[శ్రీపతి లలిత గారు రచించిన ‘సంగీతారాధ్య’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
1
హైదరాబాద్, హైటెక్ సిటీలో టెక్నాలజీ, మోడర్న్ ఫ్యాషన్‌తో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా మేళవించి ఉంటాయని రుజువు చేస్తూ, పెద్ద పెద్ద కంప్యూటర్ కంపెనీల మధ్య వెలిసిన శిల్పకళా వేదిక మీద, త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.
స్టేజి మీద గాయని, “నగుమోము కనలేని నా జాలి తెలిసి..” పాడుతుంటే, వింటున్న వేలమంది, వేరే లోకంలోకి వెళ్లిపోయారు. ‘ఖగరాజు.. నీ ఆనతి విని వేగా.. చనలేడో..’ అంటుంటే, కళ్ళముందు ఎగురుతున్న గరుత్మంతుడు, ఆయన మీద కూర్చున్న శ్రీమహావిష్ణువు కనిపిస్తూ, పారవశ్యంలో తేలి ఆడుతున్నారు. ‘గగనానికి ఇలకూ బహుదూరంబనినాడో..’ కీర్తన సాగుతుంటే, వినేవాళ్లకు మాత్రం, గగనానికి, ఇలకు అంత దూరం ఉన్నట్టు అనిపించడం లేదు. ఎదురుగా ఆ ‘జగమేలే పరమాత్మ’ కంటికి కనిపిస్తున్నాడు. చిన్నవాళ్లు ఉల్లాసమైన మనసుతో తలలూపుతుంటే, పెద్దవాళ్లు ఆనందబాష్పాలు కారుస్తూ, తన్మయత్వంలో మునిగిపోయారు.
ఇంతటి మాధుర్యాన్ని పంచుతున్నగాయని, చాలా కచేరీలు చేసి, భక్తిలో మునిగిపోయే వయసు వచ్చిన వృద్ధ కళాకారిణి కాదు, మంచి యవ్వనంలో ఉన్న ఇరవైరెండేళ్ల ఆరాధ్య. ఆమె ఎంత అనుభవిస్తూ పాడుతోందో, వింటున్నవారు రెట్టింపు ఆత్మానందం పొందుతున్నారు. కంచిపట్టు పరికిణీ, వోణీ, కుప్పెలు పెట్టి అల్లిన జడ, అందులో తురిమిన మల్లెలు, మెడలో సన్నటి గొలుసు, చేతులకి మట్టిగాజులు, ఏదో పాతకాలం సినిమాలో కథానాయికలాగా ఉంది, ఆరాధ్య.
ఆరాధ్య గురువు, శ్రీదేవి, పేరుపొందిన సంగీతకారిణి, ఎన్నో ఏళ్ళ నుంచి, ఎంతోమందికి, తన సంగీత అకాడమీలో సంగీతం నేర్పిన గురువు. ఆమె దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం అందరికీ దొరకదు. అలాంటి శ్రీదేవి ప్రియశిష్యురాలు, ఆరాధ్య.
అందరూ, ఆరాధ్య గాత్రాన్ని విని, ఆనందించడం, శ్రీదేవికి అంతులేని తృప్తినిచ్చింది.
ప్రోగ్రాం అయ్యాక, కార్యక్రమానికి తుదిమాట చెప్తూ “అందరూ, మేము శ్రీదేవి శిష్యులం అని చెప్తారు, కానీ, నేను ఆరాధ్య గురువుని అని చెప్పుకునే రోజు త్వరలోనే ఉంది” అని ముగించింది.
గ్రీన్ రూంలో ఆరాధ్య తల్లి హేమ, “నీ శిష్యురాలు, నీ పేరు నిలబెట్టింది, తనని చక్కగా తీర్చిదిద్దావు,” అన్న హేమతో, “మన శిశిర కూడా ఉంటే, ఎంత సంతోషించేదో!” అంది శ్రీదేవి కళ్లు చెమర్చగా.
“సరే! సరే! ఆరాధ్య వస్తే, మళ్లీ ప్రశ్నల పరంపర మొదలవుతుంది. త్వరలో మీ చెన్నై ప్రోగ్రామ్‌కి తయారవ్వాలిగా!” అంటూ సర్ది చెప్పింది హేమ.
