[శ్రీమతి దినవహి సత్యవతిగారు రచించిన ‘సంక్షిప్త రామాయణం మరియు సుందరకాండము’ అనే సప్తపదుల సంపుటిని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
తెలుగు సాహిత్యంలో నూతనత్వానికి, ప్రయోగశీలతకీ కొదవ లేదు. ముఖ్యంగా కవిత్వంలో వచ్చినన్ని నూతన ప్రక్రియలు ఇతర ప్రక్రియల్లో రాలేదనే చెప్పాలి. ఏప్రిల్ 2023 లో ప్రముఖ కవి, రచయిత శ్రీ సుధామ గారు సృజించిన ‘సప్తపదులు’ అనే కవితా ప్రక్రియ కవులను ఆకట్టుకుంది. విహారి గారు, శాంతమూర్తిగారి నిర్వహణలో కొన్నాళ్ళు తమ వాట్సప్ పత్రికలో సప్తపదుల ఫీచర్ నిర్వహించారు సుధామ. ఎంపిక చేసిన కొన్ని సప్తపదులను సంచికలోనూ ప్రచురించారు. ఈ ప్రక్రియ అనతి కాలంలోనే కవులలో అమిత ఆదరణ దక్కించుకుంది. అటువంటివారిలో శ్రీమతి దినవహి సత్యవతి గారు కూడా ఒకరు. అనేక సప్తపదులు వ్రాసిన తరువాత కలిగిన – సప్తపదుల ప్రక్రియలో సుందరకాండం వెలువరించాలన్న ఆలోచన కలిగింది సత్యవతిగారికి. శాంతమూర్తి గారి సూచనతో, సంక్షిప్త రామాయణం కూడా సప్తపదులలో వెలయించి, పుస్తక రూపంలో తెచ్చారు.
“లౌకికమైన రచనలు ఎన్ని చేసినా రామాయణం రచించడంలో గొప్ప పరమార్థం ఉందని సంభావించే ఉదాత్త కోవలోనే దినవహి సత్యవతి గారు సప్తపది ప్రక్రియలో ఈ రచన కావించడమే ఒక విశేషం” అని వ్యాఖ్యానించారు శ్రీ సుధామ తమ ముందుమాటలో.
“సప్తపదుల్లో రామాయణాన్ని ప్రయత్నించడం ఒక సాహసం” అన్నారు విహారి గారు తమ ముందుమాటలో. ఎందుకు సాహసమో వివరించారు. దినవహి సత్యవతిగారు వ్రాసి విజయం సాధించడం ఒక చారిత్రక విశేషం అని వ్యాఖ్యానించారు.
“లఘుకవితా ప్రక్రియలో గొప్ప కావ్యాన్ని వ్రాయడం ఇదే మొదటిది అనుకుంటున్నాను” అన్నారు శ్రీ శాంతమూర్తి గారు తమ ముందుమాటలో. సప్తపదుల లఘు కవితాప్రక్రియకు కావ్యగౌరవన్ని అందించిన సత్యవతిగారిని అభినందించారు.
~
బాలకాండలో ఉన్న సంక్షిప్త రామాయాణాన్ని సత్యవతి గారు 93 సప్తపదులలో అందించారు.
“ఆదికావ్యం,
మహాకావ్యం,
ఆధ్యాత్మికతకు సంస్కృతికి ఆలవాలం శ్రీమద్రామాయణం అమరకావ్యం”
అంటూ ప్రారంభించారు. ఆదికావ్యాన్ని తొలి సప్తపదిలోనే ప్రస్తావించడం ఎంతో ఔచితీమంతంగా ఉంది.
రాముడి జననాన్ని వర్ణిస్తూ,
“ఆదరణ
ఆచరణ
శ్రీమన్నారాయణుడు నరుడిగా, ఇక్ష్వాకు వంశమున శ్రీరాముడిగా అవతరణ!”
అని అన్నారు. ఇక్ష్వాకు వంశస్థులు తనని ఆరాధించినందుకు శ్రీమన్నారాయణుడు వారిని ఆదరించాడు. దేవతలను, ఋషిగణాలను హింసిస్తున్న రావణుని సంహరిస్తానని బ్రహ్మాదులకిచ్చిన వాగ్దానాన్ని ఆచారించాడు. ఫలితమే రాముడిగా మానవ జన్మ. శ్రీరామ జననానికి ముందరి పరిస్థితులను, ఆ నేపథ్యాన్ని ఏడు పదాలలో చక్కగా ఇమిడ్చారు కవయిత్రి.
విద్యాభ్యాసం ముగిసాకా, విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళడాన్ని, ఆ తదుపరి ఘట్టాలను ఈ విధంగా సప్తపదులలో వర్ణించారు.
