[బానోత్ అనిల్ కుమార్ గారు రచించిన ‘సమాజం లోని సకలాంశాలను చిత్రిస్తున్న తెలంగాణ కథ – సంక్షిప్త పరిచయం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
తెలంగాణ కథ నిబద్ధత కన్న నిమగ్నతకు పెద్దపీట వేసింది. స్వియానుభవాలను, ఉద్యమావసరాలను, ఉద్యమాలలో తమ అనుభవాలను రచయితలు కథలుగా మలిచారు. తెలంగాణ కథా రచయితలు అన్ని సమస్యలను తమ కథలలో చిత్రించారు.
గరిశకుర్తి రాజేంద్ర వచన గేయం, కవిత, నాటిక వంటి ప్రక్రియలలో రచనలు చేసినా ఆయన ప్రధానంగా కథా రచయిత. మూడు కథా సంపుటాలను వెలువరించారు. మొదటిది ‘పండుగ కథలు’, రెండోది ‘ఇంట గెలిచి’, మూడోది ‘అమ్మ మనసు’.
2000 సంవత్సరంలో వచ్చిన ‘పండుగ కథలు’ రాజేంద్ర తొలి ప్రయోగం. అందులో కథలు చిన్నవే, కానీ సందేశం, ప్రయోజనంలో పెద్దవి. పోస్టల్ ఉద్యోగిగా ఆయన చూసిన, ఎదుర్కొన్న అనుభవాలు కథలుగా మలిచినారు. సందర్భోచితంగా తెలుగు పండుగలు, ఆ సందర్భంగా పల్లెల్లో వెల్లివిరిసే ఆనందాలు చక్కగా వర్ణించారు. ‘ఇంట గెలిచి’ లో కథటి మొదటి దానికంటే పరిణత స్థాయినందుకున్నాయని చెప్పవచ్చు. ఇందులోని 16 కథల్లో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉన్నాయి.
ఇందులోని మొదటి కథ ‘పది రూపాయల నోటు’. పెద్దలు తమ కొడుకు, పిల్లల్ని, బిడ్డ పిల్లల్ని సమానంగా చూడాలని చెబుతుంది. ‘మబ్బు వీడింది’ కథ 2002 లో ఆంధ్రప్రభలో అచ్చయ్యింది. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అనుమానపు పొరలు ఆవరించడం, వరుసకు బాబాయి అయ్యే పెద్దాయన అందుకు కారకుడైన పోకిరీకి బుద్ధి చెప్పి ఆ పొరల్ని తొలగించడం ఇందులోని వస్తువు. విషయమేమిటో తెలుసుకోకుండా భార్యను అనుమానించడం తగదని ఈ కథ తెలుపుతుంది. అలాగే ఒంటరైపోతున్న కుటుంబవ్యవస్థలోని పెద్దల అవసరాన్ని చాటుతుంది. ఈ సంకలనం లో ‘బాబోయ్ తెలుగు కవి సమ్మేళనం’ హాస్య వ్యంగ్యకథ. ఇప్పటి కవులు రాసింది కక్కి వెళ్ళిపోవటం తప్ప ఎదుటివారి కవిత్వం వినరనే సత్యాన్ని దెప్పి పొడుస్తుంది.
‘హుమాయున్’ ప్రధానంగా కథారచయిత. ఆయన కవి, నటుడు కూడా. లఘు చిత్రాల ద్వారా ప్రతిభావంతుడైన కళాకారునిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మొదటి కథ ‘తోడు బతుకమ్మ’. 2011లో నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ప్రచురించబడింది. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద బతుకమ్మకు తోడుగా ఒక చిన్న బతుకమ్మను పేర్చడం మన సంప్రదాయం. దానిని అక్కాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి అన్వయించి అల్లిన కథ ఇది. పసి పిల్లలున్న అక్క చనిపోతే ఆ పిల్లల కోసం అక్క స్థానాన్ని చెల్లెలు పూరించడం ఇందులోని ఇతివృత్తం. ఇతివృత్తానికి హృద్యమైన మానవ సంబంధాలను, సున్నితత్వాన్ని జోడించి కథ అల్లిన తీరు ఎంతో బాగుంది.
ఆయన మరో కథ ‘పచ్చశీర’. రియల్ ఎస్టేట్ దందాల నేపథ్యంలో రాసింది. పట్టణ శివారుకు దూరంగా ఉన్న పంట భూముల్ని కూడా రియల్టర్లు వెంచర్లు చేసి ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములను రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు కొంటున్నారు. అక్కడ పంట పండకుండా, ఇండ్లూ కట్టకుండా ఏండ్ల తరబడి పడావుగా మిగిలిపోతున్నాయి. దాంతో సమాజానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన రైతులు ఆ భూములను దున్నుకోడం ఈ కథలోని సారాంశం. భూమికి రైతుతో ఉన్న అనుబంధాన్ని వినూత్నంగా ఈ కథ ఆవిష్కరించింది. పంటను భూమికి పచ్చశీరగా వర్ణించిన కథ ఇది.
