[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 8 గ్రామ మూర్ఛన జాతి పద్ధతి, ప్రాచీన రాగ పద్ధతి
భారతీయ సంగీతమునకు అతి ప్రాచీనమైన చరిత్ర ఉందనుటకు ఆధారములు గలవు.
సామవేదములో ఉచ్చరించపబడు స్వరములే భారతీయ సంగీతమునకు ఆధారములయినవని మనకు లక్షణకారుల వలన తెలియును. ఇప్పటి ఖరహరప్రియ లోని స్వరములే అప్పటి ఆది మేళము. ఇప్పటి రాగపద్ధతి అభివృద్ధి గాని, ఆ కాలములో షడ్జమము నుండి నిషాదము వరకు గల ఖరహరప్రియ స్వరములే మొట్టమొదటి మూర్ఛన. ఆ మూర్ఛనలో రిషభము మేళము వచ్చినది. ఇట్లే గాంధారము వద్ద, మధ్యమము వద్ద, పంచమ, దైవత, నిషాదముల వద్ద కూడా మూర్ఛనలు ఉత్పన్నమైనవి.
ఇట్లు పైన చెప్పిన ఆది మేళములో షడ్జ మూర్ఛనతో పాటు మరొక ఆరు మూర్ఛనలు వచ్చుట వలన మొత్తము 7 మూర్ఛనలను కలిపి ఒక ‘గ్రామము’ లేక ‘మండలము’ అనిరి. దీనినే ‘షడ్జ గ్రామము’ అందురు. తర్వాత రిషభము వద్ద వచ్చిన మూర్ఛనను ఆధారము చేసికొని తిరిగి పై విధముగానే ప్రస్తరించగా మరొక గ్రామము (రిషభ గ్రామము) ఉద్భవించినది. ఇట్లే గాంధార గ్రామము, మధ్యమ గ్రామము మొదలగునవి ఉత్పన్నమైనవని చెప్పుదురు. కాని అందుకొన్ని శ్రావ్యముగాను, ఆచరణ యోగ్యముగను యుండకపోవుటచే తక్కినవన్నియు విసర్జించి షడ్జ గ్రామము, గాంధార గ్రామము, మధ్యమ గ్రామములను మాత్రమే పేర్కొనిరి.
పై విధముగా 3 గ్రామములతో కలిపి (3 x 7) 21 మూర్ఛనలు ఉద్భవించినవి. ఈ మూర్ఛనలనే అలంకారముల వలె నుండి స్వర సమూహములతో పాడి వాటినే ‘జాతులు’ అని పేర్కొనిరి. ఒక విధముగా చెప్పవలెనన్న అప్పటి జాతులే నేటి గమక యుక్తమైన రాగములైనవి.
షడ్జ గ్రామము | గాంధార గ్రామము | మధ్యమ గ్రామము |
స రి గ మ ప ద ని | గ మ ప ద ని స రి | మ ప ద ని స రి గ |
రి గ మ ప ద ని స | మ ప ద ని స రి గ | ప ద ని స రి గ మ |
గ మ ప ద ని స రి | ప ద ని స రి గ మ | ద ని స రి గ మ ప |
మ ప ద ని స రి గ | ద ని స రి గ మ ప | ని స రి గ మ ప ద |
ప ద ని స రి గ మ | ని స రి గ మ ప ద | స రి గ మ ప ద ని |
ద ని స రి గ మ ప | స రి గ మ ప ద ని | రి గ మ ప ద ని స |
ని స రి గ మ ప ద | రి గ మ ప ద ని స | గ మ ప ద ని స రి |
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.