Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం-9

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

అధ్యాయం-5 – మొదటి భాగం

నీలోత్పలం వీడ్కోలును ప్రసారిస్తోంది,
స్వప్నసృష్టి వైభవం పొంగి పొర్లుతోంది;
సకల శుభాలను నింపుకున్న క్రీడ,
దట్టంగా వ్యాపించిన మధుర వేదన.

అబల అతివ పాన్పుపై ఉంది,
వెలుగులేని నిప్పురవ్వలా;
భయభీతురాలై కుటీరం తెరువలేదు,
మళ్ళీ ద్వారం దగ్గర తలుపుచప్పుడు మాట్లాడింది.

నేడు హస్తినాపుర పట్టపురాణిని,
గతించిన కాలపు మాటలా;
అంతఃపుర అబలను దాసిని,
నీటిలో ఉన్నాను అయినా దాహంతో.

అతిశయోక్తిలో నేనుగా తిరుగుతున్నాను,
నిత్యం అల్పత్వంలో చిక్కుకుపోతున్నాను;
పూర్వానురాగంతో ప్రతిక్షణం ఒంటరిని;
వర్తమానంలో వివశ ప్రహేళికను.

ప్రతిరోజూ ఉదయిస్తున్న ఆట,
భయంకరమైన నిరంతర బాధ;
ఒక సంవత్సరం యుగంకన్నా సుదీర్ఘమైనది,
అన్ని అనుభూతులు చెవిటివైనాయి.

దగ్గరలో వందలు వేల పరిజనం,
అంతరంగంలో బాహుబలి సాంగత్యం;
రత్నశోభితం తన భవనం,
ఇప్పుడా వైభవం కేవలం స్వప్నం!

ద్వారం దగ్గర ఎవరా అపరిచితుడు?
మెల్లగా మళ్ళీ తలుపు తడుతున్నాడు;
ఎక్కువ శంకతో ప్రశ్నల్ని మేల్కొల్పుతున్నాడు,
ఎవరయిఉంటారో తెలియటంలేదు.

తన భర్త అర్జునుడు కావచ్చు,
కాముకుడు కీచకుడు కూడా కావచ్చు;
ఇద్దరి కారణాలు వేరు వేరుగా ఉండొచ్చు,
హృదయస్పందన ద్విగుణీకృతమయింది.

బలహీనుడైన పురుషుని స్పర్శకోసం, కనిపించింది అతడే,
ఇక్కడికి అర్జునుడు రాగలడు, తన పక్షం వహిస్తూ;
శరీరాన్ని స్పృశించి హృదయ గౌరవాన్ని రాసినవాడు,
ఇక్కడికి కీచకుడు రాగలడు, అధికారం చూపటానికి. (5-1)

కొంత తనవారి గురించి ఆలోచిస్తున్నది,
మధుర స్వప్నాలను స్మరించుకుంటోంది;
ఎవరు అడుగుతారు? ఎవరు గుర్తిస్తారు?
మనసుమాయ మనసుకే తెలుసు.

చీకటిలో తడిసిన రాత్రి,
భయభీత వివర్ణ పత్ని ఉంది;
స్వీయమర్యాద ఘడియ రాలేదు,
సైరంధ్రిని మరువలేకున్నాడు.

స్వప్నభంగంతో కలయిక కోల్పోయాడు,
మళ్ళీ కళ్ళకు కనిపించలేదు;
హరిణనేత్రి శాపగ్రస్తగా అనిపిస్తుంది,
అదే దారిని కళ్లార్పకుండా చూస్తున్నాడు.

విరాటనగరం ప్రతిష్ఠను తగ్గించింది,
పామరత్వం కొంగును పట్టుకుంది;
వీరోచిత గర్జనను పోగుచేసి,
పాండవపదవిని వదిలేశాడు.

ద్వారం దగ్గర అపరిచితుడెవరు?
పాతవిషయాన్ని సంశయిస్తున్నది;
నిద్రలో నగరం హాయిగా ఉంది,
కేవలం ఈ చోటు మాత్రమే మేల్కొనిఉంది.

అర్థరాత్రి గంట గట్టిగా,
నెమ్మది, కోపం, రాయిలాంటి కఠినత్వం;
ఇరుకైన చీకటి డేరా పడుగులా ఉంది,
కీచురాళ్ళు లోతైన పాటలు పాడుతున్నాయి.

గుణవతి అయిన స్త్రీ తన పాదాలను ఎత్తినడవదు,
కోత అనుభవం చాలా పదునైనది;
తనకుతానే స్వయంగా సమీక్షించుకుంది,
ద్వారం దగ్గర ఎవరు వేచిఉన్నారు?

అకారణంగా స్తబ్ధకాలంలో చిక్కుకుంది,
త్వరగా నివారించటానికి ఎదురు చూస్తోంది;
నిరంతరం ఆత్మగౌరవం కోసమే యుద్ధం,
అనుభవం ద్వారా బదులు దొరకలేదు.

మూసిఉన్న ద్వారంవెనక ఘోర విపత్తు వచ్చింది,
సైరంధ్రి ఇప్పుడు ఎదుర్కుంటోంది; తీవ్రమైన మహాప్రవాహాన్ని;
స్వప్నాల ఉత్తమ కలయిక చరమ రసోజ్వల వ్యర్థంమైంది,
వృథా కాలభారం, నిరాధారంగా లాగుతుంది. (5-2)

సూతపుత్రుడు నిష్కారణంగా ఆగాడు,
పాండుపుత్రుడు అవకాశాన్ని వినియోగించుకున్నాడు;
మత్స్యయంత్ర భేదనాన్ని సఫలం చేశాడు,
దైవికంగా పతిగా పిలవబడ్డాడు.

