Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంబరాల రాంబాబు

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘సంబరాల రాంబాబు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రాంబాబు వనజకు పెదతల్లి కుమారుడు. తమ్ముడి వరస. ఆమె, నీరజ వాళ్ల అమ్మ, అక్క చెల్లెళ్ల పిల్లలు. ఒకే ఊళ్లో వుండడము, ఇళ్లు దగ్గరలో వుండడము వలన వాళ్ల మధ్య బంధుత్వంకంటే స్నేహమే బాగా పెరిగింది. వనజ వాళ్లు ఆరుగురు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఆమె పెద్దమ్మకు మరో ఇద్దరు అమ్మాయిలు ఎక్కువ. ఆ రోజుల్లో కుటుంబాలు పెద్దవి కదా! రాంబాబు కాక మరో అబ్బాయి కూడాను.

చిన్నప్పుటి నుండి రాంబాబు బాగా చురుకుగా వుండేవాడు. కబుర్ల పోగు. ఆటలు, స్నేహితులూ ఎక్కువ. చదువు మీద శ్రద్ధ పెద్దగా ఉండేదికాదు. సెలవు రోజుల్లో ఇల్లు పట్టకుండా తిరిగేవాడు. సాయంత్రానికి మాసిన బట్టతో, అలసిన రూపంతో ఇల్లు చేరేవాడు. స్కూల్లోనూ కబుర్లే.. ఆటల్లో ఉత్సాహంగా పొల్గొనే వాడు. స్కూలు పోటీలే కాక, వూళ్లో ఇతర స్కూళ్లతో జరిగేవి, జిల్లా స్థాయి పోటీల్లో కూడా పాల్గొని బహుమతులు, ట్రోఫీలు నెగ్గేవాడు.

ఇంటికి వచ్చిన వారితో సరదాగా కబుర్లు చెప్పేవాడు. కొత్త లేకుండా చలాకీగా మాట్లాడేవాడు. అందుకని.. అందరికీ వాడంటే ఇష్టంగా వుండేది. వనజ పెద్దమ్మకు, ఆడపిల్లలకు, నచ్చేది కాదు. వచ్చిన వాళ్లు వెళ్లి పోయేక అందరూ రాంబాబును మందలించేవారు. “నేనేం తప్పు చేసేను. వాళ్లు కూడ నాతో ఆనందంగా మాట్లాడేరు కదా, మీరే ఇలా తిట్టి పోస్తున్నారు” అనేవాడు.

వాళ్ల అమ్మతో వాదనకు దిగేవాడు. ఆమెకు నచ్చేది కాదు.

వనజా మేనత్త గారి అబ్బాయి ఓ మందుల కంపెనీకి రిప్రసెంటేటివ్‌గా పని చేసేవారు. డాక్టర్లను కలవడానికి వచ్చినపుడు వనజ ఇంట్లో మకాం, కానీ పెద్దమ్మ ఇంటికి గారంటీగా వెళ్లేవాడు. పెద్దనాన్న గారు డాక్టరు కూడాను.

‘ఏం బావా, ఫామిలీతో పాటు వచ్చేవా” అని రాంబాబు అడిగేవాడు. నవ్వు వచ్చేది, కానీ వాడి చొరవకు సంతోషంగా ఉండేది.

కష్టపడి ఆ రోజుల్లో S.S.L.C. (ఇప్పుడు 11వ తరగతి) పరీక్ష నెగ్గేడు, అయినా ఇప్పటి కాలంలో లాగా అప్పుడు మార్కులు ‘పోసే’ వారు కాదు కదా. P.U.C (pre University Course) లో చేరడానికి లెక్కల గ్రూపులో సీట్ రాలేదు. రెండో ఎంపిక Bi.P.C (సైన్సు) గ్రూపు లో వచ్చింది. అందులో చేరేడు. బాగానే చదివేడు. 55 శాతం మార్కులతో పరీక్ష నెగ్గేడు.

