Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సప్త ఋషుల ఆరాధనే ‘ఋషిపంచమి’

[‘సప్త ఋషుల ఆరాధనే – ఋషిపంచమి’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

ఋషి అంటే సత్యాన్ని దర్శించినవాడు, జ్ఞానాన్ని బోధించేవాడు అని అర్థం. ఆధ్యాత్మికతను బోధించి జన్మ మోక్షానికి, ముక్తికి దారి చూపించిన వాళ్లే ఋషులు. అంతటి మహనీయులైన మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతమే ఈ ‘ఋషిపంచమి’ వ్రతం. భాద్రపదపంచమి అనగా వినాయక చవితి మరునాడు ‘ఋషి పంచమి వ్రతం’ అనే పవిత్రమైన వ్రతాన్ని చేసుకుంటారు.

భారతీయ పరంపరాగత పౌరాణిక ప్రమాణాల ప్రకారం ప్రతివారి వంశానికి ఒక ఋషి మూలపురుషులుగా ఉంటాడు. ప్రాచీనవంశాను క్రమణమే నేటి భారతీయ సంతతిలో కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయలే. మరికొందరికి వారి పూర్వ ఋషి తెలియక పోయినప్పటికీ కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఎందరో ఋషులు ఉన్నారు. వారందరికి ప్రాముఖ్యత వహించినవారు మహనీయులైన సప్తఋషులను పూజించడం ఒక ఆచారంగా ఉన్నది. ఈ వ్రతాన్ని గురించి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

“కశ్యపో అత్రిర్భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః!
జమదగ్నిర్వసిష్ఠశ్చస్తైతే ఋషయస్మృతాః!!”

కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠులను ఈ ఏడుగురిని సప్త ఋషులంటారు. భారతీయ పరంపరాగత పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి వీరిలో ఎవరో ఒక ఋషి మూలపురుషుడిగా ఉంటాడు. ప్రాచీన ఋషుల వంశాను క్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి వంశఋషులు ప్రతిరోజు స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియక పోయినప్పటికీ ప్రతి వంశానికి కూడా ఒక ఋషి మూలపురుషుడిగా ఉంటాడు.

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలలో మహర్షులు ఉన్నారు. వారిలో మహనీయులైన వారిని పూజించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఏడుగురు పూజనీయులు వారే కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠుడు. మీరందరూ కృతయుగం నుంచి కూడా పూజలు అందుకుంటున్నవారు. సోమకుడు అనే రాక్షసుడు అపహరించిన భగవద్దత్తమైన వేదపరంపరను రక్షించడానికి మహావిష్ణువు వ్యాసమహర్షి రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపంలో మనకు అందించాడు. అందుకే వ్యాసుని నారాయణుని అవతారముగా భావిస్తారు.

అచతుర్వదనో బ్రహ్మా
ద్విబాహురపరో హరిః!
అఫాలలోచనః శంభుః
భగవాన్ బాదరాయణః!!

అని వ్యాసుని జన్మదినాన్ని గురుపూర్ణిమ పేరుతో ఆయనను పూజించడం జరుగుతుంది సప్తఋషులను అరుంధతిని పూజించిన రోజు ఋషిపంచమిగా ప్రసిధ్ధి పొందింది.

ఎందరో ఋషులు ఉన్నప్పటికీ భోజనం పరిహారాన్ని చేస్తుందని చెబుతారు. అంతేకాక స్త్రీలు ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఆచరించవలెను. రజస్వల సమయంలో కలిగిన దోషాలను పాపాలను పోగొట్టేది ఋషిపంచమి వ్రతం.

వీరిలో మొదటి వారైన కశ్యప ప్రజాపతికి అదితికి జన్మించిన వాడే నారాయణాంశ సంభూతుడైన వామనుడు. బలి చక్రవర్తిని మూడడుగుల నేల దానంగా గ్రహించి పాతాళానికి పంపించాడు. దక్ష ప్రజాపతి పుత్రికలను వివాహం చేసుకొని ఆదిత్యులు, సిద్ధగంధర్వులు అప్సరసలు నాగులు వృక్ష లతా తృణజాతులు ఇవన్నీ కూడా జన్మించినాయి.

