[2 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు యమునానది పుష్కరాలు జరుగుతున్న సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
“జలం జీవనం ఇత్యుక్తం
జలం సర్వస్య కారణం।
జల రక్షణమ్ అస్మాకం
కర్తవ్యం పరమం సదా॥
సమస్త జీవులకు జలమే ఆధారం, జలమే జీవనం. ప్రాణి కోటి జీవనమునకు నీరే ఆవశ్యకం. అందుకే ‘ఉదకం నారాయణ స్వరూపం’ అంటారు. నారములు అంటే నీరు. నీటిలో నివసించేవాడు నారాయణుడు.
‘అప ఏవ ససర్జ ఆదౌ’ అని వేదమంత్రం. సృష్టికర్త ముందుగా నీటిని సృష్టించాడు. జనుల జీవనమునకు ఆధారభూతమైంది నీరు. కనుక నీటిని జీవనము అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు. భూమండలంపై ఒక వంతు భూమి మూడు వంతుల నీరు పుష్కలంగా ఉన్నది. ఘనరూపంలో, ద్రవరూపంలో, వాయు రూపంలో లభ్యం అవుతుంది అని పరిశోధకులు నిరూపించారు.
“ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అధ్భ్య పృధివీ
పృధివ్యా ఓషధయః ఓషధీభ్యః అన్నం అన్నాత్
రేతః రేతసః పురుషః “
అని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి రేతస్సు, అందుండి జీవుడు పుట్టాడని ఉపనిషత్ వాక్యము. జీవునికి జీవనాధారమైన నీరు నదీరూపాలని పొంది భూమిపై ప్రవహిస్తూ జనులకు జీవనాన్ని ఇవ్వటమే కాక వారి పాపాలను కూడా ప్రక్షాళన చేస్తుంది. ఈ నదీ పరివాహ ప్రాంతాలు మానవులకు ఆవాసాలై ఆ నదీ తీరాలలో నాగరికత పరిఢవిల్లింది. నదులను “మాతృదేవతలుగా” ఆరాధిస్తారు. ఆ నదులలో 12 నదులను ప్రధానమైనవిగా పేర్కొంటారు. ఆ 12 నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరము వస్తుంది.
ఈ పుష్కరాలను గురించి పురాణాలలో ఒక కథ కూడా చెబుతారు. పుష్కరుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షంకాగా నాలో స్నానమాచరించిన వారి పాపాలను తొలగిపోయేటట్లు చేసే శక్తిని నాకు వరంగా ప్రసాదించమని కోరుతాడు. ఆ వర ప్రభావంతో పుష్కరుడు దేవలోకంలో గల ఆకాశగంగలో కలిసి పవిత్రుడైనాడు. అప్పుడు గౌతమ మహర్షి శాపానికి గురి అయిన దేవేంద్రుడు తన శాపం పోగొట్టుకోవడానికి తరుణోపాయము చెప్పుమని బ్రహ్మను ప్రార్థింపగా బ్రహ్మదేవుడు నీవు ఆకాశ గంగలో అంతర్భూతంగా ఉన్న పుష్కర తీర్థమున స్నానమాచరించిన శాపవిముక్తుడవు అవుతావు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ ఆదేశానుసారము ఆకాశగంగలో స్నానమాచరించి శాప విముక్తుడవుతాడు. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు మహర్షులు ఆశ్చర్యపోయి వారు బ్రహ్మతో భూలోకవాసులైన మానవులు ఏదో ఒక విధంగా పాపాలు చేస్తారు. వారు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పుష్కరుని భూలోకమునకు పంపవలసినదిగా బ్రహ్మను ప్రార్థిస్తారు. దేవతల ప్రార్ధనను మన్నించిన బ్రహ్మ పుష్కరుడు ఆర్ష భూమియగు భారత దేశమున ప్రవహించు 12 పవిత్రమైన నదులలో సంవత్సరమునకు ఒకసారి నివసించునట్లుగా ఆదేశిస్తాడు. పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే అపుడు ఆ నదికి ఆ సంవత్సరము పుష్కరము వస్తుంది.