అలా, హైదరాబాద్ నుంచి మొదలైన ఆరాధ్య సంగీత ప్రస్థానం, దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో, అక్కడినుంచి యూకే, అమెరికా చేరి, అక్కడి కర్ణాటకసంగీత ప్రియులని అలరించింది.
అన్ని పేపర్లలోనూ, యూట్యూబుల్లోనూ, ఆమె సంగీత విభావరి విశేషాలే.
దాదాపు ఆరునెలలపాటు ప్రపంచాన్ని చుట్టి, శ్రీదేవి ట్రూప్, ఆరాధ్య, హేమ, ఇంటికి చేరారు.
ఆరాధ్య కచేరీ విన్న తెలుగు, తమిళ, హిందీ సంగీత దర్శకులు చాలామంది, ఆమెని, తమ సినిమాల్లో ఒక్క పాటైనా పాడమని బతిమిలాడారు.
“ఒకసారి ఏ రకమైన పాటలు పాడితే, అలా, అవే పాడుతూ ఉండాలనిపిస్తుంది. ప్రస్తుతం, నేను శాస్త్రీయ సంగీతం మీదే దృష్టి పెట్టాను. అందుకని సినిమాల్లో పాడటం లేదు. నాకు సినిమాల్లో పాడాలనిపిస్తే, తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను” అంది ఆరాధ్య, వారితో మర్యాదగా.
“ఆరాధ్యా! మనకి ఇంకో పదిహేను రోజుల్లో, మళ్లీ చెన్నైలో కార్యక్రమం, ఆ తరువాత త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఉన్నాయి. ఒక వారం కొంచెం రెస్ట్ తీసుకో, మళ్లీ మనం సాధన మొదలుపెడదాం” అంది శ్రీదేవి.
“అమ్మలూ! మళ్లీ ట్రిప్ మొదలయ్యేలోపు నీకేం కావాలో చెప్పు. అన్నీ చేసిపెడతాను తిందువుగాని” అన్న హేమతో “నాకేమిష్టమో నీకు తెలీదా? నువ్వేం చేసినా తింటాను, కానీ నువ్వే నోట్లో ముద్దలు పెట్టాలి” తల్లి మెడ చుట్టు చేతులు వేసి, గారాబం పోతూ అంది ఆరాధ్య.
***
“ఆరాధ్యా! నీకు ఈ సంగీతం ఒక వృత్తిగా తీసుకోవడం ఇష్టమేనా? నేను బలవంతపెడుతున్నానా?” ఆరాధ్య వంక సీరియస్‌గా చూస్తూ అంది హేమ.
“ఇదేంటీ! ఇంత అనుమానం వచ్చింది నీకు? నేను అడిగితేనే కదా, నాకు సంగీతం నేర్పించావు. హిందూస్తానీ, లలిత సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ నాకు కర్ణాటక సంగీతమే నచ్చింది. నా జీవితాశయం, ప్రపంచమంతా నా సంగీతంతో అలరించాలి! ఆ సుబ్బులక్ష్మి అమ్మలాగా, శాస్త్రీయ సంగీతాన్ని, ప్రపంచం నలుమూలలా వినిపించాలి. నా ఆశ, ఆశయం అదే!” అరమోడ్పు కళ్ళతో, కలల్లో తేలిపోతూ అంది ఆరాధ్య.
“ఏమో తల్లీ! నువ్వు ఏమి చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ, ఏం చేసినా పూర్తిగా నీ మనసుకి నచ్చి చెయ్యాలి” ఆరాధ్య నుదుటి మీద ముద్దు పెడుతూ అంది హేమ.
“ముద్దులేనా, ముద్దలు లేవా?” కడుపు చూపిస్తూ అంటున్న ఆరాధ్యని చూసి, నవ్వు ఆపుకోలేకపోయింది హేమ.
“రేపు షాపింగ్‌కి కూడా వెళ్ళాలి, కొన్ని పరికిణీలు, చీరలు కొనాలమ్మా! ప్రతీ ప్రోగ్రామ్‌కి కొత్తవి కడితేనే బావుంటుంది. ఆ పాతవి ఏం చెయ్యాలో!” అంది ఆరాధ్య.
“హైదరాబాద్‌లోని పెద్ద బట్టల షాప్ వాళ్ళు, నీకు బట్టలు స్పాన్సర్ చేస్తారట, నువ్వు ఒక ఫోటో షూట్ చెయ్యాలి.” అంది హేమ.