అత్రిమహర్షి బ్రహ్మ మాస పుత్రులలో ఒకడు. అతని భార్య అనసూయ పతివ్రతా శిరోమణి. త్రిమూర్తులను పసిపాపలుగా చేసిన పతివ్రత. ఆ మువ్వురి రూపమే దత్తాత్రేయుడు.

ఉతధ్యుని పుత్రుడు భరద్వాజుడు ద్రోణుని జన్మకు కారకుడు.

నాలుగోవాడైన విశ్వామిత్రుడు రాజు అయినప్పటికీ బ్రహ్మర్షి పదాన్ని పొందినవాడు.

శ్రీరామునికి గురువై శస్త్రాస్త్రవిద్యలను నేర్పాడు.

త్రిశంకు స్వర్గాన్ని రూపొందించిన వాడు. మేనక వలన శకుంతలకు జన్మనిచ్చి, శకుంతల పుత్రుడైన భరతుడే పేరు మీదే భారతదేశం అనే పేరు వచ్చింది.

భరద్వాజుడు వనవాస సమయంలో భరతుడు శ్రీరాముని అన్వేషిస్తూ భరద్వాజాశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజులవారు వారందరికీ ఒక విందును ఏర్పాటు చేస్తాడు. నేటికి భరద్వాజ విందు చాలా ప్రసిద్ధమైనది.

తర్వాత గౌతముడు దర్భతో మాయాగోవును అదలించగా ఆ గోవు మరణిస్తుంది. దానితో బ్రహ్మహత్యపాతకాన్ని పోగొట్టుకోవటానికి గోదావరి నదిని భూమిపైకి తెస్తాడు. శ్రీరామచంద్రుడు ఆశ్రమానికి రాగా తన తపస్సునంతా శ్రీరామునికి ధార పోసి ముక్తిపొందాడు.

జమదగ్ని తన భార్య రేణుక మనసులో అన్యపురుష వ్యామోహం కలిగిందేమోనన్న శంకతో కొడుకైన పరశురామునిచే ఆమె శిరస్సు ఖండింప చేస్తాడు. కానీ తర్వాత పరశురాముని ప్రార్థనచే మరల పునరుజ్జీవితురాలయినది.

ఏడవ వాడు వశిష్ఠుడు. ఆయన భార్య అరుంధతి. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. శక్తిమొదలైన వందమంది పుత్రులకు జన్మనిచ్చాడు. రఘువంశ పురోహితుడు. రామచంద్రునికి పట్టాభిషేకం గావించినాడు.

సప్త ఋషులను ఎలా ప్రముఖంగా చెప్పుకుంటామో అలానే మనం ఏడు సముద్రాలు, ఏడు కులపర్వతాలు ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు శ్రేష్టమయినవి. ప్రాతః కాలంలో వీని స్మరణం శుభాలను కలుగజేస్తాయి అంటారు. అందుకే భాద్రపదశుక్ల పక్ష పంచమి అనగా ఋషిపంచమి రోజున స్త్రీలు పూర్వకృతదోష పరిహారం కొరకు విధి విధానంగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఋషిపంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే తెలిసి, తెలియక చేసిన రుతుదోషాలను దూరం చేసుకుని ఆయువు, బలము, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని పండితవాక్కు. సప్త ఋషుల ప్రతిమలను చేయించి, పూజించి ఋత్విక్కులను సంతోషపరచి వారి ఆశీర్వాదాలను అందుకుంటారు. అలా చేసినవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి వివరించినట్లుగా పురాణకథనం.

సప్త ఋషులు ఈ రోజున తూర్పుదిక్కున ఉదయిస్తారు. ఆకాశంలో మంచంకోళ్ళవలె నాలుగు నక్షత్రాలు ఒక నక్షత్రానికి తోకలా మూడు నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ మూడు నక్షత్రాలలో మధ్య నక్షత్రం దగ్గర మిణకు మిణుకు మంటూ ఒక నక్షత్రం కనిపిస్తుంది. అదే అరుంధతీ నక్షత్రమని చెబుతారు. అరుంధతీ నక్షత్రాన్ని చూసి నమస్కరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సౌభాగ్యం వృధ్ధి పొందుతాయని పండితవాక్కు. అందుకే వివాహ సమయంలో వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. బ్రహ్మ విద్య నేర్వవలసిన రోజు. ఈ కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానం చేసుకోవాలి. సప్త ఋషులే గాయత్రి మంత్రానికి మూలగురువులు. మానవశరీరంలో ఏడుయోగ చక్రాలు ఉంటాయి. వాటిని వికసింప చేసేవారే సప్త ఋషులు. వేదమంత్రాలను దర్శించి, వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన మహర్షులను స్మరించే శుభసందర్భం ఋషి పంచమి.

