[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]
అధ్యాయం-4 – మొదటి భాగం
ఉద్వేగభరిత నారి,
ప్రత్యంగం స్వేదభారం;
ఊహించని అనుభవం తెలియనిది,
మొదటిసారి ఆమె గుర్తించింది.
శ్యామ నఖశిఖపర్యంతం చాలా వణుకుతోంది,
మహావీరుడు అర్జునుడి భార్య;
చంచల మనసులో కీచకుడు తిష్టవేశాడు,
కళ్ళలో కొత్తభావాలు కనిపిస్తున్నాయి.
సమీపంలో పతిపరమేశ్వరుడున్నాడు,
అభినవ నర్తకరూపుడు రసేశ్వరుడు;
పౌరుషహీనుడు సాంగత్యంలేని శాపగ్రస్థుడు,
స్వీయప్రమాణితుడని నిర్వివాదం.
గుడాకేశుడు, కౌన్తేయుడు, ధనుంజయుడు,
శిథిలనామాలే పోగుచేసుకున్న;
వంధ్యుని వ్యర్థ పరిచయం లభించింది,
కాలతీరాన గోప్యతామాయ.
వ్యక్తి ఒక్కడు వ్యక్తిత్వం అపారం,
నిజమైన మనోకామన దొరకలేదు;
ఎప్పుడూ ఆశ్చర్యకరమైన ప్రశ్నలు వేధించాయి,
జటిల యోచనలు ఎక్కువగా తిరిగాయి.
అర్జునుడెవరు? ఈ కీచకుడెవరు?
ఎవరు సమర్థుడు? ఎవరు నిరర్థకుడు?
ఒకరు స్పర్శభాష రాస్తున్నారు,
మరొకరు మృదంగం వాయిస్తూ అమ్ముతున్నారు.
ఉభయనేత్రాలలో దాగి ఉన్నాయి,
ఇద్దరి మనసుల్లోనే వెల్లడయింది;
ఒకరు సమీపించటానికి ఆసక్తిగా ఉన్నారు,
మరొకరు తననుండి వెంటనే పారిపోవటానికి.
మనసులోని ఎంపిక మారుతూఉన్నది,
కదులుతూ, ఆగుతూ, స్వీయ నియంత్రణతో,
దగ్గర-దూరాలలో మనస్సు అశాంతిగా;
ప్రతిక్షణం నలిబిలి అవుతున్నట్లుంది.
దట్టమైన చీకటిని కప్పుకుని, రెప్పలులేని రాత్రి నిద్రపోయింది,
భ్రమ నిండిన మనసుతో ఆలోచిస్తూ, సైరంధ్రి కులీనురాలు;
కనురెప్పలు పైకెత్తినాక అవగాహనాభారం తొలగిపోయింది,
కలలలోకంనుండి వెంటనే కొత్తతలుపు తెరుచుకుంది. (4-1)
భ్రమరాల ఝంకారంతో మత్తుగా తూగుతోంది,
ఒక ప్రకాశవంతమైన తోట;
అనాఘ్రాత పూలతో సుందరమైంది,
నలువైపులా పవిత్ర పరిమళ వసంతం.
మనసులో వినూత్న స్పందనలను అలంకరించి,
సైరంధ్రి స్నేహాన్ని జరుపుకుంది;
సృష్టిని ఉన్మాదలయలో చూసి,
ఆటవీకాంక్షలు మేల్కొన్నాయి.
ఏకాంతం ఇష్టమైనదానిని వినోదిస్తుంది,
తనలో తాను ఉండేలా చేస్తుంది;
పేరు-ప్రఖ్యాతుల మాయ మర్చిపోయింది,
విలువైన తన శరీరాన్ని పరికించింది.
అందమైన మోము నిరంతరం సంతోషకరమైన శరీరం,
ముకుళిత యవ్వనం మత్తమోహనం;
విశాలజఘనం ఉన్నత వక్షస్థలం,
లోతైన నాభి, సన్నని నడుము.
కళ్ళల్లో సుందరమైన తృప్తి చిందులువేస్తోంది,
తనువులో ముగ్థ మరాళపు వయ్యారం;
ప్రవాళాధరాలు కలయికను కోరుకుంటున్నాయి,
బలీయమైన కోరిక లోపల మేల్కొన్నది.
మధురమైన పిల్లగాలి కదిలింది,
అభిలాష అశ్వం దూకుతున్నది;
కదిలే ఆశ్చర్యంతో ఆశాలయ,
అనుపమ అభిసారికాముగ్థ .
స్త్రీ ఒక్కతే కానీ శతరూప,
పదిలమనస్కురాలై తులలేని అమూల్య;
స్వతహాగానే స్వేచ్ఛావర్తని వాస్తవంలో నది,
లోలోపల నవ్యవర్తన కోరుకుంటుంది .
ఇవాళ పరీక్ష చేయకూడదు,
దాహం-తృప్తి ల వ్యర్థసమీక్ష;
మత్తనారి సంక్లిష్ట ప్రహేళిక,
చిరకాలంగా ఒంటరిగా కనిపిస్తుంది.
