[శ్రీపతి లలిత గారు రచించిన ‘సంగీతారాధ్య’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక మీద త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. 22 ఏళ్ళ ఆరాధ్య అనే అమ్మాయి కీర్తనలు అద్భుతంగా పాడుతుంది. ఆమె గురువు శ్రీదేవి గొప్ప సంగీతకారిణి. ఆమె దగ్గర శిష్యరికం చేసే అవకాశం అందరికీ దొరకదు. అందరూ ఆరాధ్య గాత్రాన్ని విని ఆనందించడం శ్రీదేవికి సంతోషం కలిగిస్తుంది. గ్రీన్ రూమ్ లో ఆరాధ్య తల్లి హేమ, తన స్నేహితురాలైన శ్రీదేవిని అభినందిస్తుంది. ఈ సమయంలో శిశిర కూడా ఉంటే చాలా బావుండేదని శ్రీదేవి అంటుంది. అక్కడ్నించి శ్రీదేవి బృందం దేశంలోని అనేక పెద్ద నగరాలు, యూకె, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో శాస్త్రీయ సంగీతప్రియులని అలరించి హైదరాబాద్ చేరుతుంది. సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చినా, ఆరాధ్య తిరస్కరిస్తుంది. హేమ సిఎ చదవి ఓ పెద్ద సంస్థలో పార్ట్‌నర్‌గా ఉంటుంది. ఆరాధ్యని చిన్నప్పటినుంచి చదువులోనూ, సంగీతంలోనూ సమాన ఇష్టం కలిగి ఉండేలా పెంచుతుంది. ఆరాధ్య ఇంజనీరింగ్ చేస్తుంది. సంగీతంలోనూ ప్రావీణ్యం సాధిస్తుంది. ఓ రోజు ఉదయం పొద్దున్నే, యవ్వనంలో ఉన్నట్టు కనిపించేలా మేకప్ వేసుకున్న ఓ ముసలావిడ వచ్చి తలుపు కొడుతుంది. ఆరాధ్య తీస్తుంది. ఆమెని గుర్తిపట్టిన హేమ ముఖం ముడుచుకుపోతుంది. ఆమె వసుంధర. తన మనవరాలి సంపాదనతో కులుతున్నావని హేమని తిడుతుంది. ఆరాధ్య నా కూతురు, మీ మనవరాలు కాదు అని అంటుంది హేమ. వసుంధర ఏదో చెప్పబోతే, ఆరాధ్య లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష రూపాయలిమ్మని అడుగుతుంది వసుంధర. పైసా ఇవ్వనంటుంది హేమ. ఏం చేస్తానో చూడు అని హెచ్చరించి వెళ్ళిపోతుంది వసుంధర. ఆరాధ్య కోరిక మేరకు తనకు తెలిసిన ఆమె గతం గురించి చెప్పడం మొదలుపెడుతుంది హేమ. వసుంధర తండ్రి నారాయణ. తల్లి దుర్గ. నారాయణ ఓ పల్లెటూరిలో టీచర్. బీదవిద్యార్థులకి అండగా ఉండేవాడు. వారికి ఏకైక సంతానం వసుంధర. చిన్నప్పటి నుంచి చక్కని గొంతుతో ఏ పాట విన్నా ఇట్టే పాడేసేది. పదో తరగతి వరకు చదివించి ఆపించేస్తారు తల్లిదండ్రులు. పాటలతో పాటు పనులూ నేర్చుకున్న వసుంధరని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ముచ్చట పడతారు. ఓ పెళ్ళికి వీళ్ళ దూరపు బంధువులైన సాంబమూర్తి భార్య, విశాలాక్షి తోనూ, పెళ్ళి కావల్సిన రెండో కొడుకు శ్రీరామ్ తోనూ హాజరవుతారు. వాళ్ళకి వసుంధర బాగా నచ్చేయగానే తమ స్థాయికి కాస్త తక్కువైనా ఒప్పుకుని కోడలిని చేసుకుంటారు. – ఇక చదవండి]
2
పెళ్లయ్యి, సిటీ చేరిన వసుంధరకి, భూతల స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనిపించింది. మంచి ఇల్లు, ఖరీదైన బట్టలు, తిరగడానికి మోటార్ సైకిల్, ప్రేమగా చూసుకునే భర్త, మంచి అత్తవారు.