అదే సంవత్సరం వాళ్ల వూళ్లో మెడికల్ కాలేజీ వచ్చింది. కేవలం ఏడు వేలు డోనేషన్ కడితే సీటు ఇస్తామన్నారు. రాంబాబు నాన్న డాక్టర్. విశేషించి ప్రైవేట్ ప్రాక్టీస్ బాగా ఉండేది. ఏడు వేల రూపాయలు నిజానికి అంత భారం కాదు. కానీ పెద్దమ్మ – సవేమిరా వల్లకాదు అని రూలింగ్ ఇచ్చింది. “మన ఇంటా వంటా లేదు. మంచిగా చదవాలి, మార్కులు తెచ్చుకొని సీటు సంపాయించుకోవాలి. అంతే కాని డబ్బులతో కొన్న చదువూ ఓ చదువేనా, రేపు డాక్టరుగా ఎందుకూ పనికి రాడు” అని ఢంకా బజాయించి చెప్పింది.

పాపం! రాంబాబు ముఖం చిన్నబోయింది. ఎలాగో తప్పనిసరి గనుక B.Sc లో చేరేడు. పెద్దనాన్న వైపు వాళ్లంతా మంచి పొడుగు. రాంబాబు చురుగ్గా ఎదిగాడు. ఆరడుగుల ఎత్తు రమారమి ఉండేవాడు. తెలిసిన స్నేహితులు apply చేస్తుంటే తను కూడా వాళ్ళతో ఆర్మీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసేడు. దగ్గరగా విశాఖపట్నంలో ఇంటర్వ్యూకి రమ్మన్నారు. వెళ్లేడు. అందులో సెలెక్టు అయేడు. మరో ఇద్దరు చిన్ననాటి స్నేహితులకు కూడ ఉద్యోగాలు వచ్చాయి. పెద్దమ్మతోనూ, పెదనాన్నతోనూ చెప్పి ఆర్మీలో చేరిపోయేడు. మంచి భోజనం, army drills, కొండలు ఎక్కడము, పరుగులు, విన్యాసాలు, అందరితో అరమరికలు లేకుండా హాయిగా రోజులు గడిచేవి. వాడికి సంబరమే సంబరము. ఒక ఏడాది తర్వాత శెలవు ఇచ్చేరు. అప్పుడు ఇంటికి వచ్చేడు.

వనజకు మొదటి నుండీ రాంబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇన్నాళ్లకు ఇంటికి వచ్చేడని తెలిసి చూడాలని పరుగున వెళ్లింది. అక్కడ దొడ్డమ్మ ఇంట్లో పిల్లవాడు ఇంటికి వచ్చేడు కదాని ఆప్యాయంగా పలకరించడము, నవ్వులు,కేరింతలు, కోలాహలం – ఏమీ లేవు!

“మాకేం తెచ్చావ్? తాళాలు తెరు” అంటూ పెట్టెల దగ్గర కూర్చున్నారు. రాంబాబు వాళ్ళ కోసం తనకు తోచినట్టు ఏవో గొలుసులు, లాకెట్లు, బొమ్మలు, చీరలు తెచ్చాడు. వాళ్లు మాత్రం, “ఛీ ఇంతేనా? వీటి విలువెంత? ఆర్మీలో నీకు ఖర్చేం ఉండదుగా? అంతా మిగులే! ఇంటికి వస్తూ అక్కలకు తెచ్చేది ఈ చెత్తవా? ఇంతకూ డబ్బులు ఎంత తెచ్చావురా? ఇలా పడేయ్. మేమే మాకు నచ్చినవేవో కొనుక్కుంటాం. ఎవరైనా అడిగితే పరువు పోకుండా ఉంటుంది” అన్నారు. రాంబాబు పెద్దగా డబ్బులు ఏమీ తేలేదు. వాడు ఇచ్చిన సొమ్ము వాళ్ళ కంటికి అనలేదు కూడా! వాళ్ల అసంతృప్తి, కోపం పెనవేసుకుని ముక్కు చీదుతూ కన్నీళ్లు కార్చడం వరకు వెళ్ళింది.