ప్రబల నిరీక్షిత ప్రేయసి, అందమైన అభిసారిక,
వికసించిన గాఢమైన ఏకాంతంలో, ఆమె విహరిస్తోంది;
నలువైపులా యువతి చూసింది, వసంతమాసం చిందులేస్తోంది,
అప్పుడు ఒక పురుషుడు వచ్చాడు, దాదాపుగా ఆమెకు దగ్గరగా. (4-2)
కమ్మిన సిగ్గుతో శరీరాన్ని కప్పుకుని,
హావభావాలను కలగలుపుకుని;
అతన్ని చూసి ఆమె చిన్నగా నవ్వింది,
తనను తాను మోసం చేసుకోలేకపోయింది.
చిరునవ్వు మోమును మహావీరుడు చూశాడు,
పుంసత్వతనువు ఎప్పుడూ మనసును ఆకట్టుకుంటుంది;
కఠినమైన బలమైన పొడవైన చేతులు,
కళ్ళు విజయకేతనాలెగరేస్తున్నాయి.
ఓటమిలేని ప్రభావశాలి చూశాడు,
ప్రతిక్షణం ఆవిరైపోతున్నది;
వజ్రదేహంలో ఇమడలేనివాడు,
ప్రబల పౌరుషం అమితంగా ఆకర్షిస్తుంది.
తెలియని అద్భుత భావన, మధురమైనది,
సైరంధ్రి తనలో నిర్ణయించుకుంది;
రక్తప్రసరణ అనుకూలంగా పెరిగింది,
చోటెక్కడున్నదని వెదుకుతోంది.
అంగాంగంలో తులలేని ఉత్సాహం,
తనను అలంకరించుకుంటున్నది సుకేశి;
కేవలం స్త్రీయే స్వయంసిద్ధ,
కానీ మన్మథునికే అర్పణ అవుతుంది.
తనతో తానే బంధం కలుపుకున్నది,
స్వయంగా తనకు తానే సృష్టికర్త;
మనసు వలన అన్యులకు తెలియకపోవచ్చు,
మనసుమాయను మనసే గుర్తిస్తుంది.
సామ్రాజ్ఞి లేదా దాసి కావచ్చు,
స్త్రీ పదవినే తిరిగి ఆశిస్తున్నది;
శరీరం అఖండమైనది, బావి సగమే ఉంది,
పూర్తిచేయాలని మనసు కోరుకుంటోంది.
కమలంలో మిలమిలలాడే మంచు,
సరోవరం పైన ప్రకంపనలు లేస్తున్నాయి;
జలగహ్వరంలోకి వెళ్ళాలి,
తెలియని సుడిగుండంలో చిక్కుకోవాలి.
ప్రభావితం చేసే పురుషుని చూసి, సైరంధ్రి నిశ్చేష్టిత,
నరోత్తముని సమీపంలో మత్తులో ఆహ్లాదకరమైన అనుభూతి పొందింది;
క్షణమాత్రం అతనినే చూసింది, ఎదుట అదే వీరుడు,
అతని పేరు కీచకుడు, రణధీరుడైన సేనాపతి. (4-3)
రోమాంచిత హర్షంతో ఉప్పొంగిపోయిందామె,
మన్మథానుగామిని మృగనయని;
సులజ్జిత వివర్ణవదనలా ఉన్నది,
లలిత లవంగ సుపర్ణలా.
తెలియని పురుషుడు ప్రభావితం చేస్తున్నాడు,
క్షణక్షణం దగ్గరికి ఆకర్షించటం చూస్తోంది;
ప్రబల మదనుని వల్ల మనస్సు చంచలమైంది,
స్వేదోన్మాదం సహజాలంకారణం.
ఇతరులు మరింత దగ్గరికి వచ్చారు
మోము చూస్తే తనివి తీరలేదు;
స్నిగ్థ ఈషణ తొణికిసలాడుతోంది,
మాటలులేని క్షణాలు చివురిస్తూఉన్నాయి.
కటాక్ష వీక్షణ నిపుణుడు జల్లు కురిపించాడు,
కీచకుడు తృటిలో తాకడానికి దూకాడు;
అతి ప్రవర్తన అర్థంచేసుకుంది,
వెంటనే కోరిక నశించింది.
ఎవరు ఎవరిని ఆహ్వానించారు?
తనపై తనకే నియంత్రణ లేదు;
భావనలను వ్యవస్థీకరించింది,
తన వక్రమార్గ ఆలోచనను నిరోధించింది.
లోపల ఉన్న స్త్రీ ఎవరు?
సైరంధ్రి? లేదా దృపదనందిని?
అదృష్ట శుభాంగి గందరగోళంలో,
నరనరాల్లో కేవలం స్త్రీయే ప్రవహిస్తోంది.
ఒకరు లాగుతారు, ఒకరు తోస్తారు,
క్షణంలో చుట్టేసి, లేదా మళ్ళీ కదిలి;
వెలుగులో శరీరం నడుస్తోంది;
వ్యర్థంగా ఎడారినీడ లాగుతోంది.
చిక్కుల్లో బాధితురాలు వివశ అయింది,
సమ్ముఖంలో లభ్యత సహజంగా ఉంది;
పేరు-ప్రఖ్యాతులను వదిలిన మంత్రముగ్థ,
క్షణంలో ఆ స్నిగ్థ జరగసాగింది.
అప్పుడే హటాత్తుగా అలజడి, లోపలనుండి సంఘర్షణ,
రక్తప్రసరణ ఆగిపోయింది, శరీరమంతా స్తబ్దమైపోయింది;
అప్పుడే మనసు తీవ్రంగా మారింది, నివారించలేని కుట్ర,
తనను తననుండి, తిరస్కరించుకోవటం చూస్తోంది. (4-4)
(సశేషం)
