Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరిహద్దుల్లో ఉప్పు ఎడారి

“ఆ ఎడారి అంతటా ఉప్పే ఉంది. ఉప్పు పై నడుస్తున్న మనుషులు, ఉప్పుపై ఆటాడుకుంటున్న పిల్లలు, అదే ఉప్పుపై పడుకొని ఆకాశంవైపు తదేకంగా చూస్తున్న మనుషులు! ఎంతటి అద్భుత దృశ్యం” అంటూ తమ ‘కచ్’ పర్యటనానుభవాలను వివరిస్తున్నారు నర్మద రెడ్డి.

సారి మేము ‘కచ్’కు వెళ్ళాలి అనుకున్నాము. కచ్ అనేది గుజరాత్ సరిహద్దున ఉన్న జిల్లా, హైదరాబాద్‍లో ఉన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ రామచంద్రరావు దంపతులు, వాళ్ళకు తెలిసిన ఒక కల్నల్ భుజ్‌లో ఉంటాడు, అతను ఏర్పాట్లు అన్నీ చూసుకుంటాడు అని చెప్పగానే అందరం వెళ్దాం అని అనుకున్నాము.

మేము కచ్‌కు వెళ్లడానికి రెండు కారణాలు ఉన్నాయి. కచ్‌లో ప్రతి యేట ఉప్పు ఎడారిలో రెండు నెలల పాటు ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. వాటిని చూడాలనేది ఒక కారణమైతే, ఈ కచ్‌లోనే మన దేశానికి – పాకిస్తాన్‌కు మధ్య సరిహద్దు ప్రాంతం కూడా కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా చూద్దామనే ఆలోచన మా ప్రయాణానికి ఇంకో కారణం. మిలటరీ మ్యాన్ కూతుర్ని కాబట్టి సైనికులు అన్నా సరిహద్దు ప్రాంతాలన్నా ఎందుకో నాకు ఒక రకమైన ఇష్టం.

అందుకే రామచంద్రరావుగారు చెప్పిన వెంటనే ఒకే చెప్పేశాం. నాలుగు నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. ఈలోగా కల్నల్ గారి నుండి కూడా ఇన్విటేషన్ రావడంతో మా ఏర్పాట్లన్నీ చకచకా చేసుకుని భుజ్‌కి బయలు దేరాం. భుజ్ అనేది కచ్ జిల్లా కేంద్రం.

కచ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తెలుగు దర్శకుడు రాజమౌళి ఈ ప్రాంతంలోనే ఒక సినిమా తీశాడంటే ఈజీగా తెలిసిపోతుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాలో తెల్లటి ఎడారిలో గుర్రాలపై పరిగెత్తిని సన్నివేశం ఈ ప్రాంతంలోనే తీశారంటే తెలిసిపోతుంది. మన తెలుగు సినిమానే కాకుండా ఈ ప్రాంతంలోనే అమీర్ ఖాన్ నటించిన బాలివుడ్ సినిమా ‘లగాన్’ మొత్తం ఈ కచ్ ప్రాంతంలోనే నిర్మాణం పూర్తిచేసుకుంది. వీటితో పాటు అనేక హిందీ సినిమాలు కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి.

మేము నలుగురం మొదట హైదరాబాద్ నుండి బాంబేకి, అక్కడి నుండి భుజ్‌కి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాం. మేము వెళ్ళగానే కల్నల్ గారు మమ్ముల్ని రీసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఆయన వచ్చి మమ్మల్ని ఇన్వయిట్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మిలటరీ అతన్ని చూడగానే దేశభక్తి వెన్నులోకి వచ్చింది. అంటే ఆ ఇన్విటేషన్ చాలా నచ్చేసింది. ఒక మోటార్ సైకిల్, ఒక జీప్‌ని తీసుకొని వచ్చాడు మా కోసం, మా సామాన్లు అందులో పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం.

