Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సమరాంధకారంలో శాంతి సుధారాగం

[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘సమరాంధకారంలో శాంతి సుధారాగం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

సమరాంధకార గర్భమున్ స్రవించు రుధిరధారలన్
సమధికమై సానుభూతి సుమములై సాంత్వనించగా।
వివేక దీప్తి వెలుగులో విరజిల్లున్ సత్యమార్గము
మనుజుని మానస మందిరం మధురమై మేల్కొనున్॥

శస్త్రగర్జన ఘోషలో శాంతి స్వరమున్ వినిపించునా?
రౌద్రవిహార తాండవం రమ్యమై శోభించునా?
పుడమితల్లి పరిదేవన పరితపించు వేళలో
కరుణారస గీతమై కలమిదే పలుకున్॥

కోటికోటి సంపదలన్ క్షణములో బూడిద చేయు
సమరవేగ దాహమున్ సజ్జనత్వం నిలుపునా?
విజ్ఞానవివేకమున్ వెలుగులు విరజిమ్మగా
లోకమున్ మానవత్వమే లోకధర్మమగున్॥

దైవాంశసంభూతుడై జనించిన మనుజుడు
స్నేహసుగంధ బంధములన్ నిలుపుటే శోభనము।
సహనసీమ దాటక సజ్జనహృదయమై
జీవవేదన గ్రహించుటే జీవన సౌందర్యము॥

గీతామృత బోధమున్ గంభీరమై గ్రహించగా
ప్రేమపథ పరిమళము ప్రపంచమున్ వ్యాపించున్।
సమరాంధకార రాత్రిలో సత్యదీప్తి జ్వలించగా
శాంతి సుధారాగమై అక్షరమున్ నిలుచున్॥

Exit mobile version