[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ‘కాలచక్రగతి – ఆచార్య త్రయానికి నివాళి’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ సారధి మోటమఱ్ఱి.]
(చిత్ర రూపకల్పన: గూగుల్ జెమినై సహాయంతో)
“వ్యాస శంకర మధ్యమాం” అనేది “వ్యాస రామానుజ మధ్యమాం” గా మార్పు చేస్తే, ఇద్దరిని గౌరవించినట్లే కాదా? కానీ అలా జరిగేనా!?
గత కొన్ని నెలలుగా, శంకరుడు, రామానుజుల వారిపై విస్తృత చర్చ జరుగుతుంది. మన గురు పరంపర శ్రుతిని, పై విధంగా అంగీకరిస్తే, వారిద్దరిని గురు స్థానంలో నిలిపినవారమై, ఈ వివాదాలకు అతీతంగా మనం ఉండగలమేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు?
విచిత్రమో, దైవిక ఘటనో, మన ఆచార్య త్రయంలో శంకర, రామానుజుల జయంతులు ఒకే రోజు, మొన్న ఏప్రియల్ 22న జరుపుకున్నాం. బుద్ధుని జయంతి అయిన వైశాఖ పౌర్ణమి, మే 1 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో, భారతీయ ఆధ్యాత్మిక రీతిని, గమనాన్ని వారి వారి కాలాలలో ఉన్న వాస్తవ భయానక స్థిaతిని గుర్తించి, మహత్తర మార్పుకు దోహదం చేసి, జాతికి ఒక మార్గాన్ని నిర్దేశించిన మహానుభావులు, ఈ మువ్వురు! వారికి భారతజాతే కాదు, యావత్ మానవాళి నమస్కరించదగిన మహానుభావులు. వారి తాత్విక చింతనపై మరింత లోతైన విశ్లేషణ, వారిని తాత్వికవేత్తలుగా ఉన్నత విద్యారంగంలో గుర్తించవలసిన అవసరం ఉంది.
పానుగంటి వారు, ఒక వంద సంవత్సరాల క్రితం, ‘కాలస్వరూపుడు’ అనే ఒక అద్భుత వ్యాసం, అందించారు. బహుశా తెలుగులో ఇంతటి మహత్తర వ్యాసం, బుద్ధుడు, శంకరాచార్యులు, రామానూజాచార్యులు, మరియు మధ్వాచార్యులు వారి గురించి, భారతీయ వైదిక అనుచాలన ఏ విధంగా మార్పుకు లోను అయ్యింది లాంటి విషయాలను ఎటువంటి బేషజం లేకుండా విపులీకరించినది మరొకటి ఉందని నేను అనుకొను. అలాగే, భాష పరంగా, టెక్నిక్ పరంగా, ముగింపు పరంగా ఈ వ్యాసం అనన్య సామాన్యం. ఆ వ్యాసం యొక్క ప్రభావంతో, నవంబరు 2018, సంచికలో ఈ విషయమై, ‘కాలదర్శిని: భారతీయ తాత్విక చింతన – మన కర్తవ్యం’, అనే వ్యాసాన్ని అందించాను.
దాని లంకె క్రింద అందచేస్తున్నాను. అభిరుచి ఉన్నవారు చదవగలరు.
అదే వ్యాస ప్రభావంతో, జనవరి 3, 1980 న ఒక కవిత రాశాను. అది ఆ మహానుభావులకు నివాళిగా, మీతో ఈ రోజు పంచుకుంటున్నాను. మీమీ అభిప్రాయాలు అందచేస్తే, ఆనందం.
~
ఎందరో ఎందరెందరో వస్తారు
కొందరె చరిత్రలో నిలుస్తారు..
భానునిలా ఉదయించి,
జగతికి వెలుగిచ్చి,
తోవ చూపి –
రవిలా అస్తమించారు –
ఎందరో మహానుభావులు.
పగటి పిదప రేయిలా,
రేయి పిదప పగటిలా,
ఒకరి వెనుక ఒకరు వచ్చి,
ప్రజను మార్చారు!
పైకి విసిరిన రాయిలా,
బురదను చేరే పందిలా,
సంఘం తిరిగి తిరిగి-
చీకటిని చేరింది.
పతితులై, భ్రష్టులై.
జారులై, చోరులై –
మనసును, మమతను,
మంచిని, దేవుని,
పరిచిన ప్రజను –
మార్చుటకై, బాపుటకై –
బుద్దుడు ఉదయించాడు-
చీకటిని తోలిని సూర్యునిలా!
వెదం- యాగం- దేవుని స్థానే-
ప్రేమ- అహింస- కారుణ్యాలకి జీవంపోసి-
భారం లేని- ప్రాణం తీయని-
మతాన్ని బోధించాడు!
తోకలేని కోతులై,
ఎతిరి గంతేసి-
కుప్పలౌ తెప్పలుగా-
ప్రజలా మతాన్ని-
అందుకున్నారు-
మరెందరికో అందించారు!
బుద్ధుని అస్తమయంతో-
మతాన్ని చీకటి కమ్మగ,
నిజబోధలు చుక్కలుగా,
కల్లలు, కల్పితాలు-
పున్నమి చంద్రునిలా-
వెలుగొందాయి!
కల్లరులై, కపటులై,
పాపులై, నాస్తికులై-
ప్రేమను మరిచి-
కరుణను కరిచి-
దురవస్థకై వగచి,
ఇలనే నరకం-
ప్రజలు చూసారు!
కాలచక్ర కదలికలో-
ప్రజల నుద్ధరించుటకై-
ఎందరో.. మరెందరో
మహా మనీషులు-
సూర్యప్రభలీనుతూ,
ధర్మం పెంపుకై,
వచ్చి, మెప్పించి..
తమ మార్గాన నడిపించారు.
శంకరుడు.. రామానుజుడు
మధ్వాచార్యుల-
అస్తమయాలతో-
వారి వారి మతాలు,
బౌద్ధ మతంలా,
క్షీణించి.. దిగజారి..
ప్రజను నరకంలో ఉంచాయి!
కడలిని వదిలిన నీటిలా,
ప్రజ తిరిగి తిరిగి…
భ్రష్టతను వరించింది-
మహాత్ముల పోకతో!!
మెదడు పెంచి,
మనసు తెంచి,
సైన్స్‌లో ఎదిగి –
మమతలో తరిగి..
సహోదరత్వం.. ప్రేమతత్వం..
మరిచి, వగచి – చరిస్తున్న-
ఈ లోకంలో.. ఈ సంఘంలో..
నవోదయమెన్నడు?
తరతరాలుగా – దొర్లుతున్న,
పొంగి పొరలుతున్న..
హీనతలకు కట్టలు కట్టే,
సైన్స్‌ను చేరేదెన్నడు?
పరలోకానికి వంతెన వేసే-
యోచన చేసే దెప్పుడు??
ఉపయుక్త వ్యాసాలు:
- పానుగంటి, సాక్షివ్యాసాలు
- https://sanchika.com/kaladarshini-bharatiya-tatvika-chintana/
ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు.
మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు:
“మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”

