Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సజీవ సాక్ష్యం

[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘సజీవ సాక్ష్యం’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

ఆకాశం ఒక ప్రశ్న
సముద్రం ఒక జవాబు
మధ్యలో ఈ గాలి హోరు
తీరని జీవితంలా!
ఇక్కడ నిర్మలత నటిస్తోంది
అక్కడ బీభత్సం నిజం చెబుతోంది
లోపల కూడా అంతే..
పైన పౌర్ణమి, లోపల తుఫాను!
వర్ష ఋతువు వెళ్లిపోతున్న శబ్దమా?
శరత్‌ను మోసుకొస్తున్న కాలం శబ్దమా?
ఆశ్వయుజమేమో ఆకులు రాల్చదు
కానీ మనుషుల ముసుగులు రాలుస్తుంది.
ఈరోజు నిండు పున్నమి
వయసు మీద పడే వెన్నెల..
ఇది వెలుగా? లేక
నీడల్ని సైతం చూపించే మిణుగురు కాంతా?
గాలి ఆగదు
నేను ఆగను
పౌర్ణమి వస్తుంది పోతుంది..
ఆకు రాలితే కొమ్మ మళ్లీ చిగురిస్తుంది
ముసుగు రాలితేనే మనిషి నిజమవుతాడు
చివరకు మిగిలేది ఈ హోరు మాత్రమే
నేనున్నాననడానికి సజీవ సాక్ష్యం

Exit mobile version