[శ్రీపతి లలిత గారు రచించిన ‘సంగీతారాధ్య’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[తమ పెళ్ళి తల్లికి ఇష్టం లేదని తెల్సి, మయూర్‌ని గుళ్ళో పెళ్ళి చేసుకుని ఇంటికి వస్తుంది శిశిర. వాళ్ళని పెళ్ళిబట్టల్లో, పూలదండలతో చూసిన వసుంధర నిర్ఘాంతపోతుంది. మనసులో ఎంతో కోపం ఉన్నా, పైకి ఆప్యాయత నటించి వాళ్ళని దీవిస్తుంది వసుంధర. కానీ కుట్రపన్ని మయూర్‌ని యాక్సిడెంట్ చేయించి చంపించేస్తుంది. మొదట దాన్ని ప్రమాదమని నమ్మిన శిశిర, వసుంధర ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతుంటే విని, అసలు విషయం అర్థం చేసుకుంటుంది. ఇంక అక్కడే ఉంటే తనకీ, పుట్టబోయే బిడ్డకీ ప్రమాదమని భాహించి, ముంబైలో ఉంటున్న హేమ దగ్గరకి వెళ్తుంది. విషయం తెల్సుకున్న హేమ, ఆమెని ఆదరించి, ధైర్యం చెబుతుంది. పుట్టబోయే బిడ్డని తాను పెంచుకుంటానని హేమ భరోసా ఇస్తుంది. తాను బిడ్డని ఎలా పెంచాలనుకున్నానో, అలాగే పెంచమని అడుగుతుంది శిశిర. ఆ మేరకు మాట ఇస్తుంది హేమ. ప్రసవమయ్యాకా, పాపకి ఆరాధ్య అని పేరు పెడుతుంది. కొన్ని రోజులకి పాపని చట్టపరంగా హేమకి దత్తత ఇస్తుంది. ఆరాధ్యకి ఏడాది నిండిన కొన్ని రోజులకి శిశిర చనిపోతుంది. స్నేహితురాలికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె కోరుకున్నట్టుగానే ఆరాధ్యని పెంచి పెద్ద చేస్తుంది హేమ. ఇలా గతం చెప్పడం పూర్తి చేస్తుంది. మరి మా తాతయ్య ఎక్కడున్నారని అడుగుతుంది శిశిర. ఆయన ఆఖరి రోజుల్లో వసుంధరాంటీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందనీ, ఆయన పోయాకా, ఆయన ఆస్తిపాస్తులన్నీ ఆంటీకీ దక్కాయని, ఆవిడ వాటన్నిటినీ దుబారా చేసి పోగొట్టుకుందని చెప్తుంది హేమ. – ఇక చదవండి]
7
“మయూర్ కుటుంబం సంగతులు నాకు తెలియవు. నువ్వే నా కుటుంబం అని పెంచాను, వసుంధరా ఆంటీని కూడా ఇన్నిరోజుల తర్వాత చూస్తున్నాను” అంది హేమ.
“మనకి మా నాన్న గురించి వివరాలు ఎలా తెలుస్తాయి అమ్మా! పాపం కొడుకుని పోగొట్టుకుని, కోడలు అవుతుందనుకున్న అమ్మని దూరం చేసుకుని ఎంత బాధపడ్డారో! నిజానికి అమ్మమ్మ కంటే, వాళ్లకు నా ఆర్ధిక సాయం అవసరం.” సాలోచనగా అన్న ఆరాధ్యని చూసి,
“నీదెంత మంచి మనసు బంగారం. నాకు తెలిసి మీ నాన్న టైంలో సింగర్ అభిషేక్ అని ఉండాలి. ఇప్పుడు కొత్త గాయకులు వచ్చాక, ఆయన పాడడం తగ్గింది, ఏవో కొన్ని పాటల పోటీలకు జడ్జి కింద వస్తున్నారని విన్నాను. ఆయనని నువ్వు కలిసే అవకాశం కోసం నేను ప్రయత్నిస్తాను” అంది హేమ.
అన్నట్టుగానే, అభిషేక్‌ని కలవడం కోసం గట్టి ప్రయత్నం చేసింది.
