Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసు చేసే ఆలాపన – ‘సమ్మోహన రాగ రవళి’, ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’

[డా. సి. ఉమాప్రసాద్ గారి ‘సమ్మోహన రాగ రవళి’, ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ అనే పుస్తకాలను సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రముఖ సంగీత విద్వాంసురాలు, కవయిత్రి, కాలమిస్ట్ డా. సి. ఉమాప్రసాద్ గారు ఇటీవల ‘సమ్మోహన రాగ రవళి’, ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ అనే పుస్తకాలను వెలువరించారు. ఈ రెండు పుస్తకాలను తన అత్తగారు, ప్రముఖ రచయిత్రి స్వర్గీయ డా. సి. ఆనందారామం గారికి అంకితమివ్వడం విశేషం.

~

“‘సమ్మోహన రాగ రవళి’ శీర్షికతో నేను వ్రాసిన ఈ పుస్తకంలో నాలో నేను కొన్ని ఊహించుకొని, దైవానికి విన్నవించుకున్నట్లుగా, కొన్ని వేదనాపూరిత, ఆవేదనతో కూడిన గీతికలుగా, కొన్ని దైవం సృష్టించిన ప్రకృతిని ఆధారంగా చేసుకొని రచించినవి. అలాగే ‘మార్పు’ కోసం ప్రయత్నించడానికి, ‘సమాజము’ మీద కొన్ని, ఇలా విభిన్న దృక్పథాలతో సాహిత్య భావగీతిక రచనలు చేశాను. ఆ గీతికలకు సంగీతపరంగా రాగ, తాళాలు సమకూర్చాను. అన్నింటికి మూలం దైవాన్ని నమ్మి, శరణుగోరినా మనిషి మోక్ష ముక్తి పొందగలడు.” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు డా. సి. ఉమాప్రసాద్.

ఈ పుస్తకంలో 252 భావగీతికలున్నాయి. గీతికలకు రాగాలు విభిన్నమైనవి ఎంచుకున్నా, అధిక గీతాలకు ఆది తాళమే ఎంచుకున్నారు.

‘అక్షర తల్లికి’ అనే గీతికతో ఆరంభించారు. ఈ గీతికలో సరస్వతీదేవిని ప్రార్థిస్తూ, “నా భావావేశాలు అక్షరాలుగా మలచి/నీ కంఠ హారమున నే అలంకరింప” అని అన్నారు. తర్వాతి రెండు గీతికల్లోనూ సరస్వతీదేవిని నుతించారు. మరో గీతికలో శ్రీశైల మల్లికార్జునుని స్తుతించారు.

‘వెలుగును పంచే’ అనే గీతికలో సూర్యభగవానుని ప్రార్థిస్తూ, ఆయన నామస్మరణం శత్రునాశననం, సమస్త పాపరణమని పేర్కొన్నారు. ‘వందనం’ అనే గీతికలో దేశానికి ప్రణామర్పిస్తూ, రైతులకు, సైనికులకు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. “క్షేమమే జీవనమై దేశాభివృద్ధి” జరగాలని ఆకాంక్షించారు.

తెలుగు వెలుగు ప్రస్థానాన్ని ‘తరతరాల’ అనే గీతికలో ప్రస్తావించి, తెలుగు భాషాభివృద్ధికి, సాంఘిక అభివృద్ధికి దోహదం చేసిన మహామహులకు ప్రణతులర్పించారు. “సత్యం వైపు అడుగులేస్తూ/అసత్యాన్ని తరిమి కొడదాం” అంటూ నవయుగపు నిర్మాణానికి స్వాగతం పలికారు ‘కదలిపోదాం’ అనే గీతికలో.

‘మాయాలోకం’ అనే గీతికకి మాయామాళవగౌళ రాగంలో బాణీ కట్టారు. బయటకి చెప్పే మాటలొకటి, మదిలోపలి మాటలొకటి అని వాపోతారు. “పదునగు నిజము చెప్పిన/ఎవ్వరికి వినబడదు/ముదముగ సొద చెప్పిన/వినుతింతురు అందరు” అంటారీ గీతికలో.

నాదనామక్రియ రాగంలో కూర్చిన ‘గాలిలో దీపం’ అనే గీతిక జీవితపు నశ్వరాత్వాన్ని ప్రకటిస్తుంది. భక్తితో, ఆర్తితో దైవాన్ని కొలిస్తే సమస్యలు తీరుతాయని చెబుతుంది.. ‘ఎటు పోతోంది’, ‘ఎంతో విలువైనది’ అనే రెండు గీతికలు యువతకు చక్కని మాటలు చెప్తాయి. నడవాల్సిన మార్గాన్ని చూపుతాయి.

