Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంస్కర్త

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘సంస్కర్త’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ప్రపంచమొక తాత్కాలిక పాంథశాల అనీ,
ప్రజలిక్కడ పరిమిత కాల అతిథులనీ
అనునిత్యం బోధించే పాఠశాల
ఆతని కార్యశాల!

ఎగసిపడే అహంకారము
ఎదురు లేని అధికారము
ఎంచలేని ఐశ్వర్యము
ఎన్నదగిన సౌందర్యము
ఏలుకో దగినన్ని మణి మందిర శ్రేణులు
ఎంచలేనన్ని మాగాణులూ
ఎట్టకేలకొకనాడు
మట్టిలో చేరి
వట్టిగా మారే
పరిస్థితులను నిత్యం పరిచయం చేసే
విశేష నిలయం
ఆతని విధి నిర్వహణాలయం!

కడుపారా కాటీనీ కబళించే
భూ బకాసురులు,
నిరుపేదల నీడలను కూల్చి
నింగినంటే నిర్మాణలను చేసే
పోకిరీ పెద్దలు,
ప్రజను మోసగించి
పదవుల భోగాలననుభవించే దగుల్బాజీలు,
దొరల ముసుగులో
దర్జాగా, విశృంఖలంగా విహరించే
ఘరానా దొంగలు,
ప్రాణ, మాన హారకులు,
మట్టి స్పర్శ అంటేనే చీదరించుకునే
సుకుమారులు
సుందరాంగులు,
శ్రీమంతులు
కడకొక కాలాన
తప్పని కాల నిర్ణయానుసారం
కడదేరి
మంటన గలిసే అనివార్య స్థితిని
కనీ కనీ
మానవ జీవన దశల మర్మాన్నీ,
” జాతస్య మరణం ధ్రువం ”
అన్న సృష్టి ధర్మాన్నీ
ఆద్యంతం ఆకళింపు చేసుకున్న
మేటి మేధావి అతడు!

రాత్రించరుల కన్నా,
క్రూర మృగ సంతతుల కన్నా
విష జీవ రాశుల కన్నా
సమాజంలో విచ్చల విడిగా సంచరించే
భయానక నర రూప రాక్షసులంటేనే బెదురు అతనికి!

పరులను పీడించి పీడించీ గతించి
యమపురి ప్రవేశానికీ అనర్హులై
శూన్యంలో పిచ్చి పిచ్చిగా నడయాడే
పిశాచాలైన వారినీ,
కోరికల ఆకలి తీరకుండానే
ఉసురు కోల్పోయి
కొరవి దయ్యాలుగా మారిన
అసంతృప్త ఆత్మలనూ,
పాప ప్రక్షాళన ప్రయత్నాలేవీ
నిర్వహించకుండానే నీల్గి
ప్రేతాలుగా మారిన నీచులనూ
నిత్యం దర్శించే
దినచర్య అతనిది!

చితి ముందు
నిండు మనస్సుతో దుఃఖిస్తూ
విగత జీవి ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ
శ్రద్దాంజలిని ఘటించే వారినీ,
కపటంగా కన్నీరు కారుస్తూ
కలతను నటించే వారినీ,
పై పైకి బాధను అభినయిస్తూ
లోలోన ఆనందించే వారినీ,
తప్పని కార్యంగా తలంచి
ఆవశ్యక పద్ధతులను పాటించే వారినీ
చూసీ చూసీ
మానవ మనస్తత్వ విశ్లేషణలో
ఆరితేరిన జ్ఞాని అయినాడతడు!
లౌకిక మార్గంలో
అలౌకిక అభిజ్ఞానాన్ని ఆర్జించిన
ముని అయినాడతడు!

కళేబరంతో వచ్చిన వారందరూ
కర్మ కాండల పిదప కదలిపోయినా
చితి ఆరిపోయే చివరి నిమిషం దాకా
నిలిచి ఉండే
నియమ బద్ధుడతడు!

ప్రోగు బడుతున్న చితి బూది ఎదుట
క్రమ్ముకుంటున్న చిమ్మ చీకటి కౌగిట
నిదురలేస్తున్న నిశాచరుల మధ్య
సంచరిస్తున్న గుడ్ల గూబల నడుమ
సవ్వడిస్తున్న గబ్బిలాల చెంతన
గోల చేస్తున్న ఆత్మల పొంతన
పారాడే విష జీవుల పరిసరాలలో
కర్తవ్య ధర్మాన్ని నిర్వహించే
కర్మఠుడు అతను!
నిష్ఠాగరిష్ఠుడతడు!

దేవుడు జీవుల సంస్కర్త అయితే
ఆ కర్మఠుడు
నిష్ప్రాణుల సంస్కర్త!

సమాజంలోని
ప్రమాదకర అసమానతను సందర్శిస్తూ
చింతిల్లే వేళ
సమత్వాన్ని పాటించే శ్మశానాన్ని చూస్తూ
సాంత్వనను పొందే కాపరి అతను!
ఊరికి ఉపకారి అతను!

Exit mobile version