Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం-6

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

అధ్యాయం-3 – రెండవ భాగం

పరస్పరం కళ్ళు కలిశాయి,
సుధేష్ణ చిరునవ్వుతో అన్నది:
‘స్వాగతం, వీర సహోదరుడా తమ్ముడా!
విరాటరాజ్యానికి విజయకారకా!

సేనాపతి కీచకునికి స్వాగతం,
మత్స్యదేశ భాగ్యవిధాతా;
సోదరా, ఈ సోదరికి నీ గాథ వినిపించు,
కీర్తిపత్రం మీద రాసిన విధాతవు’

‘ప్రశ్నా.. బదులూ లేవు,
ఊరికే చూడాలని వచ్చాను;
అందమైన సకల క్షేమసుందరిని చూశాను,
అంతఃపుర ఉత్తమ కక్ష్యలో.’

ప్రత్యేకవ్యక్తి భవనం నుండి వెళ్లిపోయాడు,
దాసి కళ్ళతో ఆపింది;
అతడు మన్మథుని చుట్టుకుంటూ చూశాడు,
కోరికను పోగుచేసుకుంటూ వెళ్లిపోయాడు.

సైరంధ్రి మన్మథుని నుండి బయటపడింది,
రేపటి చిక్కుల గురించి ఆలోచించసాగింది;
త్వరగా సర్వాలంకారాలనూ తొలగించింది,
ఒక్క స్త్రీని అన్వేషించింది.

ఎవరు ద్రౌపది? దృపద కుమారి?
ఎవరు యాజ్ఞసేని, అవతారిణి?
ఎవరు పంచపాండవ పత్ని?
వాస్తవంలో ఎవరు నిస్సహాయ దాసి?

వీటన్నిటిలో ఒక స్త్రీ దాగిఉంది,
నారీపదవికి అధికారిణిగా;
అందరికన్నా నిత్యనిర్మలంగా అనిపిస్తుంది.
జన్మతో లభించినట్లు ఎప్పటినుండి మిగిలింది.

దాసీరూపం మనసులో పాదుకుంది,
స్త్రీ శరీరంలో తొణికిసలాడుతోంది;
సజీవదేహం స్పందిస్తున్నది,
కానీ అది నిర్జీవఛాయ.

అతడు సైగచేసి వెళ్ళాడు, సారాశమంతా అర్థమైంది,
పరిచారిక మనసులో ఆలోచిస్తోంది: ఇది ఏ నిర్ణయం?
ఉన్నవాళ్ళు ఏమీ కారు, లేనివారు సర్వస్వం,
అన్ని బంధాల నివారణ ఎలా జరుగుతుంది? (3-5)

దాసి శూన్యమనస్కగా కనిపిస్తోంది,
అగోచర యవ్వనభారాన్ని మోస్తూ;
నీళ్ళు – ఎండమావుల కొత్త ప్రహేళిక,
ఒంటరి తన్వి తెలుసుకోలేకున్నది.

మదిలో మంద్ర పరిమళ యోచనలు,
చంచలచిత్తం అనుభవిస్తున్నది;
ఆనంద తరంగితమవటం తనకే తెలుస్తోంది,
స్థిరమైన ఆలోచనలన్నీ కరుగుతున్నాయి.

చిగుళ్లకన్నా సుకుమార శరీరం,
మృదుస్వేద సుగంధిత ఛాయ;
నిమీలిత నేత్రాలు మన్మథ నిలయాలు,
రసానుభవ శ్వాస ప్రతిధ్వనిస్తోంది.

మృదులరాత్రిని బలంగా అణచివేసింది,
కఠోర కమలం చీకటిని కాలరాసింది;
స్తంభితకాలం హాయిని వర్షిస్తోంది,
గాఢసంగీతం ప్రతిధ్వనిస్తోంది.

అనంత వసంత వర్ణవిలాసం,
గడవనికాలం అందంగా అల్లుకుంటున్నది;
హృదయలయతో స్వరం వెలువడుతోంది,
ప్రతధ్వనిలో శబ్దం మారుతోంది.

