Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంగీతారాధ్య-6

[శ్రీపతి లలిత గారు రచించిన ‘సంగీతారాధ్య’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]

[స్నేహితురాళ్లు పెళ్ళి చేసుకోడంతో, శిశిరకి కూడా పెళ్ళి మీద మనసు మళ్ళుతుంది. ప్రేమించుకున్నారు కనుక శిశిర్‌నే పెళ్ళి చేసుకుందామనుకుంటుంది. ఓ రోజు శిశిర్ వాళ్ళింటికి పల్లెటూరికి తీసుకెళ్ళమని అడుగుతుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ఆనందంగా గడుపుతారు. తిరిగి బయల్దేరి సిటీకి వస్తుంటే, దారిలో పెద్ద వాన కురుస్తుంది. ఓ ఫామ్ హౌస్ లాంటి పెద్ద ఇల్లు కనబడితే, కారుని ఆ ఇంటి వైపు పోనిచ్చి, కాసేపు ఆ ఇంట్లో ఉంటామని వామ్‌మన్‌ని అడుగుతాడు. లోపల శిశిరని చూసి, ఆడవాళ్ళు కూడా ఉన్నారే, రండి బాబూ అంటూ లోపలికి తీసుకువెళ్తాడా వాచ్‌మన్. గంటయినా వాన తగ్గదు. ఆ రాత్రికి అక్కడ ఉండిపొమ్మని తమ ఓనర్‌తో చెప్పించి వాళ్ళని ఒప్పిస్తాడు వాచ్‍మన్ రంగయ్య. వాళ్ళకి ఆహారం, పడకలు ఏర్పాటు చేస్తాడు. ఎంతకీ వాన తగ్గదు. ఆ రాత్రి ఆ వర్షం చల్లదనంలో, చిమ్మ చీకటిగా ఉన్న గదిలో, ఉరుములు, మెరుపులతో భయం వేసే వాతావరణంలో, ఎవరు,ఎవరిని దగ్గరకి తీసుకున్నారో తెలీని పరిస్థితుల్లో ఇద్దరూ ఒకటవుతారు. మర్నాడు ఉదయం మయూర్ తప్పు చేసినట్టుగా తలదించుకుంటే, మనం భార్యాభర్తలమయ్యాం, తలదించుకోకు అంటుంది శిశిర. టిఫిన్ తిని, కాఫీ తాగి రంగయ్యకి థాంక్స్ చెప్పి, కొంత డబ్బిచ్చి, సిటీకి బయల్దేరుతారు. – ఇక చదవండి]

6

ఆ రోజు తర్వాత, నెమ్మదిగా తల్లితో మాట్లాడదామంటే, వసుంధరకు, మయూర్‌ని అల్లుడిగా చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని శిశిరకి అర్థమవుతోంది. ఎలా తల్లికి చెప్పి ఒప్పించాలా అన్న ఆలోచనలో పడింది శిశిర. ఒకవేళ ఒప్పుకోకపోతే.. శిశిర మనసులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.

ఏ మ్యూజిక్ డైరెక్టరో, లేదా ఏ ప్రొడ్యూసరో, కూతుర్ని వరించి చేసుకుంటాడని ఆశలో ఉంది వసుంధర.

పెళ్లి అయినా, కూతురు, ఆమె సంపాదన, తన కంట్రోల్లో ఉండాలనేది వసుంధర ఆలోచన. కానీ ఈ మధ్య శిశిరని చూస్తుంటే, కూతురు తన చెయ్యి దాటిపోతోందని గమనించిన వసుంధర, నెమ్మదిగా శిశిరని మళ్లీ కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. కానీ, శిశిర ఇదివరకటిలా భయపడే అమ్మాయి కాదని గ్రహించే లోగానే, వసుంధరకి తల తిరిగే పని చేసింది శిశిర. ఒక రోజు, శిశిర, మయూర్, ఇద్దరూ మెడలో పూలదండలతో వచ్చి “అమ్మా, నీకు నచ్చదని తెలుసు, కానీ నేనూ, మయూర్ ఒకరినొకరం విడిచి ఉండలేం. మేము పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాము, రిజిస్టర్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకున్నాం. ముందుగా గుడిలో పెళ్లి చేసుకున్నాము” చెప్పి వసుంధర కాళ్లకి దణ్ణం పెడితే, ఇద్దర్నీ చంపేయాలన్న కోపం వచ్చినా, పైకి కనపడకుండా ఆపుకుని,

 “నాతో చెప్తే వద్దంటానా! నేనే మీకిద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. సరేలే! అయిందేదో అయిపోయింది. ఎవరికీ చెప్పకండి. నేను త్వరలో మీకు పెళ్లి ఏర్పాటు చేస్తాను. అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉండండి” చెప్పింది గొంతులో, ప్రేమ కొని తెచ్చుకుని.

