[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]
అధ్యాయం-3 – మొదటి భాగం
సుదీర్ఘ ప్రశాంతత కరుగుతున్న రాత్రి,
తనలో తాను సైరంధ్రి జ్వలిస్తున్నది;
తనువుమీద భీషణకాలం దాల్చి,
మళ్ళీ నిద్రతో కళ్ళు మూసుకుంది.
కోరిక దుప్పటి కప్పుకుని,
స్మరణప్రపంచాన్ని సమాదరించింది;
చంచల నిర్విరామ తనువు విశ్రమించింది,
పూర్వానురాగ మాయను పెనవేసుకుంది.
అంతరంగంలో తలకిందులయిన వేదన,
బాధాపిండంలో అగ్ని చేరింది;
పతిసుఖవంచిత విరహసుందరికి,
శూన్యప్రేమతో వ్యాకులరాత్రి.
ఐదయిదుగురు పతులున్నా ఒంటరిది,
సమాధానం లేని క్లిష్ట ప్రహేళిక;
స్పర్శ లేదు, కేవలం దర్శనమే,
భార్యా పదవంటే బలమైన వ్యతిరేకత.
ఒక వత్సరపు కఠిన సమస్య,
అకారణంగా తపస్సు చేస్తున్నది దేహం;
రోజూ మనస్సు విస్ఫోటనం నింపుకుంటున్నది,
చిత్రాశ్వంలా మారుతూ ఉన్నది.
ఆమె నిద్రిస్తున్న ఏకాకి జవ్వని,
లోపల సహిస్తోంది నిద్రాణపయనం,
వాంఛానిర్మిత స్వప్నాన్ని చూస్తోంది,
అంగాంగంలో రుధిర ప్రవాహం.
హటాత్తుగా మనోప్రాంగణంలోకి వచ్చింది,
అతడు, ఎప్పుడు ఎవరిని పోగొట్టుకుందో;
మత్స్య భేదనంవల్ల వంచితురాలు,
కానీ కళ్ళలో నిలుపుకుంది.
స్మృతిని హృదయానికి దగ్గరగా తీసుకుంది,
గుండెలయలో గాయాన్ని దాచింది;
పాదాలను రేపటిలో ఆపింది,
ఇప్పుడు కమలం భ్రమరంలో చిక్కుపడ్డది.
రాత్రి గడిచింది, మనసుదీరా అలంకరించుకుంది
మళ్ళీ ఉదయం తొలగించింది, దాసీ వేషం;
ఆలోచనలు సవరించుకుని చేరింది, అంతఃపుర ద్వారం,
సుధేష్ణ పాన్పుపై పడుకొని ఉంది, సుకుమారభారంతో. (3-1)
ఆమె విరాటరాజును తల్చుకుంటున్నది,
రతిరంజితగా అలసి శయ్యపై విశ్రాంతంగా;
తన ఎదుట నిలచిన దాసీని చూసింది,
పరమ సుఖభావనతో ఒత్తిగిల్లింది.
మత్తుగొలిపే లవణ స్వేదసుగంధం,
స్తనమండలంలో మధురలయ;
అధరాలపై కంపితశబ్దాల ప్రతిధ్వని,
సుఖస్పందన కళ్ళనుండి కురుస్తోంది,
దట్టమైన కేశాలలో చీకటి కమ్ముకుంది,
అంతరంగంలో ప్రేమానురాగిణిగా;
మదిలో మధురరానురాగం చిప్పిల్లుతోంది,
పరిపూర్ణ అంగాంగం తొణికిసలాడుతోంది.
రసభరిత సంతృప్తితో రమణి చూసింది
శీర్ణ విశీర్ణ విశేషాలు లేకుండా;
భ్రమరంలేని పద్మాన్ని చూసినట్లు,
సైరంధ్రి తనను చూసుకుంటోంది,
అతనిని కౌగిలిలోకి తీసుకుని,
మనసులోనే అనుభవాన్ని మేలుకొలిపింది;
నిరంతరం మనఃపటలంపై మన్మథనీడ,
మధురమయ స్మరణ హాయిగా..
సైరంధ్రిలో దాగిన అవాంతరానికి
సమాంతరంగా రసభరిత చంచలనారి;
మనసులో ఒంటరిపక్షి ఎగురుతోంది,
ఆనంతాకాశంలో ఎవరికి తెలుస్తుంది?
ఇద్దరి ప్రతిష్ఠాత్మక శరీరాల్లో,
తమ తమ మనసుల్లో కొంత వైయక్తికం;
ఒకరు మధుర పరిసరంలో శోభిస్తున్నారు,
మరొకరు పంజరంలో బాధను అనుభవిస్తూ.
భోక్త- భోగ్య ఇద్దరివీ, విభిన్న కలయికలు,
ఒకరు నిజంలో విలీనమైనారు, మరొకరు నిజం ద్వారం దగ్గర;
కలయిక- ఎడబాటుల ఆలోచన, ఆశించిన అర్థాన్ని తీసుకుంది,
స్త్రీ పదమే గొప్పది, మిగిలివన్నీ వ్యర్ధమైనవి. (3-2)
సుధేష్ణ అన్నది: ఓ దాసీ విను!
