1922 ప్రాంతములో రమణాశ్రమము తయారైనది. దక్షిణామూర్తి వలె మౌనబోధ ద్వారా భగవాన్ జ్ఞానము పంచేవారు. అహం నీటి బుడగ వంటిది. ఆత్మ సముద్రము వంటిది. పువ్వుల సువాసన వలె మహర్షి నుంచే వచ్చే ఆధ్యాత్మిక సువాసన నెమ్మదిగా ప్రసరింపబడి, నేడు సర్వ ప్రపంచములో వెదజల్లబడుతోంది. భగవాన్ భక్తులను 1950 వరకూ అనుగ్రహిస్తూనే వున్నారు. ఆయన మరణించినప్పుడు దివ్యమైన జ్యోతి అరుణాచల పర్వతములో కలసిపోవటము అక్కడి భక్తులకే కాదు, చెన్నై వరకూ కనిపించిందట.
అరుణాచలము సాధకులకు చలివేంద్రము. ఆత్మను తెలుసుకొను సాధకులకు తప్పక దర్శించి అనుభవములు ప్రోగుచేసుకునే దివ్యధామము.
మౌనముగా వున్నా ఎందరో సాధకులను, ఆత్మశోదకులను, సత్యాన్వేషులను ఆకర్షించారు భగవాన్ రమణులు. వారి బోధ ‘నీవు అన్నది ఎవరు?’ అన్న విషయము పై ధ్యానము చెయ్యమని. ఆ విషయమే మిమ్ములను లోలోపలికి లాక్కుంటుంది అని అంటారు. ఆ ధ్యాన మార్గము విచారమార్గము. పూర్వం ఉపనిషత్తులలో చెప్పినదే. శంకరులు కూడా ఈ విషయము భాష్యాలలో చెప్పారు. ఆధునిక హృదయాలకు హత్తుకునేలా, సూటిగా ఎలాంటి హంగులూ లేకుండా ఆచరణ యోగ్యముగా చెప్పిన ఆ విధానము ప్రపంచములో ఎందరినో రమణ భక్తులుగా మార్చింది, మారుస్తున్నది. అదే నేటికీ ఈ అరుణాచలానికి లాగుతోంది.
అరుణాచలములో రమణులు ఎంత ప్రశాంతులో, అరుణాచల పర్వతమంత ప్రఖ్యాతి. ఎందరో సిద్ధులకు ఆవారము ఈ కైవల్యధామమగు ఆరుణాచలము.
ఇక్కడ పూర్వము ఓంనమఃశివా యన్న సిద్దుడు తపస్సు చేశాడుట. ఆయన పేరున నమఃశివాయ గుహ అన్న గుహ ఆ గిరిశిఖరముపై కనపడుతుంది. విరూపాక్ష దేవా అన్న మరో సిద్ధ పురుషుడు తపస్సు చేసిన గుహను విరూపాక్షగుహ అంటారు. ఈ విరూపాక్షగుహలో రమణులు కొంత కాలమున్నారు. మౌనముని అయిన కుర్తాళం పీఠము పేట్టిన యోగి కొన్ని రోజులు ఈ గిరిపై యున్నట్లు వారి చరిత్ర చెబుతుంది. సిద్ధాశ్రమ యోగులు, సిద్ధులు వచ్చి ఈ గిరిలో వున్న అగ్ని లింగానికి అర్చనలు చేసి వెడుతూవుంటారని శ్రీ పరమహంస పర్యివ్రాజక శ్రీ సిద్ధేంద్రభారతీ స్వామి వారు చెప్పి యున్నారు.
మౌని రమణులు ఈ అరుణాచలేశ్వరుని హృదయములో నిలిపి, మన వంటి పామరులను అనుగ్రహించే పరమ పవిత్ర క్షేత్రము – ఈ అరుణాచలము. రమణాశ్రమములో ఒక్క పూటనైనా మనసు నిలిపి ధ్యానము చెయ్యకపోతే వారికి ప్రశాంతత గురించి ఎంత చెప్పినా అర్థము కాదు. ఇచ్చట ఆ ప్రశాంతమైన ధ్యానము కడు సులభము. కారణము మౌని, మహర్షి రమణుల దివ్య ప్రభావము గాలిలో తేలియాడి మనలను చిత్తశాంతులుగా చేసి,అశాంతి నిరోధించి ధ్యానము వైపు నెడుతుంది. అందుకే సాధకులు తప్పక వచ్చి ధ్యానమాచరించ వలసిన స్థలము ఈ రమణాశ్రమము. ప్రతివారు ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన పుణ్యధామమీ అరుణాచలము.
నేను నా భారతదేశయాత్రలో అరుణాచలము తప్పక వెళ్ళాల్సినది పెట్టుకున్నాను. మావారు కూడా వస్తానన్నందుకు నేను ఆ ప్రయాణము చివరకు మార్చి, తన వచ్చాక కలిసి వెళ్ళాము.
