“దారిలో ఏముంటాయో చెప్పండి స్వామి. రాసుకుంటాను” అతనిని నేను రిక్వెస్టు చేశాను.
ఆయన దారిలో చూడతగ్గ క్షేత్రాలు చెప్పాడు. తప్పక యోగనారసింహుని దర్శించుకోమని చెప్పాడు. శంకరభగవద్పాదుల వారు తపస్సు చేసిన కల్పవృక్షపు వివరాలు అడిగితే చెప్పాడు. నేను అన్ని వివరాలు రాసుకున్నాను, బండిని మాట్లాడటానికి సహయము అడిగాను. నా కోసము ఒక వెహికిల్ ఏర్పాటు చేశాడు, తెలిసిన ట్రావల్స్ వారు వున్నారు మఠము ప్రక్కనేయని. నాకు ఆరువేలకే వెళ్ళి రావచ్చని తెలిసి సంతోషము కలిగింది. మరురోజు ఉదయము బయలుదేరాలన్న ప్లాను వేసుకున్నాను. మావారికి చెప్పాను. అక్కయ్యకు కూడా ఫోనులో చెప్పాను. మొత్తానికి అలా హిమాలయ అంతర్భాగానికి ప్రయాణమంటే చాలా ఉద్రేకముతో కూడిన ఉత్సాహము కలిగింది. హిమాలయాలు నన్ను కరుణించాయి. జగదంబ పుట్టిల్లు నాయందు ఆదరముగా వున్నది.
నా ప్రయాణము జ్యోషిమఠ్‌కు ఉదయము ఐదు గంటలకు మొదలైయ్యింది. అలా బయలుదేరితే నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతాను. ఆ ఒక రాత్రి బస(స్టే) జ్యోషిమఠ్‌లో. మరురోజు బయలుదేరి వెననకు వచ్చెయ్యచ్చు. మనము హిమాలయాలలోకి వెళ్ళటానికి, మళ్ళీ బయటకు రావటానికి ఎన్నో విషయాలు అనుకూలించాలి, ముఖ్యముగా వాతావరణము. రోడ్డులు చాలా సున్నితంగా వుంటాయి అక్కడ. ఎప్పుడూ గుంటలు మెట్టలతో, రిపేరుతో ఆ రోడ్డులు సగము వేగనిరోధకాలు. మంచిరోడ్డు నిడివి చాలా తక్కువ. అదంతా ఘాట్‌రోడ్డు, రోడ్డు ప్రక్కన ఘాట్ గార్డులు తక్కువ. అసలు కొన్ని చోట్ల లేవు కూడా. వేగంగా వెళ్ళలేరు. గంటకు ముప్పై కిలోమీటర్లు వెళ్ళటము గగనము. దూరము 220 కిలోమీటర్లైనా వెళ్ళటానికి ఆరు గంటల పైన పడుతుంది.
పైపెచ్చు చాలా దూరము రోడ్డు పని జురుగుతుండటముతో ఆగి ఆగి వెళ్ళ వలసి రావటము వలన కూడా ప్రయాణ వేగము బాగా తగ్గింది. డ్రైవరు నేర్పుగా ఆ రోడ్డు మీద నడిపాడు. వేగం, రోడ్డు ఎలా వున్నా సౌందర్యానికి సాటి లేదని చెప్పాలి. మళ్ళీ దేవప్రయాగ మీదుగా వెళ్ళాను. ప్రతి ప్రయాగ వద్ద కారు ఆపి అతను చూపాడు. దగ్గరకు వెళ్ళాలంటే పూర్లో కొంతదూరము వెళ్ళాలి. చాలా దూరము వెళ్ళాలని మేము సాగిపోయాము. రోడ్డు ప్రక్కనే అలకనందా కులుకుతూ తోడు వచ్చింది. హిమాలయాలను చూస్తూ బోలెడు కబుర్లు మనసులో చెప్పుకున్నాను. మాయమ్మ గౌరమ్మ పుట్టిల్లు కదామరి!
రుద్రప్రయాగ తగులుతుంది దేవప్రయాగ దాటి లోపలికి వస్తే. అక్కడ అలకనందా నది మందాకినీ నదిని కలుస్తుంది. రుద్రదేవుని పేర ఆ వూరు రుద్ర ప్రయాగగా పిలుస్తారు. వూరు పెద్దది. మందాకిని కేదార్‌నాథ్ నుంచి ప్రవహిస్తూ వస్తుంది. నది సంగమములో కూడా దేవప్రయాగలోలా స్పష్టముగా రెండు నదులూ కనపడుతాయి. ఇక్కడ నారదుల వారు తపస్సు చేశారట. ఇక్కడ అలకనందా ప్రక్కనే చాముండాదేవి గుడి వుంది. రుద్రుని శక్తిగా అమ్మవారుగా ఇక్కడ ప్రజలే కాదు, యాత్రికులు కూడా తప్పక దర్శించుకునే దేవాలయము.