ఎవరేది చేస్తే వారికా ఫలం దక్కుతుందని ‘సేవ చేసినవారికి’ అనే గీతిక చెబుతుంది. దీన్ని శహన రాగంలో కూర్చారు. ‘ఎదిగిన కొద్దీ’ అనే గీతికలో వారసులకి ఇవ్వాల్సినవేమిటో సూచిస్తారు. “ఆస్తులు ఎన్ని ఇచ్చినా సంపద ఐశ్వర్యం ఏమిచ్చినా/ఇవి ఏవి ఇవ్వకపోయినా/సంస్కారం నేర్పండి/మార్గదర్శకులు అవ్వండి” అని సలహా ఇచ్చారు.

బాలకృష్ణుని అల్లరి చేష్టలని చక్కగా వర్ణించారు ‘నీ మాయ లీలలు’ గీతికలో. “అందరి వాడవు అంటారు అందంతో వున్నారు/అందనంత ఎత్తువుండి అందక జారుకుంటావు” అన్నారు ఈ గీతికలో నల్లనయ్యని ఉద్దేశించి. అత్యంత సరళమైన పదాలలో, అద్భుతమైన భావాన్ని ఇమిడ్చారు.

పూలకారుని ఆహ్వానించే గీతికకి వసంత రాగం ఎంచుకోడం స్వాభావికమే కదా. ‘ఆమని రాకతో’ అనే గీతికలో “నీ సొగసు చూసి మది తుళ్ళింతలై/ప్రకృతి కాంత సొబగులతో తేజరిల్లె” అంటూ ప్రకృతి శోభని వర్ణిస్తారు. ఇదే పేరుతో ఉన్న మరో గీతికకి మలయమారుతం రాగం ఎంచుకున్నారు. ‘వచ్చేసింది వసంతం’ అనే గీతికకి వలజి రాగం తీసుకున్నారు. ఉల్లాసంగా సాగిన గీతికకి, ఉల్లాసాంగా సాగే రాగాన్ని ఎంచుకోడంలో రచయిత్రి ప్రతిభ తెలుస్తుంది. అలాగే, ‘ఉదయపు రాగపు’ అనే గీతికకి బౌళి రాగం ఎంచుకోవడం ఎంతో ఔచితీమంతంగా ఉంది.

ఇలా ఈ పుస్తకంలో ఎన్నో దైవభక్తి గీతికలు, దేశభక్తి గీతికలు, ప్రకృతి గీతికలు, యువతకి మంచి చెప్పే గీతికలు చాలా ఉన్నాయి.

~

“మనసు స్పందించినప్పుడు, సమాజంలో స్థితిగతులు చూసినప్పుడు, అనుభవాల ద్వారా, చూసిన వాస్తవాల ద్వారా కొన్ని, పెద్దల అనుభవసారం ద్వారా విన్నవి కొన్ని, ఇలా సమాజానికి అద్దం పట్టే విషయాలకు స్పంచించి రచించిన భావకవితా మాలికలు” అంటూ ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ అనే పుస్తకం ముందుమాటలో పేర్కొన్నారు డా. ఉమాప్రసాద్. అందరికీ అన్నీ తెలిసినవే అయినా ఎవరి కలం చేతిలో ఆ అక్షరాలు వేటికవే ప్రత్యేకం అని వ్యాఖ్యానించారు.

ఈ పుస్తకంలో 257 భావగీతికలు/కవితలున్నాయి.

దేశాన్ని కాపాడే సైనికుల సేవలను నుతిస్తూ, మొదటగా ‘సదా పూజ్యనీయుడు’ అనే గీతికను సుపోషిణి రాగంలో కూర్చారు. సుపోషిణి రాగం ప్రత్యేకత ఏమిటో తమ ప్రత్యేక ఇంటర్య్వూలో వివరించారు డా. సి. ఉమాప్రసాద్.

ప్రేమికుల మనసులు, కనులు కలుసుకుంటే ఎలా ఉంటుందో ‘మనసులు చూపులు’ అనే గీతికలో తెలిపారు. సాధారణ శ్రోతలను కూడా సులభంగా మంత్రముగ్ధులను చేసే హిందోళం రాగాన్ని ఈ గీతికకు ఎంచుకున్నారు.

