Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 13

సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.

వాషింగ్టన్ డిసి..

డిసెంబర్ 11 వ తేదీ, 2022.

న్యూ జెర్సీ నుంచి మా ప్రయాణం వర్జీనియాకి ఆరంభమైంది. మా ప్రయాణానికి కొద్దిగా ముందునుండి పలుచని దూది చిన్న చిన్న ముక్కలుగా గాలిలో ఎగురుతూ కిందపడుతున్నట్లుగా మంచు పడడం మొదలైంది. ఓ పది నిమిషాల తర్వాత తగ్గిపోయింది. సన్నని వర్షం కురుస్తూనే ఉంది.

న్యూ జెర్సీ నుండి వర్జీనియాకి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. మమ్మల్ని వర్జీనియాలో ఉండే మేనల్లుడు వచ్చి తీసుకుని వెంటనే వెళ్లడం కంటే న్యూ జెర్సీలో మేనత్త మనుమరాలి భర్త అనిరుద్ సగం దూరం డ్రాప్ చేస్తే మిగతా సగానికి మా మేనల్లుడు వాసు (ఆడపడుచు కొడుకు) వచ్చి పికప్ చేసుకునే విధంగా నిర్ణయించారు పిల్లలు.

సాధన, రాజేష్, వాళ్ళ పిల్లలు సౌరవి, సుచిర్ నేను వర్జీనియా ప్రయాణం ప్రారంభమైంది.

అనిరుద్ వచ్చేటప్పుడు ఒకడే కాబట్టి టైం పాస్ అవుతుందని మరో మేనల్లుడు (తమ్ముడి కొడుకు) రాహుల్ కూడా బయలుదేరాడు.

మెత్తగా సాగిపోయే విశాలమైన రోడ్డు.. పచ్చదనం విడిచేస్తున్న చెట్ల పై మేలిముసుగులా ఫాగ్..

ప్రకృతిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగుతున్నది. చుట్టూ రంగులు మారి, మారుతూన్న చెట్ల ఆకులు, అక్కడక్కడా పచ్చదనం కనిపిస్తున్నది కానీ ఎక్కడా పంట పొలాలు, తోటలు ఉన్నట్లు కనిపించలేదు.

అదే విషయం అనిరుద్‌ని అడిగాను. హై వే లో లేవు కానీ కార్న్, సొయా చిక్కుడు, క్రాన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, పీచెస్ వంటి పండ్లు టమాటా, వంకాయ వంటి కొన్ని కూరగాయలు పాలకూర వంటి ఆకుకూరలు పండుతాయని చెప్పాడు అనిరుద్.

మాటల్లో సమయం తెలియకుండా గంట గడిచిపోయింది. అంతలో వాసు ఫోన్.. తాను ఎక్కడ ఉన్నది తెలుపుతూ ఒక లింక్ పంపాడు వాసు.

సాధన ఎవరు ఎక్కడ ఉన్నది ట్రాక్ చేస్తూనే ఉన్నది. నెక్స్ట్ వచ్చే పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆగమని చెప్పాడు వాసు. వర్షం పడుతూనే ఉంది.

సమయం రెండు కావస్తున్నది. బెల్ల్మర్ దగ్గర ఉన్న డంకిన్ డోనట్స్ షాప్‌లో ఆగాం. పిల్లలకు డోనట్స్ తీసుకున్నాడు అనిరుద్. అంతలో రాజేష్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాడు.

వాసు కోసం ఎదురుచూస్తూ ఉండగా రాజేష్ చికెన్ నగ్గెట్స్ తీసుకొచ్చాడు. మా లగేజ్ వాసు కారులోకి డంప్ చేసి అనిరుద్, చింటూ (రాహుల్‌ని చింటూ అంటాం) బై చెప్పి మేము కూడా అందులోకి మారిపోయాం.

మళ్ళీ ప్రయాణం ప్రారంభం. రాజేష్ తల నొప్పిగా ఉందంటూ మౌనంగా కూర్చున్నాడు.

వాసు మా పెళ్లి నాటికి ఎనిమిదో తొమ్మిదో ఏళ్ల పిల్లవాడు. వాసు, శశి అన్నదమ్ములు ఇద్దరు నాకు బాగా దగ్గరైన పిల్లలు. వాసు ఇండియా వచ్చినప్పుడు మాకు మాట్లాడే సమయం చాలా తక్కువ చిక్కింది. ఇక ఇప్పుడు మేము మాట్లాడుతూనే ఉన్నాం. వాసు మారథాన్ రన్నర్. ఐదు ఖండాలలో తన రన్నింగ్ చేశాడు. ఆ విషయాలు, విశేషాలతో పాటు అమెరికాలో తెలుగు వాళ్ళ జీవితం గురించి, పిల్లల గురించి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో తిరిగొచ్చి మాట్లాడుతూనే ఉన్నాం.

