[శ్రీ రాజశేఖర్ నన్నపనేని రచించిన ‘సన్యాసి విప్లవం’ అనే వ్యాస సంపుటి సమీక్షని అందిస్తున్నాము.]
సమాజమే దేవాలయంగా, దేశమే దేహంగా జీవించిన కొంతమంది వీరోచిత పోరాటమే ఈ ‘సన్యాసి విప్లవం’ వ్యాస సంపుటి.
ప్రధానంగా, క్రీ. శ. 1760 నుంచి 1800 వరకు బెంగాల్ ప్రాంతంలో రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ జరిపిన దురాగతాలపై సన్యాసుల జరిపిన పోరాట స్వరూప స్వభావాల్ని వెల్లడిస్తుంది.
“అన్నిటి యందు సమదృష్టి కలిగి అందరి హితం కోసం జీవించే త్యాగులు, యోగులు – దేశ, ధర్మ రక్షణ కోసం వేయి సంవత్సరాల కాలంలో ఎలా ఉద్యమించారో, ఎంతటి త్యాగమొనర్చారో పూసగుచ్చినట్టు వివరించిన పుస్తకమే ఈ ‘సన్యాసి విప్లవం’ “ అని తమ ముందుమాట ‘సన్యాసులు సమరజ్వాలలు’లో వ్యాఖ్యానించారు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి. సన్యాసులు కేవలం సర్వసంగ పరిత్యాగులు మాత్రమే కాదని, సర్వ సంఘ సముద్ధరణా చేతనలని స్వామీజీ పేర్కొన్నారు.
“సన్యాసుల విప్లవం అనేది మనం పుస్తకాలలో చూస్తే, ఒక 40 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఒకటి రెండు పేజీలలో కనిపిస్తుంది” అన్నారు రచయిత తన ముందుమాటలో. “అయితే ఆ నలభై ఏళ్ళ పోరాటమే సన్యాసులు విప్లవంగా చూడాలా? ఆ నలభై ఏళ్ళ కాలఖండంలోనే సన్యాసులు దేశ ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేశారా? స్వధర్మ, స్వదేశ రక్షణ కోసం సన్యాసుల పోరాటాలు, బలిదానాలు ఈ ధర్మ దేశచరిత్రలో కొత్తకాదు. యుగయుగాలుగా సర్వస్వ పరిత్యాగం చేసి, దేశ రక్షణ కోసం ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా మన భారత జాతిని నిరంతరం జాగృతం చేయడం కోసం సన్యాసులు చేసిన మహత్వపూర్ణమైన ప్రయత్నమే ఈ ‘సన్యాసి విప్లవం’ రచన” అని ఈ పుస్తకం వెలువరించటంలో తన ఉద్దేశం స్పష్టం చేశారు రచయిత.
~
‘మాతృభూమి – శ్రీరాముడు’ అనే వ్యాసంలో భరతభూమి ఔన్నత్యాన్ని వివరించారు. మాతృభూమి గొప్పతనాన్ని చాటిన వేద వాక్యం ‘మాతా భూమిః పుత్రోఽహమ్ పృథివ్యాః’, రామాయణం లోని శ్లోకం ‘జనని జన్మభూమిశ్చ’ ఉటంకించారు. మాతృభూమిపై మనం అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని, పుట్టిన గడ్డపై ఎనలేని మమకారం కలిగి ఉండాలని తెలిపారు. రామాయణం కాలం నాటి ముని పరంపరను సూక్ష్మంగా ప్రస్తావించారు.
‘కృష్ణం వందే జగద్గురుమ్’ అనే వ్యాసంలో – ధర్మనాశనం చేసి మాతృభూమికి ద్రోహం తలపెడుతున్న వారిని అడ్డుకోవడానికి శ్రీకృష్ణుడు అవతరించాడని చెబుతూ, కృష్ణుడు పిల్లల్లో పిల్లవానిగా, పెద్దల్లో పెద్దవానిగా పెరిగాడనీ, సమాజంలో ఏకతా నిర్మాణానానికి కృషి చేశాడని అన్నారు. సజ్జనుల సంఘటిత శక్తి వలన ఇది సాధ్యమైందని తెలిపారు. ధర్మానికి ఎప్పుడు గ్లాని కలిగినా, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా తాను అవతరించి అందరినీ అందరినీ ధర్మవర్తనులుగా చేస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలని ప్రస్తావించారు.
