Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక జీవితగాథలో ఒదిగిన సాహిత్య, సామాజిక, గ్రంథాలయోద్యమ చరిత్ర – ‘సంకల్పం’

[శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు గారి ‘సంకల్పం’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

కొన్ని జీవితాలు కేవలం వ్యక్తిగత గెలుపోటముల లెక్కలతోనే ఆగిపోవు; అవి ఒక కాలపు సమాజానికి, చరిత్రకు నిలువుటద్దంలా నిలిచిపోతాయి. కల్లూరు రాఘవేంద్రరావు గారు రచించిన ‘సంకల్పం’ అలాంటి ఒక అరుదైన జీవితచరిత్రాత్మక నవల. ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు, సాహిత్య సేవకుడు, గ్రంథాలయోద్యమ కార్యకర్త అయిన తన తండ్రి కల్లూరు అహోబలరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఈ రచన చేశారు. ఇందులో ఒక మనిషి జీవనయానంతో పాటు, రాయలసీమ సాహిత్య, సామాజిక చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.

కేవలం జ్ఞాపకాల ఆధారంగా అల్లుకున్న కుటుంబ కథ కాకుండా, పక్కా ఆధారాలతో ఈ నవలను నిర్మించడం ఇందులోని ప్రధాన ప్రత్యేకత. అహోబలరావు గారు స్వయంగా రాసుకున్న ఆత్మకథ, ఆయన డైరీలు, పాత ఉత్తరాలు, ఇతర దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించి రాఘవేంద్రరావు గారు వాటికి నవలా రూపం ఇచ్చారు. తండ్రి జీవితాన్ని కొడుకు కథగా చెప్పడంలో సహజంగానే ఒక ఆత్మీయత ఉంటుంది, అయితే ఆ ఆత్మీయత ఒక తరం అనుభవాలను తర్వాతి తరానికి అందించాలనే బాధ్యతగా మారడం ఈ పుస్తకానికి మరింత విలువను చేకూర్చింది.

నవల మొత్తాన్ని పరిశీలించినప్పుడు కల్లూరు రాఘవేంద్రరావుగారి రచనా ఉద్దేశం మూడు ప్రధాన దిశలలో వ్యక్తమవుతుంది. మొదటిది, తన తండ్రి కల్లూరు అహోబలరావు జీవితాన్ని, ఆయన విలువలను తరువాతి తరాలకు పరిచయం చేయడం. రెండవది, ఆ జీవితంతో ముడిపడిన కుటుంబ, సామాజిక పరిస్థితులను నమోదు చేయడం. మూడవది, స్వాతంత్య్రోద్యమ కాలంలో రాయలసీమలో సాగిన సాహిత్య, గ్రంథాలయ, ప్రచురణోద్యమ కార్యకలాపాలను గుర్తుచేయడం. ఈ మూడు లక్ష్యాలు పరస్పరం అనుసంధానమై ఉండటమే నవల ప్రత్యేకత.

ఈ నవలకు పెట్టిన ‘సంకల్పం’ అనే పేరు ప్రధాన పాత్ర వ్యక్తిత్వానికి అచ్చుగుద్దినట్లు సరిపోయింది. దేవుడిపై భారం వేస్తూనే, తాను చేపట్టిన పనిని పట్టుదలతో పూర్తి చేయాలనే నిశ్చయం అహోబలరావు గారి జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది. అరకొర జీతం, తొమ్మిది మంది పిల్లల పెద్ద కుటుంబం, ఉద్యోగంలో ఒడిదుడుకులు, సాహిత్య కార్యక్రమాలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు.. ఇవేవీ ఆయన్ని తన ఆశయాల నుంచి వెనక్కి లాగలేకపోయాయి. కుటుంబ పోషణ గురించి ఆయన వ్యక్తం చేసిన – “ఆరుగురు కుమారులను, ముగ్గురు కూతుళ్లను పెంచడమన్నది నా ఈ చిన్న ఉద్యోగానికి సాధ్యమా? అంతా భగవంతుడి సంకల్పమే – మనదికాదు” అనే మాటల్లో, భవిష్యత్తుపై భయం కంటే దైవ విశ్వాసంతో బాధ్యతను స్వీకరించే ధైర్యమే ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంతటి కుటుంబ బాధ్యతల మధ్య కూడా ఆయన తన వృత్తి పట్ల, చదువు పట్ల చూపిన అంకితభావం ఎంతో గొప్పది. ఆయనకు ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం జీవనోపాధి కోసం చేసే పని కాదు; విద్యార్థులలో జ్ఞానాన్ని నింపి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత. ఉపాధ్యాయులకు పఠనాభిరుచి ఎంత అవసరమో చెబుతూ ఆయన పలికిన – “మంచిది. పుస్తకాలు చదివే అలవాటు పెంచుకో. ఉపాధ్యాయులకు అది చాలముఖ్యం” అనే మాటలు ఆయన విద్యా దృక్పథానికి నిదర్శనం. నిరంతరం చదువుతూ తనను తాను మెరుగుపరుచుకునే ఉపాధ్యాయుడే విద్యార్థులకు నిజమైన మార్గదర్శి కాగలడని నమ్మిన ఆయన, ఆ ఆలోచననే ఆ తర్వాత గ్రంథాలయ ఉద్యమంగా విస్తరించారు.