అక్కడికి వెళ్ళగానే రామ్‍జీ గారి భార్య ఎంతో అందంగా పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి మమ్మల్ని ఆహ్వానించింది. 35 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను ఆమెకు చాలా బాగుంది. ఆమె మమ్మల్ని ఆహ్వానించిన తీరు ఒకటైతే, మేము ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి ఒక రౌండ్ టేబుల్ మీద టీ, స్నాక్స్ అరేంజ్ చేసిన తీరు ఇంకా బాటుంది. ఆ టీ, స్నాక్స్, బిస్కెట్స్ తీసుకొని అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి ఇద్దరి సాన్నిహిత్యం మా అందరికి ఎంతో బాగా అనిపించింది. ఎన్నో ఏళ్లుగా పరిచయమున్నట్లు అనిపించింది. కొద్ది సేపటి తర్వాత మా ఇల్లు చూడండి అంటూ అంతా తిప్పి చూపించారు.

వసారాలో మా కోసం ఒక టెంట్ వేశారు. మేము త్రీ కపుల్స్ వెళ్ళాం కదా ఒకవేళ ఎవరికైనా స్థలం సరిపోకపోతే ఆ టెంట్ హౌస్లో పడుకుంటాము అనే ముందు జాగ్రతతో దాన్ని వేశారు. అసలు ఎంత బాగుందో అంటే ఆ టెంట్ హౌస్. చక్కగా ఒక టేబుల్, ఫ్యాన్ లోపల మంచం, దాని మీద మంచి కంబళ్ళు, రెండు దిండ్లు చక్కగా అమర్చారు వాటిని. అది ఒక మిలటరీ ఆఫీసర్ ఇళ్ళు కాబట్టి ఆ టెంట్ కూడా మిలటరీ వాళ్ళు వేసుకునేదే వేశారు. ఎంతో బాగా అనిపించింది.

మొదటి రూమ్‌కి వెళ్ళగానే అక్కడ ఒక కప్పు ఆకారంలో ఉన్న ఒక రాగిది కనిపించింది. చిన్న దాని నుంచి పెద్ద దాని వరకూ అన్నీ అమర్చి ఉన్న ఆ రాగి ఆకారంపై చిన్న చెక్కతో చేసిన హ్యాండిల్తో కొడితే ‘సరిగమపదనిస’ అనే రాగం పలుకుతుంది. నాకు అది ఎంతో నచ్చేసింది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ బోర్డర్ లోనే దొరుకుతుందని చెప్పారు. దాన్ని కొలిమిలో వేడి చేసి దాన్ని ఆ ఆకృతితో తయారుచేస్తారట. నేను వెళ్ళే లోపల ఇలాంటి దాన్ని కొనుక్కోవాలనీ అనుకున్నా మనసులో…

తర్వాత వాళ్లు అన్నీ చిన్న చిన్న టేబుల్స్ మీద డిఫరెంట్‌గా అన్ని గ్లాస్ వేర్ అంతా అమర్చారు. ఎక్కడ ఎక్కడో తిరిగిన బోర్డర్‌లో దొరికిన కలెక్షన్స్ బొమ్మలు అవి. అవి కూడా నచ్చాయి నాకు. వాటిని చూస్తుంటే అక్కడే నాకు బాంబ్స్ పెట్టే ఒక సెప్స్ లాంటిది కనిపించింది. తుపాకీలో పెట్టే మందుగుండునీ చిన్న ఒక సర్కిల్ లాంటి ఒక దాంట్లో పేర్చి ఉంచే దండలాంటిది అది. దాన్ని సైనికులు యుద్దంలో ఉపయోగస్తారట. చూసి చాలా ఆశ్చర్యపోయాను. నా లైఫ్‌లో అలాంటి దాన్ని ఎన్నడూ చూడలేదు. సాయంత్రం వరకూ అక్కడే రెస్ట్ తీసుకున్న మేము దగ్గర్లోనే ఒక టెంపుల్ ఉండంటే అక్కడికి బయలుదేరాం.