మేము ఆనాటి మధ్యాహ్నమునకు అరుణాచలము చేరాను. దారిలో కనపడుతున్న గుట్టలు, కొండలన్నీ రాళ్ళు కుప్పులు కుప్పలు పొసినట్లుగా వున్నాయి. వాటి తీరే కొంత వేరుగా అనిపించింది. ముందుగానే బుక్ చేసుకున్న హోటల్ అపార్టుమెంటుకు వెళ్ళాము. రెండు పడకల గదులు, వంటగది ఒక చిన్నహాల్‌తో కూడిన ఆ అపార్టుమెంటు రమణాశ్రమము ఎదురుగా వున్న సందులో వుంది. ఆశ్రమానికి నడిచి వెళ్ళవచ్చు. చాలా సౌకర్యముగా వుంది. మేము ముగ్గురము మా సామాను దింపి, వెంటనే ఆశ్రమానికి వెళ్ళాము.
ఆ ఆశ్రమములో కాలు పెట్టగానే మనకు అతి పెద్ద, చాలా పురాతనమైన వృక్షము స్వాగతమిస్తుంది.
చెప్పులు గేటు ప్రక్కన వున్న స్టాండులో పెట్టి ఆ పవిత్ర స్థలములో నడుస్తుంటే పరమాత్మ ఇక్కడ కొన్ని సంవత్సరములు తిరుగాడాడడని, వీటిని తాకాడని, ఈ నేల మీద నడిచాడని తలచుకుంటే హృదయము పులకరించిపోయింది. చాలా ప్రియముగా ఆ మట్టిని శిరస్సున తిలకములా ధరించి, చెట్టును చేతితో తగిలి నమస్కరించుకొని భగవాన్లు కూర్చునే గదివైపుకు నడచాము.
ఆశ్రమము ప్రశాంతతకు పుట్టినిల్లులా వుంది. మనము చందమామలలో చదివిని ఋషుల ఆశ్రమాలను గుర్తుకు తెస్తుంది. నెమళ్ళు నిర్భయంగా తిరుగుతూ, కోతుల కిచకిచలతో, ప్రక్క ప్రక్కనే భక్తులతో, వివిధ వృక్షాలతో, శివలింగ పువ్వులతో స్వచ్ఛంగా వుంది. భగవాన్ హృదయమును రుచి చూసిన ఆ ఆశ్రమము తనూ అంత మహీమాన్వితమై దీపపు కాంతిలా వెలుగుతోంది. అరుణాచల పర్వతము పాదాలలో వున్న ఆ ఆశ్రమము చూడటానికి ముచ్చటగా, ఆదరముగా ఆహ్వనించే అమ్మలా తోచింది.
మేము ఆశ్రమములో అటునిటు తిరిగి, భగవాన్‌ల సమాధికి నమస్కరించుకొని, ఆధ్యాన మందిర హాల్‌లో కూర్చున్నాము. ముగ్గురము మౌనముగా ధ్యానములో. అక్కడ భగవాన్ని ఫోటోలు పెద్దవి గోడలకు వున్నాయి. ముందర సమాధి, దానిపై శివలింగము, చుట్టూ ఫోటోలు. అదేదో లోకములోకి వెళ్ళినట్లుగా వుంది. మగవారు ఒకవైపు, ఆడవారు మరో వైపుగా కూర్చొని ధ్యాననిమగ్నులవుతున్నారు. ఎందరో విదేశియులు అక్కడ చీరలలో తిరుగుతూ, ఎవో పనులు చేస్తూ కనబడ్డారు. వారు వచ్చి ఆశ్రమములో వుండిపోతారుట.
మేము ధ్యానములో వున్నప్పుడే కొందరు చిన్న పిల్లలు, వేదము నేర్చుకుంటున్నారులా వుంది, వచ్చి వేదగానము చేశారు. ఆ ప్రదేశములో ఆ వేదగాన పరిమళము, మహర్షి మహిమల పరిమళము కలిపి కైలాసమును మరిపించినాయి. కన్నులలో మహర్షి రూపము నిలిచిపోయి మరోలోకాలకు తీసుకుపొయ్యింది.
ధ్యానమన్న తిప్పలలో నేనుంటే…. చిన్న కునుకులా….మగతలా…. మత్తు ఆవహించింది. ఆ మత్తులో కల….. కలలో కూడా మహర్షి….. “ఇంతకాలము ఏమయ్యావు?” అంటున్నారు……
నేను ఏమీ మాట్లాడలేక పోతున్నాను….. ఏంటో విఘ్నాలు…గొంతు పెగలటము లేదు…. ఇంతలో కాంతి…. కళ్ళు తెరిస్తే ఆ మంటపములోనే వున్నాను….. ఒక ప్రక్క అక్కయ్య డీప్‌గా ధ్యానములో వుంది. లేచి వచ్చేశాను బయటకు…ఆలోచనగా…
ఆ రోజు అనుకోకుండా పౌర్ణమి. తమిళులు చాలా భక్తులు. తండోపతండాలుగా గిరివలయము కోసము వస్తున్నారు. వీధులన్నీ ప్రజలతో నిండి తిరునాళ్ళలా వుంది. మేము మా డిన్నరు ముగించి పడుకొని, రాత్రి వంటి గంటకు లేచి స్నానాదులు ముగించి అరుణగిరికి ప్రదక్షణము మొదలెట్టాము.