“యాగరక్షణం,
అహల్యోద్ధరణం,
శివధనుర్భంగం, మిథిలాపుత్రి జానకితో రాముని పాణిగ్రహణం”
సప్తపదుల నియమాలలో ఒకటైన 1,2, 7వ పదాలు అంత్యానుప్రాసలుగా రావడం ఎంత సహజంగా అమరిందో!
కైకేయి కోరిక ప్రకారం వనవాసానికి బయల్దేరుతాడు రాముడు. సీత, లక్ష్మణుడు రాముని అనుసరిస్తారు. భరతుడు అన్నగారిని వెనక్కి రమ్మని బ్రతిమాలి విఫలుడై, అన్నగారి ఆదేశం మేరకు రాజ్యభారం చేపడతాడు.
“పాలన,
ఆజ్ఞాపాలన,
నందిగ్రామము నుండియే ఆరంభము, భరతుని రాజ్యపాలన” అంటారు కవయిత్రి.
వనవాసంలో మున్యాశ్రమాలను సందర్శించినప్పుడు వారి కోరికపై రాక్షసులను సంహరించబూనుకుంటాడు రాముడు.
“సహకారము,
అంగీకారము,
రక్కసులను సంహరించి, మునులకు చేసేను ఉపకారము”.
శూర్పణఖ రామ లక్ష్మణుల వద్దకు చేరిన విధానాన్ని
“ఈరిక,
కోరిక,
మోహావేశముతో, రామలక్ష్మణుల దరికి శూర్పణఖ చేరిక” అని చెప్పారు కవయిత్రి. ఈరిక అంటే మొలక. రాముని సౌందర్యం చూచినప్పుడు శూర్పణఖలో కలిగిన మోహపు మొలక.
ఇలా రామాయణంలోని ఒక్కో సన్నివేశాన్ని అలతి పదాలలో అద్భుతంగా వివరించారు సత్యవతి గారు.
రామ సుగ్రీవుల మైత్రి అనంతరం రాముడి శక్తిని సుగ్రీవుడు సందేహించగా, ఏడు చెట్లను ఒక్క బాణంతో కూల్చిన ఉదంతాన్ని
“వీరవిక్రముడు,
పరాక్రముడు,
సప్తతాళవృక్షములను ఒకే బాణముతో కూల్చెను శ్రీరాముడు” అని వర్ణించారు.
సీతాన్వేషణకు హనుమ లంకకు బయల్దేరడం, అశోకవనంలో చూసిన సందర్భాన్ని
“పయనము,
విచయనము,
అశోకవనములో హనుమకు లభించెను జానకి దర్శనము” అని సముచితంగా వర్ణించారు.
ఘోర యుద్ధానంతరం రావణుడు, ఇతర రాక్షసులు మరణించడాన్ని ఇలా చెప్పారు.
“క్రమణము,
రణము,
రామునిచే, వానరసేనచే, రావణాది రాక్షసుల మరణము”
అగ్నిపరీక్ష ముగిసి, సీతా సమేతుడై అయోధ్యానగరం చేరుకుని, పట్టాభిషిక్తుడై రాజ్యపాలనా భారం వహిస్తాడు రాముడు.
ఫలశ్రుతిగా,
“పాపనిష్కృతము,
పుణ్యనిష్ఠితము,
పరమపవిత్రము చదివినవారికి ముక్తిప్రదాయకము శ్రీరామచరితము” అంటూ ముగించారు.
~
సుందరకాండలోని 68 సర్గలను 322 సప్తపదులలో వెలయించారు సత్యవతిగారు. స్థాలీపులాక న్యాయంగా కొన్ని సప్తపదులను ప్రస్తావిస్తాను.
“కార్యనిరతుడు,
కర్తవ్యరతుడు,
ముద్రిక తోడ్కొని, జలధి లంఘించె కేసరిసుతుడు.”
దేవతల కోర్కె మేరకు తనను అడ్డగించిన సురసని గెల్చి హనుమ ముందుకు సాగడాన్ని కవయిత్రి ఇలా వర్ణించారు:
“బుద్ధిమంతుడు,
ధీమంతుడు,
జొచ్చినంత వేగముగా నోటి నుంచి బయల్వెడలె హనుమంతుడు”
లంకానగరంలో ప్రవేశించి, రావణుడి అంతఃపురంలో సీతకై వెతుకుతాడు. ఆమె కనిపించదు. అప్పటి హనుమ మానసిక స్థితిని ఇలా తెలిపారు కవయిత్రి:
“క్రోధము,
నిర్వేదము,
సీతను కానలేకపోవుటచే హనుమకు కలిగెను ఖేదము”
నగరమంతా వెతికినా సీత కనిపించకపోయేసరికి ఆమెను రావణుడు వధించాడా అన్న అనుమానం కలుగుతుంది.
“వంక,
శంక,
జానకి మరణించెనా? హనుమకు కలిగెను అభిశంక!”
అంటారు కవయిత్రి. అభిశంక అనే పదప్రయోగం ఇక్కడ సందర్భోచితం!