స్వామీ నారాయణ టెంపుల్:

రాధాకృష్ణులు కొలువై ఉన్న అత్యద్భుతమైన ఆలయం ఇది. గుజరాత్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా చూడాలి. దీన్ని 1828లో స్వామి నారాయణ కట్టించారట. అయితే 2001 వచ్చిన భూకంపంలో ఇది దెబ్బతినడంతో మళ్ళీ దీన్ని మార్బుల్‍తో పునర్నించారు. బంగారంతో చేయిన విగ్రహాలు, కన్నులార చూడటం తప్ప వర్ణించడం సాధ్యం కాదు. మేము అక్కడికి వెళ్ళే సరికే అక్కడ వందలాది మంది ఉన్నారు. కొందరూ రెడ్ డ్రెస్ వేసుకొని భజన చేస్తూ కనిపించారు. వచ్చిన వాళ్ళకందరికి హారతి ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళతో కలిసి కాసేపు దర్శనం చేసుకొని ఆ ఆలయం అందాలని తిలకించేందుకు పరిశీలిస్తూ అంతా తిరిగాము. ఆ ఆలయం నగిషీతనం అద్భుతమనే చెప్పాలి. ఆలయం పై కప్పులో ఎనుగుల గుంపును రెండుగా వేసి ఒక బృందం ఊరేగింపుగా వెళుతున్నట్లు దానికి మెరుగులు దిద్దారు. పద్మం ఆకారంలో చెక్కిన పనితనం మరోక ఎత్తు. ఆలయం అంతటా ఉన్న స్థంబాలు దాని తీర్చిదిద్దిన విధానం. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకను సంతరించుకుందని చెప్పవచ్చు. దీని నమూనాతోనే ఢిల్లీలో ఇలాంటి ఒక ఆలయాన్ని నిర్మించారట. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతుండే ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి సహితం యాత్రికులు, ప్రముఖులు వస్తూ పోతూ ఉంటారు. భక్తి పరావశ్యంతో అలరాడే ఆ ఆలయంలో మేము కూడా హరతి తీసుకుని బయటకు వచ్చేసాం.

బాన్‌ఫైర్:

ఆ రాత్రికి మా కోసం వసారాలోని ఒక పెద్ద హాలు బయట ఓపెన్ ప్లేస్‌లో ‘బాన్‌ఫైర్’ పెట్టారు. నిండు పున్నమిలో చలి దుప్పటి కప్పేసిన ఆ వేళలో బాన్‌ఫైర్ చుట్టు కూర్చుని రాత్రంతా గడపడం మరిచిపోలేని అనుభూతి. మేము వస్తున్నాం అని తెలిసి కల్నల్ దంపతులు వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్స్‌ను కూడా పిలిచారు. అందరూ కాలక్షేపంగా మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆ రాత్రిని ఎంజాయ్ చేశాము. మాతో పాటు వచ్చిన రామచంద్రరావు గారు మంచి సింగర్ కావడంతో ఆయన పాటలతో మమ్ముల్ని ఉత్సాహపరిచారు. రాత్రి 12 గంటల వరకూ ఆ ‘బాన్‌ఫైర్’ చుట్టూ డాన్స్ చేస్తూ గడిపాము.

భుజ్‌లో ఓ కృష్ణ మందిరం వద్ద రచయిత్రి

రాత్రంతా ఆటపాటలతో గడిపి లేటుగా పడుకున్న మేము ఎర్లీగానే నిద్రలేచాం. పొద్దున్నే ఇంకొన్ని ప్రదేశాలను చూడటానికి బయలుదేరాం. మా కల్నల్ మిత్రులు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విలేజ్ దగ్గరకు మమ్ముల్ని తీసుకుపోయారు. ఆ విలేజ్ అంతా కూడా చేనేత వస్తువులతోటి నిండి ఉంది. ఒక ఎగ్జిబిషన్‌లా ఉంది దాన్ని తిరిగి చూశాము. అక్కడికే దగ్గరలో ఒక ఎతైన కట్టడం కనిపిస్తే అక్కడికి వెళ్ళాము. అది పావురాల కోసం కట్టిన ఒక కట్టడం. చిన్న చిన్న గుళ్ళు, పావురాలు అందులో కూర్చునేలా కట్టారు. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అన్ని పావురాలు ఒకే దగ్గర కూర్చొని ఈ ఇల్లు నా సొంతం అని చక్కగా ఇమిడిపోయి కుకురూకూ అని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. అది చూసి చాలా ఆనందించాను. అసలు పావురాలకి ఇలా ఇళ్ళు కూడా కట్టొచ్చా అని కాసేపు వాటినే చూస్తూ కూర్చున్నాను. చాలా అందంగా కట్టారు వాళ్ళు.