మనము రుద్ర ప్రయాగ దాటాక ధారా దేవి గుడి వస్తుంది. ఆ గుడిని వెనకకు వచ్చేటప్పుడు దర్శించాలని అనుకున్నాను. అందుకే ముందుకు సాగిపోయాను. గంగ మీద కడుతున్న, హైడ్రో డ్యాము అక్కడికి దగ్గరే. అందుకే గంగ అక్కడ పెద్ద సరస్సులా వుంది, డ్యాము మూలముగా.
శ్రీనగరు అన్న పెద్ద వూరు కనపడుతుంది. ఈ శ్రీనగరు పూర్వము Garhwal రాజుల ముఖ్య పట్టణము. బ్రిటిషు వారు దానిని మరింత మెరుగు పరిచి దానికి నగర హోదా ఇచ్చారు. అక్కడ పెద్ద కళాశాల, ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ప్రభుత్వ కార్యాలయాలు, మిలట్రీ వారి ఆఫీసులు వున్నాయి. కొంత సిటీ పోకడ వుంది. చార్‌ధామ్ వెళ్ళేవారికి ఈ శ్రీనగరు నైటు హాల్టు. ఇక్కడ రాత్రి పూట వుండటానికి మంచి హోటళ్ళు వున్నాయి. శ్రీనగరు దాటాక మనకు కొంత లోయలా కనపడుతుంది. అక్కడ భూమి దున్నటము, పంటలు పండిచటమూ కూడా వుంది. వ్యవసాయానికి వారు పండిచే పంటలేమో గాని నేలంతా ఆకుపచ్చ, లేత పసుపు కలగలిపిన రంగు తివాచి కప్పుకుంది. శ్రీనగరు దాటాక తరువాత మనకు కర్ణప్రయాగ కనపడుతుంది. ఇది పంచప్రయాగలలో ఒకటి. ఇక్కడ అలకనందాదేవి పిందారు నదిని కలుస్తుంది. పురాణాల ప్రకారము ఈ కర్ణప్రయాగలో కర్ణుడు సూర్యారాధన చేశాడట. ఇక్కడే కర్ణుని అంత్యక్రియలు జరిగాయని చెబుతారు.
నందప్రయాగలో అలకనందా నది, నందాకి నదిని కలుస్తుంది. అది మరో పెద్ద వూరు. మేము వెడుతుంటే బడి పిల్లలతో రోడ్డు హడావిడిగా వుంది. వూరు చాలా హాడావిడాగా కనపడింది. పంచ ప్రయాగలలో ఒకటైన ఆ సంగమములో అలకనందానది నందాకినీ నదిని కలుపుకు ముందుకుపోతుంది. ఆ నది పేరునే నందప్రయాగ అయ్యింది. నందప్రయాగ దాటాక ఊర్లు తగ్గాయి. కొండలకు ఏటవాలుగా చిన్న డబ్బాలలా, పిచుకల గూడుల్లా కనపడుతూ ఆ ఇళ్ళు అదో వింత అందముతో వున్నాయి. పర్వతాలలో జీవితము, జీవన విధానము మన పీఠభూములలా వుండదు. పైపెచ్చు అక్కడి ప్రజలు చాలా కష్టజీవులు. ప్రతిదానికీ మెట్లు ఎక్కాదిగా తప్పదు. నేను గమనించినంతలో మెట్లు లేని ఇల్లు లేదు. వారు చాలా మటుకు యాత్రికుల మీద ఆధారపడతారు. గొర్రెల పెంపకము, అడివిలో దొరికే చిన్న కట్టెముక్కలు ఏరుకోవటము, వున్న పొలమును సాగుచెయ్యటము వారి జీవన విధానము. దారిలో తలపై గడ్డి మోపుతో వృద్ద స్త్రీలను చుశాను. వారు తలకు తొట్టి లాంటిది తగిలించుకొని దానిలో గడ్డి నింపుకున్నారు. ఎంత ఎంత దూరాలు నడుస్తారో కదా అని అనిపించింది.
దారిలో తగిలే మరో పెద్ద వూరు చమోలి. ఆ జిల్లాకూడా చమోలినే. అది జిల్లాకేంద్రము. అక్కడ బస్సులు మారటము అదీ చేస్తారు. మిలట్రీ ట్రక్కులూ, జవాన్లూ ఎక్కువగా కనపడుతారు ఆపైన. యాత్రికులు చాలా మంది ‘అలీ’ వెళ్ళేవారున్నారు. మా అర్చకస్వామి కూడా నన్ను అక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చాడు కాని నా యాత్ర లక్ష్యము టూరిజము కాదు.
