[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సంగదోషం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 15వ అధ్యాయం, 5వ శ్లోకం
నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః।
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్॥
దురభిమానము మరియు మోహము లవలేశమైనా లేనివారు, మమకారమనే అనురక్రి లేనివారు, నిరంతరం ఆత్మ జ్ఞానం పొందడంలో మరియు భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు తమ భౌతిక జీవితం అనంతరం, ఇటువంటి ముక్తజీవులు నిస్సందేహంగా నా పరమపదమును చేరుకుంటారు అని అర్జునుడిని నిమిత్తం చేసుకొని భగవానుడు మానవాళికి బోధించాడు.
భ్రాంతి, తప్పుడు గౌరవం, చెడు సాంగత్యం నుండి దూరంగా ఉన్నవాడు; శాశ్వత సత్యాన్ని గ్రహించినవాడు; భౌతిక ఆశలు, సుఖదుఃఖాల ప్రభావాన్ని దాటినవాడు; పరమాత్మునికి ఎలా శరణు కావాలో తెలిసినవాడు అతడే ఆ శాశ్వత లోకాన్ని పొందగలడు. భగవానుడు మానవులను అనుక్షణం ఆందోళనకు, అశాంతికి గురి చేసే ద్వందాల నుండి విముక్తి పొంది, ద్వందాతీత స్థితికి చేరుకోమని కూడా సూచిస్తున్నాడు. ఇటువంటి సాధకులనే స్థితప్రజ్ఞులని అంటారు. వీరు జీవితం లోని సుఖం-దుఃఖం, గౌరవం-అవమానం, ధర్మం-అధర్మం, మంచి-చెడు వంటి అన్ని వ్యతిరేక అనుభవాల ప్రభావం నుండి బయటపడతారు. ఇలాంటి సాధకుల మనసు అనుబంధం, ద్వేషం అనే రెండింటినీ దాటి, జ్ఞానంలో నిలకడగా ఉంటుంది. ప్రపంచంలోని మార్పులు అతనిని కదిలించవు; శరీరానికి కలిగే బాధ – ఆనందాలు, మనసులో నిత్యం పడిలేచే అశాంతి మరియు సంతోష తరంగాలు అతన్ని ప్రభావితం చేయవు. అందుకే స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ అంతరంగ ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ, శాంతిలో నిలిచి జీవిస్తాడు.
సంగదోషం గురించి భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో ఒక అద్భుతమైన పద్యం ద్వారా వివరించాడు.
జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం మనోన్నతిం దిశతి పాపమపాకరోతి
చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్
ఈ శ్లోకం సత్సంగతి వల్ల కలిగే గొప్ప ప్రయోజనాలను మరియు ఇందుకు వ్యతిరేకంగా సంగదోషం (దుష్టసాంగత్యం) యొక్క కీడుని వివరిస్తోంది.
మంచి సాంగత్యం – ఇది బుద్ధిలోని మందత్వాన్ని తొలగిస్తుంది. మాటలలో సత్యాన్ని నింపుతుంది అంటే నిజాయితీగా మాట్లాడేలా చేస్తుంది. మనస్సుకు ఉన్నతిని, గౌరవాన్ని ఇస్తుంది. పాపాలను, చెడు పనులను దూరం చేస్తుంది. మనస్సును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుతుంది.
అన్ని దిక్కులలో కీర్తిని, మంచి పేరును వ్యాపింపజేస్తుంది. మంచి స్నేహం ఇన్ని మేలు చేస్తుంది కాబట్టి, దానికి విరుద్ధమైన సంగదోషం (చెడు స్నేహం) ఈ ప్రయోజనాలన్నిటికీ నష్టం కలిగించి, మనిషిని పతనానికి దారి తీస్తుందని దీని అంతరార్థం.