అన్నీ అమరినా, ఆమెలో ఏదో అసంతృప్తి.
వసుంధరకి స్టేజి మీద పాడాలని, సినిమాల్లో పాడాలని, కనీసం టీవీలో అయినా పాడాలని కోరికగా ఉండేది. ఆమె నేర్చుకున్నది శాస్త్రీయ సంగీతమయినా, పూర్తిగా పరిపక్వత లేకపోయేసరికి, అవకాశాలు అంతగా రాలేదు.
హైదరాబాద్ వచ్చాక, చుట్టుపక్కల స్నేహితురాళ్ల ద్వారా, పండగలకి, పెళ్ళిళ్ళకి పాటలు పాడే ఒక సంస్థలో చేరింది. వాళ్ళు స్టేజి షోస్ చేసేవారు, సంగీత దర్శకులని, చిన్న సినిమా నటులని పిలిచేవారు. వారి కంట్లో పడితే అవకాశాలు వస్తాయని చెప్పేవారు. సంస్థ వారు మర్యాదగానే ఉండేవారు. వెళ్లే చోట్ల కూడా, వీరంటే మర్యాదగానే ప్రవర్తించేవారు.
దానితో వసుంధర కూడా, ధైర్యంగా ఆ ప్రోగ్రాములకి వెళ్లి పాటలు పాడేది.
మొదట్లో భార్య పాటలు పాడడం బావున్నా, రానురాను శ్రీరామ్‌కి ఇది తలనొప్పిగా తయారయింది. తను ఇంటికి వచ్చేసరికి, రోజూ తాళం వేసి ఉండడం, తినడానికి ఇంట్లో ఏమీ లేకపోవడం, “ఏంటి వసూ! రోజూ ప్రోగ్రాములని వెళ్తే నా సంగతి ఏమిటి. ఆకలి వేస్తే తినడానికి ఉండదు!” కోపంగా అన్న మొగుడిని ఐస్ చేయడం, వసుంధరకి వెన్నతో పెట్టిన విద్య.
ఆమె సరసాలకి లొంగి, ముద్దు ముచ్చట్లు తీర్చుకుని, అడిగినవీ, అడగనివీ వరాలు ఇచ్చేవాడు శ్రీరామ్. మనమొకటి తలిస్తే, దేవుడు ఇంకోటి తలుస్తాడని, సరిగ్గా అదే సమయంలో నెల తప్పింది వసుంధర.
శుభవార్త విన్న శ్రీరామ్, తండ్రి అవుతున్నందుకు సంతోషపడితే, అప్పుడే గర్భం రావడం వసుంధరకి విపరీతమైన అసంతృప్తి మిగిల్చింది. సరిగ్గా, తను ఆ పాటల గ్రూపులో స్థిరపడుతున్న టైంలో వచ్చిన గర్భం, సంతోషాన్నివ్వలేదు, సరికదా, “ఇప్పుడే రావాలా ఈ కడుపు!” అని విసుక్కుంది.. తన భవిష్యత్తు దెబ్బ తీసింది ఈ బిడ్డ అని కోపం వచ్చింది వసుంధరకి. అది చూసి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు
వసుంధర ఆ సంస్థ నుంచి పక్కకి తప్పుకున్నాక, ఈమె కంటే కొద్దిగా తక్కువ టాలెంట్ ఉన్న సుమిత్రకి, ఒక షోలో ఒక చిన్న సంగీత దర్శకుడు, ఆమె పాట విని మంచి అవకాశం ఇవ్వడం, తనకి దక్కాల్సింది, సుమిత్రకు దక్కిందని తెగ బాధపడింది, వసుంధర.