పిల్లలు అప్పుడప్పుడు మాట్లాడుతూ, రాజేష్ బాగోలేదని సైలెంట్ అయ్యాడు. ఇక సాధన, వాసు, నేను ఎన్నో ఏళ్ల మాటలే మాటలు.

మరుసటి రోజు తెల్లవారుఝామున అట్లాంటాలో ఉన్న మా మూడో ఆడపడుచు కూతురు శాంతి వాళ్ళింటికి ప్రయాణం కోసం ముందే టికెట్ బుక్ చేసారు. మా సాధన రాజేష్ వాళ్ళు నా రాక కంటే ముందే వాసు ఇంట్లో వర్జీనియాలో ఓ వారం ఉండి చుట్టుపక్కల అన్ని చూశారు. వాషింగ్టన్ డిసి కూడా చూశారు.

అందుకే వాసు నాకు కూడా డిసి చూపించాలని అనుకున్నాడు. దూరం నుంచే వార్ మెమోరియల్ కనిపించింది. సాయంత్రం ఐదు కావొస్తున్నది. మసక చీకట్లు అలుముకుంటున్నాయి. అయినప్పటికీ లింకన్ మెమోరియల్‌కి తీసుకెళ్లాడు. రాజేష్ పిల్లలు కార్లోనే కూర్చున్నారు. నేను సాధన, వాసుతో పాటు లింకన్ మెమోరియల్ చూడడం కోసం కారు దిగేసరికి చలిగాలి ఈడ్చి కొట్టింది. పార్కింగ్ నుండి దాదాపు కిలోమీటరు నడవాలి. కావాలంటే సైకిలు తీసుకోవచ్చు. సైకిల్ స్టాండ్‌లో సైకిళ్ళు ఉన్నాయి. చుట్టుపక్కల అంతా నడవాల్సి వస్తుందని ఆ ఏర్పాటు అట. ఎక్కడ అద్దెకు తీసుకుంటే అక్కడే ఇవ్వాలన్న రూల్ లేదు. ఎక్కడ స్టాండ్ లోనైనా ఇవ్వొచ్చు.. బాగుంది కదా!..

ప్రకృతి నియమాలకు తలవంచిన చెట్లన్నీ ఆకులు రాల్చేసి సరికొత్తగా చిగురించడానికి ఆశగా ఎదురుచూస్తున్నట్లుగా అనిపించింది. దీపాల కాంతుల్లో వెలిగిపోతున్న లింకన్ మెమోరియల్ కేసి వడివడిగా మా అడుగులు.

అంత చలిలోనూ లింకన్ మెమోరియల్ చాలా సందడిగా ఉంది. పేదరికంలో పుట్టిన నల్లజాతి పిల్లవాడు అమెరికన్ సామ్రాజ్యాన్ని ఏలడం చిన్న విషయం కాదు కదా..

అమెరికా 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ అంతెత్తున ఎంతో ఠీవిగా కూర్చున్న విగ్రహం చూస్తుంటే గొప్ప స్ఫూర్తిని ఇస్తున్నట్లుగా తోచింది.

అటువంటి లింకన్‌ని పలకరించకుండా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు ఎలా వెళ్ళగలరు? అందుకే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అంత మంది అక్కడికి వచ్చి ఉంటారనిపించింది. ఎవరికివాళ్లు లింకన్‌తో ఫోటోలు తీసుకుంటున్నారు. మొబైల్‌లో జ్ఞాపకాలు పదిల పరుచుకుంటున్నారు.

అక్కడి వారు, ప్రభుత్వం జాతీయ సంపదగా కాపాడుకునే ఆ ప్రాంతం రాత్రి పగలు తేడా లేకుండా పర్యాటకులను ఆహ్వానిస్తుంది. అలరిస్తుంది.

మెమోరియల్ హాల్ పైకి వెళ్లి చూసి రావడానికి సమయం సరిపోదని వెళ్ళలేదు. లింకన్‌కి హలో చెప్పి జ్ఞాపకంగా ఫోటోలు తీసుకుని బై చెప్పి బయలుదేరాం.

