Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సత్యాన్వేషణ-26

ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం.

‘సౌందర్యలహరి’ – ఈ రచన గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి.

శంకరులు కైలాసం వెళ్ళినప్పుడు అమ్మవారు ఆయనకు ఈ సౌందర్య లహరి ఇచ్చిందని, అంత పవిత్ర, మంత్ర, శాస్త్ర గ్రంథం నరులకు దక్కటం ఇష్టం లేక నంది తీసుకొన ప్రయత్నించినగా…. దక్కినవి సగం పట్టుకు శంకరులవారు భూలోకము వచ్చారని, అందువల్ల దక్కినవి సగము మాత్రమేనని అంటారు. ముందు 49 శ్లోకాలను అమ్మవారు చెప్పినవని అందుకే వాటిని ‘ఆనంద లహరి’ అని అంటారు. తర్వాత 51 శ్లోకాలని సౌందర్యలహరి అని, అవి జగద్గురువులు కూర్చారని పేరు.

మరొక కథ, ‘ఆనాటి అద్వైత సిద్ధాంతం ప్రతిష్ఠించటములో, శంకరుల మీద ఎన్నో వదంతులు వ్యాప్తి చెందబడ్డాయి’. అందులో ఒకటి ‘శక్తి లేదని శాక్తేయులతో వాదన చేశారు’.

అలాంటి సందర్భంలో ఒక నాటి సాయంత్రాన జగద్గురువులు కాశీ లోని ఆశ్రమము నుంచి సాయంత్రం వేళ అలా నడుస్తూ వెళ్తున్నారట.

ఆయన చీకటి పడుతున్న వేళకు దారి తప్పి వెళ్లి ఒక ఊబిలో చిక్కుకున్నారట. దిక్కుతోచక శంకరులు చూస్తుంటే, అటుగా ఒక వృద్ధ స్త్రీమూర్తి వచ్చినదిట. శంకరులు ఆమెను బయటకు వచ్చుటకు సహాయం అడిగారట. ఆమె “శక్తి లేదని అంటివిగా. నీకు నీవై వచ్చేయి” అన్నదట. కొంత సేపటికి ఎందరో దేవతామూర్తులు, శివుడు వచ్చి ఆమెలో ఐక్యం అవటం శంకరులు చూశారుట. ఆయన తన తప్పు తెలుసుకున్నారని, తర్వాత ఆశ్రమానికి వచ్చి ‘సౌందర్య లహరి’ రాశారని అంటారు.

 అందుకే మొట్ట మొదటి శ్లోకంలోనే,

“శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ,
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి”
(సౌ.ల.-1)

“శక్తి లోపించిన శివుడైనా కదలలేదు” యని మొదలు పెడతారు.

సౌందర్యం అంటే అందం.

సు + నర = సుందరగా మారిందని బాషా శాస్త్రజ్ఞులు అంటారు. సౌందర్యమునకి అర్థం సుందరం అని తేలికగా అనుకోవచ్చు.

లహరి అంటే అల. సముద్రములో అలలు కలిగితే అందం. అది నిరంతర ప్రవాహానికి, కదలికకు, జ్ఞానానికి, ప్రాణానికి, మార్పుకు సంకేతం కదా!

ఇక్కడ చెప్పింది అమ్మవారి గురించి కదా! సదా కదులుతున్న సౌందర్యమైన, చైతన్యము అమ్మవారు.

ఏమిటి సౌందర్యం?

అమ్మవారా?

అవును, అమ్మవారు ‘లలితా పరమ భట్టారిక’. అంటే సౌందర్యం కదా మరి. అది ఎలాంటి సౌందర్యం? లావణ్యాము అతిశయించిన అందము. అమ్మవారి లావణ్యము వర్ణనకు అందనిది. నిరుపమానాతిశయించిన నిరాపేక్ష సౌందర్యము.

లోకంలో కురూపిలుంటారు. కానీ, కురూపి అమ్మ ఉండరు. మరి అమ్మల కన్న అమ్మకు, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన అమ్మవారు మరింత అతిశయించిన సౌందర్యంలో ఒప్పుతుండటం అంటే అది సహజమే కదా!

సౌందర్యం అంటే అదేనా?

అదే కాదు, శ్లోకాలలోని కవిత్వము అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు శంకరుల వారు ఆనందముతో విశ్వరూపము దాలుస్తారేమొ. అందుకే ప్రతి శ్లోకంలో పదాలు అత్యద్భుతంగా అమరి అందమైన పూలగుత్తి వలె బాసిల్లి చదివేవారికీ అనంతమైన ఆహ్లాదాన్నిస్తాయి.

సౌందర్యం అంటే అదేనా?

కాదు, మహా మహిమాన్వితమైన సౌందర్యలహరి యథార్థంలో మంత్ర తంత్ర శాస్త్రము. నిష్ఠగా సంపుటి చేసిన వారి సర్వమూ అమ్మవారే చూసుకుంటుంది.

అంతేనా? అంతే కాదు.