జాతిలో భౌతికవాదం, మూఢత్వ ప్రబలి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న ప్రతీసారి – ఓ మహాపురుషుడు ఉద్భవించి జాతిలో చేతన నింపాడని చెబుతూ హిందూ ధర్మాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములైన ఆదిశంకరుల గురించి ‘జగద్గురు ఆది శంకరులు’ అన్న వ్యాసంలో వివరించారు. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందనేందుకు నిరూపణగా, గోవింద భగవత్పాదకుల శిష్యులై, వారిని సేవించి జ్ఞానమూర్తులయిన వైనాన్ని తెలిపారు. ప్రజలలో సమరసతా భావనను, జాతీయ సమైక్యతను నెలకొల్పి దేశాన్ని రక్షించిన మహా తపస్వి ఆదిశంకరులు అని వ్యాఖ్యానించారు. నాగ సాధువులకు మార్గదర్శనం చేసి వారికి దేశరక్షణకి ఉపయోగపడేలా తీర్చిదిద్దారని వెల్లడించారు.
‘అసలెవరీ సన్యాసులు’ అనే వ్యాసంలో త్రేతా యుగం నుంచి వస్తున్న నాగ సాధువుల గురించి వివరించారు. నాగ సాధు సాంప్రాదాయంలోని 8 హోదాలను తెలిపారు. అఘోరీలను, నాగ సాధువులకు ఉండే తేడాని ప్రస్తావించారు. దశనామీ సన్యాసులను గురించి తెలిపి వారి పేర్ల చివరన – గిరి, పురి, భారతి, ఆనంద, అరణ్య, సాగర, సరస్వతి, తీర్థ, ఆశ్రమ, పర్వత, వన అనే పేర్లు ఎందుకు, ఎలా కలుస్తాయో తెలిపారు.
‘సన్యాసుల తీర్థస్థలాలు – యాత్రలు’ అనే వ్యాసంలో పంచాగాన్ని అనుసరించి, ఒక వార్షిక యోజనతో సన్యాసులు చేసే యాత్రల ఉద్దేశాన్ని వివరించారు. ఈ వ్యాసంలో సందర్భోచితంగా, కుంభమేళ విశిష్టతనీ, గంగానది ప్రాధాన్యతనీ తెలిపారు. అలహాబాద్‍లో జరిగే కుంభమేళాతో పాటుగా, లక్షలాది సాధువులు చైత్రమాసంలో సీతాదేవి జన్మస్థలం జనకపురి యాత్ర చేస్తారని తెలిపారు. బారుని పండుగ సందర్భంగా బంగ్లాదేశ్ లోని మహాస్థాన్ లో రెండు పవిత్ర స్నానాలు చేస్తారని, అలాగే చైత్రమాసంలో పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలో అగ్రద్వీప్ గోపీనాథ్ ఆలయం దర్శిస్తారని తెలిపారు. ఇస్లాం మతం లోని ఫకీర్లు దినాజ్ పూరు, మఖాన్ పూర్, ముర్షీదాబాద్, మాల్దా, మైమన్ సింగ్, భోగ్రా వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారని తెలిపారు.
దేశంలో ధర్మం, సంస్కృతి తప్పుదారి పట్టినప్పుడు, దేశంలో అరాచాకం మొదలైనప్పుడు – వాటిని సరిదిద్దడానికి నాగ సాధువులు చేసిన కృషిని ‘మొఘలుల పాలనలో సన్యాసులు’ అనే వ్యాసంలో తెలిపారు. అక్బర్‍కీ, రాణా ప్రతాప్‍కీ జరిగిన యుద్ధంలో నాగా సాధువులు రాణా ప్రతాప్ తరఫున పోరాడారని తెలిపారు. సమర్థ రామదాసు గారికీ, గురు హర్ గోవింబ్ సాహిబ్‍కీ మధ్య జరిగిన సంభాషణ వివరించారు. పంజాబ్ ప్రాంతం – మహ్మదీయుల పాలు కాకుండా ఉండేందుకు గురు గోవింద్ సాహిబ్, బందా సింగ్‌ల పోరాటాలను వివరించారు.