వాళ్ళమ్మ, ఆశ్చర్యంగా చూస్తూ ఊరుకుంది. కూతుళ్లను మందలించలేదు. ఇక తండ్రికి ప్రాక్టీసు తప్ప ఏమీ తెలియదు. పాపం! రాంబాబు బిక్క మొహం వేసుకుని కూర్చున్నాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు.

ఓ మూలకు పోయి కుర్చీలో కూలబడ్డాడు. ఇదంతా చూస్తున్న వనజకు మతిపోయింది. కాసేపు ఆగి రాంబాబు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా భుజం తట్టి, “ఎలా ఉన్నావు నాన్నా! ఎంత మారిపోయావు రా?! ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నావు అనుకుంటాను. హిందీ మన రాష్ట్ర భాష కదా మరి. అది కూడా వచ్చేసిందా? ఇంతకు నీ స్నేహితులు ఎవరైనా వచ్చారా? ఇవాళ సాయంత్రం అలా మా ఇంటికి రా!” అంటూ కాసేపు పలకరించి వచ్చింది. రాంబాబు సంతోషించాడు. ఆరోజు సాయంకాలం వనజ వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చున్నాడు.

మరో రెండేళ్లు ఆర్మీలో శిక్షణ ఇచ్చాక రాంబాబు చురుకుతనంతో సోల్జర్ కన్నా పై ర్యాంకులో ఆఫీసర్‌గా పోస్టింగ్ సంపాదించాడు. ఈలోగా అతని అక్కలకు పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ సమయాల్లో అప్పుడప్పుడు సెలవు మీద వచ్చి వెళుతూ ఉండేవాడు. తండ్రికి డబ్బు సాయం కూడా చేయగలిగాడు. పసిమిఛాయతో ఎదిగిన కొడుకుకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎందుకో దొడ్డమ్మకు కలిగినట్టుగా లేదు. వాడు పంపే డబ్బుల గురించే ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. రాంబాబు నోరు తెరిచి నాకు పెళ్లి చెయ్యండి అని అడగలేకపోయాడు. మగపిల్లాడు కదా!

పైగా, ఉత్తర భారత దేశంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్యోగం, అంత దూరం,ఆర్మీ ఉద్యోగం అంటూ ఆ రోజుల్లో పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చేవారు కాదు. మరో ఐదు ఏళ్ళు గడిచాయి.

వనజకు పెళ్లయింది. భర్త ఆ ఊళ్లోనే లాయరు. ఈసారి రాంబాబు తన భార్యతో సహా వచ్చాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఎత్తుగా, సన్నగా, అందంగా, ఉత్తరాది వారి అమ్మాయి. మన భాష రాదు. మన తిండి కాదు. మన ప్రాంతపు చీరకట్టు కూడా కాదు. ఆర్మీలో తన సీనియర్ ఆఫీసర్ గారి అమ్మాయట. ప్రేమ వివాహం. ఎవరికివారు సణుక్కున్నారు.గొణుక్కున్నారు.

రాంబాబు వనజ ఇంటికి తన భార్యను తీసుకుని వెళ్ళాడు. వనజ సంబరపడి ఆహ్వానించి కొత్త పెళ్లికూతురికి రాంబాబుకి బట్టలు పెట్టింది. వనజ దగ్గరే వాళ్ళకి కాస్త ఊరట కలిగింది.

కొన్నేళ్లు గడిచాయి. ఈ మధ్య రాంబాబు జాడలేదు. అప్పుడప్పుడు తలుచుకుని వనజ బాధపడుతూ ఉండేది. ఇంతలో పెదనాన్న కాలం చేశారు. అప్పుడు వచ్చాడు రాంబాబు. మరి వార్త ఎలా తెలిసిందో గానీ. చాలా మారిపోయాడు. వెనుకటి సంబరాల రాంబాబు కాదు మాటలు తగ్గాయి. మనుషుల్ని, పరిసరాలని గమనిస్తున్నాడు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం. అడిగితేనే సమాధానం చెప్పడం. అక్కలు దూరంగా ఉన్నారు. కానీ రాగలిగారు. 12వ రోజు కార్యక్రమాలు అయ్యాక రాంబాబు తిరుగు ప్రయాణమయ్యాడు.