అలాగే సంఘీర్ రచించిన ‘పంచుకునే మనసుంటేనే’ కథలో మనస్పర్ధలతో ఇద్దరు స్నేహితురాళ్ళు విడిపోవడం వస్తువు. కాలక్రమంలో తెచ్చిపెట్టుకున్న ఇగోలతో చిన్నప్పటి ఆత్మీయతలు కోల్పోయి అగాధం పెంచుకోవడం ఇందులో చిత్రించబడింది. జీవిత విలువలను గుర్తు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తుంది ఈ కథ. ‘నమితామిత కామితము’ ప్రేమోన్మాదుల ఆసిడ్ దాడుల నేపద్యంలో రాసిన కథ. ‘సారకుక్క’ మనిషికి కుక్కకు ఏర్పడ్డ అవినాభావ సంబంధాన్ని ఆవిష్కరించింది.
బి.మురళీధర్ సగటు మనిషి బతుకు చిత్రాన్ని హృద్యంగా మలిచే నేర్పుగల రచయిత. ఇతని కథలన్నీ దాదాపు బహుమతులు పొందాయి. ఆదిలాబాద్ జిల్లాలో అటు గిరిజనుల జీవితాన్ని, ఇటు మైదాన ప్రాంతం మధ్య తరగతి జీవితాన్ని మనసును కదిలించే కథలుగా రాశాడు. సమాజంలోని అంతరాలను వాటిని పరిరక్షించుకునే దోపిడి వర్గ స్వభావాన్ని కథల రూపంలో మలిచాడు.
మురళీధర్ రాసిన మొదటి కథ ‘అడవిపువ్వు’. తరువాత భూదేవి, మౌనం ఎరుపు, పులివేట, కొత్త నిర్వచనం, దశమి, దేవుడు కనిపించుట లేదు, నెమలి నార, సద్దుల బండ, దిష్టిబొమ్మ, అమ్మ కదా భరిస్తుంది, శివ, అందమైన ప్రయాణం మొదలైన సుమారు ఇరవై కథలు రాశాడు. ఈ కథలను ‘నెమలి నార’ పేరుతో 2016 లో సంపుటిగా తీసుకొచ్చాడు. మొదటి కథతోనే ఇతడు దృశ్యాన్ని కళాత్మకంగా మలిచే అక్షర చిత్రకారుడని నిరూపించుకున్నాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలలో నేటికీ విద్యావ్యవస్థ మూడు కాళ్ళపై నడుస్తున్నది అనుకుంటారు. గిరిజనులంటే అడవిని నమ్ముకొని బ్రతికే వారని వాళ్ళ నమ్మకాలు, సంస్కృతులలోనే సంతృప్తిని పొందుతారని అభివృద్ధి, చదువుకు దూరంగా ఉంటారనే అపోహ బలంగా ఉన్నది.
గిరిజనులు అభివృద్ధి కోరుకుంటారని అడవి పువ్వు లోని ఉపాధ్యాయుని తీరుంటే చిన్ను లాంటి రత్నాలను తయారు చేయొచ్చని ఈ కథలో తెలియజేశాడు. కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డాక ఇంటిని యజమాని నడుపుతాడు లేదా యజమానురాలు నడుపుతుంది కానీ ఒక పక్షి జాతికి చెందిన కోడి పోషిస్తుందని ఇటువంటి భయంకరమైన బతుకుల్ని ఈడుస్తున్న వాళ్ళున్న సమాజమని రచయిత వ్యంగ్యంగా ఈ కథ ద్వారా తెలియజేశాడు. కోడి పెట్టిన గుడ్డును అమ్ముకుని ఏరోజుకారోజు నూకలు తిని బ్రతికే ఒక నిరాధార తల్లి దయనీయమైన బ్రతుకుని, బాధగా మలిచిన తీరు గొప్పది.
ఏనుగు, ఎద్దు, ఆబోతు ఎన్నో పెద్ద జంతువులున్నా పులి లాంటి చిన్నదానికి భయపడటంలో అసలు అర్థం పులికి పంజా ఉంటుంది. అది ఎంత పెద్ద జంతువునైనా చంపగలదు. అదేవిధంగా రాజ్యం, దాని ఆయుధబలం వాటికి మించి ఆధిపత్య అహంకారం అంత బలమైనవని, దోపిడి వర్గం పులి లాంటిదని చిత్రిస్తాడు రచయిత.