“మనం ఒక్కసారి వేసిన బట్టలని, అనాథ శరణాలయంలో పిల్లలకి పంచేద్దాం” అన్న హేమతో,
“అవన్నీ నువ్వే చూడాలమ్మా! నువ్వు మళ్లీ ఆఫీసుకి వెళ్ళేలోగా, ఇవన్నీ చెయ్యాలి.” అంది ఆరాధ్య.
హేమ చార్టర్డ్ అకౌంటెన్సీ చేసి ఒక పెద్ద ఫర్మ్‌లో పార్టనర్‌గా ఉంది. ఆరాధ్య ఫారిన్ టూర్ కోసమని కొంతకాలం బ్రేక్ తీసుకుంది. హైదరాబాద్‌లో, పెద్ద పోష్ ఏరియాలో, మూడు బెడ్ రూమ్‌ల ఫ్లాట్‌లో, కూతురితో ఉంటుంది. హేమకి స్నేహితులే తప్ప, చెప్పుకోదగ్గ బంధువులు లేరు. ఆరాధ్య గురువు శ్రీదేవి, హేమకి చిన్ననాటి స్నేహితురాలు. శ్రీదేవి, ఆమె కుటుంబంను, హేమ తనకి ఉన్న ఒకే ఒక బంధువులు అనుకుంటుంది.
ఆరాధ్య చిన్నప్పటి నుంచి, చదువులో ఎంత టాప్‌లో ఉండేదో, సంగీతంలో కూడా, అంతే నంబర్ వన్‌గా ఉండేది. మొదట్లో, ఆరాధ్య టీవీలో వచ్చే పోటీల్లో పాల్గొంటానని, చాలా ఉత్సాహం చూపింది.
అప్పుడు హేమ, “ముందు చదువు పూర్తయ్యాక, నీకు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే అందులోకి వెళ్ళు. నేను ఏమీ అనను. హాయిగా పెళ్లి చేసుకుంటాను అంటే కూడా ఓకే.
కానీ, డిగ్రీ మాత్రం పూర్తవ్వాలి. ఈ లోగా నీకు ఇష్టమైన సంగీతం బాగా నేర్చుకో. అప్పుడు నువ్వు పోటీలకు వెళ్తావా, ప్రోగ్రాంలు ఇస్తావా? కచేరీ చేస్తావా! కాన్సర్ట్స్ ఇస్తావా, అవి నీ ఇష్టం.
నీకు ఇరవై ఏళ్లకి డిగ్రీ అవుతుంది. చదువు కూడా ఇదే చదవాలి, అని నిన్ను బలవంతపెట్టను, నీకు ఏ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చదువు” అంది.
ఆరాధ్య ఇంజనీరింగ్‌లో చేరింది. ఒకవేళ తను అనుకున్నట్టు, సంగీతమే వృత్తిగా చేసుకోలేకపోతే, ఇంజనీరింగ్ డిగ్రీతో ఏదో ఉద్యోగం వస్తుంది అని ఆ కోర్స్‌లో చేరింది.
నాలుగేళ్ల కోర్సులో, ప్రతీ కల్చరల్ ప్రోగ్రామ్‌లో ఆరాధ్య పాటలు ఉండేవి. ఒక ఏడాది, కాలేజీ కల్చరల్ సెక్రటరీగా కూడా ఉంది.
చదువు అయ్యాక, శ్రీదేవి సలహా మేరకు, కచేరీలు మొదలుపెట్టింది. మొదటి ట్రిప్ లోనే ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది.
మర్నాడు ఉదయం హేమ, ఆరాధ్య టిఫిన్ తిని, నెమ్మదిగా టీవీ చూస్తూ, రిలాక్స్ అవుతున్నారు. కాల్ బెల్ వినిపిస్తే, ఆరాధ్య లేచి తలుపు తీసింది.
సామాన్యమైన ఎత్తు, మంచి పసిమి రంగు శరీరం, రంగు వేసినట్లు తెలుస్తున్న క్లిప్ పెట్టిన నల్లని జుట్టు, ఎర్రటి జార్జెట్ చీర, స్లీవ్‌లెస్ జాకెట్టు, వయసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన మేకప్, ఒకప్పుడు మంచి అందగత్తే అనిపించేలా ఉన్న, సుమారు అరవై అయిదు ఏళ్ల ఆవిడ నిలుచుని “హేమ ఇల్లు ఇదేనా?“ అధికారం ధ్వనిస్తున్న గొంతుతో గట్టిగా అంది.
