[శ్రీపతి లలిత గారు రచించిన ‘సంగీతారాధ్య’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[శిశిరకి మయూర్‌తో పరిచయం కలుగుతుంది. మయూర్ వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం. కౌలుకి వ్యవసాయం చేస్తారు. మయూర్ ఒక్కడే డిగ్రీ వరకు చదివాడా కుటుంబంలో మయూర్ జానపద పాటలు బాగా పాడడంతో ఓ పోటీలో పాల్గొనే అవకాశం వస్తుంది. అక్కడ పాటలు నేర్పే మెంటార్స్ దగ్గర మనసుపెట్టి నేర్చుకుంటాడు. నిజాయితీగా ఉండడంతో, జనం బాగా ఇష్టపడి అతనికి ఓట్లు వేస్తారు. ఆ పోటీలో అతనే పది లక్షలు గెల్చుకుంటాడు. శిశిరకి రెండో బహుమతి వస్తుంది. ఓ సంగీత దర్శకుడు వీళ్ళిద్దరి చేత, ఓ సినిమాలో ఒక పాట పాడించగా, అది సూపర్ హిట్ అయి ఇద్దరికీ సినిమా అవకాశాలు వస్తాయి. వారి స్నేహం బలపడి ప్రేమగా మారుతుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీదేవిని లక్ష్మణాచారి శిష్యుడు శ్రీధర్ ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. ఆ పెళ్ళిలో శిశిర, హేమలదే హడావిడి. శ్రీధర్ కుటుంబ సభ్యులకు కూడా సంగీతం పట్ల ఆసక్తి ఉండడంతో ఒక అకాడమీ పెడతారు. చాలామంది పిల్లలు శ్రీదేవి దగ్గర సంగీతం నేర్చుకోడానికి వస్తారు. అనతి కాలంలోనే, శ్రీదేవికీ, అకాడమీకి మంచి పేరు వస్తుంది. హేమ డిగ్రీతో పాటు సి.ఎ. కూడా చేస్తుంది. హైదరాబాదులో ఒక చిన్న కంపెనీలో చేరుతుంది. పిన్నికి తమ్ముడు వరసయ్యే కుమార్ అనే యువకుడు కూడా అదే కంపెనీలో పని చేస్తుంటాడు. అతను కట్నం లేకుండా హేమని పెళ్ళి చేసుకుంటానని వస్తాడు. దాంతో హేమకి ఇష్టం లేకపోయినా, అతనితో పెళ్ళి జరిపిస్తుంది. అత్తగారింటికి వెళ్ళాక, వాళ్ళ నైజం తెలిసి విస్తుపోతుంది హేమ. భార్యని అదుపులో ఉంచమని తల్లి కుమార్‌కి హితబోధ చేస్తుంది. కోడలిని బాగా సాధిస్తుంది. కుమార్ ఇంట్లోనూ, ఆఫీసులోనూ నీచంగా మాట్లాడుతుంటాడు. ఖాతాదార్లకు దొంగ లెక్కలు చూపించి, డబ్బు మిగల్చమని అడుగుతూంటాడు. అలా చేయనంటుంది హేమ. గొడవ పెద్దది కావడంతో ఇంటికి వెళ్ళిపోతుంది హేమ. అత్తగారు లోపలికి రానీయకుండా తరిమేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు హేమకి. శిశిర గుర్తొస్తుంది. శిశిరకి ఫోన్ చేసి సమస్య చెప్పగానే, ముందు స్టూడియోకి వచ్చేయమంటుంది. తన దగ్గరకి వచ్చిన హేమని చూడగానే ఏదో పెద్ద సమస్యే అని అర్థం చేసుకుంటుంది శిశిర. మయూర్‌తో కలసి అతని గదికి వెళ్తారు. అతన్ని భోజనం తెమ్మని బయటకి పంపించి అసలేం జరిగిందో కనుక్కుంటుంది శిశిర. మయూర్ వచ్చాకా, భోం చేశాక, జరిగినదంతా మయూర్‌కి చెబుతుంది. మయూర్ హేమకి ధైర్యం చెప్తాడు. తన గదిలో ఉండవచ్చని, తాను నెల రోజులు ఉండననీ, పక్క ఫ్లాట్ వాళ్ళు చాలా మంచివాళ్ళని, హేమ తన పిన్ని కూతురని చెప్తానని, ఏమీ ఇబ్బంది ఉండదని చెప్తాడు. తన బట్టలు, సర్టిఫికెట్స్ ఎలా తెచ్చుకోవాలి అని హేమ అడిగితే, అందుకు ఒక మార్గం ఉందని, హేమ కాస్త యాక్టింగ్ చేయాల్సి ఉంటుందని అంటాడు మయూర్. అతని ప్లాన్ విని, శిశిర, హేమ ఆశ్చర్యపోతారు. – ఇక చదవండి]
4
మర్నాడు ఉదయం, హేమ ఆఫీస్‌కి ఫోన్ చేసి తన స్నేహితురాలితో మాట్లాడింది.
