[శ్రీపతి లలిత గారు రచించిన ‘సంగీతారాధ్య’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[ఆరాధ్యకి గతం చెప్పడం పూర్తి చేస్తుంది హేమ. తన తండ్రి వైపు వాళ్ళ వివరాలు ఎలా తెలుస్తాయని అడుగుతుంది ఆరాధ్య. మయూర్ స్నేహితుడు అభిషేక్ అనే సింగర్ ఉండేవడని, ఇప్పుడు పాటల పోటీలకు జడ్జ్‌గా వస్తున్నాడనీ, అతని ద్వారా మయూర్ కుటుంబం వివరాలు సేకరిద్దామని అంటుంది. చివరకు ఆయనను కలిసి, తామెవరో చెప్తారు, ఆరాధ్య, హేమ. ఆరాధ్య శిశిర, మయూర్ల కూతురని తెలిసి ఆయన సంతోషిస్తాడు. మయూర్ అన్న సాగర్ కొడుకు సారంగ్ ఒక పాటలో పోటీలో బహుమతి గెల్చాడని, చెప్పి అతని నెంబర్ సంపాదించి ఇస్తాడు. ఆరాధ్య సారంగ్కి ఫోన్ చేసి వాళ్ళింటికి వెళ్తుంది. సారంగ్ తన తల్లిదండ్రులను పరిచయం చేయగానే, వాళ్ళ పాదాలకి నమస్కరిస్తుంది. తాను మయూర్ కూతురినని చెప్తుంది. సాగర్, అతని భార్య ఆశ్చర్యపోతారు. జరిగినదంతా వాళ్ళకి వివరిస్తుంది ఆరాధ్య. నాయనమ్మ, తాతగారిని చూడాలని ఉంది తీసుకెళ్ళమని సాగర్ని అడుగుతుంది ఆరాధ్య. తప్పకుండా తీసుకెళ్తానంటాడు. – ఇక చదవండి]
భోజనాలు చేసేటప్పుడు, ఆరాధ్య, సాగర్ వ్యాపారం గురించి అడిగింది.
“మయూర్ బతికి ఉన్నప్పుడు, మా గురించి ఎంత తాపత్రయపడ్డాడో, పోయాక కూడా, వాడి వల్లనే మేము బాగుపడ్డాం. ఆక్సిడెంట్లో వాడు పోయిన దానికి, నష్టపరిహారంగా ఇన్సూరెన్సు డబ్బులు వచ్చాయి. అవి పెట్టి, నేను ఇంకో పది ఆవులు, గేదెలు కొని డైరీఫార్మ్ పెట్టాను. ఆ పాలు, పెరుగు, వెన్న,నెయ్యి సిటీలో సప్లై చేస్తున్నాం. ఇంకొంచెం పొలం కొని, కౌలుకి ఇచ్చాము. ఇల్లు కూడా రిపేర్లు చేయించాం. అమ్మా, నాన్నా, అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి అన్ని సదుపాయాలతో ఇల్లు ఉంది” సాగర్ చెప్తే, “స్రవంతి అత్త ఎక్కడ ఉంటారు?” అడిగింది ఆరాధ్య. “ఇక్కడే ఉంటుంది. తనకి పెళ్లై ఒక అబ్బాయి. సారంగ్ కన్నా చిన్నవాడు. మా బావ ఇక్కడ ఉద్యోగం. సొంత ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇందాకే లత ఫోన్లో చెప్పింది. ఇంకా కాసేపట్లో వాళ్ళు కూడా వస్తున్నారు.” సాగర్ నవ్వుతూ అన్నాడు.
“అమ్మయ్య! నేను అత్తని కూడా చూసి వెళ్తాను.” స్రవంతి కూడా ఆరాధ్యని చూసి సంతోషంతో పొంగిపోయింది. “శిశిర నీకు వదినని అంది, ఒక్కసారి కూడా నోరారా పిలవకుండానే వెళ్ళిపోయింది. మాకు అదృష్టం లేదు, లేకపోతే, ఇద్దరూ అంత చిన్న వయసులో వెళ్లిపోయారు” స్రవంతి బాధపడితే, “అత్తా! మీకు ఆ లోటు లేకుండా చెయ్యడానికే నేను వచ్చాను!” ఆప్యాయంగా స్రవంతిని హత్తుకుంది.
