Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సెల్యూట్

[శ్రీ పి. నిర్మల రాజు గారు రచించిన ‘సెల్యూట్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

గష్టు పదిహేనవ తేదీ..

తెల్లవారుఝామున తొలి సూర్యకిరణం తూర్పు కొండల వెనుక నుండి తొంగిచూడగానే, మృదువైన గాలి సరస్వతి విద్యానిలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని త్రివర్ణ పతాకాలను మెల్గగా తాకింది. రాత్రి కురిసిన మంచుబిందువులు పచ్చికపై ముత్యాల్లా మెరుస్తుండగా, మామిడి తోరణాలు, రంగవల్లులు, చిన్నారుల కేరింతలు పాఠశాలకు పండుగ శోభను తెచ్చాయి. అది కేవలం ఒక పాఠశాల కాదు.. వేలాది జీవితాలకు వెలుగు నింపిన విలువల ఆలయం. ఆ విద్యాలయం నుంచి బయలుదేరినవారు, దేశం నలుమూలలా సేవలందిస్తున్నారు. ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, సైనికాధికారులు, ఉపాధ్యాయులు, రైతు శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులు.. మొ॥ వారందరు గర్వంగా ఒకే పేరు పలుకుతారు, – ‘ఆచార్య పార్థసారథి’.

నలభై ఏళ్లపాటు తెలుగు భాషను మాత్రమే కాదు, మనిషిగా ఎలా జీవించాలో బోధించిన గురువు. పాఠ్యపుస్తకాలను చదివించడమే కాదు, భారత రాజ్యాంగాన్ని, మానవత్వాన్ని, దేశభక్తిని, సహనాన్ని పిల్లల హృదయాల్లో నాటిన మహోన్నత ఉపాధ్యాయుడు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం ఆయన జీవితంలో మరపురాని రోజు. అదే ఆయన తన పదవీ విరమణకు పక్షం రోజుల ముందుగానే, తన ఆధ్వర్యంలో జరిగే చివరి స్వాతంత్ర్య దినోత్సవ వేడుక రోజు. పాఠశాల నిర్వహణ కమిటీ, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, జిల్లా అధికారులు అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు – “ఈ ఏడాది జాతీయ పతాకాన్ని ఆచార్య పార్థసారథి గారు తన జీవిత సాఫల్య ప్రత్యేక వేడుకగా ఆవిష్కరించాలి.”

ఆ వార్త దేశం నలుమూలల ఉన్న ఆయన శిష్యుల చెవుల్లో పడింది. జిల్లా కలెక్టర్ ఆదిత్య వర్మ., ఐ.ఏ.ఎస్., జిల్లా పోలీసు అధికారి శ్రావణి దేవి. ఐ.పి.ఎస్., ప్రముఖ హృదయ వైద్యురాలు డాక్టర్ అనురాధ, శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, వ్యాపారవేత్తలు తమ కుటుంబాలతో కలిసి తమ గురువుకు సెల్యూట్ చేయడానికి విద్యానిలయానికి చేరుకున్నారు.

వారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అర్జున్, ఆయేషా. ఇరవై ఏళ్ల క్రితం ఇదే పాఠశాలలో కలిసి చదువుకున్న ఇద్దరు విద్యార్థులు. ఒకరు హిందూ.. మరొకరు ముస్లిం.. కానీ పార్థసారథి గారి తరగతిలో వారు ముందుగా నేర్చుకున్నది మతం కాదు.. ‘మనిషితనం’. కాలక్రమేణా వారి స్నేహం ప్రేమగా మారింది. కుటుంబాల ఆశీస్సులతో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ ఇద్దరు చిన్నారులను చేతులు పట్టుకుని అదే పాఠశాల గుమ్మం దాటుతుంటే, వారి కళ్లలో జ్ఞాపకాల వెలుగు మెరిసింది. ఆయేషా చిరునవ్వుతో అంది.. “ఈ నేల మీదనే మన ప్రేమకు తొలి అక్షరం రాయబడింది.”

అర్జున్ పాఠశాల భవనం వైపు చూసి మెల్లగా అన్నాడు.. “అవును.. మనల్ని భార్యాభర్తలుగా కలిపింది ప్రేమ కావచ్చు.. కానీ భారతీయులుగా నిలబెట్టింది మన గురువుగారే.”

