[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘సజీవ నది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నా గుండెల్లో తడి
ఓ గోదావరి
అక్కడ పారుతోంది
ప్రేమ అనే నది
అది ఎన్నటికీ మారిపోని
ఆరిపోని సజీవ నది
ఎదలోయలలో
పొంగిపొర్లుతూ
సుళ్ళు తిరుగుతూ
సాగిపోవడమే దానికి తెలుసు
అందరూ తనవారనుకుని
ప్రేమను పంచడమే తెలుసు
ఏ కల్మషమూ అంటని
పరమ పావని అది
ఏ పరమార్థమూ ఆశించని
గంగా జల ధార అది
ప్రేమ వున్న చోట
మాయ నీడ కూడా పడదు
మోసమన్న మాట కూడా వినిపించదు
నిండైన ప్రేమకు నా గుండె లోగిలి
తీరైన తారలతో కొలువున్న జాబిలి
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