“నువ్వు, ఆమె ఎవరితోనో ఎందుకు పోల్చుకుంటావు? నీకు పెళ్లి అయ్యి, కడుపు వచ్చింది. ఆవిడకి పెళ్లి, సంసారం లేదు, నీకు ఉన్నదానికి తృప్తి పడాలి” అనేవాడు శ్రీరామ్.
“పెళ్లి అవడం, కడుపు రావడం ఏమైనా గొప్ప విషయాలా? అందుకే, ఇలా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉన్నాం” విసుక్కుంది వసుంధర.
ఆ తర్వాత, సుమిత్ర పెద్ద గాయని అయ్యి, పేరు ప్రతిష్ఠలు, డబ్బులు సంపాదించడం, వసుంధరకి అస్సలు మింగుడుపడలేదు.
తొమ్మిది నెలలు నిండి, ఒక పండంటి పాపకి జన్మనిచ్చింది వసుంధర. రూపంలోనే కాదు, గానంలోనూ తల్లి పోలికే చిన్నారి శిశిర. తను పోగొట్టుకున్న బాధకి, రెట్టింపు సంతోషం ఇస్తున్నట్లుగా, శిశిర పసితనం నుంచే, మాట్లాడితే పాట పాడినట్లుగా ఉండేది.
తల్లిగా, వసుంధర సరిగమలు నేర్పించినా, నాలుగో ఏట నుంచే, శిశిరకి సంగీతం, గురువు దగ్గర నేర్పించడం మొదలుపెట్టింది వసుంధర.
“పసిదానికి, ఇప్పుడే సంగీతం నేర్పించకపోతే ఏమయ్యింది? హాయిగా బాల్యాన్ని అనుభవించనీ!” అన్నాడు శ్రీరామ్.
“ఇప్పటినుంచే నేర్చుకోవాలి, ఆలస్యమైతే నోరు తిరగదు” అంటూ, పొద్దున్న కర్ణాటక సంగీతం, సాయంత్రం హిందుస్తానీ, వారానికి రెండు రోజులు లలిత సంగీతం, ఇలా శిశిరకి మేలుకుని ఉన్నంతసేపూ సంగీతమే.
స్కూల్లో పర్మిషన్ తీసుకుని, ఇంట్లోనే రోజూ ఒక గంట పాఠాలు. ఆ వయసులో ఉండాల్సిన ఆటలు, సరదాలు, ఏమీ తెలియకుండా పెరుగుతున్న కూతురిని చూసి, శ్రీరామ్ దిగులుపడేవాడు. పెళ్లిళ్ళకి వెళ్లి బంధువులని కలవడం, సినిమాలు చూడడం, పార్క్‌కి వెళ్లి ఉయ్యాల ఊగడం, ఇలాంటివి తెలియకుండానే, శిశిరకి పదేళ్లు వచ్చాయి. శిశిర పుట్టిన అయిదేళ్ళకి నారాయణ, ఆ తర్వాత రెండేళ్ళకి దుర్గ చనిపోయారు.
దానితో వసుంధరకి, పుట్టింటి వాళ్ళు లేకుండా అయిపోయారు. ఉన్న అత్తగారు వాళ్ళతో సత్సంబంధాలు లేవు. సాంబమూర్తి, విశాలాక్షి, చంటిదైన శిశిరని, ఇరవైనాలుగు గంటలూ, సంగీతం అని, వసుంధర తిప్పుతుంటే, వద్దని చెప్పినందుకు, వాళ్ళతో పెద్ద తగులాటే వేసుకుంది. మరీ గొడవలు పెట్టుకుంటే కొడుకుని, మనవరాలిని చూడడానికి కూడా అవదని, వాళ్ళూ దూరంగా ఉండిపోయారు. ఎప్పుడైనా వచ్చి నాలుగు రోజులున్నా, ఎక్కువ కల్పించుకోకుండా, కొడుకు, మనవరాలితో, ఎక్కువ సమయం గడిపి వెళ్ళేవారు.