“మా అమ్మమ్మకి చాలా సీరియస్‌గా ఉందని, మా మేనమామ ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు, అందుకే అర్జంట్‌గా ఊరు వెళ్తున్నా! రావడానికి రెండు రోజులు పడుతుంది, కుమార్ చేతికి లీవ్ లెటర్ ఇచ్చాను, అది కొంచెం బాస్‌కి అందచెయ్యి, నేను రావడానికి ఒక వారం పట్టొచ్చు!” అని పెట్టేసింది. ఆ ఫోన్ కూడా, మయూర్ ఫోన్ నుంచి చేసి, తన ఫోన్ స్విచాఫ్ చేసింది. శిశిర తన దగ్గర ఉన్న ఇంకో ఫోన్ ఇచ్చింది. “ప్రస్తుతం నీ ఫోన్ స్విచాఫ్‌లో పెట్టి ఇది వాడు!” అని చెప్పింది.
ఆ స్నేహితురాలు, కుమార్ రాగానే, హేమ చెప్పింది అతనితో అంటే, ‘హేమ నాకు భయపడి, వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి ఉంటుంది, ఎక్కడికి పోతుంది, నాలుగు రోజుల్లో చచ్చినట్టు వస్తుంది’ అనుకున్నాడు కుమార్.
ప్లాన్ ప్రకారం, హేమ, మయూర్ స్నేహితులు ఇద్దరు, ఒక అమ్మాయి, అబ్బాయి పోలీస్ వేషాల్లో వచ్చారు. మయూర్, శిశిర వీళ్లతో వెళ్ళలేదు.
ఒక అద్దె జీప్‌లో ముగ్గురూ కుమార్ ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టగానే తలుపు తీసిన హేమ అత్తగారు, హేమని చూసి బూతు పురాణం మొదలుపెట్టింది. “ఎక్కడికి వెళ్ళావే? ఎవడితో కులకడానికి వెళ్ళావు? రాత్రంతా ఎక్కడో ఉన్న నిన్ను ఇంట్లోకి రానీయను!” కేకలు పెడుతున్న ఆమె, హేమ వెనకాల ఉన్న పోలీసులని ఒక్క క్షణం భయంతో చూసింది.
అంతే! ఆ ఆడపోలీసు వేషంలో ఉన్న అమ్మాయి, నటనలో మునిగిపోయింది.
“ఏంటీ! రాత్రి అ అమ్మాయిని తిట్టి, కొట్టి ఇంట్లోనుంచి వెళ్లగొట్టింది కాక, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీ కొడుకు ఎక్కడా! వాడిని తీసుకెళ్లడానికి, గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా పట్టుకెళ్లి స్టేషన్లో పడేయడానికి వచ్చాం.” గర్జిస్తూ అంది.
“మా అబ్బాయి ఆఫీస్‌కి వెళ్లాడు!” నంగిగా అంటున్న ఆవిడని పక్కకి లాగి,
“చూడమ్మా! నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలిగా, నీ బట్టలు తెచ్చుకో!” అన్న ఆ అమ్మాయి మాటలకి లోపలికి ఒక్క గంతులో వెళ్లి చిన్న పెట్టెలో, బీరువాలోని తన సర్టిఫికెట్లు, ఉన్న కొద్ది బంగారం, కొన్ని బట్టలు పెట్టి తెచ్చుకుంది.
“చూడండి అమ్మా! మీరు పెద్దవారు, ఒక్కరే ఉన్నారు, మీ కోడలు వాళ్ల మామగారింటికి వెళ్తోంది. ఆవిడ అమ్మమ్మకి బాగాలేదు, మీరు వెళ్ళనివ్వడం లేదంటే, మేము సాయం వచ్చాం. ఆ అమ్మాయిని ఏడిపిస్తే, మళ్లీ వచ్చి మీ ఇద్దరినీ అరెస్ట్ చేస్తాం.” మరీ గట్టిగా కాకుండా, కొంత మర్యాదగా చెప్పిన పోలీస్ అబ్బాయిని చూసి, ‘ఇతను పాపం మంచివాడు’ అనుకుంటూ తలూపింది ఆవిడ.
ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా హేమ, ఇద్దరు పోలీసులు, బయటికి పరుగులాంటి నడకల్లో వచ్చి, జీప్ ఎక్కి, జీప్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా పోనిచ్చారు.
కొద్ది దూరం వెళ్ళాక హేమ ఊపిరిపీల్చుకుంది. అప్పుడు వచ్చింది హేమకి విపరీతమైన నవ్వు. అది విజయగర్వంతో వచ్చింది.
ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి “అద్భుతంగా చేశారు. మీకెలా ధన్యవాదాలు చెప్పాలో తెలీదు” అంది హాయిగా ఊపిరి పీల్చుకుంటూ.
“పర్వాలేదమ్మా! మయూర్ అడిగితే మేము సాయం చెయ్యకుండా ఉండలేం. మాకు ఎంతో అండగా ఉంటాడు అతను. శిశిరగారు కూడా, మాకు డబ్బులు సాయం చేస్తూనే ఉంటారు. వారిద్దరూ చాలా మంచి వాళ్ళు” అన్నారు ఇద్దరూ.
రూమ్‌కి వెళ్ళాక హేమకి కొద్దిగా భయం కూడా వేసింది. ‘కుమార్ నిజంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, నిజం బయటపడుతుంది కదా!’
అది విన్న మయూర్, “వెళ్ళడు! ముందు, నిజంగానే మీ అమ్మమ్మకి బాగాలేదు అనుకుంటాడు. నాలుగురోజుల తర్వాత మీ నాన్నగారిని అడుగుతాడు. అప్పటికీ రాకపోయినా, తెలిసిన వాళ్ల దగ్గర వెతుకుతారు, వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు. శిశిరని, శ్రీదేవిని అడుగుతారు. మీరు ఎంత త్వరగా, ఉద్యోగం తెచ్చుకుని ఇక్కడ నుంచి బయటపడితే అంత మంచిది. మీరు అక్కడ సెటిల్ అయ్యాక, ఆయనకి లీగల్ నోటీస్ పంపండి. అతను ఎలానో ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అందుకే మీరే డివోర్స్ తీసుకోమని సజెస్ట్ చెయ్యండి.” మయూర్ మాటలకి ఆశ్చర్యపోయింది హేమ.
“మీకు లీగల్ జ్ఞానం బావుందే!”
“నేను లా చదువుతూ ఆపేసాను!” సిగ్గుగా అన్నాడు.
“అదీ సంగతి!” అంటూ మెచ్చుకుంది హేమ.
ఆ తర్వాత హేమ జీవితంలో సంఘటనలు, చాలా త్వరగా, అనూహ్యంగా జరిగాయి.
ముంబై కంపెనీలో ఉద్యోగం కోసం, ముందుగా ఫోన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాక, హేమని ముంబై రమ్మన్నారు. శిశిర వెంటనే టికెట్లు బుక్ చేసి పంపింది.
అక్కడ కంపెనీలో, “ఎందుకు నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తున్నావు? ” అని అడిగితే, హేమ ఏమాత్రం సంశయించకుండా జరిగింది మొత్తం చెప్పింది.
“ఎక్కడ అయినా, మన క్లైంట్‌కి లాభం చేకూర్చడం మన ధర్మం. అదే సమయంలో పన్ను ఎగ్గొట్టించడం, దొంగ లెక్కలు చూపడం సరయిన పనికాదు. ఇక్కడ కూడా అలానే చెయ్యాలి అంటే, నాకు ఈ ఉద్యోగం వద్దు. నేను వెళ్ళిపోతాను. ఏదో బ్యాంకులో క్లర్క్ కింద చేరినా నా జీవితం గడిచిపోతుంది. నా విలువలు మాత్రం వదులుకోను” ఆవేశం, దుఃఖం కలిపిన గొంతుతో చెప్పింది హేమ.
అక్కడ ఉన్న పెద్దాయన సంతోషంగా నవ్వారు. వెంటనే, ఒక కంపెనీ అకౌంట్ వివరాలు తెప్పించి, “వీళ్లకి నువ్వు టాక్స్ లెక్కచేసి చెప్పు, వాళ్ళకి నష్టం ఉండకూడదు, మనకి లాభం ఉండాలి. వీళ్ళ దగ్గర ఎంత ఫీజు తీసుకోవచ్చు. ఇవన్నీ స్టడీ చేసి, లెక్కవేసి, రేపు తీసుకుని రా!” అని చెప్పారు. బయటికి వచ్చాక తెలిసింది ఆయనే ఆ కంపెనీకి మొట్టమొదటి పార్టనర్,కంపెనీ డైరెక్టర్ అని.
తను ఉన్న హోటల్ రూమ్‌లో కూర్చుని, రాత్రంతా ఆ ఎకౌంట్లు అన్నీ చదివి, లెక్కలు వ్రాసి మర్నాడు ఆఫీసుకు వెళ్లింది. ఈసారి ఇంటర్వ్యూ రూమ్‌లో, ఆ పెద్దాయన ఒక్కరే ఉన్నారు.