“ఓసారి మా ఇంటికి రారా!”, అంటూ వనజ ఆప్యాయంగా పిలిచింది. వనజ పిల్లలతో కాసేపు ఆడుకున్నాడు. మాటల మధ్య తెలిసిన విషయం ఏంటంటే రాంబాబు భార్య వాడితో అనుకూలంగా లేదట. వాళ్లకు పిల్లలు కలగలేదట. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. వనజ ఎంతో కలత చెందింది. కన్నీరు కార్చింది.

గొప్ప విషయం ఒక్కటి వున్నది. తన వృత్తిలో మంచి నైపుణ్యాలు సంపాదించి, అంచెలంచెల ప్రమోషన్లతో Squadron Leader స్థాయికి చేరేడు రాంబాబు. వనజ రాంబాబును పరిశీలించింది.

ముఖం ఉబ్బింది. పొట్ట పెరిగింది. ఒంటరితనం, అందునా ఆర్మీ. మద్యపానానికి అలవాటు పడినట్టు ఉన్నాడు. అయ్యో అని బాధపడింది.

“రాంబాబు! నువ్వు ఒంటరి వాడివయ్యావురా! ఇంకా ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది? రిటైర్మెంట్ తీసేసుకుని మన ప్రాంతానికి వచ్చేయ్. మన ఊళ్లో మనం ఉంటాం. నాకు కళ్ళ ఎదుట నువ్వు ఉంటావు.”, అంటూ బతిమాలింది. ఒక్కసారిగా రాంబాబు చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.. “అక్కా! నువ్వే నాకు నిజమైన అక్కవు. నా మీద ప్రేమానురాగాలు, నా మంచి చెడులను గమనించడం. మా అమ్మ, అక్కలు కొంచెం ప్రేమ చూపించినా నా బతుకు వేరేలా ఉండేదేమో. ఉద్యోగంలో ఏమీ లోపం లేదు. సరేలే! గతాన్ని గురించి తలచి ఉపయోగం లేదు. అవును. నేనూ అనుకుంటున్నాను. ఇంకో రెండేళ్లలో రిటైర్మెంట్ తీసుకుంటాను. మన ఊరికే వచ్చేస్తాను. నువ్వు, బావగారు ఉన్నారుగా!” అన్నాడు.

వనజకు అప్పటికి ఒక పాప, బాబు ఉన్నారు. భర్త మంచి స్నేహశీలి. మేడ మీద ఒక హాలు, పడకగది. సకల సదుపాయాలు ఉన్న పోర్షను రాంబాబుకు ఇచ్చారు. కాఫీ, టిఫిన్. భోజనాలు, కబుర్లు అన్నీ అక్క ఇంట్లోనే. రాత్రి పైకి వెళ్లి పడుకునేవాడు.

ఆరు నెలలు గడిచాయి. మద్యం మానలేదు. ఆ అలవాటు మానడం అంత తేలిక కాదు కదా.

ఆరోజు తెల్లవారింది. రాంబాబు ఇంకా దిగి రాలేదు. చాలా సేపు చూసింది. వనజకు కంగారు పుట్టింది. మేడ మీదకి వెళ్లి తలుపు కొట్టింది. అలికిడి లేదు. వడ్రంగిని పిలిపించి బలవంతంగా తలుపులు తెరిపించారు.

రాంబాబు విగత జీవి. రాత్రి నిద్రాదేవి ఒడిలో శాశ్వతంగా కన్ను మూసాడన్నమాట.

పాపం రాంబాబు సంబరాల రాంబాబు కానీ అవన్నీ చిన్ననాటికే పరిమితం. ఉద్యోగంలో విజయాలు, తృప్తి. కానీ వ్యక్తిగతంగా చూస్తే సంతోషం జీరో.

Exit mobile version