ఆ ప్రాంతం గురించి ఉత్సాహంగా చెబుతూ వాసు డ్రైవ్ చేస్తున్నాడు. జఫర్సన్ మెమోరియల్, కాపిటల్ బిల్డింగ్, శ్వేతసౌధం అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి. సమీపంలోనే ఆఫ్రికన్ అమెరికన్ నేషనల్ మ్యూజియం ఇంకా చాలా మ్యూజియంలు ఉన్నాయి. అవి చూడాలంటే కనీసం ఒక రోజు కావాలి. మా దగ్గర సమయం లేదుగా..

అన్నిటినీ కారులో ఒక రౌండ్ వేసి చూపించాడు. అలా తిరుగుతున్నప్పుడు నన్ను బాగా ఆకర్షించినవి రోడ్డు పక్కగా ఇంకా ఆకులు రాల్చని పచ్చని చెట్లు, విద్యుత్ దీపాలతో అలంకరణ, వీధి దీపాల కింద వరుసగా ఉన్న బోల్డన్ని ఫుడ్ వ్యాన్ లు. అన్ని దేశాల రుచులను తృప్తిపరచే ఫుడ్ ట్రక్స్.. చాలా కలర్ ఫుల్‌గా. వాటిని చూస్తుంటే మా ఊళ్ళో బండెనుక బండి కట్టి వరుసగా పోయే చెరుకు బళ్ళు గుర్తొచ్చాయి.

పర్యాటకులు రద్దీగా ఉన్న సమయం కాదని కొన్ని ట్రక్స్ మూసేసి ఉన్నాయి. కొన్ని మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతుంటే పగలు ఇంకా ఎక్కువ ఉంటాయని, పర్యాటకుల ఆకలి, ఆఫీసుల్లో పనిచేసే వారి ఆకలిని తీర్చేది ఆ బళ్ళేనని చెప్పాడు వాసు.

మన దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా అట్లా వీధి బళ్ళమీదే ఫుడ్ కొనుక్కుని నడుస్తూనో లేదా రోడ్డుపక్కనే కూర్చునో, నుంచునో, పార్కుల్లోనో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ముగించడం చూసిన దృశ్యాలు గుర్తొచ్చాయి.

వాసు ఇంటికి చేరేసరికి పిల్లలు సన్సిత, ఇశ్విత, అలేఖ్య ఎదురుచూస్తున్నారు. సౌరవి, వాసు చిన్నకూతురు ఇశ్వితను కలిసే ఎక్సయిట్మెంట్‌తో ఉంది. గత వారం ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అందుకే ఆ ఎదురుచూపులు.

తర్వాత వాసు బయటకు వెళ్తూ నన్ను రమ్మన్నాడు. వాసుతో అక్కడి వాల్‌మార్ట్‌కి వెళ్ళాను. ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు ముఖాలు బాగా కనిపించాయి. తెలుగువాళ్ళ పిండివంటలు అరిసెలు, లడ్డూలు, సున్నుండలు, కారప్పూస వంటివన్నీ కనిపించాయి. ఆ సెక్షన్‌లో ఉన్న సమయంలో ఇండియాలో ఉన్న డి మార్ట్, మోర్ వంటి షాపుల్లో ఉన్నట్లే అనిపించింది.

శ్రీకాంత్ మా పెద్దమ్మ మనుమడు. వాసుకి శృతి పెళ్ళిలో పరిచయం అయ్యాడు. ఒకరికొకరు దగ్గరలోనే ఒక కిలోమీటరు దూరంలోనే ఉన్నారు. ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. మేం వర్జీనియా వస్తున్నామని తెలిసి శ్రీకాంత్ ఆ పూట డిన్నర్‌కి తీసుకురమ్మని వాసుతో చెప్పాడు. అలేఖ్య అప్పటికే సిద్ధం చేసింది కాబట్టి భోజనానికి కాదు కానీ వచ్చి చూసి వెళ్తామని చెప్పా.

రాజేష్‌కి అస్సలు బాగోలేదు. అందుకే వెళ్లోద్దని నిర్ణయించుకుని ఆ విషయం చెబుదామని శ్రీకాంత్‌కి ఫోన్ చేస్తే వాళ్ళావిడకి, మా వదినకి కూడా బాగోలేదని చెప్పాడు.

తెల్లవారుజామున మా ఫ్లైట్. కానీ రాజేష్‌కి బాగుండక పోవడం వల్ల మా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాం.

వర్జీనియాలో మేం చూసిన విషయాలతో మరో సారి కలుద్దాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

Exit mobile version