వసుంధరకి తెలీని విషయం, వాళ్ళిద్దరూ అప్పటికే జాగ్రత్త స్టేజి దాటిపోయారని, తల్లితో చెప్తే, చంపేస్తుందని భయపడి పెళ్లి చేసుకున్నారని. శిశిరకి అప్పటికే మూడోనెల దాటిపోయిందని తెలిస్తే, తల్లి అబార్షన్ చేయించడానికి వెనకాడదని, ఆ విషయం బయట పెట్టలేదు. అమాయకపు మేకపిల్ల, గుంట నక్కని నమ్మినట్టుగా, శిశిర తల్లిమాటలు నమ్మింది. ఆవిడ అసలు రూపం తెలీని మయూర్ కూడా, సంతోషంగా వెళ్లిపోయాడు.

“మయూర్ గాడిని చావు దెబ్బ కొట్టాలి, మంచిగా కనిపిస్తూ, నా కూతుర్ని మాయ చేస్తాడా!” కచ్చగా అనుకుంది వసుంధర.

రెండు రోజుల తర్వాత, వేరే ఊర్లో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్న మయూర్ కారుని, కంకర లారీ ఢీ కొట్టి, మయూర్ స్పాట్ లోనే చనిపోయాడు.

ముందు ఆక్సిడెంట్ అని నమ్మిన శిశిర, తల్లి ఫోనులో, రహస్యంగా మాట్లాడడం విని, తను అక్కడే ఉంటే, తన పుట్టబోయే బిడ్డని చంపడానికి తల్లి వెనకాడదని తెలిసి, ఇంటి నుంచి పారిపోయింది.

ముందుగా వసుంధర అనుమానం, శ్రీరామ్ మీదే వస్తుందని తెలిసి, శిశిర తండ్రి దగ్గరికి వెళ్లలేదు.

అతనికి ఫోన్ చేసి, శ్రీదేవి ఇంటికి పిలిపించింది. సంగతంతా తండ్రికి చెప్తే, శ్రీరామ్ బాధపడ్డాడు. “కష్టమో, సుఖమో నేను మీతో ఉంటే నీకు ఈ బాధ వచ్చేది కాదమ్మా! తప్పు నాదే, కానీ సరిదిద్దుకునే సమయం దాటిపోయింది.”

“నువ్వు ఈ ఊర్లో ఉంటే, మీ అమ్మ నిన్ను తీసుకెళ్లిపోతుంది. హేమ ముంబైలో ఉందికదా! అక్కడికి వెళ్ళు. మీ అమ్మకి అస్సలు అనుమానం రాదు. నేను విమానం టికెట్ కొని, నిన్ను ముంబై పంపుతాను. హేమ వచ్చి నిన్ను తీసుకుని వెళ్తుంది” అన్నాడు.

శ్రీరామ్ సలహాతో, ముంబైలో ఉన్న హేమ దగ్గరికి బయలుదేరింది శిశిర. శ్రీరామ్, శ్రీదేవిల ద్వారా ఫోన్లో విషయం తెలిసిన హేమ దిగ్భ్రాంతి పొందింది. అంత మంచివాడు మయూర్. అతన్ని ఇలా చెయ్యడానికి ఎలా మనసొప్పింది. డబ్బు ఆశ, మనిషిని ఎంత దిగజారుస్తుంది అనుకుంది.

శిశిర, విమానం దిగేసరికి, ఎయిర్పోర్ట్‌లో కారుతో రెడీగా ఉంది హేమ. శిశిర ముంబై వచ్చిన సంగతి శ్రీదేవి, శ్రీరామ్‌కీ తప్ప ఇంకెవరికీ తెలియదు.

శిశిర జరిగిన సంఘటనలతో విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇంటికెళ్లాక, ఓదారుస్తున్న హేమని చూడగానే శిశిర తట్టుకోలేక పోయింది.

 “చూసావా హేమా! అమ్మ ఎంతపని చేసిందో! ఒక మనిషి ప్రాణం తీయించింది. చిన్నప్పటినుంచి, ఆవిడకి కీర్తి, డబ్బు ఇంతే కావాలి. తను సాధించలేనిది, నాతో పొంది సంతోషపడదామని అనుకుంది కానీ, నాకు ఏది సంతోషమో ఎప్పుడూ చూడలేదు.