అక్కడి నుంచి ఒక లాండ్‌స్కేప్ లాంటి ప్రదేశం ఉందంటే అక్కడికి వెళ్ళాం. దానికి ఎంట్రీ టికెట్ లాంటిది ఉండటంతో టికెట్ తీసుకొని అందరము అందులోని వెళ్ళాము. అందులోకి వెళుతుంటే నీటి బుడగలు వచ్చేలా పౌంటెన్స్ మాకు స్వాగతం పలికింది. దాన్ని దాటుకొని ముందుకు వెళితే ఒక చెరువులాంటి ప్రదేశం కనిపించింది. ఆ చెరువులో అటు ఇటు తిరగడానికి మధ్యలో ఒక వంతెన, చుట్టూ పచ్చని పచ్చిక బయలు, సైడ్‌లో పారుతున్న నీరు చాలా బాగుంది ఆ వాతావరణం. దాని మీద నేను నడుస్తూ ముందుకు వెళుతుంటే ఒక అమ్మాయి అందంగా ముస్తాబై ఫోటోలు దిగుతూ కనిపించింది. అక్కడ ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందేమో చూద్దామని దగ్గరకు వెళ్ళి పక్కన ఉన్న ఒక వ్యక్తిని ఎవరూ ఈ యాక్ట్రెస్ అని అడిగితే, అతను “కాదు మేడం, ఆమె పెళ్ళి కాబోతుంది. పెళ్లి కోసం ఇక్కడ ఫోటోలు దిగుతుంది, మేము ఫోటోలు షూట్ చేస్తున్నాము” అని చెప్పారు. అమ్మాయికి ఒక నెమలి పింఛంతో ఉన్న రింగ్ పెట్టి ఉంది. నాకు దాన్ని చూడగానే ఆ నెమలి పింఛంతో ఉన్న ఉంగరం బాగా నచ్చేసింది. అది ఎక్కడ దొరుకుతుందని వాళ్ళని అడిగితే “దాన్ని మేమే తయారు చేశాం, ఇది అమ్మేది కాదు” అని చెప్పారు. ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడి, అమ్మాయి పెళ్లి విషయాలు కనుక్కొని ముందుకు కదిలాము.

