[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 14
రాగ ప్రకరణము:
మిక్కిలి పురాతన కాలంలో ఋగ్వేదమును సాధారణంగా ఒకే శైలియగు స్వరిత (స)లో పాడుచుండెడివారు. కాని ఆ తరువాత ఉదాత్త (రి), అనుదాత్త (ని) స్వరములను చేర్చి పాడుచుండెడివారు. ఈ విధముగా ఋగ్వేద గానంతో ప్రారంభమయిన ఏక స్వర కొలత రిసని, అను త్రి స్వర కొలత గాను; ఆ తరువాత గరిసనిద అను పంచ స్వర కొలత గాను; ఆ తరువాత మగరిసనిదప అను సప్త స్వర కొలత గాను వృద్ధి చేయబడినది. ఈ విధంగా ఏర్పడిన సంపూర్ణ కొలతయగు యీ మగరిసనిదప లో సనిదప అను భాగమును హెచ్చు స్థాయి నుండి పాడినప్పుడు అది ఒక సంపూర్ణమైన స్థాయి (ఆక్టేవు)గా ఏర్పడును. భారతీయ సంగీత చరిత్రలో యీ స్థాయిని కనిపెట్టిన పద్ధతి అతి ముఖ్యమైనదనియు, అప్పటి నుండే సంగీత కళ యథార్థంగా ప్రారంభమైనదనియు చెప్పవచ్చును. ఋగ్వేదములో కూడా యీ స్థాయిలు 3 విధాలు. అవి ఒక దాని కంటే మరొకటి యొకటి హెచ్చు స్థాయిలో పాడదగుననియు చెప్పి యుండుటచే యీ త్రి స్థాయి పద్ధతి సుమారు మూడు వేల సంవత్సరాల క్రిందటనే ఆమోదించబడినట్లు మనకు స్పష్టమగుచున్నది.
స్వరిత స్వరము:
ఋగ్వేద గానములో పలుకు మధ్య స్వరమగు ‘స’ అను స్వరిత స్వరమని చెప్పబడును.
ఉదాత్త స్వరము:
ఋగ్వేద గానములో పలుకు హెచ్చు స్వరమగు ‘రి’ ని ఉదాత్త స్వరమని చెప్పబడును.
అనుదాత్త స్వరము:
ఋగ్వేద గానములో పలుకు తగ్గు స్వరమగు ‘ని’ ని అనుదాత్త స్వరమని చెప్పబడును.
స్వర సంఖ్యలను బట్టి రాగముల కేర్పడిన పేర్లు:
- 1 స్వరము కలది ఆర్సికము
- 2 స్వరములు కలది గాధిక యనియు
- 3 స్వరములు కలది సామిక యనియు
- 4 స్వరములు గలది స్వరాంతర యనియు
- 5 స్వరములు గలది జౌడవ యనియు
- 6 స్వరములు గలది షాడవ యనియు
- 7 స్వరములు గలది సంపూర్ణ మనియు చెప్పబడును.
శ్లో.
యోసా ధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః
రంజక జనచిత్తైనాం సరాగః కధితోబుధైః
శృతి, స్వరస్థాన, స్వర, వర్ణ, అలంకార, గమక, మూర్చన, ప్రయోగముల చేత విభూషింపబడి సంగీత రసిక జనుల చిత్తములను రంజిపజేయు నాద విభూతి రాగముగా శోభిల్లుచున్నది అని పండితులు నిర్వచించిరి.
‘రాగము’ భారతదేశ సంగీతము యొక్క విశిష్టత ప్రపంచ సంగీత రీతులలో భారతీయ సంగీతమును తన రాగము వలన ఒక ప్రత్యేక స్థానమును సంపాదించుకొనినది.
‘రాగము’ అను పదమునకు అనేక అర్థములు కలవు. కోరిక, రంగు, రంజనము, వన్నె, ఎరుపు వర్ణము, వర్ణము, వలపు, ప్రేత, అనురాగము, రక్తి, ఆనందము, ఉల్లాసము, శోభ, ప్రకాశము మొదలగునవి. పై వాటిలో ఎక్కువగా సంగీతమునకు సంబంధించినవే.
