[పాలస్తీనా కవయిత్రి లిసా సుహైర్ మజాజ్ (గాజా-2014) రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Lisa Suhair Majaj’s poem ‘Conversation’ (Gaza-2014) by Mrs. Geetanjali.]
~
సరే నాకో సంగతి చెప్పు..!
యుద్ధంలో గాజా పిల్లలు చనిపోతున్నప్పుడు..
లేదా వాళ్ళు చంపేస్తున్నప్పుడు నువ్వేం చేసావు?
ఏం చేసానా.. పిల్లల హంతకులతో వాళ్ళని చంపొధ్ధు అని వాదించాను..
ప్రాధేయ పడ్డాననుకో!
అలాగా.. నువ్వేం చెప్పావు వాళ్ళకి?
అమాయక పసిపిల్లలు..
మంచితనం.. ప్రేమ ఇవే వాళ్లకు కావాల్సింది.
పీడకలలు చేసే భయంకరమైన శబ్దం కంటే
చిన్నపాటి చిరునవ్వు చేసే సవ్వడే మంచిది కదా పసి పిల్లలకి..
యుద్దాన్ని ఆపలేమా.. చిరునవ్వులని ఇవ్వలేమా వీళ్ళకి?
హత్యకు ఉన్న ఖరీదు మరణించడానికంటే ఎక్కువ కదా అన్నాను వాళ్ళతో.
ఓహ్హో.. వాళ్ళు విన్నారా మరి?
భలే ఉన్నావు నువ్వు.. హంతకులెప్పుడైనా మాట వింటారా చెప్పు?
వాళ్ళ ఆయుధాలు.. డ్రోన్లు,. వాళ్ళ అహంకారపు అరుపులు
ఇవన్నీ బీభత్సంగా చేసే చప్పుళ్ళు వాళ్ళని చెవిటివాళ్లను చేశాయి.
అసలు వాళ్ళెందుకు కోపంగా ఉన్నారో కాస్త చెబుతావా?
వాళ్లకు సురక్షితంగా ఉండాలని ఉందట.
అంటే ఎవరి నుంచి రక్షణ కావాలట వాళ్ళకి.. పిల్లల నుంచా ?
లేదు వాళ్ళసలు గాజా లో పిల్లలే లేరని..
యువకులు మాత్రమే ఉన్నారని బుకాయిస్తున్నారు.
మరి… శిశువులసంగతేమైనా ఆలోచించారా వాళ్ళు?
ఎందుకు ఆలోచించరు చెప్పు?
వాళ్లేమన్నారంటే.. శిశువులు రేపు మమ్మల్ని కాటేసే విషప్పాములుగా పెరుగుతారు..
అందుకే శిశువుల్ని వాళ్ళ గూటిలోనే చంపేయడం మంచిదన్నారు .
మరి ఇక ఈ టీచర్లు, గాయకులు, కళాకారులు..
తండ్రులు..తల్లులు., వీళ్ళ సంగతేంటి?
వీళ్లంతా ఏమవుతారు?
అక్కడ.. గాజాలో ఉన్న వీళ్లంతా టెర్రరిస్టులే అన్నారు వాళ్ళు!
ఇక తల్లులంటారా.. వాళ్లంతా తమ పొట్టలో
చిన్న విషపు పాములను కనే వాళ్లే తప్ప మరేమీ కారు!
సరే.. వాళ్ళతో నువ్వు చేస్తున్న యుద్ధం ఏమైనా పనికొచ్చిందా మరి?
అయ్యో.. లేదు గాక లేదు!
నేను నా హృదయాన్ని., శ్వాసనీ రెంటినీ కోల్పోయాను.
నా మాటల్ని పోగోట్టుకున్నాను.
పోతే పోయింది..
కానీ నేను ఇలా ప్రశ్నించక పోతే.. ఎదురు తిరగక పోతే..
నా అంతరాత్మ నే కోల్పోయేవాడిని!
యుద్ధంలో.. ఎవరైనా పిల్లలు బతికారా?
బతకడం అంటే ఎలా.. భౌతికంగానా.. స్ఫూర్తిలోనా?
అవును.. ఏమో చెప్పలేను!
మరి ఒకటి చెప్పు..
మిగిలిన ఈ బతికి బట్ట కట్టిన పిల్లలు..
రేపు పెద్దయ్యాక ఏమవుతారంటావు?
ఏమవుతారు రేపు వీళ్లంతా పెరిగి..పెద్దగా అయ్యి ?
నీకా సందేహమే రాకూడదు!
కాస్త తల పైకెత్తి చూడు..
అవి నక్షత్రాలనుకుంటున్నావా.. కాదు .
అవి గాజా పిల్లల కళ్ళు
వాళ్ళ కళ్ళు రాత్రి పూట ఆకాశాన్ని రంధ్రాలు పడేటట్లు కాలుస్తాయి.
నువ్వు ఆకాశం వైపు చూసిన ప్రతిసారీ ఇది గుర్తుంచుకో!
అవి నువ్వు చూస్తున్న గాజా పిల్లల మండే కళ్ళు అని!
ప్రాణాలు దక్కిన మిగిలిన గాజా పిల్లలు ఏమవుతారంటావా?
వాళ్ళు.. రేపటి మండే అగ్నిగోళాలు అవుతారో లేదో నువ్వే చూడు!
~
మూలం: లిసా సుహైర్ మజాజ్
అనువాదం: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964