Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – స్వాధ్యాయ – పద్య కావ్య రచన పోటీ ఫలితాలు – ప్రకటన

సంచిక – స్వాధ్యాయ సంయుక్తంగా, భారతీయ సంస్కృతి ఇతివృత్తంగా రచింపబడిన పద్యకావ్యాల పోటీ ఫలితాలు.

మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారు ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

పోటీకి అందిన కావ్యాలని విశ్లేషించి, విజేతలని ఎంపిక చేస్తూ, తమ నిర్ణయాన్ని ఇలా ప్రకటించారు ఏల్చూరి మురళీధర రావుగారు.

~

‘సంచిక’ పాఠకులందరికీ ‘పరాభవ’ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. పూజ్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి దివ్యాశీర్వాద సౌజన్యంతో ‘సంచిక’ పత్రిక నెలకొల్పిన పద్యకావ్యాల పోటీలో పాల్గొన్న కవులందరికీ అభ్యుదయ శుభాకాంక్షలు.

ఈ యేడాది మొత్తం పదకొండు మంది కవుల రచనలు అందాయి. అవి: పెన్నిధి (ఫణి ప్రసన్నకుమార్), నిరీక్షణ (కుంతి), భీష్మ రాయబారం (డా. భైరవభట్ల విజయాదిత్య), శ్రీకృష్ణప్రేమ (శ్రీమతి అన్నపూర్ణాదేవి), భారతీయ సంస్కృతి (ఎం.జి. వంశీకృష్ణ : కలంపేరు – వంశీకృష్ణ పరిమళ), వేంకటరమణీయం (డా. ఆమళ్లదిన్నె వేంకట రమణప్రసాద్), సోఽహం (డా. చింతలపాటి మోహన మురళీకృష్ణ), శిఖండి (నూతలపాటి వేంకట రత్నశర్మ), భారతీయము (ఐలేని గిరి), విశ్వరాజమకుటం (కృష్ణ విరజ), సుధామ గోవిందమ్: స్నేహపరిమళము (పాణ్యం దత్తశర్మ).

ఇవిగాక మాకు అందిన ‘భారతీయత: ఒక నిత్యయజ్ఞం’ (పాత్లవతు బుజ్జి శిల్ప), ‘అంతా మారిపోయింది’ (గంట రామకృష్ణ), ‘ఘనమగు సంస్కృతి మనది’ (వాణి వేమవరపు) అన్న మూడింటిని వచనకవితలు కావటం వల్ల పోటీకి స్వీకరింపలేదు.

ఈ కృతులన్నింటిలో బహురీతుల ప్రతిభావిలసనం విద్యోతిల్లుతున్నది. ఒక్కొక్క కవికి ఒక్కొక్క భంగీభణితితో సరస్వతీసాక్షాత్కారం కలిగింది. కొత్తకొత్త కల్పనలతోడి పదబంధాలతో, విశేషవృత్తసంచయంతో, గర్భాదిచిత్రకవిత్వప్రయోగాలతో పద్యబంధం వినూత్నశిల్పాలతో వెలుగులీనుతున్నది. భాషాచ్ఛందోవ్యతిక్రమాలు, లేఖన-టంకణాది దోషాలు సుపరిష్కృతములైనాక అచిరకాలంలో ఈ కృతులు ముద్రితప్రకాశితములు కాగలవని ఆశింపవచ్చును. ఈ కృతికర్తలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, మూడు కృతులను బహుమానార్హములుగా ఎంపికచేయటం జరిగింది. అవి:

1) డా. ఆమళ్ళదిన్నె వేంకట రమణప్రసాద్ గారి వేంకటరమణీయం. ఇది సప్తగిరిశిఖరాన వెలసిన శ్రీ వేంకటేశ్వరుని లీలావిశేషవర్ణనముఖంగా చారిత్రిక పూర్వాపరసంహితతో తిరుమల తిరుపతి దేవస్థాన సేవాహేవాకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రౌఢకావ్యం. కవిగారి శబ్దసంస్కారం గొప్పది, కావ్యహేతువులైన ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసాలు పుష్కలం, నిరాఘాటమైన శైలి. అక్కడక్కడ దొర్లిన నెరసులను యథాయోగ్యంగా సవరింపవలసి ఉన్నది.