ప్రేమలో వైఫల్యం చెందినవారి ఆవేదనకి అద్దం పడుతుంది ‘పగిలిన నా హృదయం’ గీతిక. దీన్ని పరమశివుడితో అత్యంత సన్నిహిత సంబంధం ఉండే రేవతి రాగంలో కూర్చారు.

ఒంటరితనమెలా బాధిస్తుందే, ఎంత వేదన కలిగిస్తుందో ఎంతో ఆర్తిగా, ‘ఏకాకిని’ అన్న గీతికలో తెలిపారు.

‘నా మనసే’ అనే గీతికలో, “అనురాగమే అతిరవమై/పులకరమే సుమరజయై” అని అన్నారు. అతిరవం అంటే, గంభీరమైన ధ్వని అని మామూలు అర్థం. ఈ గీతిక సందర్భంలో ఒకరిపై ఉన్న ప్రేమ తీవ్రతను లేదా ఆరాటాన్ని వర్ణించడానికి వాడారని అనిపిస్తుంది.

శ్రీరామ జననానికి లోకమెలా స్పందించిందో ‘సమస్తలోకం’ అనే గీతికలో అద్భుతంగా చెప్పారు. వినేవారిలో లోతైన భక్తి భావాన్ని, వైరాగ్యాన్ని కల్పించే వరాళి రాగంలో దీన్ని కూర్చారు.

ప్రేయసి సమక్షం లేదా ప్రియురాలి తావు ఎలా ఉంటుందో ‘నువ్వున్న చోట’ అనే గీతికలో హృద్యంగా చెప్పారు.

‘బ్రతుకే స్వరాలమయం’ అనే గీతికలో సందర్భానికి తగ్గ రాగాన్ని ప్రస్తావిస్తూ, సంగీత సాహిత్యాలలో తన ప్రావీణ్యాన్ని పాఠకులకు రుచి చూపారు రచయిత్రి.

గురువుల విలువను ‘జ్ఞానధార’ అనే గీతికలో అద్భుతంగా చెప్పారు. గురువు ఎందుకు దైవసమానులో తెలిపారు.

‘బాలకృష్ణా’ అనే గీతికని హమీర్‌కల్యాణి రాగంలో కూర్చారు. దీని ఆలాపన మనసులో ఒక రకమైన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందట. ఈ గీతంలో కృష్ణునకు నీరాజనాలు అర్పించారు రచయిత్రి.

వర్షం తెచ్చే హర్షం ఎలా ఉంటుందో ‘చినుకు చినుకు’ అనే గీతికలో వివరించారు. దీన్ని పాడుకునేందుకు హిందోళాన్ని, ఆది తాళాన్ని ఎంచుకున్నారు.

మనిషితనం కోల్పోవద్దనీ, మానవత్వమే మేలని చెప్తుంది ‘మానవత్వం’ అనే గీతిక. దీనిని కరుణను, మనశ్శాంతిని కలిగించే అద్భుతమైన చక్రవాకం రాగంలో కూర్చారు.

దేశభక్తిని చాటే ‘మనమంతా’ గీతికకి దేశ్ రాగం ఎంచుకోడం సముచితంగా ఉంది. “మతం మత్తు వదిలేద్దాం కులజాడ్యం వదిలేద్దాం” అంటుందీ గీతిక. మన జాతీయ గేయం ‘వందేమాతరం’ ను ఈ దేశ్ రాగంలోనే స్వరపరిచారు.

ఇంకా చక్కని గీతికలున్న ఈ పుస్తకం పఠితలను ఆకట్టుకుంటుంది.

~

ఇవి రచయిత్రి మనసు నుంచి వెలువడిన భావగీతికలు. గీతాలు వ్రాసి, వాటిని పాడుకోగలిగే విధంగా రాగమూ, తాళమూ సూచించారు. అంటే ఇవి మనసు చేసే ఆలాపనలన్నమాట!

***

సమ్మోహన రాగ రవళి
రచన: డా. సి. ఉమాప్రసాద్
పేజీలు: 266
వెల: ₹ 120/-
~
సుమనోహర ఆణిముత్యాల కూర్పు
రచన: డా. సి. ఉమాప్రసాద్
పేజీలు: 273
వెల: ₹ 120/-
ప్రతులకు:
డా. సి. ఉమాప్రసాద్
10-1-592, బలరామ్ బ్లాక్స్ ఎదురుగా,
వెస్ట్ మారేడ్‌పల్లి, సికిందరాబాద్ – 500 026.
ఫోన్: 7032725616, 9573374947

~
డా. సి. ఉమాప్రసాద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-c-umaprasad/

Exit mobile version