“అవును, మీరు ఎవరూ?” అంటూనే, లోపలికి రమ్మన్న ఆరాధ్యని పరీక్షగా చూసింది.
నైట్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని, జుట్టు పైకి క్లిప్ పెట్టింది.
నల్లటి పెద్ద కళ్లు, చిన్న నుదురు, సూటిగా ఉన్న ముక్కు, ఎర్రగా గుండ్రంగా నోరు, సొట్ట ఉన్న గడ్డం. ఏ మేకప్ లేకపోయినా, అందం ఒలుకుతున్న ఆరాధ్యని చూసి “అంతా మీ అమ్మలా ఉన్నావు” అంటూ లోపలికి వచ్చింది.
“ఎవరూ..” హేమకి వచ్చినావిడ ఎవరో అర్థమవ్వడానికి ఒక నిమిషం పట్టింది.
ఆవిడని గుర్తు పట్టగానే, హేమ మొహం ఒక్కసారిగా ముడుచుకుపోయింది.
“ఏం హేమా! నేనెవరో తెలియలేదా? తెలిసీ నాటకం ఆడుతున్నావా?” కటువుగా అంది.
“వసుంధర ఆంటీ! బావున్నారా?” ముఖాన నవ్వు పులుముకుంటూ అంది.
“నేను బానే ఉన్నాను, నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు, నా మనవరాలి సంపాదనతో కులుకుతున్నావు” వసుంధర కళ్ళలోనుంచి నిప్పురవ్వలు రాలాయి.
“ఆంటీ! మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. మొదటిది, ఆరాధ్య నా కూతురు, మీ మనవరాలు కాదు. రెండోది, నాకు, నా కూతురి సంపాదన తినాల్సిన అవసరంలేదు, ఈ రోజుకీ, నా కూతుర్ని నేనే పోషిస్తున్నాను. ఆఖరిది, ఆరాధ్య డబ్బు కోసం కచేరీలు చేయడం లేదు. ఎక్కడ చేసినా, చారిటీ కోసం చేస్తోంది” నెమ్మదిగా అన్నా, స్థిరంగా అంది హేమ.
వసుంధర మళ్లీ ఏదో మాట్లాడబోతుంటే, “ఆరాధ్యా! నువ్వు లోపలికి వెళ్ళు, ఈవిడతో నేను మాట్లాడి వస్తాను!” చెప్పింది హేమ.
“అదిగో! నా మనవరాలితో, నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదా! అమ్మా! నేను మీ అమ్మమ్మని, ఇది నీ తల్లి కాదు, దాని స్నేహితురాలు. నా కూతుర్ని చంపేసి, ఆస్తి కాజేయడానికి నిన్ను పెంచింది” కచ్చగా అంటున్న వసుంధరతో, “అవునా! ఇన్నేళ్లు ఏమయ్యారు అమ్మమ్మా! అమ్మని చంపిన ఆవిడని, జైల్లో పెట్టించలేదా, ఈవిడ నుంచి, నన్ను తప్పించడానికి, ఇన్ని సంవత్సరాలు పట్టిందా?” ఏడుపు మొహం పెట్టి, వెంటనే పకపకా నవ్వేసి లోపలికి వెళ్ళింది ఆరాధ్య.
అంత టెన్షన్ లోను ఫక్కున నవ్వింది హేమ.
“నీకు నవ్వులాటగా ఉంది. నా ముఖాన ఒక అయిదు లక్షలు పడెయ్యి, లేపోతే, ఈ పిల్ల, నా కూతురు శిశిర కూతురని, దాని మీద నాకు అధికారం ఉందని, కోర్టులో కేసు వేస్తా” అంది వసుంధర.
“ఆ పని చెయ్యకూడదూ? నీ గురించీ, శిశిర గురించీ, ప్రపంచానికి తెలుస్తుంది. నీకు అయిదు లక్షలు కాదు, అయిదు రూపాయలు కూడా ఇవ్వను, మర్యాదగా వెళ్ళు, లేపోతే మెడ పట్టి గెంటాల్సి ఉంటుంది” కోపంగా అరిచింది హేమ.