2) డా. భైరవభట్ల విజయాదిత్య గారి భీష్మ రాయబారం. జయేతిహాసంలోని పాత్రల స్వభావానురూపములైన సంభాషణలతో చిత్రచిత్రంగా నవీనేతివృత్తాన్ని నాటకీయంగా నడిపిన తీరు హృద్యంగా ఉన్నది. ఎక్కడికక్కడ సరికొత్త కల్పనలు కావ్యానికి వింత సొగసును అలవరించాయి. కవిత్వంలో ఆసాంతం పరచుకొని ఉన్న ఆధ్యాత్మికత కావ్యగౌరవాన్ని ప్రగుణీకరించింది. శీర్షికను పునరాలోచించిన తర్వాత ముద్రణార్థం కృతిలో చోటుచేసికొన్న భాషాదోషాలను పరిష్కరించటం ఆవశ్యకమై ఉన్నది.

3) కృష్ణ విరజ గారి విశ్వరాజమకుటం. ఇది భారతదేశ సంస్కృతిప్రావీణ్యాన్ని, చారిత్రికవైభవాన్ని, తెలుగువారి రాజకీయ సాంఘిక దార్శనిక విశిష్ట సంగీత సాహిత్య శిల్పాది కళారంగాల నాయకత్వ సింహావలోకనముఖంగా మహాపురుషాభివర్ణనలతో ‘సంచిక’ పత్రిక ప్రకటించిన పోటీ పరమోద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని సాగిన సుమధురకావ్యం. పెద్దలచే రచనను పరిష్కరింపజేసికొన్నాక తప్పక ముద్రింపవలసిన కృతి.

ఈ మూడు కృతుల పరస్పర గుణావగుణ తారతమ్యపరీక్షను ఉజ్జగించి, రచనలోని కొత్తదనాన్ని స్వాగతిస్తూ కృతికర్తలు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల చొప్పున సమాన బహుమతికై ఎంపిక చేయటం జరిగింది.

మహావిద్వాంసులై, మహాకవులై, దేశికాగ్రణులై తెలుగు జాతికి గర్వహేతుకములైన అనేక మహాకృతులను రచించి, సాహిత్యలోకానికి గురుస్థానీయులైన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారు పద్యవిద్యకు ప్రోత్సాహకంగా నెలకొల్పిన ఈ బహుమతులను అందుకొంటున్న సుకవులందరికీ మనఃపూర్వక అభినందనలను అందజేస్తూ – నాకు ఈ పద్యసరస్వతీ బహుముఖీన దివ్యకాంతులను దర్శించే మహాభాగ్యాన్ని కల్పించిన సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారికి, మిత్రులు కొల్లూరి సోమ శంకర్ గారికి, ‘స్వాధ్యాయ’ సంస్థ సంస్థాపకులు కోవెల సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను విన్నవిస్తున్నాను.

ఏల్చూరి మురళీధర రావు


విజేతలు వీరే!!!

డా. ఆమళ్ళదిన్నె వేంకట రమణప్రసాద్ గారి స్వస్థలం అనంతపురం. జననం: 30-12-1948, వయస్సు: 78. వీరు విద్వాన్, ఎం.ఎ., ఎం.ఇడి, పిహెచ్.డి చేసారు. 2002లో న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

పరిశోధన: ‘తెలుగు సాహిత్యంలో మృచ్ఛకటికం’ అనే సిద్ధాంత గ్రంథానికి తంగిరాల సాహిత్య పీఠం, 1996 ద్వారా ఉత్తమ పరిశోధన అవార్డు పొందారు.

“అనంతపద్యం” (అనంతపురం జిల్లాలో కవితా సాహిత్య అభివృద్ధి) అనే వీరి బృహత్ పరిశోధనా గ్రంథం ఐదు సంస్థల నుండి 2014, 2018, 2018, 2019, 2021 సంవత్సరాలకు గాను ఉత్తమ సాహిత్య గ్రంథం అవార్డును గెలుచుకుంది.

వీరు రచించిన మూడు ఆశ్వాసాల పద్యకావ్యం ‘ఏకలవ్య ప్రబంధం’, 2013, 2014, 2014 సంవత్సరాల్లో మూడు సంస్థల నుండి ఉత్తమ పద్య కావ్య రచనగా అవార్డులను గెలుచుకుంది.