దేవుడు ఉత్తమ అనుభవం ఇచ్చాడు;
స్త్రీ- పురుషుల సంగమం సృష్టించాడు,
నిష్ఫల భార్యారూపాన్ని మాయంచేశాడు.
గుర్తింపులన్నింటినీ దూరంగా తొలగించాడు,
కేవలం పురుషుడనే అర్థాన్ని అలంకరించి;
వన్యకామనల లేనివాడిని మేల్కొలిపి,
రాత్రికి రమ్య రతిరూపాన్ని ప్రసాదించాడు.
మలయజ ముకుళిత ఉష్ణపయోధరాలు,
పగడాల్లాంటి అరుణాధరాలులతో;
శరీరం లయాన్వితంగా సవరించుకుంటోంది,
మందస్మిత సెలఏరులా మెల్లగా ప్రవహిస్తోంది.
రక్తంలో అవ్యక్త తుళ్ళింత కలిగింది,
ఆనంద కామన విద్యుత్తులా పట్టుకుంది;
వేడిశ్వాస ఎగిసిపడుతోంది,
నల్లనిరాత్రి నిట్టూరుస్తోంది.
మనోహరమైన రతిక్రీడలో పులకించిన శరీరం,
కంపితగాత్రం చాలా సుఖాన్ని పొందింది;
స్వేచ్ఛాకాశంలో కారుమబ్బులు గర్జించాయి,
సకల కమలదళాలు దేహంలో వికసించాయి.
ఆలస్యంగా చిక్కని స్వరసంగీతాలు,
స్వేదంతో తడిసి స్రవిస్తున్న మధురస్పందనలు;
నఖశిఖపర్యంతం అనుభూతి తొణికిసలాడుతోంది.
దాసి మదనతాప విహ్వల అయింది,
వెంటనే తీవ్ర ఉదాసీనత ఆవరించింది;
మన్మథతాపం నిండిపోయింది,
వివశదశతో వ్యాకుల బాధిత.
సుధేష్ణ సహజమైన చిరునవ్వు నవ్వింది,
భావవివర్ణిత ద్రౌపదిని చూసింది;
దాసి మనసును గ్రహించింది,
శారీరిక వేదనను అడుగుతోంది.
‘ఓ దాసీ! ఓ సుందరీ! జీవితం ఒక కానుక,
పురుషుడు లేని ప్రపంచం, అజ్ఞాన ఏకాంగి లాంటిది;
నువ్వు కాంచన కామినివి, నీ పతి ఎక్కడ?
దేహపు పొదరింట, అతనితో వినోదించు’ (3-3)
సైరంధ్రి తనువులో వ్యాకులపడుతోంది,
వికల మానసంలో ప్రతివాదన చెప్పుకుంటూ;
ఉన్నతశాఖపై సత్యం వేలాడుతోంది;
మధ్యదారిలో కపటం వికటంగా తిరుగుతోంది.
ఒకరోజు మాయ కమ్మేసింది,
మిగతా సమయంలో దాని నీడే;
ఈనాటి ప్రతిక్షణపు బాధ,
గత- అనాగత క్రీడను ఆడుతోంది.
కేవలం భార్య కావటంలో ఏముంది?
స్త్రీత్వాన్ని నిరంతరం పోగొట్టుకోవటమే,
నిరర్థక ప్రత్యేకతను రోజూ వహించటం,
తనని తాను ఎప్పుడూ ఒప్పించుకోవటం.
ఒక చక్రం మీద నాలుగురకాల కోరికలు,
కారణం లేకుండానే అడగటం;
అనుబంధాలన్నీ వృథాగా అనిపిస్తాయి,
తెరిచిన కళ్ళల్లో కలలు మేల్కొంటాయి.
తెలియని క్షణంలోకి అందరూ వెళ్ళాలి,
పాదాలు గడిచిన నిన్నలో చిక్కుపడ్డాయి;
వృథాకాలపు చీకటినీడ,
వాంఛామూలపు అద్భుతమాయ.
విధి చెప్పినా పరీక్ష చెప్పినా,
వైఫల్య నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది;
ఎక్కడా ఎప్పుడూ చేరలేనిది,
ఎక్కడా ఎప్పటికీ ఉండకూడదనిపిస్తుంది.
ఎగిరే రెక్కలు కానీ పంజరంలో,
చరాచరలోకంలో ఎగిరేదెలా?
ఆనంతాకాశ భయంకర మోసంలో
భవిష్యత్తులో పక్షి చిక్కుకుపోయింది.
రాగం-విరాగాల విరాట యవనికలో,
దానిని దాటటం చాలా కష్టం;
ఆశాశ్విత భ్రమణం ఎప్పుడూ వేధిస్తుంది,
మూసిన పిడికిలిని స్వేచ్ఛ అనిచెప్తుంది.
అంతా సందడిగా మారింది, ఆమె బాధపడింది,
లోతైన సుడిగుండం వలలోంచి తీరమెవరు దాటగలరు?
అప్పుడే ఎవరిదో శీఘ్రంగా, అలవాటుగా రావటం జరిగినది,
అపరిచితునిలా ఒక పురుషుడు, ద్వారంవద్ద ఆగాడు. (3-4)
(సశేషం)