“నీ అంతు చూస్తాను, నాకు డబ్బు కావాలి! అంతే! నాకు వేరే బంధాలు, ప్రేమలు లేవు, కోర్ట్ నోటీసుకి సిద్ధంగా ఉండు” రుసరుసలాడుతూ వెళ్ళింది వసుంధర.
తలుపులేసి, నిస్త్రాణగా కుర్చీలో వాలిన హేమకి, వేడి కాఫీ కప్ అందించింది ఆరాధ్య.
“థాంక్స్ బంగారూ! అమ్మకి, ఎప్పడు ఏం కావాలో నీకు బాగా తెలుసు” అంటూ కాఫీ తీసుకుంది.
హేమ ఎదురుగా కూచుంటూ ఆరాధ్య, “అమ్మా! నా కథ, అప్పుడప్పుడూ, ముక్కలుగా తప్ప, పూర్తిగా చెప్పలేదు. నువ్వు, నన్ను కన్నతల్లిని కాను, అని చెప్పావు. నీ ఫ్రెండ్ కూతుర్ని అన్నావు. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇన్ని రోజులూ రాని ఈవిడ, ఈరోజు ఎందుకు వచ్చింది? నన్ను చిన్నప్పటినుంచి పోటీలకి ఎందుకు పంపలేదు.. ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇరవై రెండేళ్ల అమ్మాయిని. నా అనుమానాలు తీర్చాల్సిన అవసరం ఉంది, అందుకే నాకు అన్నీ వివరంగా చెప్పమ్మా” అంది ఆరాధ్య.
“నువ్వన్నది నిజమే! ఇప్పుడు అన్నీ వివరంగా చెప్పాల్సిన టైం వచ్చింది” అంటూ లోపలికి వెళ్లి, ఒక ఏడెనిమిది పెద్ద ఆల్బమ్స్ తెచ్చింది హేమ.
“ముందు ఇవన్నీ చూడు! కొంత నీకు అర్థమౌతుంది”.
ఇంతకు ముందే, హేమ, ఆరాధ్య తల్లి శిశిర, తండ్రి మయూర్, ఫోటోలు చూపించి ఉండడంవల్ల వాళ్ళని, హేమ, శ్రీదేవిలని గుర్తు పట్టింది.
ఆరాధ్య ఒకో ఆల్బమ్ తెరిచి, ఎవరెవరో అడిగి తెలుసుకుంటోంది. కొద్దిగా పాత ఆల్బమ్స్ చూస్తే, అందులో అన్నీ, శిశిర బహుమతులు తీసుకుంటున్న ఫోటోలే. అన్ని ఫోటోల్లో పక్కన వసుంధర.
“మరి వాళ్ళ నాన్న లేరా?” హేమని అడిగింది.
“నీకు అంతా వివరంగా చెప్తాను ఆరాధ్యా! నేను, నిన్ను ఎందుకు చిన్నప్పుడు పోటీల్లో పాల్గొననివ్వలేదో, నీకు అన్నీ అర్థమవుతాయి” అంటూ చెప్పడం మొదలుపెట్టింది .
వసుంధర తండ్రి నారాయణ, చిన్న పల్లెటూరిలో టీచర్‌గా ఉండేవారు. ఆయన, అందరికీ ఇష్టమైన ఉపాధ్యాయుడు. బీద పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం, స్కూల్ అయ్యాక చదువు చెప్పడం లాంటివి, ఆయన చేస్తే, వసుంధర తల్లి దుర్గ, భర్తకి తగ్గ భార్య, ఆ బీద పిల్లలకి ఆకలి తీర్చేది. వారి ఏకైక సంతానం వసుంధర. ఒక్కతే కూతురు కావడంతో, బాగా గారాబంగా పెంచారు. మంచి పసిమిరంగు, చక్రాల్లాంటి నల్లటి కళ్లు, ఉంగరాల జుట్టు, ఆ ఊర్లోనే అందగత్తెగా చెప్పుకునేవారు, వసుంధరని. వీటికి తోడు, వసుంధరది మంచి గొంతు. ఏ పాటైనా, ఇట్టే పట్టేసి చక్కగా పాడేది.