కర్నాటక సంగీతము రాగమయము. కల్పిత సంగీత రచనలు అనగా పాటలు, స్వరజతులు, వర్ణములు, కృతులు, కీర్తనలు, జావళీ పదములు మొదలగు అన్నియు రాగ రూపములే. మనోధర్మ సంగీత శాఖలైన రాగాలాపన, స్వరకల్పన, నెరవు, తానము, పల్లవి మొదలగు అన్నియును రాగ రూపములే. రాగ భూయిష్టము వలె రాగమునకు ఒక నాద రూపము ఉండును. రాగమునకు భావము, రసము ఉండును. రాగమునకు నిర్ణీత కాలము ఉండును. నవ రసములకు వటి భావములకు వివిధ రాగము లున్నవి. ఈ రాగ పద్ధతి సంగీత మహర్షుల సంగీత తపస్సుల హృదయములందు ఉద్భవించినది. మొట్టమొదట, మూర్చనలుగా ఉద్భవించి క్రమ పరిణామము చెందుచు జాతులుగా, రాగములుగా అభివృద్ధి చెందినవి. రాగమునకు పూర్వ రూపమైన ‘జాతి’కి పూర్వాచార్యులు మొదలు 10 తరువాత 3 కలిపి మొత్తం 13 లక్షణములు చెప్పిరి. రాగమునకు శృతులు, స్వరస్థానములు, గమకములు, సంగతులు, జౌడవ, షాడవ, సంపూర్ణ, వర్జ్య, వక్రాదులు, ఆరోహణ, అవరోహణలు, వాది, సంవాది అనువాదులు, గ్రహనాస్య, అంశ స్వరాదులు, మంద్ర మధ్యతార స్థాయిలు, బహుత్వ, అల్పత్వ స్వరములు మొదలగు అంశములు ఎన్నియో లక్షణములు కలవు.
“స్వర రాగ సుధా రసయుత భక్తి స్వర్గాపవర్గము రా
రాగసుధా రస పానము చేసి రంజిల్లవే మనసా”
‘రాగ రత్నమాలిక చే రంజిల్లునట’ – ఇట్లు అనేక విధములుగా రాగ మహత్యమును త్యాగరాజస్వామి కొనియాడిరి.
సంగీతము యొక్క పరమావధి ‘రాగము’.
రాగమును అవగాహనతో హృద్యముగా పాడుటలో ఎంత ఆనందము, ఎంత కష్టమున్నదో రాగమును అవగాహనతో ఆనందించుట అంత కష్టము అయినను రాగ అవగాహన లేకపోయినను అవ్యక్తమైన ఆనందమును ‘రాగము’ శ్రోతకు ఒసంగును.
క్రీ. శ. 1660 ప్రాంతమున వేంకటమఖి యను మహానుభావుడు ‘చతుర్దండి ప్రకాశిక’ యను గొప్ప సంగీత గ్రంథమును వ్రాసెను. సంగీత చరిత్ర యందు 72 మేళకర్తల పద్ధతిని విశదీకరించెను. వాటికి నామములు కల్పించెను. క్రమ సంఖ్య ఏర్పరిచెను. 3 రిషభములు, 3 గాంధారములతో ప్రస్తరించెను.
ఆధునిక కనకాంగి, రత్నాంగి, మేళకర్త నామములను ఒసగి వాటిని క్రమ సంపూర్ణములుగా దిద్ది, వాటికి కటపయాది సూత్రమును అన్వయించినది ‘అకళంక’ బిరుదు కలిగిన మహారాష్ట్ర సంగీత పండితుడు, సంగ్రహ చూదామని గ్రంథమును వ్రాసినవాడు, తంజావూరు ఆస్థాన విద్వాంసుడైన శ్రీ గోవిందాచార్యులు. ఆ తరువాత కనకాంబరి – ఫేనద్యుతి నామములు క్రమ సంపూర్ణములుగాను, కటపయాది సూత్రమునకు అన్వయించబడినవి.