ఏక పతీవ్రత కాలేకపోయింది,
ఐదుగురు పురుషులను అంగీకరించింది;
అందరికీ వంతులవారీగా భార్య,
వర్తమానంలో యవ్వనవతి.

జూదమాడి సర్వం కోల్పోయారు,
ప్రపంచంలోని కష్టాలన్నీ అనుభవించారు;
కులధాత్రిని సమర్పించారు,
వారికి దర్పణమెవరు చూపుతారు?

స్వయంగా పరాక్రమించలేకపోయాడు,
ఎండమావిని నీళ్లనుకుంటూ వచ్చాడు;
ఆత్మపరీక్ష వృథాగా మారింది;
సమతుల్యమైన సమీక్ష ఎవరు చేస్తారు?

నూతన వికృతవేషం స్వీకరించాడు,
తనను తాను వేరుగా చెప్పాడు;
అంతా తన అభినయాన్ని వెదికారు,
సహజంగా ఎదగటం ఫలించలేదు.

దాసీరూపాన్ని దగ్గరిగా చూశాడు,
అయినా లజ్జారేఖ లేదు;
ప్రేమలేని దారుణదీక్ష,
ప్రతిరోజూ కఠినపరీక్ష.

ఇతరప్రపంచం ఆశ్రయం పొందింది,
నిజపరిహారాన్ని చూపించింది;
శిథిలదుర్గం కథలు రాసింది,
అనేక వేదనలను వ్యర్థంగా అనుభవించింది.

మళ్ళీ తలుపు పిలుపు విన్నది: తిరుగుతున్నప్పుడు;
తృటికాలపు ఆనందంలో బాధ;
ఇప్పుడు చీకటిమధ్య వెలుగు చిక్కుకుంది,

పరిష్కారం దూరంగా వెళ్ళిపోయింది.
నిజంగా అక్కడ ఎవరైనా ఉన్నారా? లేక పెద్ద భ్రమా?
శరీరాన్ని గందరగోళంతో కప్పుకుని, ఆమె ఆలోచిస్తున్నది;
మనసులో గీతలు పడ్డాయి, పదునైన క్షణం అంచుతో,

పట్టుకుంటే చాలా కోసుకుంటుంది,
దెబ్బ త్వరగా తగ్గిపోతుంది. (5-3)

మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్తుంటే,
అడుగు పడేకొద్దీ అనుమానాలు నాటుకుంటున్నాయి;
పాదాలసవ్వడితో తనని తానే మోసం చేసుకుంటూ,
వెనక్కి తిరిగి మళ్ళీ నడుస్తోంది.

ఆ చకోరి నలువైపులా చూసింది,
రహస్యంగా దీపం వెలిగించింది;
క్షణంలో వెలుగు వ్యాపించింది,
మళ్ళీ ద్వారందగ్గర తలుపుపిలుపు వినిపించింది.

బహిరంతరాలలో భేదాల కలకలం,
కళ్ళల్లో దృశ్యాలు మారుతూ ఉన్నాయి;
రోజూ కొత్త అధ్యాయాలు రాయాలి,
గతపుటలను మరవటం దుష్కరం.

మూసిన తలుపులు తెరిచినట్లనిపిస్తున్నాయి,
అర్థరాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి;
విషమగీతాలు పాడే కీచురాళ్ళు,
రాత్రి భయపెట్టటానికి సుదీర్ఘంగా ఉంది.

అసమానమైన లయలో మనసు చిక్కుకుంది,
చాలా భయంతో గొంతు వణికింది;
తలపైనుండి బరువు తగ్గటంలేదు,
సందిగ్ధం మళ్ళీ తలుపు తడుతోంది.

సహజనిద్రకు అవాంతరాలున్నట్లనిపిస్తుంది,
హఠాత్తుగా అగ్ని ప్రచండంగా ఎగిసిపడుతున్నది;
మనసుతో ఏదో అల్లుకుపోతున్నది,
కళ్ళతో ఎన్నడూ చూడనిది,

ఇవాళ కాకపోతే తర్వాత దొరుకుతుంది,
పెళుసైన కోరిక కూడా ఫలిస్తుంది;
అనుచితమైనా లేదా న్యాయమైనదైనా,
అందరూ ఎదురు చూడాల్సిందే.

సందిగ్ధంలో నీడను పట్టుకున్నది,
అడుగడుగునా కష్టాలున్నాయి;
గతం-నేడు రెండూ భారమే,
భేదం-భ్రమ భయంకరంగా ఉంటాయి.

ఆసక్తి-అనుమానం రెంటినీ త్రాసులో తూచింది,
సమానం కాలేకపోయాయి,కొలతలు రెండూ అమూల్యం;
సునయన స్త్రీ భ్రమ-విభ్రమల్లో ఊగిసలాడుతున్నది,
మూసిన ద్వారం మాటున నిజంగా అక్కడ ఎవరో ఉన్నారా? (5-4)

(సశేషం)

Exit mobile version