ఆయనకి సమాధానం చెప్పేలోపే, ఆ కంపెనీ గురించి తనకు ఉన్న కొన్ని సందేహాలు ఆయన దగ్గర తీర్చుకుని, “ఈ కంపెనీ చాలా విలువలు ఉన్నవారు, ఇలాంటి ఖాతాదారులు మనకి చాలా ముఖ్యం. వీళ్లకు పన్ను ఎంత ఆదా చెయ్యగలిగితే అంత చెయ్యాలి. కానీ న్యాయమార్గంలోనే.. కంపెనీ ఉద్యోగులకు, మామూలు ఖర్చులతో పాటు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, కొంత డబ్బు ట్రస్ట్ ద్వారా, చదువు, వైద్యం కోసం ఖర్చు పెడితే, పన్ను తగ్గడమే కాదు, ఉద్యోగులంతా విశ్వాసంగా పని చేస్తారు. కంపెనీకి ఇంకా కొన్ని లాభాలు ఉంటాయి” అంటూ హేమ చెప్పింది పూర్తిగా విన్న ఆయన,
“నేను ఎప్పటినుంచో నుంచో ఎదురుచూస్తున్న నా వారసురాలివి దొరికావు. ఇప్పుడు నిన్ను అకౌంటెంట్‌గా తీసుకుంటున్నాను. నీ పనిబట్టి జీతం, నీ స్థానం పెరుగుతుంది. నాకు నచ్చితే అయిదు సంవత్సరాల్లో నిన్ను పార్టనర్‌గా చేర్చుకుంటాను.”
ఆయన మాటలకి, హేమకి సంతోషంతో కళ్ళనీళ్లు వచ్చాయి. గభాలున ఆయన పాదాలకి నమస్కారం చేసింది “థాంక్యూ సర్!” అంటూ.
“నీకు కంపెనీ ఫ్లాట్ ఇస్తాను, అక్కడే ఉండచ్చు, ఆఫీసుకి దగ్గరే, హాయిగా నడిచి రావచ్చు.”
హేమ సంతోషంతో వెంటనే శిశిర, మయూర్‌కి ఫోన్ చేసి చెప్పింది. “హమ్మయ్య! నీకు మంచి రోజులు వచ్చాయి! కొంత ఉద్యోగంలో సెటిల్ అయ్యాక నీ భర్త విషయం తేల్చుకో! నీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అని మర్చిపోకు, మయూర్ కూడా చాలా సంతోష పడతాడు. అతను రాగానే చెప్తాను” అన్న శిశిరకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంది మనసులో, పైకి చెప్తే “నాకు థాంక్స్ చెప్తావా!” అని తిడుతుందని భయంతో.
డైరెక్టర్ చెప్పినట్టు అయిదు సంవత్సరాలలో, మంచి పేరు తెచ్చుకుని, పార్టనర్ అయింది.
మంచి సంపాదన, సొంత ఫ్లాట్, ఇరవైనాలుగు గంటలు ఇంట్లో ఉండే పనిమనిషి, కారు, డ్రైవరు, వైభవంగా ఉంది హేమకి ముంబైలో. కుమార్‌కి విడాకులు ఇచ్చేసింది.
పిన్నికి నెలకింత పంపుతోంది, పిన్ని సాధింపు తండ్రికి ఉండకూడదని. తండ్రీ, పెద్ద తన గురించి ఆరాటపడడు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తే “బాగున్నావా!” అంటే, “ ఆ.. నువ్వూ!” అనడం తప్ప.
అందుకే, ఈ ఒంటరి జీవితం నచ్చింది హేమకి. శిశిరకి, శ్రీదేవికి చాలాసార్లు చెప్పింది తన దగ్గరికి వచ్చి, కొన్ని రోజులు ఉండి వెళ్ళమని. శిశిర పూర్తిగా బిజీ అయ్యి ఇదిగో, అదిగో అంటుండేది. ఒక్కసారి, శ్రీదేవి మాత్రం, ముంబైలో ప్రోగ్రామ్ ఉంటే శ్రీధర్‌తో వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళింది.
(ఇంకా ఉంది)
శ్రీపతి లలిత వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి విరమణ చేశారు. స్వస్థలం హైదరాబాద్. శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తిగారు.
వీరి సాహితీ ప్రయాణం, అరవై ఏళ్ళ వయసులో మొదలైంది. ఇప్పటికి సుమారు వంద కథలపైనే వ్రాసారు.
ఈనాడు ఆదివారం అనుబంధంలో ఇప్పటివరకు ఏడు కథలు ప్రచురించడం, వీరికి గుర్తింపునిచ్చింది.
ఫేస్బుక్ గ్రూప్‌లలో, అనేక అంతర్జాల పత్రికలలో వీరి కథలు వచ్చాయి. ఇరవై అయిదుకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.
వీరు రాసిన చాలా కథలు వేరు, వేరు యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.
సంగీతారాధ్య వీరి మొదటి నవల.