అది ఒక ఎగ్జిబిషన్ లాంటి ప్రదేశం! వెళ్ళగానే అన్ని టోపీలు కనిపించాయి. ఇంకొక షాప్‌లో పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ కూడ రాజస్థానీ కళ ఉట్టిపడే అమ్మాయి మేలిముసుగులో చక్కగ గద్దె మీద కూర్చొని రెండు చేతులు అలవోకగా అలా పెట్టి మహారాణిలా కూర్చున్న భంగిమతోటి ఒకటి; తరువాత ఇద్దరు గొడుగులు పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నట్టు; రకరకాల కుండలు తయారు చేసే అమ్మాయి బొమ్మలతోటి ఎన్నెన్నో పెయింటింగ్స్ ఉన్నాయి. అవి అన్నీ చూసి ఆనందిస్తూ, ఆ పెయింటింగ్స్ గురించి కనుక్కుందాం అని ఆరాతీస్తే ఒక్కొక్కటి చాలా ఖరీదైనది 20-30 వేలు అని తెల్సింది. తరువాత రూ.500 దగ్గర నుంచి చిన్న చిన్న ఫొటోస్ కూడా కనిపించాయి. కొంత ముందుకు వెళితే అద్దంతో తయారు చేసిన లంగాలు, బట్టలు, షర్ట్స్, కుర్తాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ వాటిని అన్నీ చూసి ఇంకా ముందుకు కదిలితే చీరలు నేస్తూ కనిపించింది. ఒక అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చక్కగా ఎర్రటి కొండల అంచుతోటి ఉన్న వైట్ కలర్ సారీ చాలా బాగా ఉంది. చూడగానే నచ్చేయడంతో ఒక 1500 ఉండొచ్చులే కొనుక్కుందాని అమె దగ్గరకు వెళ్ళి అడిగితే దాని ధర 10,000 రూపాయలు అని చెప్పింది..! ఇంత ఖరీదా అని మనసులో అనుకున్నాను. అక్కడ చీరలకు ఉపయోగించే నూలు చాలా ఖరీదైనదట. పైగా వాళ్ళు అద్దాలకు ఉపయోగించే రంగు కూడా నాచురల్‌గా తయారు చేస్తారంట. అందుకని దాని రేటు అంత ఎక్కువ ఉంటుందని చెప్పారు. ప్రకృతిలో వున్న అన్ని ఆకులు, పువ్వులతో రంగులు తయారు చేసి, వాటిని ఉపయోగిస్తారని చెప్పారు. అక్కడ చీర కొనుక్కోకపోయినా చాలా బాగుంది అనిపించడంతో అక్కడే ఉన్న ఒక అమ్మాయితో ఫొటోలు దిగి ముందుకు కదిలాము.

అన్ని రకాల వస్తువులు దొరికే ఆ ఎగ్జిబిషన్లో మధ్యాహ్నం వరకూ తిరిగి చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరాము. ఇంట్లో సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకొని 4 గంటలకు కచ్‌కి బయలుదేరాము. ఒక రకంగా మేము ప్లాన్ చేసుకుంది కూడా ఈ ప్రాంతాన్ని చూడాలనే కాబట్టి ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తామా అన్న ఆనందంతో అక్కడికి బయలుదేరాం.

రాన్ ఆఫ్ కచ్:

కచ్ అనేది ఒక దేశానికి పశ్చిమ దిశలో సరిహద్దుగా ఉన్న జిల్లా. కచ్ సరిహద్దుగా ఉండటమే కాదు ఈ ప్రాంతానికి అనేక ప్రత్యేకలు కూడా ఉన్నాయి. ప్రాచీన భారతదేశ నాగరికత చిహ్నాలను తన గర్భంలో దాచుకున్న చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా అంతుచిక్కని ఉప్పు ఎడారి ఈ ప్రాంతంలోనే ఉంది. అందుకే ఇక్కడికి వెళ్ళాలన్న మా కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది.

ఈ ప్రాంతానికి మేము వెళ్ళడానికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. భారత దేశానికి – పాకిస్తాన్‌కు కీలక సరిహద్దు ప్రాంతం కూడా కచ్. జిల్లా కేంద్రం భజ్ కు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉండటంతోదాన్ని చూడాలన్న ముఖ్య కారణం మమ్మల్ని అక్కడికి వెళ్ళేలా చేసింది.

కచ్ అనేది గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా, 45 వేల చ.కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద జిల్లాగా గుర్తింబడింది. దీని పేరులోనే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఉంది. ‘కచ్’ అంటే ‘పొడి కానిది’ అని అర్థం. ఇది నిస్సారమైన తడిభూమి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయి మిగిలి కాలంలో పొడిగా ఉంటుంది. దీన్ని ఇంకో ప్రత్యేకత ఏంటంటే వర్షాకాలం పూర్తికాగానే ఈ భూమి పూర్తిగా ఆరిపోయి మంచులా కనిపిస్తుంది. ఈ జిల్లాకు ఉత్తర – తూర్పు సరిహద్దులో పర్యాటక ప్రదేశాలైన గ్రేట్ రాన్ ఆఫ్ కచ్, లిటిల్ రాన్ ఆఫ్ కచ్ ఉంటే, పశ్చిమ – దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కచ్, అరేబియన్ సముద్రం ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతంగా, అనేక మార్లు చొరబాటుదారులు ఈ ప్రాంతం నుండి దేశంలోకి ప్రవేశించడంతో నిత్యం ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జవానులు పహారా కాస్తుంటారు.

