[రెడ్డిశెట్టి పవన్ కుమార్ గారి ‘సర్కారు బడి – అందరూ నడపాలండి’ అనే రచనని అందిస్తున్నాము.]
అమ్మ ఒడి తరువాత శిశువును పాలించే మలిగుడియే బడి. అమ్మను వదిలి వెళ్లనని అమ్మ బుజ్జగింపులకు సైతం తోసిరాజనే బుజ్జాయిని వెలుగు దిశగా దారి చూపుతూ అ అంటే అమ్మ అని, నువు ఆ అమ్మ దగ్గరే ఉన్నావని, ఇ అంటూ ఇది నీ ఇల్లే అని లాలిస్తూ, విజ్ఞానాన్ని పాదుచేసే మహోన్నత క్షేత్రం బడి.
ఆటల్లో విలువల్ని, ఆడుతూ పాఠాల్ని బోధించి నలుగురితో చేయి కలిపించి వసుధైవ కుటుంబం అనే భావన మొగ్గ తొడిగించి బంగారు భవితకు బాటలు పరిచే ఏకైక మార్గం బడి. భవిష్యత్తు ఎంత ఉన్నతస్థానంలో అలరించినప్పటికీ బడి జ్ఞాపకాలకు సాటి మధురానుభూతులేవీ ఉండకపోవడం బడి మహత్తే. విద్య, వినయం, విజ్ఞానం, ఓర్పు, సమయపాలన, క్రమశిక్షణ, పట్టుదల, వ్యూహరచన, కార్యదీక్షత, ఐక్యత, మిత్రలాభం ఇత్యాది పరిపూర్ణ వ్యక్తిత్వానికి కావలసిన అన్ని అస్త్రాలనూ జీవితపు అమ్ములపొదిలో బద్రపరిచేది కేవలం బడి ఒక్కటే. బడి బంగారు భవిష్యత్తుకు బరోసా. విద్యార్ధి భవిష్యప్రగతికి బీమా. ప్రగతి పథముకు అసలైన పునాది. పాలమీది మీగడ బతుకులో బడి. పూలదాగిన మధువు బడి. జగతిని గెలిపించే శక్తి బడి. జగమును వెలిగంచే దీపం బడి. భవిష్యత్తు పరచే ముళ్లబాటను సాంతం పూలబాటగా మలచే ఈ బడి అన్ని కనీస అవసరాలు తీర్చే విధంగా వెలసినపుడే దేశ ప్రగతికి భరోసా సిద్ధించేది.
ఎండ వానల నుండి రక్షణ కల్పిస్తూ నాలుగు గోడలూ, ఓ నల్ల బల్ల, సుద్ద ముక్క, అధ్యాపకుడు, చిన్న మైదానం, త్రాగునీరు, మరుగు దొడ్లు బడికి కావలసిన కనీస వసతులు. మిగిలిన హంగులన్నీ ఆ తరువాతే. ఆధునిక పోకడలతో, లోటు బడ్జెట్ పేరున పలు తరగతులను ఒకే గదిలో కలిపేయడమంటే భావి భారత భవిష్యత్తును నేడే గంగలో కలపడం. గదులతో కుంచించుకపోయి ఒక గదిగా మిగిలిన బడికి, పలు తరగతుల కలగూరగంప విద్యార్థులు ఒక వైపు తలకు మించిన భారం కాగా, ఏకోపాధ్యాయ విధానంతో అధ్యాపకుడు ఒంటి చేయితో బరిలోకి దిగడం బడిబండికి వనరుల లేమితో ఒక చక్రం తొలగించడమే. అప్పుడు ఒక తరగతి పాఠ్యఅంశంతో గదిగోడలను సైతము మంత్రముగ్ధులను గావించే ఉపాద్యాయుడు అదే గదిలోని వేరే తరగతి విద్యార్థిని ఏ విధంగా ఏకాకిని చేయగలడు. ఒక వైపు ఒకే పాఠ్యాంశాన్ని స్పెషల్ క్లాస్, స్టడీ అవర్స్, రివిజన్ పేరుతో ఒకసారికి అదనంగా ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులకు తర్ఫీదును ఇస్తే, ఒక పీరియడ్ కూడా పూర్తిగా నోచుకోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ముక్కలుగా విభజింపబడ్డ పీరియడ్‌లో తమ ముక్క కోసం అర్రులు చార్చుతూ కాలంతో వెలివేయబడడం వారి పఠనాసక్తిని పలుచబరచడమే అవుతుంది. తత్పర్యవసానంగా ఆ బడికి సమాజానికి సిద్ధించిన బలహీన సంబంధాలు కాలగమనంలో మరింత దిగజారుతాయి.