యందలి నిబిడీకృతముగ యున్న సౌందర్యం ఆధ్యాత్మికం. అది చదివిన వారికి అనుభవమే. ప్రతి శ్లోకం లోను గూఢమైన, అంతరార్థము తీసుకున్న వారు అమ్మవారి పదములు విడువరు. తేలికగా అమ్మ సాన్నిధ్యం అందించు అత్యంత అద్భుతమైన గ్రంథం సౌందర్యలహరి.

పూజ్య గురువు ఎక్విరాల కృష్ణమాచార్యులు వారు తమ శిష్యులకు నిరంతరం చదుకొనమని ఇచ్చిన 3 శ్లోకాలు కూడా ఈ సౌందర్యలహరి నుంచే. అవి 3-15-1

నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం శ్రీ చాగంటి వారిని కలిసినప్పుడు వారు నాకు సౌందర్య లహరి లోని ఈ శ్లోకమునే ప్రతిరోజు చదుకోమ్మని చెప్పారు.

“అవిద్యానామంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక-మకరంద- శ్రుతిఝరీ.
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతీ”
(సౌ.ల.-3)

ఇన్ని అద్భుతమైన స్తోత్రాలలో ఏ ఒక స్తోత్రము పట్టుకున్నా చాలు మన జీవితాలు పండించుకోవడానికి. కాదంటే సౌందర్యలహరిలోని ఒక్క శ్లోకము చాలు. అసలు అమ్మ పదములు మనమున తలచినామంటే చాలా అదృష్టవంతులమని అర్థమట.

***

శంకరభగవత్పాదుల గురించి ఆలోచిస్తూ శంకరమఠము వచ్చాను. అది హోటలు వున్న వీధి చివరనే వున్నది, అర కిలోమీటరు దూరములో. రోడ్డు చాలా స్లోపుగా వుండి నడవటానికి నాకు కొద్దిగా ఇబ్బంది వేసింది. ఆ మఠము క్రింద అంతస్తులో ఏముందో కానీ ప్రక్కన మెట్లతో పైకి దారి. మెట్లు ఎక్కేచోట పెద్ద ఆర్చు, దానిమీద శంకరమఠమన్న పేరు రాసి వుంది. చాలా నిశ్శబ్దముగా వుంది. మెట్లు ఎక్కి పైకి వెడితే ఆ క్రింది షాపుల మీద మేడ మీదకు పోతాము. అక్కడో వసారా, దానికి ఆనుకొని వరసగా గదులు వున్నాయి. అన్నీ గదులు ఖాళీగా వున్నాయి. నేను నెమ్మదిగా నడుస్తూ వరండా గుండా లోపలికి వెళ్ళాను. మరో ప్రక్క షాపుల మీది మేడ పైభాగము ఆ మఠానికి ముందరి ప్రాంగణములా విశాలముగా వున్నది.

ఒక గదిలో ఒక సాధువు గారు వున్నాడు. నేను ఆయనకు నమస్కరించాను. ఆయన మధ్యవయస్కుడులా వున్నాడు. “ఎవరూ” అంటూ బయటకు వచ్చాడు.

“నేను మఠము దర్శించటానికి వచ్చాను” అని చెప్పాను.

ఆయన ఆదరముగా స్వాగతించాడు నన్ను. లోపల శివుని లింగము వున్నది. దాని ముందర చిన్న దీపము. మరో ప్రక్క పూర్వ పీఠాధిపతుల విగ్రహాలనుకుంటా వున్నాయి.

నేను శివునికి నమస్కరించాను.

అక్కడ వున్న విగ్రహాన్ని చూపి “అది తోటకాచార్యులది. ఆయన అక్కడే వుండేవాడు” అన్నారు ఆయన. అది గదిలా వున్నా, కొండను తొలచి గదిలా చేశారని చూడగానే తెలిసిపోతోంది. నేను ఆచార్యుల సమక్షములో వెళ్ళి నా ఆసనము పరచుకొని జపము మొదలెట్టాను. కొన్ని వందల సంవత్సరాల క్రిందట శంకరులు కాలు పెట్టిన చోటని ఊహ కలగగానే హృదయములో చెప్పలేని ఉద్రేకము కలిగింది. ‘జాతిని ఉద్ధరించిన స్వామీ, నన్ను నా గురువు వద్దకు చేర్చు’ మూగగా వేడుకున్నాను.

“ఐంకార హ్రీంకార రహస్యయుక్తా
శ్రీంకార గూఢార్థ మహా విభూత్యా।
ఓంకార మర్మ ప్రతిపాదినీభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యామ్‌॥”
(గురుపాదుకా పంచకము)

అరగంట తరువాత బయటకు వచ్చాను. బయట పిట్టగోడ వద్ద సాధువు కుర్చి వేసుకు కుర్చొని వున్నారు. నన్ను దగ్గరకు రమ్మని పిలిచారు. నాకో కుర్చీ తెమ్మని ఎవరికో చెప్పారు. ఇంతలో ఒక చిన్న పిల్లాడు ఒక చైరు నాకు వేసి వెళ్ళిపోయాడు.

(సశేషం)

Exit mobile version