ఆరాధ్య ప్రోగ్రాములు కొన్ని, హైదరాబాద్‌లోనే అయ్యాయి. దానికి కొందరు పాత గాయకులని కూడా అతిథులుగా పిలిచారు. వాళ్ళల్లో అనుకోకుండా అభిషేక్ కూడా ఉన్నాడు.
మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక, ఆరాధ్య, హేమ, ఇద్దరూ అభిషేక్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అతను ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్థిరపడ్డాను అని చెప్పడంతో, అతని అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకుంది ఆరాధ్య.
“ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలని చూస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి వస్తాను. వచ్చేముందు ఫోన్ చేస్తాను” అంది.
ఎందుకు ఆరాధ్య తనని కలవాలనుకుందో అర్థం అవ్వకపోయినా, “సరే!” అన్నాడు అభిషేక్.
నాలుగు రోజుల తరవాత ఆరాధ్య, హేమ, అభిషేక్ ఇంటికి వెళ్లారు.
ఇద్దర్నీ సాదరంగా ఆహ్వానించాడు అభిషేక్. అందరూ కూర్చున్నాక “చాలా చక్కగా పాడుతున్నావమ్మా నువ్వు? నీది మంచి ప్లేబాక్ సింగర్ గొంతు, సినిమాల్లో పాడడం ఎందుకు వద్దనుకున్నావు?” అన్నాడు.
“ఏమో అంకుల్! నాకు సినిమా సంగీతంకన్నా, ఈ శాస్త్రీయ సంగీతమే నచ్చుతోంది, ఇప్పుడు హిందూస్తానీ కూడా మళ్లీ నేర్చుకుంటున్నాను, కొన్ని లలిత సంగీతం పాటలు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మీరు నేర్పుతారా? అంకుల్ అనేశాను క్షమించండి” అంది ఆరాధ్య.
“అయ్యో! తప్పు ఏముందమ్మా? ఇంచుమించు మా అమ్మాయి వయసు నువ్వు. ఎందుకో నిన్ను చూస్తే ఎవరో గుర్తొస్తున్నారు. ఎవరూ అని తట్టడంలేదు..”
“శిశిరా! మయూర్! ఎవరు గుర్తొస్తున్నారు?” ఆరాధ్య అంటుంటే,
“శిశిరా? నీకు శిశిర బంధువా? మయూర్ ఎలా తెలుసు? వాళ్ళిద్దరూ చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు దాటింది” సంభ్రమంగా అన్నాడు అభిషేక్.
“ఈ అమ్మాయి, శిశిర, మయూర్ల కూతురు!” హేమ చెప్తే నమ్మలేనట్టు చూసాడు అభిషేక్.
“అవును అంకుల్, నాకు ఇప్పటివరకు మా అమ్మానాన్నల గురించి కొంత తెల్సు, మీరు, వాళ్ళు గుళ్లో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళతో ఉండి, మీరు ఫోటోలు తీసారని తెలుసు. నా దురదృష్టం, వాళ్ళని ఒక్కసారి కూడా చూడలేకపోవడం, అయితే, అదృష్టం ఏమంటే మా కన్నమ్మకి, ప్రియ సఖి హేమ నాకు అమ్మ అయ్యి నన్ను పెంచింది. నాకు సంగీతం నేర్పించింది. నాకు నా తండ్రి వేపు బంధువులని కలవాలని ఉంది. మీకు వాళ్ల గురించి తెలుసా.” ఆరాధ్య గొంతు వణికింది.
“ఆరాధ్యా! నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చెప్పాక, నాకు శిశిర పోలికలు కనిపిస్తున్నాయి. నీ పాటలో మయూర్ వినిపిస్తున్నాడు. నాకు మయూర్ మంచి స్నేహితుడు. అంతచిన్న వయసులో, అతని జీవితం ముగిసిపోవడం చాలా బాధగా ఉంది.