వసుంధరకి, ఉదయం లేచిన నుంచి శిశిర సంగీతం మీదే దృష్టి. ఏ పోటీలు ఉన్నాయి? ఎక్కడకి పంపాలి? ఏ పాటలు పాడించాలి? ఇదే గోల. అలా పది పోటీల్లో పాల్గొన్న శిశిరకి, పాటలపోటీల్లో అయిదు బహుమతులు మాత్రమే వచ్చాయి. మూడు ప్రథమ బహుమతులు అయితే రెండు ద్వితీయ. సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు, వసుంధర రెండు రోజులు తిండీ నిద్ర లేకుండా, తండ్రీకూతుర్లని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.
మరో ఏడాదికి, వసుంధర శ్రమ వృథా కాకుండా, శిశిర, తన పదో ఏట, రెండు సినిమాల్లో పిల్లల పాటలు పాడింది. ఒక పాట సంచలనం రేపింది. దానితో శిశిర స్టార్, వసుంధర స్టార్ మదర్ అయ్యారు. శ్రీరామ్, సాంబమూర్తి కుటుంబం కూడా, శిశిర గురించి అందరికీ గర్వంగా చెప్పుకున్నారు.
వసుంధర పెంపకంలో, శిశిర కూడా తను ఒక గొప్పదాన్నని, ఎవరితోనూ మాట్లాడే అవసరం తనకి లేదని అనుకుంటూ, అందరికీ దూరం అవసాగింది. అలా ఏడో క్లాసుకి వచ్చాక, స్కూల్ వాళ్లు అటెండన్స్ తప్పనిసరి చేశారు. యూనిఫామ్ వేసుకుని, పుస్తకాలు పట్టుకుని వచ్చిన శిశిర, తనకి స్కూల్లో ఒక పెద్ద స్వాగత సత్కారం ఉంటుందని భ్రమపడింది. మొదటి పదినిమిషాల్లోనే అది భ్రమ అని తెలిసింది. ఎవరూ తనని పట్టించుకోలేదు, పలకరించలేదు.
అప్పుడు తన వేపు చూస్తూ “హలో! నా పేరు హేమ నువ్వు..” అని పలకరించిన హేమ మొట్టమొదటి స్నేహితురాలు. హేమ, తన స్నేహితురాలు శ్రీదేవిని, పరిచయం చేసింది.
“శ్రీదేవి సంగీతం బాగా పాడుతుంది, వాళ్ల నాన్నగారు పెద్ద గురువు” అని పరిచయం చేస్తే “నేను కూడా సంగీతం నేర్చుకున్నాను. రెండు సినిమాల్లో పాడాను. ఫలానా పాట నేనే పాడాను” గొప్పగా చెప్పుకున్న శిశిరని మెచ్చుకోలుగా చూసి, “అవునా! బాగా పాడావు” అన్న శ్రీదేవి, రెండో మరియు ఆఖరి ఫ్రెండు.
మొదటిసారిగా, స్కూల్ జీవితంలో ఆనందం, సరదాలు అనుభవిస్తూ శిశిర చాలా సంతోషపడింది. నెమ్మదిగా శ్రీదేవి,హేమల స్నేహంతో, కొంత లోకజ్ఞానం కూడా వచ్చింది శిశిరకి.
హేమ, శ్రీదేవిలతో స్నేహం, వసుంధరకి ఇష్టం లేకపోయినా, కూతురు ఏడ్చి గోల చేస్తుందని వదిలేసింది. త్వరలో, ముగ్గురూ ప్రాణస్నేహితురాళ్ళు అయ్యారు. శిశిర జీవితంలో, వసంతంలా మరచిపోలేని సమయం అదే.
శ్రీదేవి నాన్నగారు లక్ష్మణాచారిగారు. వారి కుటుంబం అంతా సంగీతజ్ఞానం ఉన్నవారు. తాతగారు పెద్ద కర్ణాటక సంగీత విద్వాంసుడు. లక్ష్మణాచారిగారు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నా, అప్పుడప్పుడు కర్ణాటక సంగీతం ప్రోగ్రాములు ఇవ్వడం, కొంతమంది విద్యార్థులకు సంగీతం నేర్పడం చేసేవారు. లక్ష్మణాచారిగారి అన్నయ్య రామాచారిగారు, వయోలిన్ విద్వాంసుడు.