రాగ పరిణామం – రాగ విభజన – రాగ ఆలాపన పద్ధతి:
ఋగ్వేదాన్ని ఆదిలో ఒక స్వరంతో ప్రవచనం చేసేవారు. అలా పాడటాన్ని ‘ఆర్చిక గానం’ అనేవారు. తరువాత రెండు స్వరాలలో గానం చేయడాన్ని ‘గాధిక గానం’ అనేవారు. తరువాత 3 స్వరాలతో గానం చేయడం ఆచారంలోకి వచ్చింది. అలా గానం చేయడాన్ని ‘సామిక గానం’ అనేవారు. ఇట్లు మూడు స్వరాలతో గానం చేసేటప్పుడు మధ్య స్వరాన్ని ‘సమాహారం’ అనీ, పై స్వరాన్ని ‘ఉదాత్తం’ అని క్రింది స్వరాన్ని ‘అనుదాత్తం’ అని అన్నారు. ఈ రకం అయిన వేదగానం ఈనాడు కూడ మనం వింటూ ఉంటాం.
సామ వేదాన్ని గానం చేసేటప్పుడు మాత్రం బుగ్వేద, యజుర్వేద గానానికి భిన్నంగా 7 స్వరాలలో పాడటం మొదలుపెట్టి, ఈనాడు 7 స్వరాలలో పాడుతూనే ఉన్నారు. స్వచ్ఛంగా, సంప్రదాయంగా, సంగీతబద్ధంగా తమిళనాడు, ఆంధ్రరాష్ట్రాల వేద పండితులు గానం ఆ విధంగా చేస్తున్నారు.
ఈ గానం, మగరిస నిదప అవరోహణ క్రమంలో అనగా మధ్యస్థాయిలో, మగరిస మంద్ర స్థాయిలో నిదప స్వరాలు ఉంటున్నాయి. ఈ స్వరాలు ఖరహరప్రియ స్వరస్థానాలుగా ఉంటున్నాయ. అనగా (చ॥రి; సా॥గ; శు॥మ; ప; చ॥దై; కై॥ని;) స్వరస్థానాలతో సామ వేదాన్ని గానం చేయటం జరుగుతున్నది.
యజుర్వేదం ఈ ప్రకారం 7 స్వరాలలో గానం నిర్ణీత బద్ధంగా చేస్తే అదే సామగానం అవుతుంది అని వేద పండితులు వివరించారు.
వేదాన్ని ఉదాత్త అనుదాత్త స్వరితాలతో పాడుతూ క్రమంగా 4 స్వరాలు (స్వరాంతరం) 5 స్వరాలు (జౌడవం) 6 స్వరాలు (షాడవం) 7 స్వరాలు (సంపూర్ణం) ఉపయోగిస్తూ పాడవచ్చని అన్నారు. ఆ సంగీతానికి వైదికగానం అన్నారు. కాలక్రమంగా సంగీతం కళాగానంగా పరిణామం చెందింది. సంగీతానికి ప్రాతిపదిక సామగానం, సామగాన స్వరాలు. సామగాన మూర్చన సంగీతానికి మూలం. సామగాన మూర్చన నుండి తక్కిన మూర్చనలు, జాతులు, రాగాలు, ఉద్భవించాయి.
సామగాన మూర్చనను, హరప్రియ, ముఖారి, చిత్తరంజని ఖరహరప్రియ అనే వివిధ పేర్లతో కాలవాహినిలో పిలుస్తూ వచ్చి ఈనాడు అనగా 72 మేళకర్తల కాలానికి ఖరహరప్రియగా స్థిరపడింది.
ఈ ఖరహరప్రియ రాగం నుండి క్రమంగా తోడి, కళ్యాణి, హరికాంభోజి, నరభైరవి, చ్యుతపంచమ తోడి; శంకరాభరణ రాగాలు గ్రహభేద స్ఫూర్తితో వెలువడి ప్రసిద్ధ రాగాలుగా ప్రకాశిస్తున్నాయి. ఈ ఖరహరప్రియ రాగమే షడ్జగ్రామము. చ్యుత పంచమ ఖరహరప్రియయే మధ్యమ గ్రామము. చ్యుత పంచమ తోడియే గాంధార గ్రామము. ఈ ప్రకారము భారతీయ సంగీతమునకు ప్రాతిపదిక సామగాన మూర్చనయే.
“మోదకర నిగ మోత్తమ సామ వేదసారం”
“సద్యోజాత ఆది పంచవక్త్రజ సరిగమపదనీ వరసప్తస్వర విద్యాలోలం” – త్యాగరాజు.