ఋషి పంచమిరోజున ఉపవాసం ఉంటే గురువులు ప్రసన్నులై మన కోరికలు తీరుస్తారని చెబుతారు. అంతేగాక స్త్రీలు ఆ రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికి వారి సంతానానికి తరతరాలపాటు ఆయురారోగ్య సౌభాగ్యాలు కలుగుతాయని పురాణ కథనం. కశ్యపుడు, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని ఈ ఏడుగురి ఋణం మనిషి తప్పనిసరిగా తీర్చుకోవాలి. మనిషి జన్మిస్తూనే ఐదు రుణాలతో భూమ్మీదకు వస్తాడు. అవే దేవ ఋణం, పితృఋణం, ఋషిఋణం, మనుష్య ఋణం, భూత ఋణం అని అంటారు. మనం ఆచరించాల్సిన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు తెలియచెప్పింది ఋషులే కదా! అంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వారిని సతీ సమేతంగా భక్తితో స్మరించి పూజించుకోవటం మన ధర్మం. మనం ఏడుగురిని సేవించలేకపోయినా ఐదుగురినయినా స్మరించుకోవాలి అందుకే ఈ రోజుకి ఋషి పంచమి అనే పేరు వచ్చింది. అత్రిమహర్షి, అనసూయ, వీరు దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉధ్ధరించిన జంట. భరద్వాజుడు, గాయత్రీమంత్రి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని మనం స్మరించుకోవలసిన ఐదుగురు.

నిజానికి ఇది స్త్రీలకు సంబంధించిన పండుగ. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచెప్పింది. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే రజస్వలా సమయంలో చేసిన దోషాలు పరిహారం అవుతాయని బ్రహ్మదేవుడు సితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పంలో ఉన్నది. వ్రతం చేసుకోవలసిన ఈరోజున సప్తఋషులను వారి భార్యలతో సహా పూజించాలి.

ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా నియమాలు పాటించాలి. ఉత్తరేణి మొక్కలును వేళ్ళతోసహా పీకిదాని కొమ్మతో ఉదయాన్నే పళ్ళుతోముకొని, అనంతరము గంగాజలం, బురద, తులసి, చెట్టులోనిమట్టి, ఆవుపేడ, రావిచెట్టుమట్టి, గంధపుచెక్క, నువ్వులు, గోమూత్రంతో కలిపి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై 108 చెంబులతో స్నానం చేయాలి. స్నానం నదిలో కానీ ఇంటిలో కానీ చేయవచ్చు. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రతానికి

“కశ్యపాయ నమస్తుభ్యంఆత్రేయచ నమోనమః భరద్వాజాయ నమస్తుభ్యం విశ్వామిత్రయే తే నమః!
గౌతమాయ నమస్తుభ్యం విశ్వామిత్రాయేతే నమః వశిష్ఠాయ నమస్తుభ్యం సప్తర్షిభ్యో నమోన్నమః!!”

అని సంకల్పం చెప్పుకోవాలి.

ఈ వ్రతాన్ని ముత్తైదువలు చేసుకుంటే తిల అభ్యంగన స్నానం చేసి పసుపు కుంకుమలను ధరించి పూజకు కూర్చోవాలి. వితంతువులు విబూది, గోపీ చందనం, పంచగవ్యాలతో స్నానంచేయాలి. ఈ వ్రతాన్ని నాలుగు వర్ణాల వారు స్త్రీ పురుషులెవరైనా చేసుకోవచ్చు. పూజా మందిరం వద్ద గణపతి, నవగ్రహాలు, షోడశమాతల్ని ప్రతిష్టించి, సప్తఋషులను భార్యలతో సహా లేదా అత్రి, అనసూయ, అరుంధతి వశిష్ఠుల చిత్రాల నుంచి పంచామృతాలు, నీటితో అభిషేకం చేసి, బియ్యం, పళ్ళు, పూలు, తమలపాకులు, యాలకులు, లవంగాలు, దక్షిణగా ఉంచి వ్రతకథ చెప్పుకొని హారతిస్తారు. ఇందులో వశిష్ఠుని అరుంధతిని పూజిస్తే సౌభాగ్యంతో జీవిస్తారని నమ్మకం. అందుకే వివాహ సమయంలో వధూవరులచే మొట్టమొదటగా అరుంధతీ దర్శనం చేయిస్తారు.