ఇలాంటి నేపథ్యంలో పెరిగిన శ్రీదేవి, ఎంతో మానసిక పరిపక్వతతో ఉండేది. శిశిర, తల్లికి తెలియకుండా, అప్పుడప్పుడు శ్రీదేవితో వాళ్ళింటికి వెళ్లి, సంగీతం మెలకువలు నేర్చుకునేది. సంగీతం నేర్చుకుంటున్నా, చదువు మాత్రం నిర్లక్ష్యం చేయనివ్వలేదు శ్రీదేవిని కుటుంబం వారు. అందుకే, శ్రీదేవి ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వచ్చేది.
హేమ తండ్రి పట్టాభి, బ్యాంకులో గుమస్తా. హేమకి అయిదు సంవత్సరాల వయసులో, హేమ తల్లి కామెర్ల వ్యాధితో చనిపోయింది. తల్లి లేని పిల్లని పెంచడానికి, ఎవరి సహాయం లేకపోవడంతో, ఇంట్లో ఆడదిక్కు కోసం, సుమతిని పెళ్లి చేసుకున్నాడు. సుమతి కూడా, భర్త పోయి ఒక కొడుకు ఉన్న ఆమె. అలాంటి ఆమెని చేసుకుంటే, కూతురికి తల్లి, ఆమె కొడుక్కి తండ్రి దొరుకుతారని ఆశపడ్డ పట్టాభికి నిరాశే ఎదురయ్యింది.
సుమతి, మొదటి రోజు నుంచి, హేమని, అసలు సిసలైన సవతి తల్లిగానే చూసింది. అందులోనూ, హేమ మంచి తెలివిగా చదవడం, సుమతి కొడుకు సురేష్ చదువులో వెనకపడడం, సుమతికి మింగుడుపడేది కాదు. అందుకే హేమని ఏదో ఒక రకంగా సాధిస్తూనే ఉండేది. పట్టాభి ఏమన్నా అంటే, ఇంకా గొడవలు అవుతాయని, చూసీ చూడనట్టు ఉండేవాడు.
హేమ ఒకటే లక్ష్యం పెట్టుకుంది. బాగా చదువుకుని, త్వరగా ఉద్యోగంలో చేరి, ఆ ఇంట్లో నుంచి బయటపడాలి.
‘ఎన్నో పోటీల అవకాశాలు పోతున్నాయి, శిశిరని స్కూల్ మానిపించాలి’ అనుకునేది వసుంధర.
“ఈ రోజుల్లో డిగ్రీ కనీసపు చదువు. శిశిర కనీసం టెన్త్ అయినా పాసవనీ, తర్వాత ప్రైవేటుగా చదవచ్చు” అని శ్రీరామ్ పట్టుపట్టడంతో అతి కష్టం మీద, శిశిరని టెన్త్ వరకు చదివించింది వసుంధర.
టెన్త్ పరీక్షలు అందరూ మంచి మార్కులతో పాసయ్యారు.
ముందునుంచి, హేమ లక్ష్యం మంచి చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని. ఇంటర్లో కామర్స్, సిఎ కోర్స్ హేమ తీసుకుంటే, శ్రీదేవి లెక్కలు తీసుకుంది. సంగీతం వృత్తిగా చేసుకోలేకపోతే, ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటుందని ఆమె ఉద్దేశం. శిశిర ఎంత గొడవ చేసినా, ఇంటర్‌లో చేర్చలేదు వసుంధర. డైరెక్టుగా డిగ్రీ, ప్రైవేట్‌గా కట్టచ్చని, శిశిరకి సినిమా పాటల అవకాశాల కోసం ప్రయత్నించింది. దానికి మొదటి మెట్టుగా, అన్ని పోటీల్లో పాల్గొనమనేది. కొంత మంది బ్యాండ్‌లో చేరి, పెళ్లిళ్లకు, పెద్ద ఈవెంట్స్‌కి, పాడించడం మొదలుపెట్టింది.
