[శ్రీ కంచరాన భుజంగరావు రచించిన ‘సముద్ర రోదన’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
అలలు అలలుగా
ఎంత శోకం అనుభవిస్తుందో..
పొద్దు మునిగినా తేలినా
కడలి కన్నీటి పొంగు
తెరిపిన పడినట్టు
ఏ ఆనవాళ్లూ లేవు
ద్రవ దుఃఖమంటే
ఉప్పెన కెరటాలేం కాదు
ఉగ్రరూప జలశ్రేణులూ కాదు
తీరం ఒడిచేరి మొరపెట్టుకునే
ఉప్పని కన్నీళ్లు..
కేవలం ఉప్పని కన్నీళ్లు..
అలజడి రేగడమంటే
తుంపర కెరటాల పోటు కాదు
భయపెట్టే నీటితెరలూ కాదు
పశ్చాత్తాపపు ఒప్పుకోళ్లు
విచార వదనపు వేడుకోళ్లు
తడి గుండెను ముంచెత్తే
తరగ నురగల ప్రాయశ్చిత్తాలు
అనంతకాలపు నిత్య శోకానికి
అనిత్య వ్యక్తీకరణలు –
ఐనా హోరు హోరున ఇంతలా
తనెందుకు రోదిస్తున్నట్టూ..?
తెడ్డుకీ తెప్పకీ లంకె తెంచి
ఎందరో జాలర్ల ఊపిరి కోసినందుకా..
చీకటిజీబులో తుపాను గాలిలో
ఒంటరి నౌకల్ని దారి తప్పించినందుకా..
ఢీకొనేలా మంచు గండాల్ని అడ్డుపెట్టి
కూరుకుపోయేలా ఇసుక ఊబిలో దించి
ఓడల్ని మునగేసినందుకా..?
అభం శుభం ఎరుగని వారిని
పడవ ప్రయాణం తెలియని వారిని
యానం సరదా తీరని వారిని
నీళ్ళ సమాధికి సాగనంపినందుకా..?
ఎందుకు?
తనెందుకిలా ఏడుస్తున్నట్టూ
అనాదిగా అవిరామంగా..?