ఇక్కడ గిరి సాక్షాత్తు శివుడే. ఇక్కడ గిరి వలయము విశేషమైనది. పరమ ప్రసిద్ధి. పౌర్ణమి రోజన లక్షలలో భక్తులు వచ్చి, రాత్రి రాకా చంద్రుని వెలుతురులో శిఖిచంద్రమౌనిని తలుస్తూ, గిరి ప్రదక్షణ చేస్తారు. ఆ గిరి చూట్లూ 14కి.మీ. నడక. ఈ గిరే శివుడనే నమ్మకము అడుగడుగు కనపడి, మన మనసులను ఆ గిరిప్రభువు పై నుంచి కదలనీయ్యదు. శివుని వాహనమైన నంది ఎన్నో ప్రదేశాలలో ఆ గిరిని చూస్తూ,తమ ప్రభువు ఆజ్ఞ కై ఎదురుచూస్తూ వుంటాడు. గిరి ప్రదక్షణలో ఎన్నో ఈశ్వర దేవాలయాలు కనపడుతాయి.
అందులో ఎనిమిది లింగాలు ఎంతో ప్రముఖమైనవి. వీటిని అష్టలింగాలంటారు. ఈ ప్రదక్షిణలో భక్తులు ఆగి తమ వందనములు సమర్పించేది కూడా ఈ ఎనిమిది లింగాలకే. అవి: ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం. మధ్యలో మనకు అగస్త్యుల వారి ఆలయము వస్తుంది. శ్రీవిద్యకు ఆద్యులు, పరమశివుని ఆజ్ఞ పై దక్షిణాపథానికి వచ్చి తపమాచరించిన ఈ మౌని ఈ క్షేత్రాన్ని పావనము చేశారు.
మేము మా ప్రదక్షిణలో నేను ఈ శివలింగాలకు వీలైనంత వరకూ ఆగి, ముందుగా తయారుచేసుకున్న వత్తులు, నెయ్యి, ప్రమిదలతో దీపాలు వెలిగించాను. ప్రదక్షణ చేసేటప్పుడు మౌనము పాటించటము ఉత్తమము. మనసును పరమశివునిపై నిలపి, శివ నామముతో కాని, గురు నామముతో కాని జపము చేస్తూ చేసే గిరి ప్రదక్షణ సర్వ కర్మలను పారద్రోలి, పరమపద సోపాన పఠములో మోక్షమన్న నిచ్చెన పై నిలుపుతుంది. నేను నా మంత్రము జపిస్తూ ప్రదక్షిణ చేశాను. చెప్పులు లేకుండా చేస్తే ఉత్తమము అని, చెప్పులులవదిలేసి కేవలము సాక్సుతో నేనూ అక్కా ప్రదక్షిణ మొదలెట్టాము. మావారు సాక్సు కూడా వేసుకోకుండా వచ్చారు.
ప్రజల తండోపతండాలుగా వున్నారు. అది అర్థరాత్రి అంటే నమశక్యము కాదు. అంతమంది ప్రజలు. మధ్యలో అక్కడక్కడ అన్నదానాలు చేస్తూ పులిహోరలు పంచుతూ కొందరు భక్తులు, మంచినీరు మజ్జిగ ఇస్తూ సేవ చేస్తున్నారు. మేము శివనామము తలుస్తూ నెమ్మదిగా నడుస్తూ, ఆగుతూ, కాళ్ళకు కలిగిన గాయాలను లెక్కచెయ్యక నెమ్మదిగా ఉదయము 7 గంటల ప్రాంతములో అరుణాచలము మేము మొదలెట్టిన ప్రదేశానికి చేరాము. ఆ నడకలో మనకు ఒకచోట హైవే తగులుతుంది. ఆ బస్సులు, ఆటోలు బైకులు ఎవ్వరూ నడిచే భక్తులను లెక్కచెయ్యరనిపించింది. వారి వేగము చూస్తే. మేమున్న బసకు దగ్గరలో ఒక హోటల్‌లో టిఫెను చేసి మేము వున్న హోటలుకు వెళ్ళి పడుకుండిపోయాము. మధ్యహ్నము మళ్ళీ ఆశ్రమములో వుంది, సాయంత్రము అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళాము.
(సశేషం)