బడిని పరిపుష్టం చెయడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థి గాటికి కట్టిన అన్నార్థికి విద్యామూలాలు నాటి ప్రగతి పంట పండించడం బడికి ఒక రకంగా అదనపు భారమే. మౌలిక వసతుల వెక్కిరింతలు, సిబ్బంది లేమితో పని చేస్తున్న అధ్యాపకులపై అధిక బరువులతో ఒక వైపు అధ్యాపకులు నిర్వీర్యమవుతున్నారన్నది క్షేత్రస్థాయిలోని బహిరంగ రహస్యం. ఎట్టి కారణం చేతనో సర్వీస్ కమీషన్ వెతికిన మెరికల్లాంటి అధ్యాపకుల ప్రతిభ, ప్రైవేట్ విద్యాసంస్థలకు దక్కని బోధనా పటిమ అడవికాచిన వెన్నల కాకూడదు. రాయిలాంటి పిల్లాడిలో దాగి ఉన్న విద్యాశిల్పాన్ని ముందుగా స్పృశించగలిగేది కేవలం గురువే అనడం నిర్వివాదాంశం. విద్యార్థులను అనునిత్యం సానపడుతూ, ఎప్పుడు ఎక్కడ ఎవరు వీగిపోతున్నారో ప్రత్యేకంగా గమనిస్తూ, విద్యామకరంద ఊతముతో వారి నుద్ధరింపి, వారికి ఎల్లలు లేని ప్రతిభామార్గాలను ఆవిష్కరింపచేసి వారిని సరస్వతి మాత ముద్దుబిడ్డలుగా ప్రతిష్ఠించినపుడే గురుపీఠం దైవసమానమనే పూజ్య భావన వేళ్లూనుకుంటుంది.
కణకణమండే లోహపు ముద్దకు సమ్మెట దెబ్బ తోడైనపుడే అది అస్త్రంగా రూపు దిద్దుకుంటుంది. విద్యార్జనకు విద్యార్ధి అహరహం శ్రమించినపుడే గురువిద్యతో ప్రయోజకుడయ్యేది. అందిపుచ్చుకోవలసిన అక్షర జ్ఞానాన్ని పరిహాసం చేసి, కళ్ళకు అద్దుకోవలసిన జీవన జ్యోతిని చేతులారా ఆర్పే వినయరాహిత్యంతో విద్యార్థి మెదలితే అది అక్షరాలా బడికి మిక్కిలి కళంకం.
విద్యార్థుల ప్రగతే ఏకైక లక్ష్యంగా ఉపాద్యాయుడు మిక్కిలి అంకిత భావంతో, ప్రతిరోజూ క్రొత్త ఉత్సాహంతో, క్షేత్రస్థాయి ప్రణాళికలతో బడిని కాపాడుకోవాలి. బడి కనీస అవసరాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఔదల దాల్చాలి. మనది అనే స్వాతంత్య్రంతో విద్యార్థుల తల్లిదండ్రులు బడిని ఆకళింపు చేసుకోవాలి. అప్పుడు ప్రైవేట్ బడిని మరిపించే సర్కార్ బడి శాఖోపశాఖలుగా వర్థిల్లుతుంది.
రెడ్డిశెట్టి పవన్ కుమార్ భారతీయ రైల్వేలో ఉద్యోగి. పువ్వులంటే ఇష్టం. రుబాయీలు, కవితలు, ఆర్టికల్స్, పాటలు, ప్రకటనలు, స్క్రీన్ ప్లే ఇవి వారి కొమ్మకు కుసుమాలు. వీటిని ఏ కొమ్మన చూసినా, తన మనసు తుమ్మెద అవుతుందనే పవన్ కుమార్ తేనెలొలుకు తెలుగు భాషకు ప్రణమిల్లుతారు. ఫోన్:9392941388