటి అడుగు ముందుకు వేసినప్పుడు
రెండవది ఆపి నిలబడింది.

మాటల ఉచ్చారణ ఊగుతోంది, స్వీయలయలో తూగుతూ,
గొంతులోని ఆక్రందనలా, వెలువడదు.. దాగదు;
అమ్మకి తాళంచెవి తెలుసు, స్త్రీ మనసు అంటే ఏమిటో,
తనలోతాను పశ్చాత్తాపపడుతోంది: ఒకవధువు, ఐదుగురు భర్తలు! (2-6)

ఇద్దరూ అపరిచితుల్లా మౌనంగా నిలిచారు,
శబ్దంలేని మాట అన్నది;
ఐదుగురు పతీసమేత, ఒక స్త్రీ,
మరొకరు పతివంచిత బహిష్కృత.

ఒక నరుడు మది దోచాడు,
ఇతర నరులు పుత్రులను ఇచ్చారు;
ఇద్దరూ మనోగతాలను స్వీకరించారు,
కష్టతర గాయాలను అసంబద్ధంగా అనుభవించింది.

బడబానలం ఎవరికి తెలుసు?
అంతా చూసేది ప్రశాంతజలాలనే;
క్రూరకాలం కలలను దోచేసింది,
ఇద్దరూ జీవిస్తున్నది ధూసరజీవితాన్నే.

అందరికీ తెలిసినదైనా పరిచితమైనదైనా,
అంతా దీనిని నిర్ణయించి అభీష్టమన్నారు;
కానీ స్వప్నమది అన్నిటికన్నా ఉన్నతం,
చెప్పలేని సర్వస్వంగా ఎల్లప్పుడూ ఉన్నది.

గృహప్రవేశ జ్యోతిని వెలిగించింది,
పతులు ఐదుగురనేది విధి నిర్ణయం, లభించారు;
అందరు సోదరులు కలిసి వచ్చారు,
తక్కువ- ఎక్కువలనే భేదాన్ని మరిపించారు.

మనోభావాన్ని ప్రియునితో లగ్నం చేసింది,
ఐదుగురు పతులతో శరీరాన్ని పంచుకున్నది;
అలజడిని క్రమశిక్షణగా మలచుకున్నది,
వస్తురూపంగా విభజన చేసింది.

భువనమోహిని, దృపదతనయ,
ప్రత్యేకఇష్టాల అధికారిణి;
ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటుంది: ఎవరి వంతు?
ఇవాళ నా భర్త ఎవరవుతారు?

లోలోపల చెప్పలేని భారం మోస్తూ,
పాంచాలి పంజరంలో ఉన్నది;
ఎదుట కాలం నిశ్చేతనంగాఉంది;
హృదయ-స్పందన ఎక్కడో దూరంగా చేరింది.

చివరకు ఆలోచనాలోకం నుండి ఆమె వెనక్కి వచ్చింది,
గడపదగ్గరే రాత్రిలో ద్వారాన్ని నిలబెట్టి పట్టుకుని;
ముందుకు వెళ్ళే అవకాశంలేదు, వెనక్కి ప్రయాణం లేదు;
మధ్యదారి ఆగిపోయింది; పరవశప్రాణంలా. (2-7)

(సశేషం)

Exit mobile version