మనకు మేషాది 12 రాశులు చెప్పబడినాయి. ఆ విధంగా పుష్కరుడు సంవత్సరమునకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తాడు. బ్రహ్మ ఆదేశమును అనుసరించి పుష్కరుడు భూలోకంలోని నదులలో ప్రవేశిస్తాడు. ఆ వరుసలో మొదటగా మేషరాశిలో ప్రవేశించినపుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. ఆ తరువాత వరుసగా సంవత్సరమునకు ఒక నదిలో ప్రవేశించడం జరుగుతుంది. అలా ఇప్పుడు బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయాన యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. పరాభవ నామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ విదియ నుంచి అంటే 2026 జూన్ 2వ తేదీ నుండి జ్యేష్ఠ బహుళ త్రయోదశి అంటే 13వ తేదీ వరకు యమునా నదిలో పుష్కరుడు కొలువై ఉంటాడు. మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలని చివరి 12 రోజులు అంత్యపుష్కరాలని అంటారు. మిగిలినరోజులలో ప్రతిరోజు అపరాహ్ణసమయంలో 2 1/2 ఘడియల కాలము నదిలో కొలువై ఉంటాడు. ఆది, అంత్య పుష్కరాల రోజులలో నదీస్నానం చేయలేని వారు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా స్నానంచేసి పునీతులు కావచ్చును.
ఈ యమునానది సూర్యునికి సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవికి పుట్టింది. యమునానదికి యమధర్మరాజు సోదరుడు. యమధర్మరాజుకు యమునా నదితో సంబంధంగల పండుగను అతిశ్రధ్ధతో జరుపుకుంటారు. దానిని యమద్వితీయ, భ్రాతృద్వితీయఅను పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజున యమధర్మరాజు తన సోదరి అయిన యమునానది ఇంటికి వచ్చి విందారగించి ఆనందించి, కానుకలనిచ్చి చెల్లెల్ని సర్వ సౌభాగ్యాలతో సుమంగళిగా జీవించమని నిండు మనసుతో ఆశీర్వదిస్తాడు. సోదరీసోదరుల అనురాగాన్ని వ్యక్తీకరించేది ఈ పండుగ. నేటికీ భారతదేశంలో దీపావళి పండుగ వెళ్ళిన రెండవ రోజున అన్నదమ్ములు తమ సోదరి ఇంటికి వచ్చి సోదరి చేతి భోజనాన్ని ఆరగించి తగిన విధంగా ఆదరిస్తారు. సోదరి తన అన్న గారిని గౌరవించి ఆదరిస్తుంది. యమునానది ఏర్పరచిన ఈ సామాజికపరమైన, ఆనందకరమైన పండుగను భగినీ హస్తభోజనం అని కూడా వ్యవహరిస్తారు.
గంగానదికి ఉపనది యమునానది. యమునా నది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించింది. ఈ నది ఉత్తరకాశీజిల్లాలోని హిమాలయపర్వత శ్రేణులలోగల యమునోత్రి హిమానీనదం వద్ద జన్మించింది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 6,387 మీటర్ల ఎత్తునగల బందర్ పూంఛ్ శిఖరం వద్ద జన్మించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ , హర్యానా, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద అతిపవిత్రమైన త్రివేణి సంగమం వద్ద గంగా నదిలో కలుస్తుంది. తీర్థయాత్రలలో
ప్రధానమైన చార్ధామ్ యాత్ర యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ నాలుగింటిని కలిపి చార్ధామ్ అంటారు. ఈ యాత్రను యమునోత్రితోటి ప్రారంభించడం సాంప్రదాయము. ఇక్కడ యమునా నదికి ఆలయం ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. తాబేలు మీద నీటి కడవతో యమునా దేవి నిలబడి పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆమె పాదముల నుండి నీరు చిమ్ముతూ భక్తులను పునీతులను చేస్తుంది.
‘కీర్తనాత్ పానాశనీ’ అని యమునకు పేరు. కీర్తిస్తే చాలు మన పాపాలు పోగొట్టేది యమున. యమునానదిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యుల వారు ‘రెండు అష్టకాల’ను రచించారు.
భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ యమునానది ఒడ్డున ఉన్నది. యమునానదిని తలచుకోగానే బాలకృష్ణుడు గుర్తుకు వస్తాడు. మధురలో పుట్టిన బాలకృష్ణుని వ్రేపల్లెకు తీసుకొని వెళ్ళు సమయంలో, వసుదేవుడు బాలకృష్ణుడు పుట్టిన వెంటనే ఒక గంపలో తన శిరస్సున పెట్టుకొని వ్రేపల్లెకు తీసుకొని వెళ్ళు సమయాన యమున పరమాత్మకు దారి ఇవ్వటమే కాక ఆ పరమాత్మ యొక్క పాదాలను భక్తితో స్పృశించింది. అప్పటినుంచి యమునా నదిలోని నీరు కృష్ణవర్ణముతో ప్రకాశిస్తూ ఉంటాయని చెబుతారు.
ఈ నది తీరంగురించి తలుచుకోగానే రాధాకృష్ణులు జ్ఞప్తికి వస్తారు. శ్రీకృష్ణుడు ఈ నదీ తీరాన రాధాదేవి తోటి కలిసిఎన్నో రాసక్రీడలు జరిపాడు. ఈ నదీ తరంగాలలో వచ్చే శబ్దాలు నేటికీ రాధామాధవుల ప్రణయ సంగీతాన్ని గానం చేస్తుంటాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ శ్రీకృష్ణుని బాల్యము, యవ్వనము, కృష్ణలీలలు, రాసక్రీడలు కన్నులారా దర్శించి ధన్యురాలు అయింది యమున.