ఆమెకి పాటల మీద ఉన్న ఇష్టం చూసి, వసుంధరకి, శాస్త్రీయ సంగీతం నేర్పించారు నారాయణగారు. ఇంట్లో పండగలకి, ఎక్కడైనా పెళ్లిళ్లకి వెళితే, అందరూ వసుంధరని పాడమనేవారు. అలా ఆమె పాడుతుంటే, అందరూ విని మెచ్చుకునేవారు. వేరే ఊరు పంపి, కాలేజీలో చదివించలేక, వసుంధరని పదో క్లాసుతోనే చదువు ఆపించారు నారాయణ. శాస్త్రీయ సంగీతం మరిన్ని రోజులు నేర్చుకోమంటే, దాని మీద కన్నా, సినిమా పాటల మీద ఎక్కువ ఆసక్తి చూపేది వసుంధర.
“నీకేంటి వసుంధరా! చక్కగా ఉంటావు, పాటలు పాడతావు, సినిమాలో హీరోయిన్ అవగలవు” అని పనీ పాటా లేని స్నేహితులు పొగిడితే, నిజమే అని కలల్లో తేలిపోయేది వసుంధర. తను, పెద్ద సినిమా హీరోయిన్ అయినట్లు, బోలెడు నగలు, పెట్టుకుని పెద్ద కార్లలో తిరుగుతున్నట్టు ఊహల్లో తేలిపోయేది.
అందరి ఆడపిల్లల మనసు దోచుకున్న అందాల నటుడు, తనని వలచి పెళ్లి చేసుకుంటాడని, ఊహించుకుని, సంతోషించేది.
నారాయణ బంధువుల ఇంట్లో పెళ్లికి, తల్లితండ్రులతో కలిసి వెళ్ళింది వసుంధర.
తల్లి పాత పట్టుచీరతో కుట్టించిన ముదురు నీలం రంగుకి ఎర్రంచు ఉన్న పట్టులంగా, ఆ చీర పమిట కొంగుతో కుట్టిన ఎర్ర జాకెట్టు, ఎర్రటి జార్జెట్ ఓణీ, అసలే పసిమి రంగు వసుంధర అందం ఇనుమడింప చేసింది. పొడవాటి జడలో పెట్టుకున్న మల్లెపూలు, పైన ఒక గులాబీ, చేతులకు నీలం, ఎరుపు మట్టిగాజులు, చెవులకు బంగారు జుంకాలు, తల అటూ,ఇటూ తిప్పినపుడు ఊగుతూ, ఇంకాస్త అందం తీసుకొచ్చాయి.
ఇంట్లో కొద్దిగా పనీపాటలు అలవాటవడంతో, చకచకా తిరుగుతూ, అన్ని పనులూ అందుకుంటూ, మధ్యలో “ఇదిగో వసూ! పెళ్ళికూతురిని చేస్తున్నాం, పాట అందుకో!” అనగానే, ఒక లలిత గీతమో, ఒక మంగళ హారతో అందుకుంటూ, అందరి చూపులూ తన వేపు తిప్పుకున్న వసుంధరని చూసి, ఆమె ప్రేమలో పడిపోయాడు శ్రీరామ్. శ్రీరామ్ తండ్రి సాంబమూర్తి, నారాయణకి దూరపు బంధువు. సాంబమూర్తి ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాడు కూడా ప్రభుత్వ ఉద్యోగి. అతనికి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు.
రెండోవాడు శ్రీరామ్, అప్పటికే బ్యాంకులో ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
మరీ సన్నగా కాక, ఒక మోస్తరు దృఢంగా, పొడుగ్గా, చామన ఛాయ కంటే ఒక పిసరు ఎక్కువ రంగుతో, అప్పట్లో బాగా పేరున్న హీరో క్రాఫ్, సన్నని మీసం, మనిషి ఆకర్షణగానే ఉంటాడు. దానికి తోడు బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగం, ఆస్తిపరుడు సాంబమూర్తిగారి అబ్బాయి.
ఆడపడుచులు లేరు, అత్తగారు మంచిది అనే అందరూ అనుకుంటారు.
అలాంటి శ్రీరామ్‌కి ఆడపిల్లల తల్లితండ్రులు, తమ అమ్మాయిని ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పెళ్లికి వాళ్ళు వస్తున్నారని తెలిసి, ఇద్దరు,ముగ్గురు, తల్లితండ్రులు, వాళ్ల కూతుర్లతో వచ్చారు.