భారతీయ సంగీతము రాగ దశకు చేరిన తరువాత నిజమైన సంగీత అభివృది కళా విషయంగా ప్రారంభం అయింది.
రాగ విభజనలు:
సంగీత రత్నాకర కర్త శార్ఞ్గ దేవుడు, రాగ విభజన నిర్దుష్ట రూపములలో గావించెను.
1. మార్గ రాగములు:
అనగా శాస్త్ర బద్ధమైనవి. దేశకాల పరిస్టితులు ప్రభావములకు ప్రభావితము చెందనివి. శాశ్వతమైనవి. దేశ విస్తృతమైనవి. ఇవి ఆరు విధములు. (1) గ్రామ (2) ఉప (3) శుద్ధ (4) భాష (5) విభాష (6) అంతర్భాష రాగములు.
2. దేశ్య రాగములు:
అనగా దేశకాల పరిస్థితులను బట్టి మార్పు చెందు స్వభావము కలిగి ప్రజలలో వాడుకలో నుండు రాగములు (Applied, but classical). ఇవి 4 విధములు.
- రాగాంగ రాగములు: అనగా జనక రాగములు, ప్రసిద్ధ రాగములు, మేళకర్త రాగ సదృశములైన రాగములు. ఉదా: శంకరాభరణము మొ॥.
- ఉపాంగరాగములు: జన్య రాగములకు సదృశమైనవి. ఉదా: మోహన.
- భాషాంగ రాగములు: భారతదేశమునందు ఆయా భాషా రాష్ట్రములకు చెందినవి. (ఇప్పటి అర్ధము అన్యస్వరము కలిగినవి) ఉదా: సారంగ.
- క్రియాంగ రాగములు: ఉత్సవములందు, ఆయా రసములకు అనుగుణంగా ఉండు రాగములు. సన్నివేశానుకూల రాగములు. ఉదా: కదనకుతూహలం, కుంతల వరాళి మొ॥.
రెండవ విభజన
ఘన, నయ, దేశ్య రాగములు. ఘన రాగములు, ప్రసిద్ధ రాగములు, ఉదాత్త రాగములు ఎక్కువ అవకాశము కలిగి ఉండు విస్తృతమైన రాగములు; తానమును వీణపై వాయించు రాగములు (ఘనము=తానము).
- ఘనరాగములు: నాట; గౌళ; ఆరభి: వరాళి; శ్రీరాగము. ద్వితీయ ఘనరాగములు: రీతిగౌళ; నారాయణగౌళ; భౌళి : కేదారం, సారంగనాట.
- నయరాగములు: అనగా రక్తి రాగములు: బిలహరి, కేదారగౌళ, ఆనందభైరవి మొ॥.
- దేశ్యరాగములు: అన్యదేశ: అన్య సంప్రదాయ అనగా హిందూస్తానీ సంగీత శైలి నుండి తీసుకొనిన రాగములు. కాపి: బేహాగ్: మొ॥.
మూడవ విభజన – నారదుని విభజన (సంగీత మకరందము)
ముక్తాంగ కంపిత, అర్ధకంపిత, కంప విహీన రాగములు.
- ముక్తాంగ కంపిత రాగములు: సర్వ స్వర గమక, వరీక, రక్తి రాగములు. ఉ॥ తోడి; భైరవి మొ॥.
- అర్ధకంపిత రాగములు: తగు మాత్రంగా గమకములుండు రాగములు. ఉ॥ బిలహరి, బహుదారి మొ॥
- కంప విహీన రాగములు: కదనకుతూహలం, కుంతల వరాళి; మొ॥
4వ విభజన – మతంగుని రాగ విభజన (బృహద్దేశి గ్రంధము)
శుద్ద, ఛాయాలగ; సంకీర్ణ రాగాలు
- శుద్ధ రాగములు: శంకారాభరణం, కేదారగౌళ, మోహన మొ॥
- ఛాయాలగ (సాలగ) రాగములు: ఒక రాగమునందు ఇంకొక రాగచ్ఛాయ వచ్చు రాగములు; అసావేరి, రీతిగౌళ మొ॥
- సంకీర్ణ రాగములు: ఒక రాగమునందు కొన్ని ఇతర రాగచ్ఛాయలు వినిపించు రాగములు. ఇట్టి రాగములు అరుదు.