ఇంటికి బయలుదేరుతూ, “అందర్నీ తీసుకుని మా ఇంటికి తప్పక రావాలి పెదనాన్నా!” ఆరాధ్య అంటే “ఇన్నిరోజులు మేము ఉన్నామని కూడా తెలీదు. ఇప్పుడు అక్కడ ఎందుకమ్మా! ఇక్కడికి వచ్చేయి, మాతో ఉండిపో!” అన్న సాగర్‌కి,
“పెదనాన్నా! నా కన్నమ్మ ఏం ఆలోచించి అలా చేసిందో తెలీదు. అమ్మకి నన్ను న్యాయపరంగా దత్తత ఇచ్చింది. పుట్టినప్పటి నుంచి తనే నాకు అమ్మ. నాకోసం పెళ్లి గురించి కూడా ఆలోచించలేదు. ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో మాటలు పడింది. అటువంటి అమ్మని ఈ జన్మలో వదులుకోను.
నా పుట్టుక గురించి నిజం, బయటి ప్రపంచానికి చెప్తాను. మీరంతా నా తండ్రి వేపు బంధువులు. మీతో బంధం తెంచుకోను. నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. మా గురువు శ్రీదేవి పెద్దమ్మ, ఒక కర్ణాటక సంగీతం అకాడమీ పెట్టారు. నేను మనదేశానికి చెందిన అన్నిరకాల సంగీతం నేర్చుకుని, అన్నీ ఒకటే చోట నేర్పించాలని ఆశ. మీరు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు పెదనాన్నా! నేను పెళ్లిచేసుకుంటాను. నాకు ఇప్పుడు ఇరవై రెండేళ్లు. ఇంకో అయిదు సంవత్సరాల దాకా ఆ ఆలోచన ఉండదు. ఈ లోగా నేను అనుకున్నవి సాధించి, జీవితాంతం నా ఆశయాన్ని పంచుకుంటూ, నాతో పాటు నడవడానికి ఎవరైనా తయారుగా ఉంటే, అప్పుడు పెళ్లి. నా దృష్టిలో పెళ్లి జీవిత పరమావధి కాదు, ఒక భాగం అంతే!” తన ఆలోచనలు, ఆశయాలు ఇంత స్పష్టంగా చెప్తున్న ఆరాధ్యని, సారంగ్ ఆరాధనగా చూస్తే, సాగర్, లత గర్వంగా చూసారు.
రెండు రోజుల తర్వాత, సాగర్ ఊరికి తీసుకెళ్తాను అన్నాడు. “ముందుగా పెద్దవాళ్లకి, సంగతంతా చెప్పి మానసికంగా తయారు చెయ్యాలి, లేకపోతే వాళ్ల వయసు, ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు ఒక్కసారిగా ఇదంతా వింటే తట్టుకోలేకపోవచ్చు” అని సాగర్ అభిప్రాయం.
“అమ్మా! ఈసారి నువ్వు నాతో పాటు రావాలి” అంది ఆరాధ్య హేమతో.
“వద్దు తల్లీ! వాళ్ళంతా నీ తండ్రి వేపు వారు. నేను వస్తే బాగోదు. వాళ్ళకి ఫ్రీగా ఉండదు.” అంది హేమ.
“నువ్వు రాకపోతే నాకు బావుండదు అమ్మా! వాళ్ళకి నాతో పాటు, నువ్వు కూడా అలవాటు అవ్వాలి. నేను ఇలా అందర్నీ కలుస్తుంటే, నీ మనసులో మథనం నాకు తెలీదు అనుకోకు. నాన్న వేపు వాళ్లకు, నేను, వాళ్ళతో ఉండిపోవాలనిపిస్తుంది. అది సహజమే, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ, నేను నిన్ను వదిలేది లేదు. మా కన్నమ్మ ఏం ఆలోచించి, నీకు న్యాయపరంగా దత్తత ఇచ్చిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ జన్మకి నువ్వు నా అమ్మవి, నేను నీ కూతుర్ని.
వాళ్లకి కూడా, నీ సంగతి, మంచితనం తెలియాలి. నీకూ, నాకూ ఉన్న అనుబంధం కూడా వాళ్ళకి అర్థమవ్వాలి.”