13వ శతాబ్దంలో సమ్మ రాజపుత్రుల సంతతికి చెందిన జడేజాల పాలనలో ఉండేది ఈ సంస్థానం. 1815 తర్వాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి స్వతంత్ర రాజ్యంగా ఉండింది. భుజ్ రాజధానికిగా ఉన్న ఈ సంస్థానం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ సార్వభౌమ్యాన్ని అంగీకరించి ఇండియన్ యూనియన్‌లో విలీనం అయింది.

దేశ విభజన ముందు వరకూ ప్రాచీన సింధు నాగరికతకు జీవం పోసిన ఈ ప్రాంతమంతా ఒకే భాగంగా ఉన్నప్పటికీ దేశ విభజనతో కరాచీ నౌకాశ్రయంతో సహా ఎక్కువ భాగం పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోయింది. కచ్ ప్రాంతం మాత్రం భారత్‌లో భాగంగానే ఉండిపోయింది. అయితే కచ్ భూభాగంలో విషయంలో మాత్రం భారత్ – పాకిస్తాన్ల మధ్య దీర్ఘకాలం వివాదం కొనసాగింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. యుద్ధం తర్వాత మొత్తం 3,500 చ.కి.మీ భూభాగంలో పాకిస్తాన్ కు 350. చ.కి.మీ భూభాగాన్ని మిగిలిన భూభాగాన్ని భారతదేశానికి ఇస్తూ అంతర్జాతీయ సరిహద్దురేఖ నిర్ణయించబడింది. అయితే 1999 కార్గిల్ యుద్ధం ముగిసిన కొన్ని వారాల తర్వాత వివాదాలు తిరిగి తలెత్తాయి. అందుకే నిత్యం మిలటరీ పర్యవేక్షణలో ఉంటుంది ఈ ప్రాంతం.

కచ్ ఫెస్టివల్:

ఇక్కడి ఉప్పు ఎడారిలో ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు గుజరాత్ ప్రభుత్వం ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్స్‌ని చూడటానికే దేశ విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ ఉత్సవంలో పర్యాటకులకు విడిది కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తుంది.

మేము ఉన్న ప్రదేశం నుండి అక్కడికి చేరుకోవడానికి దాదాపు 2 గంటల ప్రయాణం. అక్కడికి వెళ్ళి చూడగానే వెన్నెల పరుచుకుందా అన్నట్లు తెల్లటి ఎడారి. కనుచూపు మేర ఇదే దృశ్యం. ఎక్కడైన ఎడారి అంటే ఇసుకతో నిండి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ ఎడారి అంతటా ఉప్పే ఉంది. ఉప్పు పై నడుస్తున్న మనుషులు, ఉప్పుపై ఆటాడుకుంటున్న పిల్లలు, అదే ఉప్పుపై పడుకొని ఆకాశంవైపు తదేకంగా చూస్తున్న మనుషులు ఎంతటి అద్భుత దృశ్యం. కన్నుల పండుగలాంటి దృశ్యం. వీటి పైనే అక్కడి ప్రభుత్వం గుడారాలు వేసి పర్యాటకులకు సరసమైన ధరలో ఉండేందుకు ఏర్పాటు చేసింది.

    

మేము అక్కడికి చేరుకోగానే సాయంత్రం అయింది. ఒకవైపు సంధ్యా సమయం. ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడు. కింద తెల్లటి ఉప్పు.. చూడచక్కటి దృశ్యం. అందమైన అమ్మాయికి తెల్లటి చీరకట్టి ఎర్రటి బొట్టు పెట్టినట్టు ఆ ప్రకృతి తీర్చిదిద్దిన దృశ్యం. దాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి..! అందరం ఆ వెండి వెన్నెల్లో ఫోటోలు దిగి మరచిపోలేని అనుభూతిని మూటగట్టుకొని తిరిగి వచ్చాము.

Exit mobile version