ప్రపంచీకరణ వల్ల గ్రామాలు, కుటుంబాలు, పర్యావరణం ఎంతగా ధ్వంసమై పోతున్నాయో చెప్పే కథ ‘నెమలినార’. ఇందులో గ్రామీణ వినోదమైన యక్షగానం (నాటకం) నెమలినార చెట్టును కాపాడుకునే తండ్లాటలో పల్లెటూరి మనిషి ద్వారా చూపించాడు రచయిత.
పట్టణీకరణ వల్ల పల్లెలు మాయమై పోతున్న గడ్డు పరిస్థితిలో పంట పొలాలన్నీ పట్నం కోరల్లో చికుకొని పెద్ద పెద్ద భవనాలు వెలియడం, రేపటి తరానికి పంటను, మట్టిని కంప్యూటర్ లో చూపించేకాలం దాపురిస్తుందని రచయిత భవిష్యదర్శనం చేయించాడు.
‘మా అడవి మాకియ్యుండ్రి’ అనే కథలో రచయిత ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల డొల్లతనాన్ని బయటపెట్టాడు. ఏమిచ్చినా మాకొద్దు మా అడవి మాకియ్యుండ్రి అని గిరిజనులంటే అదొక్కటి తప్ప ఏదైనా అడగండి అన్న ధోరణిలో ప్రభుత్వ యంత్రాంగమున్నదని రచయిత నర్మగర్భంగా చిత్రించాడు.
ఇట్లా సమాజంలోని అమానవీయతను ఎత్తి చూపే అక్షర ప్రయత్నమే ఈ కథలు. మైదాన, గిరిజన జన జీవితాన్ని తనదైన శైలిలో కథలుగా మలిచిన మురళీధర్ దృక్పథం, దృష్టి కోణం గాకుండా మానవీయతే అతని అసలైన కతాంతరంగం. ‘నెమలినార’ కు ‘తానా’ వారి ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ‘అడవిపువ్వు’, ‘పులివేట’, ‘భూదేవి’, కొత్త నిర్వచనానికి విపుల మాస పత్రిక ప్రోత్సాహక బహుమతులు వచ్చాయి. రేడియోలో ‘సవారి బంగ్ల ముచ్చట్లు’ ధారావాహికగా ప్రసారమయ్యాయి.
విప్లవోద్యమ ప్రభావంతో ‘పాలు’ కథా సంకలనం వెలువరించిన బి.ఎస్. రాములు తెలంగాణ పల్లె ప్రాంతంలోని సామాజిక పరిణామ దశను, వివిధ పోరాటాల నేపథ్యంలో సంభవించిన సామాజిక మార్పుల ఫలితమైన మానవ సంబంధాలను తన కథల్లో చిత్రిస్తున్నారు. ‘వారసత్వం’ వంటి కథలు ఆయన రాజకీయ పోరాటాల ఫలితాలను బహుజన, దళిత దృక్కోణం నుంచి చిత్రించే ప్రయత్నం చేస్తాయి. వస్తువు శిల్పాన్ని నిర్ణయిస్తుందని నమ్మి తెలంగాణ యాసలో, భాషలో పోరాట కథలను రాసిన అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల్లో శిల్ప పరమైన మార్పును చూస్తాం. విప్లవోద్యమ నేపథ్యంలో సంభవించిన సామాజిక మార్పులు మధ్యతరగతిపై చూపిన ప్రభావాలను, తెలంగాణలో చోటుచేసుకున్న మానవ జీవిత విధ్వంసాలను, ఫ్యూడల్ వ్యవస్థ అంతరించిపోవడం వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను వారు తమ కథలో చిత్రణ చేశారు. అల్లం రాజయ్య ‘మధ్యవర్తులు’, ‘మహదేవునికల’, ‘అతడు’, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘జాడ’, ‘చావు విందు’ ఇందుకు ఉదాహరణలు.
విప్లవోద్యమ సాహిత్యం వన్నెతెరిగిన తర్వాత కాలువ మల్లయ్య తెలంగాణ గ్రామీణ జీవితాలను, సామాజిక సంబంధాలను, సామాజిక పరిణామ క్రమాన్ని తన కథల్లో చిత్రిస్తూ వస్తున్నారు. ఆయన పుంఖానుపుంఖంగా కథలు రాస్తూ ‘కథల మల్లయ్య’గా ప్రసిద్ధి చెందారు. బహుశా, తెలంగాణ లోని ఏ అంశం కూడా ఆయన కథల నుంచి తప్పించుకుని పోవడం లేదని నిర్ధారణగా చెప్పవచ్చు.