మంచి బట్టలు,నగలతో తిరుగుతున్న వాళ్ల పిల్లల మీద కన్నా, శ్రీరామ్ చూపులు వసుంధర మీద ఉండడం గమనించి, ‘ఈ దుర్గా, నారాయణా, తెలివిగా పిల్లని చక్కగా తయారు చేసి, ఆ అబ్బాయికి బానే వల వేస్తున్నారు’ అనుకున్నారు.
సాంబమూర్తి, తన ఊర్లో రెండంతస్తుల మేడ కట్టాడు. ఆయన భార్య విశాలాక్షి, పెళ్లి ఇంట్లో, పెద్ద పట్టుచీర కట్టుకుని, ఒంటి నిండా నగలతో, లక్ష్మీదేవిలా తిరుగుతుంటే, అందరూ అసూయగా చూస్తున్నారు. ఆవిడ పెద్ద కోడలు కూడా, వసుంధరంత చక్కనిది కాకపోయినా, మంచి చీర, పెట్టుకున్న నగలతో బాగానే ఉంది.
సాంబమూర్తి ఇంటిల్లిపాదికీ, వసుంధర పిచ్చపిచ్చగా నచ్చింది.
శ్రీరామ్ ఆ అమ్మాయి బాగా నచ్చిందని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పగానే, ఆవిడ దుర్గను పిలిచి, “దుర్గా! మీ అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా!” ఆరాగా అడిగింది.
“సంబంధాలకేమిలే వదినా! పిల్ల చక్కగా ఉందని అడుగుతారు. వాళ్ళడిగే కట్నాలు ఇచ్చుకోలేక, మేమే వెనక్కి తగ్గుతున్నాం.” అంది దుర్గ.
“ఏమాత్రం ఇస్తారు?” లోపాయికారిగా అడిగింది విశాలాక్షి.
“పిల్లకి ఒక అయిదు తులాల బంగారం ఉంది. ఊర్లో పెంకుటిల్లు మా తర్వాత దానికేగా! పాతికవేలు కట్నం ఇచ్చి, ఊర్లోనే, ఇంటిముందు పందిరేసి, పెళ్ళి చెయ్యగలం. అంతకు మించి బడిపంతులు సంసారం, ఏం చేస్తాం వదినా? నీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే చెప్పు. పిల్లవాడు సామాన్యంగా ఉండి, పెళ్ళాన్ని పోషించుకుంటే చాలు!” అంది దుర్గ బతిమిలాడిన స్వరంలో.
విశాలాక్షి, వసుంధరని గమనిస్తూనే ఉంది. అందం, సంగీతమే కాక, మంచి హుషారుగా పనులు అందుకుంటోంది. చకచకా, బొంగరంలా తిరుగుతోంది. ఆ అమ్మాయి ఎటు తిరిగితే, పొద్దుతిరుగుడు పువ్వులా, కొడుకు అటే తిరగడం కూడా చూసింది. తమకు సరిపడా ఆస్తి ఉంది. డబ్బు అంత అవసరం లేదు. ఇంత చక్కటి పిల్లను చేసుకుంటే, పుట్టేవాళ్ళకి ఆ అందం వస్తుంది. సంగీతం కూడా తమ కుటుంబంలో లేదు. అది మనవలకి వస్తే బావుంటుంది.
బీద ఇంటి పిల్లని చేసుకుంటే, తను చెప్పినట్టు వింటుంది. డబ్బున్న పెద్ద కోడలు, తనని లెక్కపెట్టదు. ఇవన్నీ ఆలోచించి సాంబమూర్తితో మాట్లాడింది. తన మనసులో ఉన్నదే భార్య చెప్పడం ఆయనకి కూడా సంతోషం వేసింది.
అక్కడికక్కడే, పెద్దవాళ్ళు నలుగురిని పిలిచి, పిల్లలని కూడా పిలిచి, మనసులో మాట చెప్పారు సాంబమూర్తి దంపతులు. అనుకోని అదృష్టం, తలుపు తట్టిందని పొంగిపోయారు నారాయణ దంపతులు.