‘అలీ’ మంచుతో కప్పబడిన పర్వతశిఖరము. అక్కడ వింటర్‌గేమ్సు వుంటాయి. కేబులు కారు, ఐస్ స్కేటింగు అక్కడి ఆకర్షణలు. అక్కడకు వెళ్ళటానికి చాలా మంది వస్తుంటారు. భారతదేశములో అదో పెద్ద Snow Games ఆకర్షణ. వాటికోసము నేను అమెరికా నుంచి హిమాలయాలకు వెళ్ళాలా? మా అట్లాంటా దగ్గరలో వున్న స్మోకీలు చాలుగా. కాబట్టి, నా లిస్టులో అలీ చోటుచేసుకోలేదు. అదే కాదు ర్యాఫ్టింగు, డైవింగులాంటి క్రీడల జోలికి, నదిలో పడవలో తిరగటము గట్రా కూడా నన్ను ఆకర్షించలేదు. అసలు దృష్టికి రాలేదు. నా దృష్టి, మనసు సర్వము నా గురువుకై వెతుకులాటకు, గంగా నది పూజకు, జపానికీ, గురుచరిత్ర పారాయణానికి సరిపోయింది. మరో ఆలోచన చేసే స్థాయినాకు లేదు.
“దుర్లభంత్రయమేవైతత్, దైవానుగ్రహకారణమ్।
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః॥” (మోహముద్గరమ్)
సంసార చక్రములో పరిభ్రమించుచున్న ప్రాణులకు మానవజన్మ కలుగుట, మోక్షము పొందవలెనని తీవ్రేచ్ఛ జనించుట, బ్రహ్మతత్త్వవిదులైన మహాపురుషులతో సమాగమము, పుణ్యవశమున కలుగును.
నేను రెండు గంటల ప్రాంతములో పవిత్ర జ్యోషిమఠ్ చేరాను. అదీ కొండ ఏటవాలుగా నిర్మించిన చిన్న వూరు. రోడ్డు ఒక వరస, ఇళ్ళు, షాపులూ గట్రా ఒక వరస. విశాలమైన మైదానము లేదు. అంతా స్లోపుగా వుంది. జారుడుగా వుంది. కొండలన్నీ నల్లగా వున్నాయి. వాటిపై మాములుగా ఆ సమయములో మంచు కురుస్తుందట కాని ఆ యేడు లేదు. నేను వున్నది టూరిజం వారి హోటలు. మా డ్రైవరు కారు ప్రక్కకు ఆపి వూరులోకి మాయమైనాడు. నాకు ఏదో కంగారు. గుండె పట్టేసినట్లుగా వుంది. ఎందుకంత అనీజీనెస్ కలిగిందో అర్థము కాలేదు. సరేనని దొరికిన తిండి తిని శంకరులు స్థాపించిన మఠము వెతుకుతూ బయలుదేరాను.
***
కారులో వస్తేనే, వచ్చిన దూరముకు కళ్ళు తలా తిరుగుతున్నాయి. మహానుభావులు శంకరులు ఎలా ఇంత లోపలికి నడుస్తూ వచ్చారో ఎంత ఆలోచించినా అర్థము కాలేదు. శంకరుల గురించి ఆలోచిస్తూ వుంటే మనస్సంతా భక్తితో మునిగింది.
“శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయము।
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరము॥”
భారతీయ సనాతన ధర్మ, తత్త్వశాస్త్ర వినీలాకాశములో ధ్రువతారగా వెలుగుతూ, తన ప్రకాశముతో మార్గదిశానిర్దేశము చూపుతున్న మహనీయుడు సాక్షాత్ శంకరుల అవతారమని కీర్తించబడిన గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు. హిందూ మతము అతలాకుతలమవుతున్న తరుణములో, విపత్కర పరిస్థితులలో, నాలుగు దిక్కులా విచ్చుకుక్కలలా పరాయి మతాలు విజృంబిస్తుంటే, ఎదుర్కొని, నిలచి, వేదాన్ని ప్రమాణముగా నిలిపి, తన వాదనా పటిమతో, కార్యదీక్షతో, హైందవాన్ని పరిరక్షించి, కొత్త వైభావాన్ని సంతరించి పెట్టిన మహామనీషి, చారిత్రక పురుషుడు, ప్రస్థానత్రయ వ్యాఖ్యాత, అద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ శ్రీ శంకర భగవత్పాదులు.
(సశేషం)