పూర్వం విదర్భదేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుడికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. వివాహమైన కొద్ది రోజులకి ఆ అమ్మాయి భర్త మరణిస్తాడు. తల్లిదండ్రులు ఆమెను తీసుకొని గంగాతీరంలో నివాసముంటారు. ఒకరోజు ఆ అమ్మాయి శరీరంనుంచి పురుగులు పడటం గమనిస్తాడు తండ్రి. దైవ భక్తుడైన అతడు తన కుమార్తెకిలా ఎందుకు జరుగుతున్నదో అని దివ్యదృష్టితో గమనిస్తాడు. పూర్వజన్మలో రజస్వల అయిఉన్నప్పుడు అన్నంగిన్నెను తాకినందువలన ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. ఈమెతో ఋషిపంచమి వ్రతం చేయిస్తే ఆ దోషం పోతుందని ఆ వ్రతాన్ని చేయిస్తాడు.

విదర్భ నగరంలో శ్వేతజితుడనే క్షత్రియుడు సుమిత్ర అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. భార్య రజస్వల అయిన సందర్భంలో శ్వేతజిత్తు ఆమెను తాకటం మాట్లాడటంవంటివి చేసేవాడు. ఆమె కూడా ఆ సమయంలో అందరితోనూ మామూలుగానే మాట్లాడేది. ఇలా కాలం గడిచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగాను, అతడేమో ఎద్దుగాను జన్మించారు. కొంతకాలం గడిచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగాను, అతడేమో ఎద్దుగాను జన్మించి కొడుకైన గంగాధరం ఇంటికి చేరుతారు. అప్పుడు గంగాధరం సుమిత్రకు శ్రాధ్ధక్రియలు ఆచరించి పరమాన్నం నైవేద్యం పెడుతుండగా ఒక కుక్క వచ్చి దాన్ని ముట్టుకుంటుంది. దానిని పారబోసి వేరేగా వండి నైవేద్యం పెడతారు. తద్దినం పెట్టేది తనకే కదా అని తనే ఆ పాయసం తింటే దాన్ని పారబోశాడని బాధపడి కుక్క రూపంలో ఉన్న సుమిత్ర ఎద్దు రూపంలో ఉన్న భర్తతో పంచుకుంటుంది. వారి మాటలను అర్థం చేసుకున్న గంగాధరం కుక్క రూపంలో ఉన్నది తన తల్లి అని తెలుసుకొని వారు ఆవిధంగా జన్మించడానికి కారణం ఏమిటో గురువుద్వారా తెలుసుకుని ‘ఋషిపంచమి’ వ్రతాన్ని ఆచరించి వారి దోషాలను పోగొడతాడు.

మన పురాతన ఆచారాన్ని ఎంతో నిష్ఠగా ఆచరించేవారు ఉన్నారు. కాబట్టి కష్టాలనుండి బయటపడి మనగలుగుతున్నాం. ఈ పూజా విధానం ముగిసిన తర్వాత ఆకాశంలోని సప్త ఋషులను అరుంధతిని చూస్తూ ఆఋషులను పూజించాలి. అంతేకాకుండా ఏడు లేదా నాలుగు వత్తులతో దీపాన్నుంచాలి. పెరుగు, శనగలు, తోటకూరకూర నైవేద్యం పెట్టాలి. వివాహమైన వారు కనుక ఈ వ్రతంచేస్తే భర్త ప్రేమను సుఖాన్ని పొందుతారు.