5వ విభజన – రామామాత్యుడు
ఈ రాగవిభజన రామామాత్యునిది. ఉత్తమ, మధ్యమ, అధమ రాగములు.
- ఉత్తమ రాగములు: ప్రసిద్ధ రాగములు. ఎక్కువ మందికి తెలిసి ఎక్కువ అవకాశముతో అనేక రచనలు కలిగి, మనోధర్మ సంగీతము (రాగ ఆలాపన, స్వరకల్పన, నెరవు, తానము, పల్లవి)నకు అవకాశము కలుగు రాగములు.
- మధ్యమ రాగములు: పరిమితి కలిగిన అవకాశము, ప్రాచుర్యం కలిగి, పరిమితమైన సంఖ్యగల రచనలు కలిగి, మనోధర్మ సంగీతమునకు తగు మాత్రంగా అవకాశము కలిగిన రాగములు. బహుదారి, కన్నడగౌళ మొ॥.
- అధమ రాగములు: ఒక్కటి, రెండు, రచనలు కలిగి మనోధర్మ సంగీతానికి అవకాశం లేక గమకము లేక, నామ మాత్రంగా ఉండి ప్రాచుర్యం లేని రాగములు. ఉదా॥ జింగ్లా; వసంతభైరవి మొ॥.
6వ విభజన – సూర్యాంశ, చంద్రాంశ, గౌడ, రాగములు (నారదుని సంగీత మకరంద విభజన)
సూర్యాంశరాగములు – పగటి వేళ పాడదగు రాగములు.
ఉదయం: ఉదా: గాంధార, జయసాక్షి, సామవేది మొ॥ 20 రాగములు.
మధ్యాహ్నం: శంకరాభరణం, కాంభోజి, పూర్వి బలహంస, మొ॥ 14 రాగములు.
చంద్రాంశ రాగములు: శుద్ధనాట, కురంజి; సారంగ, ఛాయ; మొ॥ 19 రాగములు.
సూర్యాంశ చంద్రాంశ రాగములు: ఉదయము, సాయంకాలము పాడదగిన రాగములు. దేశాక్షి, మాహురి, ఆందోళి, భైరవి, రమాకృతి మొ॥ 10 రాగములు.
గౌడ రాగములు: మధ్యాహ్నం 12 గం॥ నుండి 3 గంటల వరకు పాడతగు రాగములు శుద్ధ సారంగ, వరాళి, ద్రవతి మొదలైనవి.
7వ విభజన – నారదుని విభజన – స్రీ పురుష, నపుంసక రాగములు
- స్రీ రాగములు: కురంజి, బిలహరి, వరాళి, గౌళ మొదలైనవి.
- పురుష రాగములు: భైరవి, భూపాలము, శ్రీరాగము మొదలైనవి.
- నపుంసక రాగములు: ఇవి ప్రశ్నార్థకములు, ఈ విభజనకు తార్కిక విలువ లేదు.
8వ విభజన – నారదుని విభజన- ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర రాగములు
రాగ కాల నిర్ణయ పద్ధతి యందు అనుసరించ తగు రాగములు. ఈ పద్ధతి హిందూస్థానీ సంగీత పద్ధతి యందు ఇప్పటికిని అనుసరించబడుచున్నది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారు ఝాము వేళలకు వివిధ రాగములు నిర్ణయించబడి ఆచరించబడుచున్నది.
ఉదయ రాగములు: బిలహరి, మలహరి; ముఖారి, భైరవి మొ॥నవి.
మధ్యాహ్న రాగములు: శ్రీరాగము, మధ్యమావతి, కళ్యాణి మొ॥నవి.
9వ విభజన – పుత్ర, మిత్ర, కళత్ర రాగములు
- పుత్ర రాగములు – జన్యరాగములకు సదృశమైనవి.
- మిత్ర రాగములు – పేర్లను బట్టి దగ్గర దగ్గర రాగములు రంజని, నిరంజని, జనరంజని మనోరంజని మొ॥. రాగచ్ఛాయను బట్టి దగ్గర రాగములు జనరంజని-పూర్ణచంద్రిక; రీతిగౌళ-ఆనందభైరవి; ఆరభి-దేవగాంధారి.