హనుమ సీతను కాంచిన సందర్భాన్ని-
“దరిసెనము,
నిశామనము,
సీత జాడ కనుగొంటినని హనుమ ఆహ్లాదనము” అని పేర్కొన్నారు కవయిత్రి. నిశామనము అనే పదాని చూచుట, ఆలోచించుట అని అర్థాలున్నందున్న ఈ సందర్భానికి తగిన పదమైంది.
తన ఎదుటకు వచ్చిన హనుమని చూసి సీత మానసిక స్థితిని –
“ఆలకించెను
ఆలోచించెను,
రామదూత సందేశము విని సీత సంతోషించెను” అంటూ వర్ణించారు.
హనుమ రామలక్ష్మణుల క్షేమం గురించి, సీత కనిపించక వారు పడుతున్న బాధ గురించి తెలిపి, తాను సీతామాతను రాముని వద్దకు చేరుస్తానంటాడు. అది ఉచితం కాదని, రాముడే వచ్చి తనను కాపాడి తీసుకువెళ్ళాలని చెబుతుంది సీత. ఈ సందర్భంలో, కవయిత్రి తాను ‘సంక్షిప్త రామాయణం’లో ఉపయోగించిన రెండు పదాలను ఇక్కడా వినియోగించి, చక్కని సప్తపది వ్రాశారు.
“ఈరిక,
చేరిక,
సీత ఎదురుచూపుల లక్ష్యం రాముని చేరిక!” అని. ఇక్కడ రెండవ పదం చేరికకి సన్నిధి అని అర్థం చేసుకోవాలి, ఏడవ పదం చేరిక అంటే, ఆ సాన్నిధ్యం లభించడంగా భావించాలి.
శత్రు సామర్థ్యం తెలుసుకోడం కోసం రాక్షసులను కవ్వించాలనుకుంటాడు హనుమ.
“పౌరుషవంతుడు,
భాస్వంతుడు,
ఉద్యానవనమును సమూలముగా నాశనము చేసెను హనుమంతుడు”.
రాక్షస వనితలు వెళ్ళి రావణుడికి ఫిర్యాదు చేస్తారు. ఆ వింత కోతిని పట్టి బంధించమని ఆదేశాలిస్తాడు. ఎందరో రాక్షసులని తుదముట్టించి, చివరకు మేఘనాథుడి బ్రహ్మాస్త ప్రయోగానికి లొంగుతాడు హనుమ.
“తగ్గెను,
ఒగ్గెను,
బ్రహ్మాస్త్రము విడిపించుకొను శక్తి చాలదని మొగ్గెను!”
ఆపై, హనుమని బంధిచి రావణుడి ముందు నిలుపుతారు. మంత్రుల ప్రశ్నలకు, తాను రామదూతనని చెప్తాడు హనుమ.
రావణుడికి హనుమ చెప్పిన హితవచనాలు నచ్చవు. కోపగించుకుని హనుమని వధించమని ఆదేశిస్తాడు. దూతని చంపరాదని విభీషణుడు వారించగా, తోకకి నిప్పుపెట్టి వదిలేయమని ఆదేశిస్తాడు రావణుడు.
సీత ప్రార్థనపై హనుమకి వేడి సోకకుండా రక్షిస్తాడు అగ్ని.
“ధ్వంసనము,
పతనము,
హనుమ చేయగ పూనుకొనెను లంకాదుర్గము దహనము.”
లంకని దహించాకా, సీత అశోకవనంలో ఉన్న సంగతి స్ఫురిస్తుది. ఆమె క్షేమమని తెల్సుకుని, లంక నుంచి బయల్దేరుతాడు హనుమ.
గంధమాధన పర్వతంపై ఉన్న రాముని చేరి, ప్రణమిల్లాడు హనుమ.
“వినయవంతుడు,
గుణవంతుడు,
‘జానకమ్మను చూచినాను’ జయమని ప్రణమిల్లెను హనుమంతుడు.”
సీతాన్వేషణ వృత్తాంతమంతా రామలక్ష్మణులని వినిపించి, శ్రీరాముడు తనను విడిపించడానికి సీత ఎంతలా ఎదురుచూస్తోందో చెప్తాడు హనుమ.
“శుభాకాంక్ష,
క్షేమాభికాంక్ష,
సీతాన్వేషణవృత్తాంతము సుజనశ్రేయప్రదమగునని ఈ ‘సుందర’సప్తపది లక్ష్యాపేక్ష!” అంటూ ముగించారు కవయిత్రి.
***
రచన: శ్రీమతి దినవహి సత్యవతి
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 100
వెల: ₹ 150/-
ప్రతులకు
అచ్చంగా తెలుగు ప్రచురణలు
8558899478 (వాట్సప్ మాత్రమే)
~
రచయిత్రి:
9790752180
~
ఆన్‌లైన్‌లో
https://books.acchamgatelugu.com/products/sankshipta-ramayanam-sundarakandamu?sku_id=61267742
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