వీరి కృతి ‘ఎన్టీఆర్ శతకం’ బెంగళూరు సీపీ బ్రౌన్ సేవా సమితి (ఎ. లక్ష్మీ రెడ్డి నిర్వహకులు) నుండి ఉత్తమ శతక రచనలో మొదటి బహుమతిని గెలుచుకుంది. 28-05-2023 నాడు బెంగళూరులో బహుమతి ప్రదానం జరిగింది.

ఇవి కాక, ఇంకను అష్టావధాన సంపుటి, పద్య ఖండకావ్యాలు, నాటకములు, రచనలు అన్ని ప్రక్రియలు కలిపి 20 రచనలు వెలువరించారు.

విశాలాంధ్రలోని ప్రతిష్ఠాత్మక సాహిత్య సంస్థలు నిర్వహించే ‘కవితా రచనా పోటీ’లకు పద్యాలు రాసి పంపడం వ్యసనం. పంపిన ప్రతిసారీ అవార్డులు గెలుచుకోవడం సరస్వతి ప్రసాదం! ఇదిగో! ఇప్పుడీ పద్మావతి ప్రసాదం.

~

డా. భైరవభట్ల విజయాదిత్య విజయనగరం వాస్తవ్యులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం నుంచి ఎం.ఎస్.సి చేశారు. ఇండోర్‍లో ఎం.టెక్ చేశారు. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా తెలుగులో ఎం.ఎ. చేశారు. భారతీయ విజ్ఞాన సంస్థ, బంగలూరు నుంచి పిహెచ్.డి. పట్టా పొందారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయనగరం నుంచి భరతనాట్యంలో డిప్లొమా పొందారు.

తల్లిదండ్రులు శ్రీ భైరవభట్ల నరసింహం, శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్ గార్ల వలన సాహిత్యంలో ప్రవేశం కలిగింది. విజయనగరంలో విజయభావన మొదలైన సంస్థల వలన కొంత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా వారి అన్నయ్య శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు వలన పద్యములో మెళుకువలు, లోతులు కొంత కొంత తెలుసుకుంటున్నారు. ‘పద్యసౌందర్యము’, ‘విశ్వనాథ సాహిత్య పీఠము’, ‘హరివంశ సత్సంగము’ మొదలైన వాట్స్ ఆప్ గ్రూపుల లోతైన అధ్యయన విధానము వలన సాహిత్యముపైన అవగాహన కలిగించుకున్నారు. సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు సమగ్రమైన ఆన్‌లైన్ పాఠాలు తయారుచేసే ‘మన भाषा’ అధ్యయన పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు.

‘అర్ధనారీశ్వరమ్’ నవల ప్రచురించారు. తపస్వీమనోహరం నిర్వహించిన నవలల పోటిలో రెండవ బహుమతి పొందిన ‘ఎన్నెలమ్మ’ అనే నవల వారిచే ప్రచురింపబడింది

చిరునామా: 71 , పి.ఎస్.ఆర్ కాలనీ, విజయనగరం 535002.

ఫోన్: 9448174872, ఈ-మెయిల్: bh.aditya369@gmail.com

~

శ్రీమతి కుండూరి కృష్ణ విరజ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. నల్లాన్ చక్రవర్తుల రంగాచార్యులు, తిరుమలా దేవి వీరి తల్లితండ్రులు. వీరి శ్రీవారు కుండూరి వేణుగోపాల శ్రీనివాసాచార్యులు. కృష్ణ విరజ గారు, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీల్డ్‌లో సబ్ ఎడిటర్గా పనిచేసి, ఆరోగ్య రీత్యా విరమించుకున్నారు.  శ్రీ  నల్లాన్ చక్రవర్తుల శ్రీరాం చక్రవర్తి గారు వీరి గురువు. కృష్ణ విరజ ఈ మధ్యే సాహిత్య రంగంలో అడుగుపెట్టారు.  పద్యాలు, గజల్స్ వ్రాయడానికి ప్రయత్నిస్తున్నారు.

***

ముగ్గురు విజేతలకు బహుమతి మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ. 5000/- చొప్పున వారి గూగుల్ పే/ఫోన్ పే ఎకౌంట్‌లకు పంపడమైనది.

Exit mobile version