అవును! మీ అమ్మనాన్నా గుడిలో పెళ్లి చేసుకున్నప్పుడు, నేను వారితో వెళ్లాను, ఫోటోలు కూడా తీసాను. నా దగ్గర కూడా కొన్ని ఉండాలి. చూసి నీకిస్తాను. మయూర్ కుటుంబం గురించి నాకూ పెద్దగా తెలియదు, కానీ ఈ మధ్య ఒక పాటల పోటీకి వెళ్ళినప్పుడు, ఒక అబ్బాయి వచ్చాడు.. అతని పేరు సారంగ్ అని గుర్తు, సెకండ్ విన్నర్ అతను. అతను మయూర్‌కి బంధువుని అని చెప్పినట్టు గుర్తు. నేను ఆ ఛానల్ వాళ్ళని కనుక్కుని మీకు వివరాలు చెప్తాను.” అన్న అభిషేక్ మాటలకి చాలా సంతోష పడింది ఆరాధ్య.
ఆ ప్రోగ్రామ్ ఎపిసోడ్ చూసింది ఆరాధ్య. అందులో యాంకర్, సారంగ్‌ని
“సారంగ్! మీకు సంగీతం మీద అభిరుచి ఎలా వచ్చింది? మీ అమ్మగారు కానీ, నాన్నగారు కానీ పాడతారా?” అన్నదానికి అతను, “మా అమ్మా, నాన్నలకి సంగీతం రాదు. మా బాబాయి, అంటే మా నాన్నగారి తమ్ముడు, మయూర్ అని ఒకప్పుడు పెద్ద సింగర్, దురదృష్టవశాత్తూ, యాక్సిడెంట్లో చనిపోయారు. అది కూడా నేను పుట్టక ముందు జరిగింది. ఒకవేళ, ఆయన పోలిక వచ్చిందేమో నాకు, అనుకుంటారు ఇంట్లోవాళ్ళు.” అన్నాడు సారంగ్. అది విన్న ఆరాధ్య సంతోషపడింది, మయూర్ తరఫు బంధువుల ఆచూకీ దొరికినందుకు.
అన్నట్టుగానే రెండురోజుల తర్వాత, అభిషేక్, సారంగ్ ఫోన్ నంబర్, అడ్రస్ చెప్పాడు. వెంటనే సారంగ్కి ఫోన్ చేసింది ఆరాధ్య.
8
ఇప్పటికే సంగీత ప్రపంచంలో ఆరాధ్య పేరు బాగా తెలిసిపోవడంతో, ఆమె ఫోన్ చేస్తే సంతోషంతో మాట్లాడాడు సారంగ్.
“సారంగ్! నేను, మీరు ఆ పోటీలో పాడిన పాటలు విన్నాను. వచ్చే నెలలో నా ప్రోగ్రాంలో కొన్ని లలిత గీతాలు, జానపద పాటలు కూడా పెడదామని ఉంది. దాని గురించి మాట్లాడాలి. మీ ఇంటికి రావచ్చా!” అని అడిగిన ఆరాధ్య మాటలకి పొంగిపోయాడు సారంగ్. “తప్పకుండా రండి!” అని అడ్రస్ పెట్టాడు.
కొన్ని స్వీట్స్, పళ్లు పట్టుకుని ఆ అడ్రస్‌కి వెళ్లింది ఆరాధ్య. హేమని ‘వద్దు’ అని చెప్పి తను ఒక్కతే వెళ్ళింది.
బయట సారంగ్ ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
“నమస్తే మేడమ్!” అని సారంగ్ అంటే, “అక్క! మీ అక్కని నేను!” ఆశ్చర్యంగా చూస్తున్న అతని వెంట లోపలికి వెళ్లింది.
అక్కడ సోఫాలో కూర్చున్న వారిని పరిచయం చేస్తూ, “మా అమ్మ లత, నాన్నగారు సాగర్” అన్నాడు సారంగ్.
ఆరాధ్య ఇద్దరికీ కాళ్ళకి నమస్కారం చేస్తుంటే, “అయ్యో! ఇదేంటమ్మా!” అంటూ లేపింది లత.
ఆరాధ్య వంక చిత్రంగా చూస్తున్న సాగర్ని, భుజం మీద తట్టి, “ఏమండీ!” అంది లత.
“నువ్వు.. నీ పేరేంటి? ఎవరి అమ్మాయివి” గొంతు గద్గదమైంది సాగర్‌కి.
“నేను మీ తమ్ముడు మయూర్, శిశిరల కూతుర్ని పెదనాన్నగారూ!” దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అంది ఆరాధ్య.