ఈ క్షణాన్ని ఎవరివ్వగలరు?
ఎగిసిపడే మోసాన్ని ఎవరు దాచగలరు?
ఒక కాలం రూపుమాసి ఆగిపోయింది,
ఎప్పటినుండి మరో విలంబన నడుస్తున్నది!

సుధేష్ణ అన్నది: ‘ఓ అమ్మాయీ విను!
కేవలం పురుషునికే నువ్వు అధికారిణివి;
నువ్వు అనంత అనుపమ నారివి,
సకల సృష్టికి పరమ నియంతవు’.

మనసున సంకీర్ణమైన ఆలోచనలు,
స్తబ్ధ పరిచారిక చిక్కుల్లో పడింది;
మనస్సులో పరాయి వస్తువును కోరింది,
తన శరీరం తనకే పరాయిగా అనిపిస్తోంది. (3-6)

వినిన అమాయక సైరంధ్రి అస్వస్థురాలైంది,
మానంత్రాసు శరీరాన్నీ, సంతాపాన్ని తులతూచింది,
బహిరంగ-రహస్యపు ఆటను గాయంలా భరిస్తోంది,
కీచకుడు మనసులో నిలిచి ఉల్కాపాతం కలిగిస్తున్నాడు.

సందిగ్ధంగా పగలు గడిచింది,
నిశ్శబ్దంగా చీకటి వచ్చింది;
అంతఃపురంనుండి అనుమతి తీసుకుంది,
ఉద్వేగహృదయంతో దాసి బయలుదేరింది.

మారువేషంలో ప్రహేళిక దాగింది,
సామ్రాజ్ఞీ? లేక పట్టింపులేని స్త్రీ?
అవాంతరంలా అనుమతి లభించింది,
సమాంతరంగా త్వరిత నిషేధం జరుగుతుంది.

మనసు విహ్వలమైనది చాలా చంచలమైనది,
చీకటివేగంలా పక్షి ఎగురుతోంది;
సందిగ్ధంతో అస్తిత్వం దోచుకోవాలి,
పాతబండిని లాగాల్సివస్తుంది.

శరీరమొకటేకానీ బహుముఖీన,
మనోభావాల అభినయ;
బయట కనిపించేది దైహికం,
మరో రూపం లోపల నిలిచింది.

ప్రతిక్షణం కాలం ఖచ్చితంగా మారుతుంది,
విధి నియమానుసారం అలంకరిస్తుంది;
లోపలా బయటా, భిన్నశరీరాలు
ఈ అంతరం మాసిపోదు.

అభాగ్య స్వప్నాలను భరిస్తున్నది,
గహనమైన బాటలో ముందుకు నడిచింది;
అలసిన శరీరం, నడక సాగించింది,
మనసుమాయ ఎండమావి లాంటిది.

ఆకస్మిక క్షణంలో మృదంగం విన్నది,
అంతరంగంలో ఇప్పుడు ప్రశ్నలుదయించాయి;
నరపుంగవుడిని ఎవరు నర్తింపజేస్తున్నారు?
ఇప్పుడీ ప్రతిఘటనను ఎవరు ఆటపట్టిస్తున్నారు ?

నడుస్తూ నర్తనశాలను చేరింది,
ద్వారం దగ్గరే మధురనాదం వింది;
క్షణమాత్రం అర్జునునితో చూపు కలిసింది,
అప్పుడు కీచకుడు తనువును ఆటపట్టించాడు.

తనను సంబాళించుకుని, ఆమె వెనక్కి పరిగెత్తింది,
మృదంగంనుండి బలమైన దెబ్బ విని, శరీరం వణికింది;
వెంటనే కుటీరంలోకి చొరబడింది, మనోసూత్రాన్ని లాక్కుంది,
ఇటువైపునుండి అర్జునుడు, అటువైపు కీచకుడు. (3-7)

(సశేషం)

Exit mobile version