“మీ పిల్లకు, మీరేమి పెట్టుకోవాలనుకుంటే అది పెట్టండి. పెళ్లి ఖర్చు, ఇద్దరం పెట్టుకుని, పెళ్లి వైభవంగా చేద్దాం! మాకు ఏ కట్నాలూ, కానుకలూ వద్దు. మేమే, మా కోడలికి పది తులాల బంగారం పెడతాం!” విశాలాక్షి మాటలకి ఉబ్బితబ్బిబ్బయింది దుర్గ. వసుంధర కూడా తన కలలు నిజం అవుతున్నాయని సంతోషంతో, శ్రీరామ్ వంక చూస్తూ, ముసిముసినవ్వులు నవ్వింది.
అనుకున్నట్లుగానే మంచి ముహూర్తానికి దుర్గా,నారాయణా, పల్లెటూర్లో ఇంటిముందు కొబ్బరాకుల పందిరేసి, మామిడాకులు తోరణాలు కట్టి, బంతి, చేమంతులతో మండపం అలంకరించారు. సగం పెళ్లి ఖర్చు పెట్టుకుంటానని అన్న సాంబమూర్తిని వారించాడు నారాయణ. “కట్న,కానుకలు ఆశించకుండా మా అమ్మాయిని, మీ కోడలిని చేసుకుంటున్నారు బావగారూ! మీ తాహతుకు తగ్గట్టు కాకపోయినా, ఉన్నంతలో బాగానే పెళ్ళి చేస్తాను. నాకు తోచినంతలో అల్లుడుగారికి, మీకు బట్టలు పెడతాను వద్దనకండి” బతిమిలాడుతూ అన్నాడు.
నోటి మంచితనం అంటే ఏమిటో, ఎలాఉంటుందో, వసుంధర పెళ్ళిలో అందరికీ తెలిసింది. ఆవూర్లోనే ఉన్న పెద్ద జమీందారీ కుటుంబం వారు, వారి ఇంట్లో వియ్యాలవారికి విడిది ఏర్పాటు చేశారు. మగపెళ్ళివారి తరఫున వచ్చిన ఏభై మందికి, మంచి వసతులున్న గదులు, పిలిస్తే పలికేందుకు పనివాళ్ళని ఏర్పాటు చేశారు.
గురువుగారింట్లో పెళ్ళి అని, అందరూ బియ్యం, పప్పులు, కూరలు,పాలు సమృద్ధిగా తెచ్చి పడేశారు. అరటి ఆకులు, అరటి గెలలు, కొబ్బరి బోండాలు లెక్కలేనట్లు వచ్చి పడ్డాయి. ఒక ఇంట్లో పొద్దుటి టిఫిన్లు చేయిస్తే, ఇంకో ఇంట్లో మిఠాయిలు, కారాలు చేశారు.
వడ్డనల్లో అందరికీ జున్ను, చిక్కటి పాలతో చేసిన పాయసం, గడ్డ పెరుగు ఇంకో ఇంటినుంచి వచ్చాయి. వసుంధరా, శ్రీరామ్‌ల పెళ్లి, ఒక్క నారాయణ కూతురి పెళ్ళిలా కాక, ఊరందరికీ సీతారాముల పెళ్లిలా జరిగింది.
అల్లుడికి పట్టుబట్టలు, ఉంగరం, గొలుసు పెట్టి, వియ్యంకుడు,వియ్యపురాలికి పట్టుబట్టలూ, పెద్ద కొడుకు, కోడలు, పిల్లలకి మంచి బట్టలు పెట్టి, ఘనంగా సారె పెట్టారు. పెళ్లి, ఇంత ఘనంగా నారాయణ దంపతులు చేస్తారని ఊహించని, సాంబమూర్తి కుటుంబం ఉబ్బితబ్బిబ్బయ్యారు.
(ఇంకా ఉంది)
శ్రీపతి లలిత వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి విరమణ చేశారు. స్వస్థలం హైదరాబాద్. శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తిగారు.
వీరి సాహితీ ప్రయాణం, అరవై ఏళ్ళ వయసులో మొదలైంది. ఇప్పటికి సుమారు వంద కథలపైనే వ్రాసారు.
ఈనాడు ఆదివారం అనుబంధంలో ఇప్పటివరకు ఏడు కథలు ప్రచురించడం, వీరికి గుర్తింపునిచ్చింది.
ఫేస్బుక్ గ్రూప్‌లలో, అనేక అంతర్జాల పత్రికలలో వీరి కథలు వచ్చాయి. ఇరవై అయిదుకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.
వీరు రాసిన చాలా కథలు వేరు, వేరు యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.
సంగీతారాధ్య వీరి మొదటి నవల.