తెలంగాణ గ్రామీణ విధ్వంసాలను, ప్రపంచీకరణ నేపథ్యం గల సామాజిక జీవనంలో వస్తున్న మార్పులను, వృత్తుల విధ్వంసాన్ని, ఊళ్ళు వల్లకాడులు కావడం వంటి బీభత్స వాతావరణాన్ని తెలంగాణ కథారచయితలు సమర్థవంతంగా రాస్తున్నారు. తెలిదేవర భానుమూర్తి, పెద్దింటి అశోక్ కుమార్, కె.వి. నరేందర్, ఎలికట్టె శంకర్ రావు లాంటి తెలంగాణ రచయితలు విస్తృతంగా రాస్తున్నారు. రైతాంగ సంక్షోభాన్ని ప్రపంచీకరణ నేపథ్యంలో బలంగా చిత్రించిన కథలు వచ్చాయి. శ్రీధర్ దేశ్ పాండే, బోదనం నర్సిరెడ్డి లాంటి రచయితలు ఇందుకు ప్రామాణికంగా నిలుస్తారు.
ముదిగంటి సుజాతారెడ్డి ‘జహంగీర్ బీ’, మహమ్మద్ నిసార్ ‘వతన్’ కథలు విలక్షణమైనవి. ముస్లిం సమాజం పట్ల నేటి ఆపాదిత ముద్రల భయానక వాతావరణాన్ని ఈ కథలు చిత్రిస్తాయి. జహంగీర్ బీ కథ రెండు విభిన్న మతాల స్త్రీల జీవితాలను సమాంతరంగా చిత్రిస్తూ, ఆ జీవితాల్లోని వైరుధ్యాలను రూపుకడుతుంది. ముస్లిం సమాజంలోని అంతర్గత సమస్యలను, అదనంగా మెజారిటీ మతప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకవర్గం వేస్తున్న ముద్రల వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్న దుఃఖాన్ని ఈ కథ మన కళ్ల ముందుంచుతుంది. ముస్లింగా పుట్టడమే నేరమై చిక్కుల్లో పడుతున్న సామాజిక నేపథ్యాన్ని సుజాతారెడ్డి ఈ కథలో సమర్థవంతంగా చిత్రించారు. వారికి చేయూత అందించాల్సిన అవసరాన్ని తెలియజేయడం ఈ కథ సాధించిన అదనపు ప్రయోజనం.
నిసార్ రాసిన ‘వతన్’ కథలో ముస్లిం, హిందూ ప్రజల సహజీవనాన్ని పీర్ల పండుగ నేపథ్యంగా చిత్రీకరిస్తూనే, నిజాం జమానాలో ముస్లింలందరూ ద్రోహ పాత్ర పోషించలేదనే విషయాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఈ కథ చిత్రిస్తుంది. ఇది సామాజిక చారిత్రక కథ.
గన్ను కృష్ణమూర్తి రాసిన తపస్సు కథా సంపుటి 2010 లో వచ్చింది. అందులో 27 కథలున్నాయి. ఈ కథల్లో ఆయన హాస్యం, వ్యంగ్యం మేళవించి సామాజిక సమస్యలు చర్చించారు. ఇవి జీవితపు లోతులు సామాజిక స్థితిగతులకు అద్దం పట్టేలా ఉన్నాయి.
అందులో మొదటి కథ ‘తపస్సు’. దయాహృదయం గల ఒక యువకుడు లోకోపకారం కోసం ఒంటి మీది బట్టలు కూడా త్యాగం చేస్తాడు. ప్రశాంత్ అనే ఆ యువకుడిని దొంగగా అనుమానించి పోలీస్ స్టేషన్లో బంధించి హింసించడం ‘తపస్సు’ కథ లోని ఇతివృత్తం. నిజాయితీగా నడుచుకునే వారిని సమాజం హింసిస్తుందనే సందేశం ఈ కథలో ఉంది. కాలేజీ సమ్మె నేపథ్యంలో రాసిన కథ సమ్మె. చిన్న కారణంతో విద్యార్థులు చేసిన సమ్మె బజారులో ఉన్న పసిపాప ప్రాణాలు బలి తీసుకునేలా పరిణమించడం ఈ కథలోని వస్తువు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల కష్టాలు చిత్రిస్తూ రాసిన కథ ‘చీపురు కట్ట’. కార్లు తుడిచే బాల కార్మికుడు ఆక్సిడెంటులో గాయపడి కార్లో ఆస్పత్రికి తరలిస్తుంటే ‘నేను కారెక్కాను’ అని మురిసిపోయే కథ ‘తీరిన కోరిక’. ఆధునిక మానవుడు అభివృద్ధిలో అంతరిక్షం వైపు దూసుకుపోతుంటే నైతికంగా పతనమవుతున్న దుస్థితిని వర్ణించిన కథ ‘సామాన్యుని స్వగతం’.
ఇలా తెలంగాణ కథా రచయుతలు సకలాంశాలను ప్రతిబింబించే కథా రచన చేస్తూ తెలుగు కథా సాహిత్య పరిపూర్ణతలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.
ఉపయుక్త గ్రంథాలు:
1) ఈ వ్యాసంలో ఉదాహరించిన ఆయా రచయితల కథా సంపుటాలు
2) వికీపీడియా