వ్రతాలన్నింటిలోకి అత్యున్నతమైన వ్రతం ఏదని ధర్మరాజు కోరినప్పుడు శ్రీకృష్ణుడు ఋషిపంచమి వంటి శ్రేష్ఠమైన వ్రతం లేదని చెబుతాడు. స్త్రీలు రజస్వల దోషానికి పరిహారంగా జరుపుకొనే ఈవ్రతాన్నీ భాద్రపదమాసంలో ఋషిపంచమి రోజున ఆచరించాలి. ఆ రోజున నది తీరంలో పరిమళ ద్రవ్యాలతో మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. ఆ తర్వాత నదీ జలాన్ని తీర్ధంగా తీసుకుని అక్కడ హోమాన్ని ఆచరించాలి. ఇంటికి చేరిన తర్వాత వ్రతానికి సంబంధించిన వేదిక సిద్ధం చేసుకుని కలశాన్ని గణపతిని, కృష్ణ, తుంగభద్రాదినదులను, సప్తఋషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత వాయన దానాలు ఇవ్వాలి. ఇలా ఏడు సంవత్సరాలు ఆపకుండా జరుపుకుంటే సకలసౌభాగ్యలు కలుగుతాయని పండితవాక్కు.

పైన చెప్పుకున్న కథలన్నీ కాక అసలు ఈ వ్రతం చేసుకోవటానికి కారణమైన వ్రత కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సుమిత్రుడు జయశ్రీ అనే దంపతులు నివసించేవారు. వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్యా విధేయుడు. అందువలన ఆమె రుతు దోషాల్ని పట్టించుకోకుండా నడుచుకుంటున్నా చూస్తూ ఊరుకునేవాడు. వీరికి సుమతి అనే కుమారుడు జన్మించాడు. ఆ తరువాత కొంతకాలానికి వాళ్లిద్దరూ కాలం చేశారు.

సుమతి చంద్రావతిని వివాహం చేసుకున్నాడు. నియమనిష్ఠలనుపాటిస్తూ వాళ్ళు కాలం గడప సాగారు. అలాంటి పరిస్థితులలో రుతు దోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ, ఆమెకు అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు. కొడుకుపట్ల గల ప్రేమానురాగాల కారణంగా వాళ్ళు సుమతి ఇంటికి చేరుకున్నారు.

ఒకసారి సుమతి ఇంట్లో పితృకార్యాన్ని నిర్వహిస్తుండగా ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషంకక్కి వెళ్ళింది. కుక్క రూపంలోఉన్న జయశ్రీ ఆదృశ్యం చూసి మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదమని భావించి చంద్రావతి చూస్తుండగా వాటిని తాకింది. అది చూసిన చంద్రావతి కోపంతో ఆ కుక్కను కర్రతో కొట్టి, పాయసాన్ని మళ్ళీ సిద్ధం చేసింది. సుమతి పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే, ఒకవైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు.

ఎద్దు కుక్క రెండు కూడా తమకు ఎదురైన అనుభవాన్ని గురించి సంభాషించుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాయి. సుమతి నియమ నిష్ఠల కారణంగా తనకు సంక్రమించిన శక్తితో వాటి వేదనను అర్థం చేసుకున్నాడు. తపోనిష్టితులైన ఋషులకు తన తల్లిదండ్రుల విషయాన్ని వివరించి చెప్పాడు. వారి పూర్వజన్మ పాప ఫలితంగా అలా జన్మించి అవస్థలు పడుతున్నారని, వారి పాప విముక్తికోసం ఋషిపంచమి వ్రతం చేశాడు. సుమతి ఈవ్రతాన్ని చేయగానే తలిదండ్రులు ఆ దేహాలను వదలి పుణ్యలోకాలకు చేరుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

భాద్రపదపంచమినాడు ఋషిపంచమి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి పాపాలైనా తొలగిపోతాయన్నది పై వ్రతకథలద్వారా లోకానికి విదితమైనది.

“సప్తర్షయః ప్రసీదంతు మమ పాపం వ్యపోహతు ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే ముని పుంగవాః!
వశిష్ఠాయ నమస్తుభ్యం సప్తర్షిభ్యో నమో నమః!!”

అని ఋషిపంచమినాడు సప్త ఋషులను పూజించి పుణ్యాలను పొందుదాం.

“ఋషిభ్యో నమః సప్తర్షి భ్యో నమః!
బ్రహ్మర్షిభ్యోనమః మహర్షిభ్యోనమః!!”

అని సప్తర్షులకు నమస్కరించి ఆ మహర్షుల దీవెనలు పొందుదాం.

Exit mobile version