“నా బంగారు తల్లి!” ముద్దుపెట్టుకుని “వస్తాను తల్లీ!” అంది హేమ ప్రేమ నిండిన కళ్ళతో కూతుర్ని చూసుకుంటూ.
అప్పుడు, సాగర్‌కి, తనకి జరిగిన సంభాషణ చెప్పింది ఆరాధ్య, హేమకి. హేమ కళ్లు విప్పార్చి, “నువ్వు నిజంగా నా చిట్టితల్లి ఆరాధ్యవేనా! ఇంత పెద్దదానివి ఎప్పుడయ్యావు? ఎంత పరిపక్వత వచ్చింది నీ ఆలోచనల్లో!” అంది హేమ, గర్వంగా తను మలిచిన శిల్పాన్ని చూస్తూ.
“నువ్వు అమ్మమ్మ గురించి ఎందుకు వాళ్ళకి అసలు నిజం చెప్పలేదు?” ఆసక్తిగా అడిగింది హేమ.
“అమ్మా! ఆవిడ, ఒంటరితనంతో ఒకరకంగా శిక్ష అనుభవించింది. ఇప్పుడు ఇంకేం శిక్షించాలి. వాళ్లు పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా, నాన్న మరణం వెనక ఈవిడే ఉందని నిరూపించలేరు. ముందు ఆవిడని జైల్లో పెడతారు, తర్వాత వదిలేస్తారు. ఎందుకు ఈ వయసులో ఆవిడకి ఇవన్నీ. ఇన్ని చేసినా, మా అమ్మా,నాన్నని తేలేరుగా. అందుకే ఆవిడని క్షమించాను. మరీ ఆవిడకి ఇబ్బంది అయితే, జరుగుబాటుకి డబ్బు కూడా ఇస్తాను.” అంది ఆరాధ్య.
హేమ తన పెంపకం చూసి గర్వపడింది. ‘మీ అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను’ అనుకుంది.
రెండురోజుల తర్వాత, సాగర్ కుటుంబంతో కలిసి హేమా,ఆరాధ్యా, మయూర్ ఊరు వెళ్లారు. పెద్ద వయసులో, తన కొడుకు రక్తం పంచుకు పుట్టిన అమ్మాయిని చూస్తే, వాళ్ళకి కళ్ళనీళ్ళు ఆగలేదు. ఆరాధ్య ఇద్దర్నీ దగ్గరికి తీసుకుని, “నాన్న లేరని బాధపడద్దు నానమ్మా! నేనే మీ అబ్బాయి అనుకోండి. తాతగారూ! నేను ఇంక వస్తూనే ఉంటాను. మీరు కూడా, ఎప్పడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు అక్కడికి రావచ్చు” అంటూ ఓదార్చింది.
ఆ తర్వాత అందరి దగ్గరా సెలవు తీసుకుని, ఇద్దరూ ఇంటికి వచ్చారు.
కొన్నిరోజుల తర్వాత, హేమ, శ్రీదేవి సలహా మేరకు, ఆరాధ్య, తన ఇంటికి, కొందరు పత్రికల వాళ్ళని పిలిచి, తన పుట్టుక గురించిన నిజం, ఎంతవరకు చెప్పాలో అంతవరకూ, చెప్పింది. ఆ సమావేశానికి, మయూర్ తల్లిదండ్రులని, సాగర్, స్రవంతి కుటుంబాన్ని మాత్రమే కాక, శ్రీదేవి కుటుంబం, వసుంధరని కూడా పిలిచింది. అందరికీ, ఒక్కొక్కరిని పేరుపేరునా, వరసల ప్రకారం పరిచయం చేసింది. “మా అమ్మమ్మ!” అని వసుంధరని పరిచయం చేస్తే, ఆవిడ తట్టుకోలేక ఆరాధ్యని పట్టుకుని ఏడ్చేసింది.
హేమని, “మా అమ్మ!” అనీ శ్రీదేవిని, శ్రీధర్ని “పెద్దమ్మా! పెదనాన్నా!” అని పరిచయం చేసింది. పత్రికల వాళ్ళు, అందరి ఫోటోలు తీసుకుని, ఆరాధ్య పెట్టిన స్నాక్స్ తిని వెళ్ళిపోయాక, మిగిలిన అందరూ కబుర్లు చెప్పుకుని, భోజనాలు చేసి వెళ్లిపోయారు.