అహోబలరావు గారి ఆలోచనలు కేవలం పాఠశాల గోడలకే పరిమితం కాకుండా, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో సమాజం వైపు మళ్లాయి. స్వాతంత్య్ర ఉద్యమం అంటే కేవలం రాజకీయ సభలు, సత్యాగ్రహాలు మాత్రమే కాదు; ప్రజల్లో జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కూడా ఉద్యమంలో ఒక భాగమే. గాంధీజీ బోధనలతో ప్రభావితమైన ఆయన, 1919 అక్టోబరు 3న తన సొంతూరు కల్లూరులో ఇంటి అరుగుపై ఉన్న చిన్న గదిలోనే ‘శారదా గ్రంథమాల’ను ప్రారంభించారు. పెద్ద భవనాలు, సమృద్ధిగా నిధులు లేకపోయినా, ఉన్న కొద్దిపాటి స్థలంలోనే తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ పుస్తకాలను సేకరించి ఊరి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వంటి గ్రంథాలయోద్యమ ప్రముఖుల ప్రస్తావన, వారి స్ఫూర్తితో రాయలసీమలో పుస్తక పఠనాన్ని పెంచడానికి ఆయన చేసిన కృషి ఈ నవలలో వివరంగా కనిపిస్తుంది.

పుస్తకాలు చదివే అలవాటును పెంచడంతో పాటు, అసలు చదవడానికి మంచి పుస్తకాలను అందుబాటులోకి తేవడం కూడా అంతే ముఖ్యమని ఆయన గుర్తించారు. అందుకే 1931లో బళ్లారిలో ఇద్దరు కవిమిత్రులతో కలిసి ‘శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల’ను స్థాపించారు. రాయలసీమ రచయితల రచనలను అచ్చువేయించి పాఠకులకు అందించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. పెద్దల ఆశీస్సులతో, “ఫలాపేక్షతో కాక సాహిత్య సేవా దృష్టితో కొనసాగించు” అనే ఉపదేశాన్ని శిరసావహించి, నిధుల సమీకరణ నుంచి ముద్రణ వరకు ఎన్నో బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. మద్యపాన నిషేధం, ఖద్దరు వాడకం గురించి ప్రచారం చేసినప్పుడు ఆనాటి అధికార వ్యవస్థ నుంచి అడ్డంకులు ఎదురైనా – “ప్రజా సంక్షేమం కోసం, మద్యపానాన్ని మానండని చెప్పడం నేరమవుతుందా? మనం నేసిన ఖద్దరు బట్టలను మనం వాడుకొందామని చెప్పడం నేరమా?” అని నిర్భయంగా ప్రశ్నించి తన నైతిక ధైర్యాన్ని చాటుకున్నారు.

బయట ప్రపంచంలో ఆయన సాగించిన ఈ సాహిత్య, సామాజిక పోరాటాల వెనుక ఆయన కుటుంబ నేపథ్యం, ఆనాటి గ్రామీణ సమాజపు కట్టుబాట్లు కూడా ఈ నవలలో సహజంగా ఒదిగిపోయాయి. వివాహ సంబంధాల విషయంలో ఆర్థిక అంతరాలు ఎలా ఉండేవో చెప్పే ఒక సందర్భంలో – “అన్నా! బొరుగులు తిని సంసారాలు చేసే ఇండ్లు మావి. మీలాంటి గొప్ప సంబంధాలతో మేము తూగలేం” అనే మాట ఆనాటి మనుషుల ఆత్మాభిమానాన్ని కళ్ళకు కడుతుంది. అంతేకాదు, అహోబలరావు గారు బయట ఇంతటి ప్రజాసేవ చేయగలిగారంటే, అందుకు ఆయన భార్య సీతమ్మ గారి ఓర్పు, ఇంటి నిర్వహణే ప్రధాన కారణం. అలాగే జానకమ్మ వంటి పాత్రల ద్వారా ఆనాటి కుటుంబ వ్యవస్థలో స్త్రీల జీవితాలను సంప్రదాయాలు, ఆర్థిక పరిస్థితులు ఎంతగా ప్రభావితం చేసేవో రచయిత చూపించారు. చరిత్రలో పెద్దగా వెలుగులోకి రాని ఇంటి ఆడవాళ్ల నిశ్శబ్ద త్యాగాన్ని, శ్రమను ఈ నవల ఎంతో సున్నితంగా గుర్తుచేస్తుంది.