పాఠశాల ఆవరణ క్రమంగా జనసంద్రమైంది. పూర్వ విద్యార్థులు తమ గురువును చూసి భావోద్వేగంతో ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. కొందరి కళ్లలో ఆనందబాష్పాలు.. మరికొందరి పెదవులపై చిరునవ్వు. అంతలో ప్రార్ధనా వేదిక దగ్గర చిన్న కలకలం చెలరేగింది. ఏడో తరగతి విద్యార్థులు రామ్, రహీమ్లు, అందంగా చిత్రీకరించి తెచ్చుకొని తమ చేతిలో ఉంచుకొన్న చిన్న జాతీయ పతాకాలని ఒకరిది మరొకరు లాక్కుంటూ వాగ్వాదానికి దిగారు.

“నా జెండాకే మొదటి బహుమతి వస్తుంది!” అని రామ్ గర్వంగా అన్నాడు.

“కాదు.. నా జెండానే గొప్పది. మొదటి బహుమతి మాదే!” అని రహీమ్ గట్టిగా అన్నాడు.

మాటా మాటా పెరిగి ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. అది గమనించిన ఆదిత్య వర్మ వెంటనే అక్కడికి వచ్చాడు. వారిని మందలించబోతుండగా, వెనుకనుంచి పార్థసారథి గారి మృదుస్వరం వినిపించింది.

“ఆదిత్యా.. వారిని ఆపకు.”

అందరూ ఆశ్చర్యంగా గురువుగారి వైపు చూశారు. ఆయన ఇద్దరు బాలుర దగ్గరకు వెళ్లి, వారి భుజాలపై చేయి వేసి చిరునవ్వుతో అడిగారు.

మీరిద్దరూ పోట్లాడేది.. జెండా గొప్పదని నిరూపించడానికా?.. లేక మీరే గొప్పవాళ్లమని నిరూపించడానికా?” ఇద్దరూ తలవంచారు.

బాబులూ.. ఈ త్రివర్ణ పతాకానికి మూడు రంగులు ఉన్నాయి. ఎప్పుడైనా కాషాయం ‘నేనే గొప్ప’ అని తెలుపుతో పోట్లాడిందా? ఆకుపచ్చను దూరం చేసిందా? మూడు రంగులు కలిసినప్పుడే అది భారత జాతీయ పతాకమవుతుంది. విడిపోతే.. అది కేవలం మూడు రంగుల వస్త్రమే.

ఆ మాటలు విన్న రామ్, రహీమ్ మౌనంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డ అర్జున్, ఆయేషా కళ్లలో పాత జ్ఞాపకాలు మెదిలాయి.

“గుర్తుందా?” అని ఆయిషా మెల్లగా అడిగింది.

“ఎలా మర్చిపోగలను?” అన్నాడు అర్జున్.

“మన పెళ్లిని వ్యతిరేకించిన వాళ్లందరికీ గురువుగారు చెప్పిన మాట ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తూనే ఉంది, ‘ప్రేమకు మతం లేదు.. దేశానికి పిల్లలు మాత్రమే ఉంటారు.’”

ఆదిత్య వర్మ కళ్లలో గౌరవం మరింత పెరిగింది. వేదికపైకి వచ్చి గురువుగారి చేతులను పట్టుకుని ఇలా అన్నాడు.

“గురువుగారూ.. ఈరోజు ఈ మహా విద్యాలయంలో మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే గొప్ప గురువులు మీరు కాగా, మేమంతా మీ శిష్యులం, మీ ముందర నిలబడటమే మాకు గౌరవం.”

పార్థసారథి గారు చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వులో తృప్తి , వినయం, భవిష్యత్తుపై నమ్మకం భారత భారతి త్రివర్ణ పతాకంలా మెరిసిపోతుంది. ఆయన మెల్లగా ఆదిత్య భుజంపై చేయి వేసి ఇలా అన్నారు.

“ఆదిత్యా!.. గురువు చేతిలో వెలిగిన దీపం, శిష్యుడి చేతితోనే ప్రపంచాన్ని వెలిగించాలి. మా తరం తన బాధ్యతను నెరవేర్చింది. ఇక ఈ జెండా గౌరవాన్ని, ఈ దేశ భవిష్యత్తును మీ తరం భుజాలపై మోసుకెళ్లాలి..” అని చెప్పి పతాక తాడును అతని చేతిలో ఉంచారు.

“లేదు గురువుగారూ.. ఈ గౌరవం మీదే..” అంటూ ఆదిత్య వెనక్కి తగ్గాడు. పార్థసారథి గారు చిరునవ్వుతో తల ఊపారు.

“కాదు నాయనా.. మేము మీకు విద్య ఇచ్చాం. మా పెద్దలు మాకు స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యానికి అర్థం చెప్పేది, దాన్ని కాపాడేది మీ తరం. అందుకే.. ఈ పతాకాన్ని నువ్వే ఆవిష్కరించాలి.”

అంతలో ఆయన తన పక్కనే నిలబడి ఉన్న చిన్న మనవడిని పిలిచారు.

