Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం-8

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

అధ్యాయం-4 – రెండవ భాగం

సైరంధ్రి క్షణమాత్రం కంపించింది,
తన నీడను సమీకరించుకుంది;
అతివ్యతిరేకత జుగుప్సగా ఉంది,
క్షణంలో సహజ సమర్పణ త్యజించింది.

సుడిగాలిని త్వరగా పారద్రోలింది,
శీఘ్రమే అతడిని పరునిగా భావించింది;
ఉపవనాన్ని వదిలి ఆ యువతి బయలుదేరింది,
తనను తానే మోసం చేసుకోలేకపోయింది.

తనలో తననిజం తెలుసుకోకుండానే,
తనను తననుండి గుర్తించకుండానే;
నిత్యం తననుతాను దాచి ఉంచుకోవటం,
తననుండి తనను ఎలా కప్పిఉంచగలదు?

క్షణంలో శరీరం కోరుకుంటుంది,
క్షణంలో దేహం కోరికవుతుంది;
శరీరమే ఆటలన్నీ ఆడుతుంది,
శరీరంలోనే రహస్యాలన్నీ దాగున్నాయి.

ఐదయిదు భర్తలకు భార్య,
ఒక అపరిచిత పురుషుని వరించింది;
ఇష్ట-క్లిష్టాల భేదం మరిపించి,
అన్ని ఇష్టాలను వదులుకుంది.

భర్తగా మారిన ఒకరిని గౌరవించాలి,
భార్య అంటూ మరొకరిని పిలవాలి;
ఇద్దరిలో ఎవరు సత్యవంతులు?
బంధం పరిపక్వం కాలేదని తెలియలేదు

అందరి అర్థాలన్నీ భిన్నంగా ఉంటాయి,
మనోనిహిత పెళుసు ఆకాంక్షలు;
స్త్రీ ఎప్పుడైతే కేంద్రబిందువవుతుందో,
ఆమెకు నిజమైన అధికారి ఎవరు?

పాండవపత్ని ఆలోచించటం మొదలుపెట్టింది,
బలమైన పాపంనుండి విముక్త మహనీయురాలు;
శపితస్వప్నం ధ్వంసంచేసింది,
తన స్వామిని మనసులో ప్రతిష్ఠించుకుంది.

మధ్యదారిలో కీచకుడు నిలబడ్డాడు, ఎలా దాటిపోగలదు,
వెంటనే పరిచారిక అలంకరణలన్నీ సర్దేసుకుంటోంది;
రాగం – త్యాగాల సమ్మేళనంలో కలయికను మర్చిపోయింది.
ప్రచండ ఉల్కాపాతానికి, తక్షణ ప్రతీకారం చేసింది. (4-5)

అనారోగ్య కోరికలను కలిపి – విడదీసి,
విరుద్ధ భావాలను కనురెప్పల్లో వదిలేసి;
అతడూ, భర్త ఇద్దరూ పంచుకుంటే,
పదవి ప్రకారం అవగాహనతో విభజించారు.

భర్త-భార్యా, స్త్రీ-పురుషుడు,
జంట ఇద్దరూ, కానీ చాలా అంతరం;
దూరం- దగ్గరల రాతకోతల్లో,
ఇద్దరి వారసత్వం విలువైనది.

పంచ పాండవులు పతీ పరమేశ్వరులు,
భార్యకు అసలు మర్యాద ఇవ్వలేదు;
దగ్గరగా చూస్తే పురుషుడు ఉత్తముడు,
అతనిలో సహజ ప్రకాశం ఉంది.

తనలో తానే తనను కలుసుకుంటున్నది,
క్షణం-క్షణార్థంలో వెనక్కి మరలుతున్నది;
మనోరథంతో రోజూ వినోదం,
తనతో తానుగా వంచించుకుంటున్నది.

తెలియని చిక్కులో పడిపోయింది,
గడవని రేపటి క్షణాన్ని చూసింది;
లోపల భయంకర గర్జన విన్నది,
పాపం సమీపంలో ఉన్నది, ఎదుట పురుషునిలా.