సాగర్, స్రవంతి, హేమని, ఆరాధ్యని తమ ఇంటికి ఆహ్వానించారు.
ఎవరూ లేరు అనుకున్న తనకి, ఇంతమంది బంధువులు ఉన్నారని సంతోషపడింది ఆరాధ్య. హేమ కూడా, ఆరాధ్య ఒంటరి కాకుండా, పెద్ద కుటుంబం దొరికిందని ఆనందించింది.
అందరూ వెళ్ళిపోయాక, హేమ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది. “అమ్మా! నాకు అన్నిటికంటే ఏదిష్టమో తెలుసా! ఇదే! ఇలా పడుకుంటే, నాకున్న సమస్యలు అన్నీ గాల్లోకి తేలిపోయినట్లు, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది.
అమ్మా! ఒకరకంగా నేను చాలా లక్కీ. నా కన్నమ్మ కథ విన్నాక , అయ్యో పాపం ఆవిడ అనిపించింది కానీ, నాకు అమ్మ లేదనే బాధ కలగలేదు. ఆవిడ, పాపం బాల్యం కోసం, నాదన్న కుటుంబం కోసం, శిశిరం వసంతం కోసం చూసినట్టు ఎదురు చూసింది. నేను నీ దగ్గర యువరాణిలా పెరిగాను. బాల్యాన్ని సంతోషంగా అనుభవించాను. ఇప్పుడు పెద్ద కుటుంబం దొరికింది. అదేగా అమ్మ కోరుకుంది. నీలాగా ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఎవరూ పెంచరు, అలానే క్రమశిక్షణ కూడా నేర్పావు. ఈ జన్మకి, నేను నీ కూతుర్ని, నువ్వే నా అమ్మవి” హేమని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంది ఆరాధ్య. హేమకి శిశిరని తలచుకుంటే, కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి.
“శిశిరా! నీ జీవితంలో, వసంతం కోసం ఎదురుచూసిన నువ్వు, ఎండిన ఆకులా రాలిపోయావు. నీ కూతుర్ని నువ్వు చెప్పినట్టుగానే పెంచిన నాకు, జీవితంలో ఆరాధ్య అనే వసంతం వచ్చింది. చెట్లు చిగురించి,పూలతో కళకళలాడే వసంతం ఎలా ఋతువులలో రాణిలా అలరారుతుందో, మన ఆరాధ్య కూడా సంగీత ప్రపంచంలో మహారాణిలా వెలుగొందుతుంది.
ఆరాధ్య వల్ల ఇప్పుడు, నువ్వు, మయూర్, పాడిన పాటలు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. శిశిరా! ఇప్పుడు నీకు, మయూర్‌కి కూడా వసంతమే! ఎక్కడ ఉన్నా, మీ ఇద్దరి ఆశీస్సులు, ఆరాధ్యకి పూర్తిగా ఉంటాయని, ఆ ఆశీస్సులతో, మన ఆరాధ్య ‘సంగీతారాధ్య’ గా వెలుగొంతుందని, తన కీర్తి, ప్రపంచం నలుదిక్కులా సంగీత తరంగాలుగా ప్రసరిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను” హేమ మనస్ఫూర్తిగా అనుకుంటుంటే, నిజమేనంటూ దూరంగా గుడిగంటలు గణగణమని మోగాయి.
(సమాప్తం)
శ్రీపతి లలిత వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి విరమణ చేశారు. స్వస్థలం హైదరాబాద్. శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తిగారు.
వీరి సాహితీ ప్రయాణం, అరవై ఏళ్ళ వయసులో మొదలైంది. ఇప్పటికి సుమారు వంద కథలపైనే వ్రాసారు.
ఈనాడు ఆదివారం అనుబంధంలో ఇప్పటివరకు ఏడు కథలు ప్రచురించడం, వీరికి గుర్తింపునిచ్చింది.
ఫేస్బుక్ గ్రూప్‌లలో, అనేక అంతర్జాల పత్రికలలో వీరి కథలు వచ్చాయి. ఇరవై అయిదుకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.
వీరు రాసిన చాలా కథలు వేరు, వేరు యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.
సంగీతారాధ్య వీరి మొదటి నవల.
