[శ్రీమతి కనకదుర్గా లక్ష్మీరత్న గారి ‘సర్వస్య శరణాగతి’ అనే రచనని అందిస్తున్నాము.]
తనువు,మనస్సు సర్వస్వము భగవంతునిదే అనే స్పృహ కలిగి, అహంకారాన్ని వదిలి వేయడమే సర్వస్య శరణాగతి. అంటే అస్థిత్వాన్ని భగవంతుని పాదాల చెంత పెట్టడమనే స్థితి. “నేను”,”నాది” అనే భావం నుండి విడివడి పరమాత్మకు చెందినవాడను, ‘నీట ముంచినా,పాల ముంచినా నీదే భారం’ అని ఆయన యందు అచంచలమైన విశ్వాసం కలిగి, ఆయనను దిశా నిర్దేశకుడిగా భావించడం.ఇది ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థితి.
హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడిని పర్వతాలమీద నుండి కిందకు పడదోసినా, శూలాలతో పొడిచినా,ఏనుగుల చేత త్రొక్కించినా, మరెన్నో చిత్రహింసలకు గురి చేసినా, ప్రహ్లాదుడు మాత్రం శ్రీహరి నామస్మరణాన్ని విడిచి పెట్టలేదు. ఇది ప్రహ్లాదునికి,శ్రీమన్నారాయణుని యందున్నఅచంచలమైన విశ్వాసానికి, అనన్య భక్తికి తార్కాణం. తనని తాను ఆ శ్రీహరికి సమర్పించుకున్నాడు. అందుకే, ఆయన నృసింహుడై స్థంభం లోంచి వచ్చి తన భక్తుడిని హింసల పాలు జేసిన హిరణ్యకశ్యపుడిని వధించాడు.
భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టం తీసుకుంటే మొసలి, గజేంద్రుడు సమఉజ్జీలుగా పోరాడుతున్నాయి. ఒకానొక దశలో గజేంద్రుడి బలం క్షీణించగా, తన స్వప్రయత్నంతో బలవంతుడైన శత్రువుని జయించడం దుస్సాధ్యమని గ్రహించి తన అహంభావాన్ని,గర్వాన్ని విడనాడి భగవంతుని అనుగ్రహం లేనిదే తన మరణం తధ్యమని తలచిన గజేంద్రుడు ఊర్ధ్వముఖుడై ఆకాశం వైపు చూస్తూ ‘లోకాలన్నీ ఏ మహాత్మునిచే సృజింపబడి, పెంచబడుతున్నాయో అటువంటి పరమేశ్వరుడే నాకు దిక్కు’ అని దిక్కులు పిక్కటిల్లేలా మొరపెట్టుకున్నాడు. ఆర్తత్రాణపరాయణుడైన ఆ శ్రీహరి గజేంద్రుని మొర వినగానే ఉన్న పరిస్థితిని, పరిసరాలను మర్చిపోయి గజేంద్రుడిని రక్షించడానికి బయలుదేరాడు.
విభీషణుడు రావణునిలోని దోషములను,అతని మిథ్యాప్రవర్తనను, పురుషోత్తముడైన శ్రీరాముని లోని సుగుణములను, కార్యదక్షతను వివేచనతో గుర్తించి, సోదర బంధం నుండి విముక్తుడై శ్రీరామచంద్రుడిని శరణుజొచ్చి ఆయన ఆశ్రయం కోరాడు. ఒక్క హనుమ మినహా, సుగ్రీవుడు, అంగదుడు మొదలగు వారు ‘శత్రుపక్షము వారిని ఎట్టి పరిస్థితిలోను దరిజేరనీయరాదు’ అని తమ అభిప్రాయములు వ్యక్తపరచినప్పటికినీ శ్రీరాముడు “శత్రువు ఆర్తుడైనను,గర్వించినవాడైనను తన ప్రతిపక్షం వారిని శరణు జొచ్చినప్పుడు వారు నిశ్చయబుద్ధితో తమ ప్రాణములను ఒడ్డియైనను అతనిని కాపాడవలెను. శరణాగతులను రక్షింపకుండుట మహాదోషము. దానివలన అపకీర్తి వచ్చును. ‘నేను నీ వాడను’ అని పలుకుచు ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణు గోరినచో వారికి అభయమిత్తును. ఇది నా వ్రతం” అని తన దృఢ నిశ్చయముతో విభీషణుడికి ఆశ్రయమిచ్చి శరణాగతవత్సలుడు అని పేరొందాడు.
నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు,సభలో ఆశీనులైన పెద్దలు కూడా అచేతనులై వీక్షిస్తున్నప్పుడు, ద్రౌపది రెండు చేతులూ ఎత్తి “కృష్ణా” అని ఆర్తిగా పిలవగా కృష్ణపరమాత్మ ఆవిడని పరాభవమునుండి తప్పించాడు.
మన భక్తి, విశ్వాసంలో కొరత ఉండ వచ్చేమో గానీ, పరమాత్ముని దయలో తావన్మాత్రం కూడా కొరత ఉండదు.సర్వస్య శరణాగతి స్థితి రావడానికి సాధన బాగా అవసరం. మొదట మనలోని అరిషడ్వర్గాలను పారద్రోలాలి. మనసు శుద్ధం అవుతుంది. అప్పుడు అంతా పరమాత్మే, అన్నింటా పరమాత్మే గోచరమవుతాడు. మన కర్మలను – తెలిసి చేసిన పుణ్యంగానీ, తెలియక చేసిన పాపం గానీ ఆయన చరణారవిందాలకు సమర్పిస్తే, మనం కర్మ బంధనాల నుండి విముక్తులవుతాము. దీనికి ఈశ్వరార్పణ బుద్ధిని అలవర్చుకోవాలి. కర్మల నుండి విముక్తి పొందడమే మోక్షం.
గీతలో కృష్ణపరమాత్మ
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥
అని బోధించాడు.
సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను ఆ పరమాత్మకు సమర్పించి సర్వశక్తిమంతుడును, సర్వాధారుడును, పరమేశ్వరుడును అయిన ఆయనను శరణు వేడితే అన్ని పాపముల నుండి విముక్తులు అవుతారు.