“రా బంగారం.. ఈ తాడు నువ్వూ పట్టుకో.”

చిన్నారి అమాయకంగా ఆదిత్య చేతిని పట్టుకున్నాడు.

ఒకవైపు గత తరం.. మరోవైపు వర్తమానం.. వారి మధ్యలో భవిష్యత్తు..

ముగ్గురి చేతులు ఒకే తాడును తాకాయి.

పతాకం నెమ్మదిగా పైకెగసింది.

త్రివర్ణ పతాకం ఆకాశంలో రెపరెపలాడింది.

పూలవర్షం కురిసింది.

“జనగణమన..”

జాతీయ గీతం పాఠశాల ఆవరణను నింపేసింది.

జాతీయ గీతం ముగిసిన తర్వాత పార్థసారథి గారు మైకు ముందుకు వచ్చారు.

“పిల్లలూ!.. ఈ జెండా ఒక వస్త్రం కాదు.. ఇది కోట్లాది భారతీయుల ఆశలతో నేసిన ఆత్మగౌరవం. ఈ త్రివర్ణ పతాకానికి రూపం ఇచ్చిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆయన గీసింది కేవలం జెండా కాదు.. భారతాత్మకు ఒక రూపం.

ఈ జెండా కోసం మహాత్మా గాంధీ నడిచారు.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సమానత్వానికి రాజ్యాంగాన్ని అందించారు.. భగత్ సింగ్ నవ్వుతూ ఉరికంబం ఎక్కాడు.. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టి పోరాడింది.. అల్లూరి సీతారామరాజు అడవుల్లో స్వేచ్ఛా జ్యోతి వెలిగించాడు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర జ్వాలను రగిలించాడు.. వాళ్లు ఒక్క మాట కోసం జీవించారు.. భారతదేశం!

స్వాతంత్ర్యం వచ్చి నేటికి 80 సం.లు. ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నాం,కానీ మన హృదయాలు ఒకదానికొకటి దూరమైతే, ఆ అభివృద్ధికి అర్థమేంటి? చరిత్రలో మన మధ్య ఉన్న విభేదాలను విదేశీ పాలకులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. ఇకపై అలాంటి విభేదాలకు మనమే కారణం కాకూడదు.

రామ్.. రహీమ్.. ఇక్కడికి రండి.”

ఇద్దరూ ముందుకు వచ్చారు.

“ఇప్పుడు చెప్పండి.. మీ ఇద్దరిలో ఎవరి జెండా గొప్పది?”ఇద్దరూ ఒకేసారి తల ఊపారు.

“గురువుగారూ.. జెండా ఒక్కటే.. భారత్ ఒక్కటే. మేమూ ఒక్కటే.”

అని చెప్పి ఇద్దరూ కౌగిలించుకున్నారు. అర్జున్ ఆయేషా పిల్లలు కూడా వారి చేతులు పట్టుకున్నారు. ఆ క్షణంలో అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఎవరో మృదువుగా మాట్లాడుతున్నట్టు తమ అంతర్వాణి ధ్వనించింది .

“నా బిడ్డలారా.. మీ పెద్దలు నాకు స్వేచ్ఛను ఇచ్చారు.ఇప్పుడు మీరు నాకు ఐక్యతను ఇవ్వండి. ద్వేషం నుంచి స్వాతంత్ర్యం.. మత విద్వేషం నుంచి స్వాతంత్ర్యం.. కుల అహంకారం నుంచి స్వాతంత్ర్యం.. ఇవన్నీ సాధించిన రోజే నేను నిజంగా స్వతంత్ర భారతమాతను అవుతాను. మీ పిల్లలకు బంగారు భారత్‌ను కూడా వారసత్వంగా ఇవ్వండి. అదే.. మీరు నాకు చేసే నిజమైన సెల్యూట్.”

ఆకాశంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భూమిపై హృదయాలు ఒక్కటవుతున్నాయి. పార్థసారధి గారి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. పూర్వ విద్యార్థులందరూ సెల్యూట్ చేశారు. అప్పుడే మెల్లగా వీచిన గాలి, త్రివర్ణ పతాకాన్ని మరింత గర్వంగా రెపరెప లాడించింది. ఆకాశం నుంచి జారిపడిన కొన్ని పూలరేకులు అక్కడ నిలిచిన వారిపై సుతిమెత్తగా రాలాయి. అవి భారతమాత హర్షించి కురిపించిన ఆశీర్వచనాల్లా అనిపించాయి.

ఆ రోజు సెల్యూట్ అందింది కేవలం జాతీయ పతాకానికే కాదు..

భారత జాతి మనస్సాక్షికి.

Exit mobile version