నాకు బాల్యం అనేది లేకుండా చేసింది. అమ్మవేపు బంధువులు ఎవరూ లేరు. నాన్న వేపు వాళ్ళని కలవకుండా చేసేది. నాన్నని కూడా మాటలతో, చేతలతో బాధ పెట్టి, ఆయన ఇంటినుంచి వెళ్ళేవరకు నిద్రపోలేదు. నా చిన్నప్పటినుంచి సినిమాల్లో పాటలు పాడడం, ఫంక్షన్స్‌లో పాటలు పాడడమూ తప్ప నాకింకో లోకం లేకుండా పెంచింది.

మీతో స్కూల్లో కలిసి చదివిన ఆ రోజుల్లో కూడా, అందరితో కలవనీయకుండా చాలా ప్రయత్నం చేసింది. ఆ రోజులే నా జీవితంలో బంగారురోజులు.

ఇప్పుడు నా మయూర్‌ని నా నుంచి దూరం చేసింది. ఈ జన్మలో ఆమెని క్షమించను, ఆమె నా తల్లి అనుకోవాలంటేనే అసహ్యం వేస్తోంది!”

ఉద్రేకంగా అంటున్న శిశిరని నెమ్మదిగా ఆపుతూ, “ఇప్పుడవన్నీ ఆలోచించకు శిశిరా! ఇక్కడ నువ్వూ, నేనూ తప్ప ఎవరూ ఉండరు, రారు. అయిపోయినదాన్ని మనం మార్చలేం. పోయిన మయూర్‌ని నీకెవరూ తిరిగి తేలేరు.

అతని గుర్తుగా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని, నీ నుంచి ఎవరూ దూరం చెయ్యలేరు.

ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో, నీ మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఇక్కడ నీకేవిధమైన ఇబ్బంది లేదు. ఎప్పడు,ఏమి కావాలన్నా ఈ అమ్మాయి చేసి పెడుతుంది.

కడుపు నిండా తిని, కంటినిండా నిద్ర పోవాలి. రేపు మనం ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆవిడ ఎలా చెప్తే అలా నడుచుకో!” చెప్పింది హేమ.

మర్నాడు, శిశిరని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళింది హేమ.

ఆమె శిశిరని చెక్ చేసి, లోపల బిడ్డ బాగానే ఉందని, శిశిరకి మాత్రం బీపీ ఎక్కువగా ఉందని, మనసు ప్రశాంతంగా పెట్టుకుని వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పింది.

హేమ, ఆమెతో పాటు ఇంట్లో ఉన్న మనిషి, ఇద్దరూ శిశిరని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు.

శ్రీరామ్, మధ్య మధ్యలో వచ్చి చూసినా, వసుంధర తన రాకపోకలు కనిపెడుతుందేమో అని ఎక్కువగా ఫోన్ లోనే మాట్లాడేవాడు. వసుంధర ఎంత ప్రయత్నించినా, శిశిర ఎక్కడుందో తెలుసుకోలేకపోయింది.

హేమ ఎంత సర్ది చెప్పినా, మయూర్ మరణం, శిశిరని బాగా కృంగతీసింది. అందునా, అది తల్లి చెయ్యించిన ఘోరమని, మానసికంగా కృంగిపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, శిశిర ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది. డబ్బులన్నీ తల్లి చేతిలోనే ఉండేసరికి, తనకు డబ్బులు లేవని, పుట్టబోయే బిడ్డతో ఎలా బతకాలని బాధపడేది.

తనకి ఏదైనా అయితే, తన బిడ్డ సంగతి ఎలా అని, ప్రతీ నిమిషం దిగులు పడుతుండేది.

చూసి, చూసి హేమ ఒకసారి, “శిశిరా! నువ్వు బిడ్డని కని నాకు ఇవ్వు. నేను పెంచుకుంటాను” అంది శిశిరతో.

“హేమా! నువ్వు నా మీద జాలితో అంటున్నావా?” అంది ఉక్రోషంగా.