“అంగనా మంగనామంతరే మాధవం
మాధవం మాధవంచ అంతరేణ అంగనా”
శ్రీకృష్ణకర్ణామృతంలో శ్రీకృష్ణపరమాత్మ సలిపిన రాసక్రీడలు వర్ణితము. సర్పరూపంలో యమునలో దాగిన రాక్షసుని అంతమొందించి గో, గోపాలకులను రక్షించిన తీరు అద్భుతం. శ్రీకృష్ణ ప్రియవాహినిని నేను. వేదవ్యాసుడు ఈద్వీపంలో పుట్టిన కారణంగా ఆయనకు కృష్ణద్వైపాయనుడనే పేరువచ్చింది. ఒకసారి బలరాముడు యమునా నదిని తన దగ్గరకు వచ్చి తనకు స్నానం చేయించమంటాడు. ఆ నది రాకపోయేసరికి కోపంతో తన నాగలి తోటి ఆ నదీ గమనాన్ని మళ్ళించాడని విష్ణుపురాణంలోని కథనం.
గంగా నదీ జలాలు స్వఛ్ఛమయిన ధవళవర్ణంలో ఉంటే యమునానదీ జలాలు కృష్ణవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఏడవవింతగా ప్రసిద్ధికెక్కిన తాజ్ మహల్ షాజహాన్ తనభార్య అయిన ముంతాజ్ ప్రేమ చిహ్నంగా ఈ నది ఒడ్డునే నిర్మింపబడినది. మొగల్ చక్రవర్తుల జీవితాన్ని ఆమూలాగ్రంగా చూసింది. అంతేకాక వారు నాలుగుదిక్కుల కాలువలు తవ్వించారు. ఆ కాలువల నీటి వలన నేడు దాదాపు రెండులక్షల ఎకరాలు సాగుచేయబడుతున్నాయి. అలాగే ఈ యమునానది ఒడ్డునే పానిపట్టు యుద్ధాలు, రాజపుత్ర యుద్ధాలు, ఎన్నో మహమ్మదీయుల యుద్ధాలు జరిగి చారిత్రకంగా ప్రసిద్ధికి ఎక్కింది యమునానదితీరం.
చర్మణ్వతి, క్షిప్ర, కర్ణావతి, వేత్రవతీనదులు యమునానదికి ఉపనదులు. ఇలా ఉపనదులను తనలో విలీనం చేసుకుంటూ చివరకు గంగానదిలో సంగమిస్తుంది. పుష్కరసమయంలో యమునానదిలో స్నానంచేస్తే పాపప్రక్షాళన జరుగుతుందని, సూర్యానుగ్రహం లభిస్తుందని, మరణంభయం నుండి విముక్తి లభిస్తుందని, దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తులనమ్మకం. అంతేకాక ఈ సమయంలో నదీతీరాన పితృదేవతలకు తర్పణాలు, శ్రాధ్ధాది కర్మలను ఆచరిస్తే వారికి సద్గతులు కలగటమేకాక , పితృదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని పండితవాక్కు. ఇక్కడచేసే దానమేదైనా కోటిరెట్ల ఫలితాన్నిస్తుందని భావన.
నమామి యమునామహం సకలసిద్ధిహేతుం ముదా
మురారి పదపంకజ స్పురదమందరేణూత్కటం।
తటస్థనవకానన ప్రకటమోదపుష్పాంబునా
సురాసురపూజితం స్మరపితుః శ్రియం బిభ్రతీమ్॥
శ్రీకృష్ణుని చరణస్పర్శచే పరిమళించే ఇసుకతిన్నెలు కలది, దేవతలకు, మహర్షులకు సకలసిధ్ధులను ప్రసాదించేది, సమస్తజనుల పాపాలను పోగొట్టే యమునానదికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆదిశంకరులు యమునాష్టకంలో యమునానదిని ‘త్రిలోక శోక హారిణి’గా అభివర్ణించారు. త్రివేణీసంగమం, మధురలో కంససంహారం తరువాత కృష్ణుడు విశ్రమించిన విశ్రామఘాట్, బృందావనంలోని కేశిఘాట్, మొదలుగాగల ఘాట్ లలో స్నానం చేసినచో శక్తిని, శ్రేయస్సును కలుగజేసే యమునానది పుష్కరస్నానం సర్వపాపాలను హరించి పుణ్యాలను కలిగించు తల్లికి నమస్కారం.