ఈ కుటుంబ, సామాజిక విశేషాలను రచయిత రాఘవేంద్రరావు గారు చాలా సరళమైన, ఆత్మీయమైన భాషలో పాఠకులకు అందించారు. పాత్రల మధ్య సంభాషణలు, గురువులతో జరిగే చర్చలు, ప్రాంతీయ పదప్రయోగాలు ఆనాటి వాతావరణాన్ని కళ్ళముందుంచుతాయి. అయితే, కొన్నిచోట్ల చారిత్రక వివరాలు, వ్యక్తుల పరిచయాలు, సంస్థల విశేషాలు ఎక్కువగా రావడం వల్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. మామూలు నవలగా చదివితే, కథానాయకుడి ఆదర్శ గుణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు, ఆయన మానసిక సంఘర్షణలు గానీ, కుటుంబంలోని స్త్రీల వ్యక్తిగత ఆలోచనలు, ఆశలు గానీ అంత లోతుగా ఆవిష్కృతం కానట్టు అనిపించవచ్చు. కానీ దీనిని మామూలు నవలగా పరిగణించలేము.

అందుకే, దీన్ని ఒక సాధారణ కల్పిత నవలగా కాకుండా, ఒక చారిత్రక సాంస్కృతిక దస్తావేజుగా చూడటం సముచితం. 1956లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన హిందూపురంలోని శారదా విద్యానిలయంలో బోధనను, సాహిత్య సేవను ఆపలేదు. దశాబ్దాల క్రితం చిన్నగా ప్రారంభించిన శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల 1983లో స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆయన పట్టుదలకు, అంకితభావానికి నిదర్శనం. 1986లో భార్య సీతమ్మ మరణం వంటి వ్యక్తిగత విషాదాలను తట్టుకుని, 1990లో తుదిశ్వాస విడిచే వరకు ఆయన తన ఆశయాలను తర్వాతి తరానికి అప్పగించే ప్రయత్నం చేశారు.

ఇప్పటి పరిస్థితులలో ఈ నవల ప్రాసంగికతను కూడా గుర్తించాలి. సమాచారాన్ని పొందడానికి అనేక సాంకేతిక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, పఠన సంస్కృతిని పెంపొందించడం, మంచి రచనలను పాఠకులకు చేరవేయడం, ప్రాంతీయ సాహిత్యాన్ని పరిరక్షించడం వంటి అవసరాలు నేటికీ కొనసాగుతున్నాయి. అహోబలరావు కాలంలో పరిమితమైన వనరులతో ప్రారంభమైన గ్రంథాలయ, ప్రచురణ కార్యక్రమాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తాయి. సాంస్కృతిక అభివృద్ధి కేవలం ప్రభుత్వ సంస్థల బాధ్యత కాదు; వ్యక్తుల చొరవ, సమష్టి సహకారం, నిరంతర కృషి కూడా దానికి అవసరం. ఈ భావన ‘సంకల్పం’ను గతకాలపు జీవితగాథగా మాత్రమే కాకుండా, వర్తమానానికి కూడా ఉపయోగపడే రచనగా నిలబెడుతుంది. జీవిత చరిత్ర రచనను కాల్పనిక సాహిత్య ప్రక్రియ అయిన నవలగా వర్గీకరించటం పట్ల అభ్యంతరాలున్నా, ఈ రచన విలువపట్ల ఎవరికీ అభ్యంతరాలుండవు.

చివరగా, “వీలున్నప్పుడల్లా పెద్దల ద్వారా మన కుటుంబ చరిత్ర విని వ్రాసి పెట్టుకొంటే మంచిది. భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది” అన్న తండ్రి మాటను రాఘవేంద్రరావు గారు ఈ నవల ద్వారా అక్షరాలా నిజం చేశారు. వ్యక్తి సంకల్పం సమాజ ప్రయోజనంతో ముడిపడినప్పుడు అది వ్యక్తిగత జీవితాన్ని అధిగమించి చరిత్రలో భాగమవుతుంది. కల్లూరు అహోబలరావు గారి జీవితం ఆ సత్యానికి నిదర్శనమైతే, కల్లూరు రాఘవేంద్రరావు గారు రచించిన ‘సంకల్పం’ ఆ జీవితాన్ని సాహిత్యరూపంలో నిలిపిన విలువైన ప్రయత్నం.

***

సంకల్పం (నవల)
రచన: కల్లూరు రాఘవేంద్రరావు
ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం.
పేజీలు: x + 170 = 180
వెల: ₹ 400/-
ప్రతులకు:
శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,
26-4-982,
త్యాగరాజ నగర్, 9వ క్రాస్,
హిందూపురం 515201
ఫోన్: 9493271620

 

~
శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-kalluru-raghavendra-rao/

Exit mobile version