భారతదేశాన్ని రాజకీయంగా తమ గుప్పిట్లో పెట్టుకున్న మొఘలులు, యూరోపియన్ల నుంచి దేశాన్ని కాపాడలేకపోవడం వల్ల – అమూల్యమైన దేశ సంపదను బ్రిటీషు వారు దోచుకువెళ్ళారని చెబుతూ 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం గురించి, ఓ చిరుద్యోగిగా ఈస్టిండియా కంపెనీలో చేరిన రాబర్ట్ క్లైవ్, ఇంగ్లండ్ తిరిగి వెళ్ళేనాటికి ఆ దేశంలోనే అత్యంత సంపన్నులలో ఒకడైన ఉదంతాన్ని ‘ప్లాసీ, బక్సర్ యుద్ధాలు – సన్యాసులు’ అనే వ్యాసంలో ప్రస్తావించారు. పారిశ్రామిక విప్లవం తర్వాత పరిశ్రమలకు అవసరమైన పెట్టుబడులను బెంగాల్ నుంచి దోచుకున్న సొమ్ములే అందించాయని తెలిపారు. బక్సర్ యుద్ధం తరువాత బ్రిటీషు వారి ఆక్రమణల పర్వం వేగవంతమై – తూర్పు యుపి, బీహార్, బెంగాల్, ఒరిస్సాలలో తిరుగులేని శక్తిగా ఎదిగారని చెప్పారు.
బక్సర్ యుద్ధం తరువాత ‘బెంగాల్ పరిస్థితులు’ ఎలా ఉండేవో తదుపరి వ్యాసంలో తెలిపారు. కరువు, ఆకలిచావులు, ప్రాణాంత రోగాలు, పాలకుల ధనదాహం ప్రజలను పీడించాయి. తీర్థయాత్రలలో భాగంగా దేశంలో సంచరిస్తున్న సన్యాసులు పరిస్థితులను గమనించి, కారణాలను అవగతం చేసుకున్నారు. అది సన్యాసి విప్లవానికి నాంది పలికింది. తరువాతి వ్యాసంలో సన్యాసి విప్లవం ఎలా మొదలయిందో తెలిపారు.
సన్యాసమంటే మాతృభూమిపై అచంచల భక్తితో తీసుకునే ఓ దీక్ష అని చెబుతూ – సినిమాల్లో చూపించినట్టు కుటుంబ సమస్యలను తప్పించుకునేందుకు తీసుకునేది కాదని అంటారు రచయిత ‘సన్యాసులకు సైనిక శిక్షణ’ అనే వ్యాసంలో. ధర్మ రక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసే యజ్యం సన్యాసమని, అందుకే సన్యాస దీక్షలో సైనిక శిక్షణ భాగమని వివరిస్తారు. సన్యాసులకి శిక్షణ ఎవరిస్తారు? ఎక్కడిస్తారు? ఆయుధాలు ఎలా సమకూర్చుకుంటారు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలిపి – వివిధ రాజాస్థానాలలో ఉన్న సన్యాసి సైనిక శిక్షణా స్థావారాల గురించి, అక్బర్ కాలంలో మధుసూదన సరస్వతి ప్రారంభించిన జునా అఖాడా గురించి తెలియజేస్తారు. శిక్షణ పూర్తయిన సన్యాసులు దేశమంతా కాలినడకన తిరుగుతూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ, మాతృభూమి రక్షణ ద్వారా మోక్షసాధన చేసేవారని తెలిపారు.
‘వందేమాతరం ముందుగా సన్యాసులే పాడారా?’ అనే వ్యాసంలో వందేమాతరం గీత రచనకు మూలం క్రీ.శ. 1760 నుంచి 1800 వరకు బెంగాల్‌లో మహ్మదీయులు, ఆంగ్లేయులపై సన్యాసులు సాగించిన పోరాటమని చెబుతారు. 1838లో జన్మించిన బంకించంద్రకి వారి తాతగారు తన చిన్నతనంలో జరిగిన సన్యాసి విప్లవం గురించి తెలిపి, అప్పటి సాధువుల సింహనాదం గురించి తెలియజేసి సాధువులు మాతృభూమిని దుర్గలా, సరస్వతిలా, అపరకాళిలా దర్శించి ప్రార్థించారని చెబుతూ – ఆనందమఠంలో బ్రహ్మచారి సత్యానందుడికి, మహేంద్రుడికి జరిగిన సంభాషణల ద్వారా వివరిస్తారు.