“నా తమ్ముడి కూతురివా? శిశిర ఇంకా మయూర్ బిడ్డవా నువ్వు. నాకు తెలుసు! వాడు ఆ ముందు రోజు ఏదో చెప్పాలనుకుని, నిన్ను పర్సనల్‌గా కలిసినప్పుడు చెప్తాను అన్నయ్యా ఆ శుభవార్త అన్నాడు. ఆ తర్వాత అంతా మాకు దుఃఖమే మిగిలింది.”
సాగర్ మాట్లాడేది, ఆరాధ్య సమాధానం, లతకి కానీ, సారంగ్కి కానీ ఏమీ అర్థం కాలేదు.
“ముందు అందరూ కూర్చోండి, నేను తాగడానికి ఏదన్నా తెస్తాను” అని లత వెళ్తుంటే,
“మన ఇంటి లక్ష్మి మొదటిసారి ఇక్కడికి వచ్చింది, భోజనం ఏర్పాటు చెయ్యి!” అన్నాడు సాగర్.
“పెద్దమ్మా! మీరు కూడా కూర్చోండి. ఇది మీరు కూడా వినాలి!” అంటూ జరిగిన విషయం, యాక్సిడెంట్ చేయించింది అమ్మమ్మ అన్న ఒక్క విషయం తప్ప, మిగిలినవి చెప్తుంటే అందరూ దుఃఖం, ఆశ్చర్యం, సంతోషం, ఇలా రకరకాల భావాలతో విన్నారు.
“అయ్యో! ఎంత మంచిదో శిశిర! పాపం ఎన్ని కష్టాలు పడింది. చిన్న పిల్లవి నువ్వు, అమ్మానాన్న లేక ఎంత అల్లాడిపోయావో!” బాధగా అన్న లతతో, “లేదు పెద్దమ్మా! నా కన్నమ్మ లోటు ఏమాత్రం తెలియకుండానే, పెంచింది మా అమ్మ. ఆవిడ వల్లనే, నేను ధైర్యంగా నాకు నచ్చిన సంగీతం ఎన్నుకున్నాను. ప్రతీ అడుగులోనూ, తానే నాకు అండగా నిలబడింది.”
“పెదనాన్నా! నాకు నాయనమ్మ, తాతగారిని చూడాలని ఉంది. మీరు నన్ను తీసుకెళ్తారా?” అడిగిన ఆరాధ్యతో,
“తప్పకుండా!” అన్నాడు సాగర్.
“అయితే అక్కా! ఇదంతా మమ్మల్ని కలవడానికా! నాకు మీతో పాడే అవకాశం లేదా!” సారంగ్ బాధగా అన్నాడు.
“నువ్వు నా తమ్ముడివి, నీకు కాక ఇంకెవరికి ఛాన్స్ ఇస్తాను. నువ్వు, నేను చెప్పిన గురువు దగ్గర లలిత సంగీతం నేర్చుకో. మరో మూడు నెలల్లో నాకు విదేశాలలో ప్రోగ్రామ్ ఉంది. దానికి నువ్వు కూడా వద్దుగాని.” సారంగ్ మొహం వెలిగిపోయింది.
“థాంక్స్ అక్కా!” హుషారుగా అన్నాడు.
(ముగింపు వచ్చే వారం)
శ్రీపతి లలిత వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి విరమణ చేశారు. స్వస్థలం హైదరాబాద్. శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తిగారు.
వీరి సాహితీ ప్రయాణం, అరవై ఏళ్ళ వయసులో మొదలైంది. ఇప్పటికి సుమారు వంద కథలపైనే వ్రాసారు.
ఈనాడు ఆదివారం అనుబంధంలో ఇప్పటివరకు ఏడు కథలు ప్రచురించడం, వీరికి గుర్తింపునిచ్చింది.
ఫేస్బుక్ గ్రూప్‌లలో, అనేక అంతర్జాల పత్రికలలో వీరి కథలు వచ్చాయి. ఇరవై అయిదుకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.
వీరు రాసిన చాలా కథలు వేరు, వేరు యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.
సంగీతారాధ్య వీరి మొదటి నవల.