“లేదు! నిజంగానే అంటున్నాను. నేను ఈ స్థితిలో ఉండడానికి నువ్వూ, మయూర్ కారణం. నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా వృత్తే నాకు దైవం. నువ్వు నిజంగా నీ బిడ్డని నాకు పెంపకానికి ఇస్తే, నా బిడ్డలా పెంచుకుంటాను. నిజానికి ఈమధ్య నాకు ఒక బిడ్డని పెంచుకోవాలనే కోరిక కలుగుతోంది. ఎవరో తెలియని వారి బిడ్డ కంటే, నీ బిడ్డ అయితే, ఇంకా మంచిది. నువ్వు నాతో ఉన్నా, వేరేగా వెళ్లినా ఆ బిడ్డ నాతోనే ఉంటుంది. నువ్వు మళ్లీ నీ పాటల ప్రస్థానం మొదలుపెట్టు. అసలు ఈ బిడ్డ, నీ బిడ్డ అన్న సంగతి ఎవరికీ తెలియనివ్వను” సీరియస్‌గా అన్నది హేమ.

శిశిర మొహం ఒక్కసారి వెలిగిపోయింది. ఆ రోజు నుంచి, శిశిర హేమతో రోజూ తన బిడ్డని ఎలా పెంచాలి అన్న విషయం గురించి మాట్లాడేది.

“హేమా! నా జీవితంలో వసంతాన్ని అనుభవించి, ఎక్కువగా ఆనందించిన క్షణాలు ఏమిటో తెలుసా? నీతోనూ, శ్రీదేవితోనూ గడిపిన స్కూల్ రోజులే. నా బిడ్డ జీవితం ఎంతో సంతోషంగా గడవాలి. నాలాగా చిన్నప్పటినుంచి పోటీ జీవితం వద్దు.

ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివే స్వతంత్రం ఉండాలి. మయూర్ నేనూ గాయకులం కనక, పాటల మీద ఇష్టం ఉండే అవకాశం ఉంది. సంగీతం నేర్చుకుంటానంటే ఒప్పుకో, ఇష్టం లేకుండా బలవంత పెట్టి ఏదీ నేర్పించకు. కనీసం ఇరవై ఏళ్ళు వచ్చేవరకు, ఏ పోటీలకు వెళ్ళనివ్వకు. నాకు బాల్యం ఎలా ఉంటుందో తెలీదు, నా బిడ్డ అన్ని ఆటలు ఆడుకోవాలి, సైకిల్ తొక్కాలి, ఈత కొట్టాలి, పరుగులు పెట్టాలి. గెలుపు,ఓటమిలు రుచి చూడాలి. అలకలు, సంతోషాలు, దుఃఖాలు, ఏడుపులు అన్నీ అనుభవిస్తూ మామూలుగా పెరగాలి.

నాకు నువ్వు మాటివ్వు. నా బిడ్డని ఇలానే పెంచుతాను అని” ఆవేశంగా అన్న శిశిరని, విస్మయంగా చూసింది హేమ. ‘ఇంత బాధ దాచుకుందా మనసులో? ఒక్కసారి అగ్నిపర్వతం బద్దలయ్యినట్టుగా, తన మనసులో ఉన్నవన్నీ చెప్పింది’ అనుకుంది.

 “శిశిరా! నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు నీ బిడ్డని ఎలా పెంచాలనుకుంటున్నావో, అలానే పెంచి నీకు చూపిస్తాను” చేతిలో చెయ్యి వేసి చెప్పింది హేమ.

అలా హృదయభారం దించుకున్నాక, శిశిర ఆరోగ్యం బాగయ్యి, హుషారుగా తిరుగుతుండేది. ఆహారం తీసుకుంటూ, ఆహ్లాదంగా ఉండేసరికి, కానుపు తేలిగ్గా అయ్యి పండంటి పాపాయి పుట్టింది. శిశిరే, పాపాయికి ‘ఆరాధ్య’ అనే పేరు పెట్టింది.

హేమని తొందరపెట్టి, ఆరాధ్యని న్యాయపరంగా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పూర్తిచేసింది. ఆరాధ్యకి ఏడాది నిండిన కొన్నిరోజులకే, రాత్రి హాయిగా కబుర్లు చెప్పిన శిశిర, ఉదయం లేవలేదు. ఆ రోజు సరిగ్గా మయూర్ పోయిన రోజు. ‘తన ప్రియ సఖుడిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది’ అనుకుంది హేమ.

సంగతి తెలిసిన శ్రీరామ్ వచ్చి, కార్యక్రమాలు జరిపించి, కొంతకాలం ఆరాధ్యని ముంబైలోనే ఉంచి పెంచమని చెప్పారు. హేమ, స్నేహితురాలికి ఇచ్చిన మాట ప్రకారం, ఆరాధ్యని బాల్యంలో ఉండే సరదాలు, సంతోషాలు హాయిగా అనుభవించేలాగా పెంచింది.