రాబర్ట్ క్లైవ్ దురాగతాలు పెచ్చుమీరటంతో ప్రజల నుండి వాస్తవాలు తెలుసుకున్న సన్యాసులు – ఆంగ్ల సిపాయిలపై దాడి చేసి, వారిని నిర్మూలిస్తారు. కానీ 1763లో వారెన్ హేస్టింగ్స్, 1767లో కెప్టెన్ వెల్డింగ్, కెప్టెన్ డి. మెకంజీ, 1769లో లెఫ్టినెంట్ కేత్ అనే ఆంగ్లేయులను సన్యాసులు సమర్థవంతంగా ఎదుర్కున్న వైనాన్ని ‘1760 తరువాత సన్యాసుల పోరాటాలు’ అనే వ్యాసంలో చదవవచ్చు.
సన్యాసులకు సమర్థవంతమైన నాయకత్వం అందించిన భవానీ పాఠక్ గురించి తదుపరి వ్యాసంలో తెలియజేశారు రచయిత. ఆంగ్లేయులపై పోరాటంలో ఫకీర్లు భాగస్వాములయ్యారనీ మరో వ్యాసంలో వివరించారు.
‘ప్రబల ప్రవాహాం’ అనే వ్యాసంలో కూకా సాంప్రదాయం గురించి, దాని ఆద్యులు పండిత రామసింహ కూకా గురించి వివరంగా తెలియజేశారు. ఇదే వ్యాసంలో రామోషి సేన నాయకుడు వాసుదేవ బలవంత్ ఫడ్కే గురించి, ఆయన కృషి గురించి తెలిపారు. లోకమాన్య తిలక్ పోరాటంలో సహకరించిన చాపేకర్ సోదరుల గురించి వివరించారు. ఆనంద మఠం, వందేమాతరం రచించిన బంకించంద్ర గురించి సవివరంగా వెల్లడించారు. ఈ వ్యాసంలో ఇంకా రామకృష్ణ పరమహంస, వివేకానందలు జరిపిన కృషి గురించి, లాల్-బాల్-పాల్ పేరిట ప్రసిద్ధులైన లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ గురించి ప్రస్తావించారు. వందేమాతర ఉద్యమం విశ్వవ్యాప్తమైన తీరు వర్ణించారు. చిట్టగాంగ్ వీరకిషోరాల గురించి, ఆర్.ఎస్.ఎస్. స్థాపన గురించి తెలిపారు. హెడ్గేవార్ జీవితాన్ని సంక్షిప్తంగా ప్రస్తావించారు. హైదరాబాద్ విమోచనానికి సన్యాసులు చేసిన కృషిని వివరించారు. అజాద్ హింద్ ఫౌజ్ స్థాపన, దాని ప్రస్థానం వివరించారు. దేశంలో సన్యాస పరంపర కొనసాగుతోందని తెలిపారు.
‘మాతృభూమి సంకల్పం’ అనే వ్యాసంలో బాహ్య పరిస్థితుల వల్ల మన చూపు మసకబారకుండా, మనస్సు మొద్దు బారకుండా, మనలను, తరువాతి తరాల వారిని కాపాడుకోవాలని చెబుతూ, శక్తిమంతులుగా మారాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు.
చివరగా, ఈ వ్యాస సంపుటికి ఉపకరించిన గ్రంథాలు, ఇతర సమాచార వనరులను పేర్కొన్నారు. రెండవ కవర్ పేజీలో వందేమాతరం గేయాన్ని అందించారు.
~
1760-1800 నాటి సన్యాసి విప్లవం గురించి చెప్పడానికి ముందుగా పాఠకులను సన్నద్ధం చేసేందుకు, సన్యాస పరంపర ప్రాముఖ్యతని చాటడానికి తొలి పది వ్యాసాలు ‘లీడ్’గా ఉపయోగపడ్డాయి. శీర్షికలు కూడా వ్యాసంలోని ఇతివృత్తాన్ని స్ఫురింపజేసేవిగా ఉన్నాయి.
***
రచన: రాజశేఖర్ నన్నపనేని
ప్రచురణ: మెగామైండ్స్ ప్రచురణలు
పేజీలు: 123
వెల: 150
ప్రతులకు:
మెగామైండ్స్ మీడియా,
మారేపల్లి, ఏ. కొండూరు,
కృష్ణాజిల్లా
ఆంధ్రప్రదేశ్ 521227
ఫోన్: 8500581928
megamindsmedia@gmail.com
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.