ఉన్మత్త పురుషుని నఖశిఖ పర్యంతం చూసింది,
అతనిని నిర్వహించటం కష్టం;
కాముకుడు చేతులు చాపి నిలబడ్డాడు,
తన స్వామి రక్షించనూ లేడు.

స్వజనసభలో అందరిముందూ ఓడిపోయారు,
వారిని ఇక్కడకు ఎలా పిలవాలి?
నావ ఎండమావి మధ్యలో ఉంది,
దానిని ఎవరు మళ్లించగలరు?

చాలా ఆలోచించి చివరకు ఓడిపోయింది,
స్వీయరక్షణ ఆలోచనారహితంగా మారింది;
భయగ్రస్తురాలైన ఆమె నిస్సహాయ,
ఆలంబనలేని పాండవుల భార్య.

సైరంధ్రి చేతులు జోడించి ప్రతీకారం చేస్తున్నది,
సేనాపతి వెంటనే అధికారం స్వీకరించాడు;
దగ్గరి శరీరంనుండి లాగింది, దాసి వదనం వివర్ణం,
అకస్మాత్తుగా అక్కడే ప్రత్యక్షమయ్యాడు, అతులిత ప్రియతమ కర్ణుడు. (4-6)

పుంస్త్వపుఘోష ఆకాశంలో వ్యాపించింది,
సుబాహువీరుడు దగ్గరికి చొచ్చుకువచ్చాడు;
సేనాపతిని సులభంగా ఎత్తుకున్నాడు,
ఆటలాగా విసిరి పడేశాడు.

భుజంమీద దెబ్బకు కీచకుడు ఉలిక్కిపడ్డాడు,
సంతోషించిన దాసి నిరోధించలేదు;
పరస్పరం ఆవాహన చేసుకున్నారు,
మళ్ళీ ద్వంద్వయద్ధం మొదలైంది.

కిరీటాన్ని అలంకరించుకున్న కీచకుడు లేచాడు,
కర్ణుడు బలిష్ట భుజాలను అలంకరించుకున్నాడు;
గతానురాగం నిండిన నారి,
ప్రియునిపై మళ్ళీ: అప్పుడు కరిగింది.

హింసకుని భయంకరమైన పెద్దదెబ్బకు
అనంతరం ఛీత్కారం వ్యాపిస్తోంది;
ముష్టిఘాతాలు ప్రతిఘాతాలు వినిపిస్తూ,
ఇద్దరు యోధులు చివరిదాకా వచ్చారు.

మృత్యువు ఘోర నగారా మోగించింది,
కీచకుడు వ్యవధిలేకుండా ఓడిపోయాడు;
ప్రతాపవంతుడు ప్రాణఘాత ప్రహారాన్ని చేశాడు,
నిర్లజ్జపాపి నశించాడు.

ప్రియుని అనురాగవతి సైరంధ్రి,
భాగ్యశాలిని కర్ణునివైపు పరిగెత్తింది;
పురుషత్వపు తనువులో తలదాచుకుంది,
బలంగా కౌగిలిలో చుట్టుకున్నది.

చేతులను వరమాలగా చేసి,
దాహంతో ఉన్న ఆధరాల దప్పిక తీర్చింది;
కోరిక తాళంచెవి దొరికింది,
గందరగోళపు నిర్వచనం అర్థమైంది.

అభిసారిక వాసంతి ఇష్టపడింది,
రసవంతంగా రమణి మెరుస్తోంది;
ఇరువురి శరీరాలు అనురాగంతో కలుస్తున్నాయి,
ఆమె సహజ సుమంగళిగా మారిపోయింది.

ద్వారం దగ్గర తలుపుతట్టిన చప్పుడుకు, నిద్రాజాలం విరిగింది,
స్వప్నలోక సంపద, అప్పుడే ధ్వంసమైంది;
మధ్యరాత్రి ఎవరో, ద్వారం దగ్గర నిలబడ్డారు,
అర్జునుడు కావచ్చు, కీచకుడని కూడా అనిపిస్తున్నాడు. (4-7)

(సశేషం)

Exit mobile version