[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘సాంత్వన!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్షరం నాకు వ్యసనమయ్యింది
రేగే ఆలోచనల సుడులలోంచి
బయటపడేసే మత్తుమందులా
భావాల మైకం జల్లే సాంత్వన!
జీవిక జాలంలో చిక్కి ఊపిరాడక
పారిపోయే దారి దొరకనప్పుడు,
గుండె గూడులో పేరిన బరువును
గుదిబండలా మారనీయకుండా
తేలికపరచగల ఆమ్లజనిగా అది!
లోకం పోకడైన గెలుపోటముల కేళిలో
నేను తేలిపోయి ఓడిపోతున్న ప్రతిసారీ
నన్ను నేను రేపటిలోకి నడిపించడానికి
తేలే వారధిలా అది ఆ తీరం చేరుస్తుంది!
అలసి సొలసి పోయిన సగటు ప్రాణం
అక్షరం ఒడిలోకి చేరి తలవాల్చగానే,
నిన్నటి గాయాలన్ని మటుమాయమై
రేపటి మనుగడకై ఆశలు చిగురిస్తాయి!
ఉద్వేగాలు ఉరికి అలలై కదులు వేళ
ముని వేళ్ళు భావాల లహరిలో తడిసి
భావ సిరా చరవాణి తెరపైన అక్షరాలై
వరుసకడుతున్న వేళ మనసు తేలికై
అక్షర మల్లెల కాసారంలో సేదదీరుతుంది!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు, 100 కవితలు రాశాను.