- కళత్ర రాగములు: భర్త, శంకరాభరణం – కళత్రం, బిలహరి. భర్త కళ్యాణి, కళత్రం మోహన కళ్యాణి.
10వ విభజన
ఈ విభజన హిందూస్థానీ సంగీత పద్దతి యందలిది: రాగ, రాగిణి, పరివారపద్ధతి, ఈ విభజన కూడ జనక, (కళత్ర, మిత్ర) జన్య రాగ పద్ధతికి సదృశమైనదియే.
రాగము అనగా పురుష రాగము. రాగిణి అనగా కళత్ర రాగము.
11వ విభజన – పురాతన తమిళ సంగీత సంప్రదాయమున గల రాగవిభజన:
ఈ సంప్రదాయమున హరి కాంభోజి ప్రధాన రాగము.
- పణ్ = రాగము, మేళకర్త రాగము
- తిరమ్ = జన్యరాగము.
- పణ్ విభాగములు మూడు.
- ఎహల్ పణ్ = పగలు పాడబడు రాగము
- ఇరవు పణ్ = రాత్రి పాడతగు రాగము
- పాదు ప్పణ్ = అన్ని వేళల పాడుకొనదగు రాగము.
12వ విభజన – పార్శ్వ దేవుని వివరణము
ఈ విభజన రాగాంగ, ఉపాంగ, భాషాంగ, క్రియాంగ రాగములను, సంపూర్ణ, షాడవ, జౌడవ రాగములతో ప్రస్తరించగా 12 రాగ విభజనలు వచ్చును.
13వ రాగ విభజన
- పంచమాంత్య రాగములు – నవరోజు – సరిగమప – పమగరిసనిదప
- ధైవతాంత్య రాగము – కురంజి – సనిసరిగమపద – దపమగరిసనిస
- నిషాదాంత్యరాగములు – నాదనామక్రియ : చిత్తరంజని – సరిగమపదని – నిదపమగరిసనిసా
14వ రాగ విభజన
సంపూర్ణ, షాడవ జౌడవ రాగ భేదములు.
- సంపూర్ణ రాగం: సప్త స్వరములతో ఉండెడి రాగము – ఖరహరప్రియ
- షాడవ రాగము: ఆరు స్వరములతో గల రాగము. శ్రీరంజని
- జౌడవ రాగము – అయిదు స్వరములతో కలిగిన రాగము. మోహన.
వీటిని ప్రస్తరించగా ఈ దిగువ నుదహరించిన భేదములు వచ్చును.
- స౦పూర్ణ సంపూర్ణం – సంపూర్ణ షాడవం – సంపూర్ణ జౌడవం
- షాడవ సంపూర్ణం – షాడవ షాడవం – షాడవ జౌడవం
- జౌడవ సంపూర్ణం ; జౌడవ జౌడవం ; జౌడవ షాడవం
ఇవి మరల శుద్ధ సంకీర్ణ వక్ర భేదములగును.
ఉదాహరణకు:
- శుద్ధ జౌడవ రాగము – మోహన
- సంకీర్ణ జౌడవ రాగము – ఆందోళిక – సరిమపనిస – సనిదమరిస
- వక్ర జౌడవ రాగము – భోగిసింధం. సపమపదనిస – సనిదనిపమస
- శుద్ధషాడవ రాగము – శ్రీరంజని సరిగమదనిస
- సంకీర్ణ షాడవ రాగము – కన్నడగౌళ సరిగమపనిస – సనిదపమగస
- వక్ర షాడవ రాగము – గౌళ – సరిగమ రిమపనిస – సనిపమరిగమరిస
- శుద్ధ సంపూర్ణము
- సంకీర్ణ సంపూర్ణము
- వక్ర సంపూర్ణము
15వ విభజన – వక్రరాగ విభజన
1.వక్ర సంపూర్ణము 2. వక్ర క్రమ సంపూర్ణము 3. వక్రషాడవము 4. వక్ర క్రమ షాడవము 5. వక్ర జౌడవము 6. వక్రక్రమ జౌడవము.