“ఎందుకు వసుంధరా! పిల్లని అంతా హైరానా పెడతావు, మనకి డబ్బులు లేకుండా లేదుగా? చక్కగా చదువుకుని, మంచి అబ్బాయితో పెళ్లి అయితే, వాళ్ళ ఇష్టం సినిమాలకే పాడుతుందా, ప్రోగ్రాంలే ఇస్తుందా!” అన్న శ్రీరామ్ మాటలకి “నాలాగే, అన్నీ వదులుకొని, ఎదుగూ బొదుగూ లేక అఘోరించాలా? అదే మా స్నేహితురాలు సుమిత్ర, సినిమాల్లో పాడి, జూబిలీహిల్స్లో ఇల్లు కట్టుకుంది..” చిట్టా విప్పేసరికి ఆయన అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
మొదట్లో, శిశిరకి కూడా ఇలా ప్రత్యేకంగా ఉండడం, మంచి బట్టలు వేసుకుని పాటలు పాడడం, తర్వాత అందరూ పొగడడం సంతోషంగా ఉండేది.
కాని, కొన్నిరోజుల తర్వాత, ఆ మెరుపుల టైట్ బట్టలు, పొట్టి గౌన్లు, మేకప్ వేసుకుని తయారయిన తనని చూసే రకరకాల చూపులు, ఒంటికి ముళ్ళలాగా గుచ్చుకునేవి.
అదే శ్రీదేవి, సంగీత కచేరీలకి హాయిగా పట్టు లంగా, లేదా, లంగా ఓణీ, కట్టుకుని కూర్చుని పాడితే, వచ్చిన వారు గౌరవంగా మాట్లాడడం గమనించి,
“అమ్మా! నేనూ కర్ణాటక సంగీత కచేరీలు చేస్తాను” అంది. “నువ్వేమన్నా సుబ్బులక్ష్మివా! కర్ణాటక సంగీతానికి, పేరూ, డబ్బులూ రావు. ఏదో గుళ్లల్లో, పండగలకి కచేరీ చేస్తే, ఓ పిచ్చి శాలువా కప్పి, నాలుగు కొబ్బరి చిప్పలు ఇస్తారు. అవి తప్ప ఏముండవు. నువ్వలా చిప్ప పట్టుకోకూడదనేగా నా తాపత్రయం” అరిచింది వసుంధర.
అందరి ఆడపిల్లల్లా, మంచి డ్రెస్సులు వేసుకుని, బయట స్వతంత్రంగా షాపింగ్ చేస్తూ, సినిమాలకి వెళ్లి, జీవితాన్ని అనుభవిద్దామంటే, తల్లి స్టూడియోలకి, ప్రోగ్రాంలకి తిప్పడమే సరిపోతోంది. చిన్నప్పుడు, స్కూల్ జీవితం సరిగ్గా అనుభవించలేదు, కాలేజీకి వెళ్ళనే లేదు.
ఈ బంగారు పంజరం బతుకు ఏమిటి? అని బాధపడేది శిశిర.
ఒకటి, రెండు సార్లు, విదేశాల్లో ప్రోగ్రాం వస్తే, వసుంధర తోడు వచ్చింది. అక్కడ కూడా, అందరితో బయట తిరిగి వద్దామంటే, వద్దని తనే తిప్పింది.
డబ్బులన్నీ ఆవిడ కంట్రోల్లోనే ఉండేవి. శిశిర, ఒక్క రూపాయి స్వతంత్రంగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండేది కాదు వసుంధరకి. ఇవన్నీ నచ్చని శ్రీరామ్, భార్యకి చెప్పిచెప్పి, అలిసిపోయి, రోజూ గొడవలు పడలేక, విడిగా వెళ్ళిపోయాడు. లీగల్‌గా విడాకులు లేకపోయినా, అతని దారిన అతను ఉండేవాడు.