తల్లిదండ్రి పోలిక వచ్చి, ఆరాధ్య చిన్నప్పటినుంచి సంగీతం అంటే ఇష్టపడేది. హేమ ముందుగా, ఆరాధ్యకు ముంబైలో హిందుస్తానీ సంగీతం నేర్పించింది. శ్రీదేవి సలహాతో, హైదరాబాద్‌లో పెరిగితే మరింత బావుంటుందని, ఆరాధ్యకి పదిహేను సంవత్సరాలు వచ్చాక, హైదరాబాద్‌లో, తన ఆధ్వర్యంలో, కంపెనీ శాఖ పెట్టింది.

అందరికీ, పాపని తను అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచాననే చెప్పేది. అసలు నిజం ఇద్దరికి మాత్రమే తెలుసు.

“ఇది నా స్నేహితురాలి కథ, మీ అమ్మ కథ. మనం ముంబై నుంచి రావడం, శ్రీదేవి దగ్గర సంగీతం నేర్చుకోవడం, ఇవన్నీ నీకు తెలిసినవే” భావోద్వేగంతో చెమ్మగిల్లిన కళ్లు తుడుచుకుంటూ అంది హేమ. తను కడుపులో ఉన్నప్పుడు, తల్లి పడ్డ బాధ, తండ్రి పోయిన దుఃఖాన్ని దిగమింగలేక, శిశిర పడ్డ క్షోభ వింటుంటే ఆరాధ్య ఏడ్చేసింది.

“అయ్యో! నా కన్నమ్మ ఎన్ని బాధలు పడి నన్ను కన్నది కదా! ఆ సమయంలో నువ్వు ఆమెని ఆదుకోకపోతే, నేను ఈ లోకంలోకి వచ్చేదాన్ని కాదు కదమ్మా!” కళ్ళనీళ్ళు పెట్టుకున్న ఆరాధ్యని హృదయానికి హత్తుకుంది.

“ఆ దేవుడు ఇచ్చిన వరానివి నువ్వు. నా జీవితంలో ఒంటరిగా ఉండకుండా, నిన్ను నా చేతిలో పెట్టింది మీ అమ్మ. నాకు నీ వల్ల ఇంత సంతోషం రాసిపెట్టి ఉంటే, నువ్వు రాకుండా ఎవరు అడ్డుకుంటారు తల్లీ!” అంది హేమ.

“మరి తాతయ్య ఏమయ్యారు? మా నాన్న తరఫు బంధువులు ఎవరూ లేరా?”

“అంకుల్, శిశిర పోయిన తర్వాత, తను భార్య నుంచి విడిపోకుండా ఉంటే బావుండేదని, తన వల్లే కూతురికి సమస్యలు వచ్చాయని, దిగులు పడి కొద్ది రోజుల్లోనే పోయారు. చివరి రోజుల్లో, వసుంధర ఆంటీ, శ్రీరామ్ అంకుల్ దగ్గరికి వచ్చేసింది. ప్రేమతో కాకపోయినా, ఆయన ఇల్లు, ఆస్తి ఇంకెవరికైనా ఇస్తారేమో అన్న భయంతో. ఏది ఏమైనా, ఆఖరి రోజుల్లో ఒంటరిగా దిక్కులేని చావు కాకుండా, భార్య తన దగ్గరికి రావడం శ్రీరామ్ అంకుల్‌కి కొంత శాంతి చేకూర్చుంది. విడాకులు తీసుకోలేదు కనక, ఆయన ఇల్లు, డబ్బులు వసుంధర ఆంటీకి చెందాయి. శిశిర చనిపోయిన సంగతి ఆవిడకి చాలా ఆలస్యంగా తెలిసింది. ఎంతైనా కన్నతల్లి కదా! తన ఆశలు అన్నీ అడియాసలు అవడం, కన్న కూతురు, కట్టుకున్న భర్త ఇద్దరూ చనిపోవడం, ఎవరూ బంధుమిత్రులు దగ్గరికి రాకపోవడంతో, ఒంటరితనంతో, మద్యం అలవాటైందని విన్నాను. ఇల్లు ఉంది, డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఎలా డబ్బులు సంపాదించాలి అనే విషయంలో, ఇప్పుడు ఈవిడకి నువ్వు దొరికావు. శిశిరని నీ వయసులో చూసిన వారికి, నిన్ను చూస్తే వెంటనే అర్థం అవుతుంది నువ్వు శిశిర కూతురివి అని.”

(ఇంకా ఉంది)

Exit mobile version