ఆరోహణ వక్ర సంపూర్ణ, షాడవ, జౌడవ భేదములు
అవరోహణ వక్ర సంపూర్ణ, షాడవ, జౌడవ భేదములు
ఉభయ వక్ర సంపూర్ణ, షాడవ, జౌడవ భేదములు
షాడవ జౌడవ రాగములు వర్జ్య రాగముల క్రిందకు వచ్చును.
16వ విభజన
భాషాంగ రాగములు, అనగా అన్య స్వరస్థానములు కలిగిన రాగములలో, ఏకాన్యస్వర, ద్విఅన్యస్వర, త్రిఅన్యస్వర, బహు అన్యస్వర భాషాంగ రాగములు; మూర్చన యందు అన్యస్వరములు కలిగిన భాషాంగరాగములు, ప్రయోగమునందు అన్యస్వరములు కలుగు రాగములు కలవు.
17వ విభజన
అర్ధ భాషాంగ రాగములు. అనగా స్వరస్థానము ఒకటే అయినను శృతుల యందు భేదములు కలిగినచో అవి అర్ధ భాషాంగ రాగములనుట వాడుక యందు కలదు. ఉదా: శహన రాగమున, సావేరి రాగమున, ఆహిరి రాగమున అంతర గాంధారము ఒక శృతి తక్కువగా పలుకును. ఈ రాగములను అర్ధ భాషాంగ రాగములనుట కద్దు.
18వ విభజన
మూర్చన ప్రధాన రాగములు – కళ్యాణి, భైరవి మొ॥.
ప్రయోగ ప్రధాన రాగములు – అఠాణా, ఆహిరి యదుకుల కాంభోజి మొ॥.
19వ విభజన
పూర్వాంగ ప్రధాన రాగములు – ద్విజావంతి, శహన, మొ॥.
ఉత్తరాంగ ప్రధాన రాగములు – అఠాణా, మొ॥ ఉత్తరంగ ప్రధాన రాగములు అరుదు.
20వ విభజన
పూర్వ ప్రసిద్ధ రాగములు: ఆధునిక ప్రసిద్ద రాగములు అనగా పూర్వం ప్రసిద్ధి అయిన రాగముల మూర్చనల యందు కొద్ది మార్పులతో నూతన నామములతో ప్రకాశించు రాగములు. మలహరి – సావేరి; దేశాక్షి – బిలహరి; సాళగభైరవి – ముఖారి.
21వ విభజన
ప్రసిద్ధ రాగములు తోడి, కళ్యాణి మొ॥
రక్తి రాగములు – బిలహరి, శహన మొ॥
అపూర్వ రాగములు – ఘంటా, పాడి, రేగుప్తి మొ॥
22వ విభజన
మేళకర్త రాగములు 16 ప్రకృతి, వికృతి స్వరములను ప్రస్తరించగా వచ్చు 72 మేళకర్తలు.
23వ విభజన
సువాది వివాది మేళకర్త రాగ విభజన. ఈ 72 మేళకర్తల యందు సువాది రాగములు 32 మేళకర్త రాగములు సహజములు.
40 వివాది మేళములు: ఈ రాగములు అసహజములు అయినను కర్ణాటక సంగీతమున మాత్రము ప్రచారములో ఉన్నవి. 32 మేళకర్తలు ప్రకృతి సిద్ధమైన 12 స్వరస్థానములను ప్రస్తరించగా వచ్చిన స్వరస్థాన మేళకర్తలు. తక్కిన 40 మేళకర్తలు, మారు పేర్లతో అనగా షట్ముతి రిషభం, శుద్ధ గాంధారం, షట్ముతి ధైవతం, శుద్ధ నిషాధం అను వికృతి స్వరములలో ఏ ఒక్కటైనను కలిగిన మేళములు వివాది మేళములు.
కటపయాది సూత్రము:
72 మేళకర్తల నామములకు ఆ మేళకర్త సంఖ్యను తెలుసుకొనగలుగునట్టు, మేళ నామముల మొదటి రెండు అక్షరములను ఏర్పరచిరి, ఆ ఏర్పాటునకు క, ట, ప, యాది ఆది సూత్రము అని పేరు.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.