శిశిరతో మాత్రం ఫోన్లో మాట్లాడేవాడు. రోజురోజుకీ శిశిరలో అసంతృప్తి పెరిగిపోతోంది. తల్లికి తెలియకుండా హేమతోనూ, శ్రీదేవితోనూ మాట్లాడుతుంటే, వాళ్ళు కాలేజీలో అనుభవిస్తున్న సరదాలు, సాధిస్తున్న విజయాలు, స్నేహితులతో తిరుగుతూ చేస్తున్న షాపింగ్‌లు, వింటుంటే, తన బాల్యాన్ని, యవ్వనాన్ని, తల్లి కాళ్ల కింద తొక్కేసి, తనకి ఊపిరి ఆడకుండా గొంతు నొక్కేసినట్టు అనిపిస్తోంది. అసలు తల్లిని చూస్తేనే చికాకు వస్తోంది. వేరే ఊర్లకి వెళ్లినా, వేరే దేశాలకి వెళ్లినా, అందరూ షాపింగ్‌లో వాళ్ళకి నచ్చినవి కొంటుంటే, తల్లి మాత్రం, ఆవిడకి నచ్చినవి కొంటోంది. ఆవిడ కొనే బట్టలు చూస్తే, శిశిరకి కంపరం వస్తోంది. అవి కట్టుకుంటే రాజుగారి వస్త్రం కథ గుర్తొస్తోంది.
“నాకీ బట్టలు వద్దు” అని శిశిర అంటే “అందరి కళ్ళలో పడాలంటే ఇలాంటివి వేసుకోవాలి” అనేది వసుంధర.
“నేను పాటలు పాడడానికి వెళ్తున్నానా, లేక అందాల పోటీకా?” విసుక్కునేది ఆమె.
అలా శిశిరకి పాటలు పాడడం మీద కూడా ఇష్టం పోయింది.
ఆ విసుగు, చిరాకు, ప్రోగ్రాంలో కనిపించి ఆమెకి వచ్చే అవకాశాలు బాగా తగ్గాయి.
వసుంధర తిట్లు ఎక్కువయ్యాయి.
“శని చుట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అందలం ఎక్కిద్దామా అనుకుంటే అణగారిపోతాను, అనే వాళ్ళని ఎవరేమి చెయ్యగలరు? అంతా ఆ తండ్రి పోలికే ఈ కూతురికి” భర్తని, కూతుర్ని కలిపి మరీ తిట్టేది. తండ్రికి చెప్పి బాధపడితే, “నువ్వు మీ అమ్మతో తెగతెంపులు చేసుకునిరా, నేను నీకు చదువు చెప్పిస్తాను, ఏమి కావాలంటే అది చేయిస్తాను” అనేవాడు శ్రీరామ్.
తల్లిని వదిలి పెట్టడానికి ధైర్యం చెయ్యలేకపోయింది శిశిర.
ఎప్పుడైనా, తల్లిని బతిమిలాడి, తండ్రి దగ్గరికి, తాతయ్య, నాన్నమ్మల దగ్గరికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వచ్చేది. అలా శిశిరకి ఇరవయ్యేళ్ళు దాటాయి.
(ఇంకా ఉంది)
శ్రీపతి లలిత వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి విరమణ చేశారు. స్వస్థలం హైదరాబాద్. శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తిగారు.
వీరి సాహితీ ప్రయాణం, అరవై ఏళ్ళ వయసులో మొదలైంది. ఇప్పటికి సుమారు వంద కథలపైనే వ్రాసారు.
ఈనాడు ఆదివారం అనుబంధంలో ఇప్పటివరకు ఏడు కథలు ప్రచురించడం, వీరికి గుర్తింపునిచ్చింది.
ఫేస్బుక్ గ్రూప్‌లలో, అనేక అంతర్జాల పత్రికలలో వీరి కథలు వచ్చాయి. ఇరవై అయిదుకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.
వీరు రాసిన చాలా కథలు వేరు, వేరు యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.
సంగీతారాధ్య వీరి మొదటి నవల.
