Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా

[బాలబాలికల కోసం ‘సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

భారతదేశంలో అత్యంత వైజ్ఞానిక నగరం ఏమిటి అని ప్రశ్న వేస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని ‘కోల్‌కతా’ అనే సమాధానం వస్తుంది. కోల్‌కతా లోనే అతి పెద్దది మరియు అత్యంత అధునాతనమైన సైన్స్ మ్యూజియం ఉన్నది. కాబట్టి దీనిని ‘సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు.

పిల్లల డాక్టర్ల జాతీయ సమావేశాలు కోల్‌కతాలో జరిగినపుడు సైన్స్ సిటీ లోనే జరిగాయి. నేను ఇప్పటి వరకు మూడు నేషషల్ కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాను. ఇందులో రెండు కాన్ఫరెన్స్‌లు సైన్స్ సిటీ లోనే జరిగాయి. మేము ప్రత్యేకంగా వెళ్ళి చూడనవసరం లేకుండా విజ్ఞాన భాండాగారాల లోనే సమావేశాలు జరగడం మా అదృష్టం. ఈ సంవత్సరం మాత్రం విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. అందువల్ల సైన్స్ సిటీకి వెళ్ళి చూసి రావలని వచ్చింది. 2005లో మొదటి సారిగా సైన్స్ సిటీని చూశాను. మరల 2013లో సైన్స్ సిటీలో జరిగిన పిల్లల డాక్టర్ల జాతీయ సమావేశాలకు డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశంలోనే భారతరత్న క్షిపణి శాస్త్రవేత్త భారత రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం గారిని కలసి నేను రాసిన సైన్స్ పాయింట్ పుస్తకాన్ని వారి కందించి మాట్లాడగలిగే అదృష్టం లభించింది. భారత రాష్ట్రపతిని కలవడం నా జీవితంలో తొలి ఆనందమయ క్షణంగా హృదయంలో దాచుకున్నాను. నేను ఆ పుస్తకంలో అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను కూడా రాశాను. ఈ పుస్తకాన్ని 2003 లో ప్రింటు చేశాను. బాలతేజం అనే మాస పత్రికలో ఈ జీవిత చరిత్ర కథనం అంతకు పూర్వం ప్రింటయింది. ఈ పుస్తకాన్ని అబ్దుల్ కలాం గారికి అందించినపుడు ‘మీరేం చేస్తారని’ ప్రశ్నించారు నన్ను. నేను పిల్లల కోసం సాహిత్యం రాస్తున్నాను. ఇప్పటికి ఇరవై పుస్తకాలకు పైగా ప్రింటు చేశానని చెప్పాను. వారు మరలా నన్ను “పిల్లల కోసం సైన్స్ రాస్తున్నారా లేదా” అని ప్రశ్నించారు. “సర్ నేను ఎక్కువగా సైన్స్‌ను చెప్పటానికే ప్రయత్నిస్తున్నాను. మానవ అవయవాలకు పొడుపు కథలు రాశాను. మానవ అవయవాలు తన ఆత్మకథ చెప్పుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా రాశాను” అని చెపితే చాలా సంతోషించారు.  “నేటి విద్యార్థులకు కావాల్సింది సైన్స్. మీరు విద్యార్థుల కోసం, సైన్స్ కోసం సాహిత్యాన్ని సృష్టించండి” అని చెప్పడం నా జీవితంలో ఒక అద్భుత ఘట్టం.

మిరానియా గార్డెన్స్ లో సైన్స్ సిటీని మరల చూసినపుడు పై విషయాలన్నీ గుర్తు వచ్చాయి. 21 సంవత్సరాల ప్రేమ గుర్తుకు వచ్చింది. డా. ఎపిజె అబ్దుల్ కలామ్‌ను పరిచయం చేసిన ఘనత సైన్స్ సిటీకే దక్కింది. ఒక ప్రముఖ శాస్త్రవేత్తను భారత విజ్ఞాన భాండాగారమైన సైన్స్ సిటీలో కలసి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలున్న ‘సైన్స్ పాయింట్’ పుస్తకం వారి కందించడం మధుర జ్ఞాపకం.

2026వ సంవత్సరం జనవరిలో జరుగుతున్న పిల్లల డాక్టర్ల కాన్ఫరెన్స్‌కు నేను మావారితో పిల్లలలో కోల్‌కతా వెళ్ళాను. నా పాత మిత్రురాలైన సైన్స్ సిటీని చూడటానికి వెళ్ళాను. భారతదేశంలోని రెండు సైన్స్ సిటీలలో ఇదొకటి. మరొకటి బెంగుళూరు లోని నెహ్రూ సైన్స్ మ్యూజియం. నేను బెంగుళూరు లోని నెహ్రూ సైన్స్ మ్యూజియంను ఇంతకు పూర్వమే చూశాను. కాబట్టి భారతదేశంలోని ప్రముఖ సైన్స్ మ్యూజియంలు రెండింటినీ నేను చూసినట్లే.

జెటిస్ హాల్డేన్ ఏవ్ లో ఉన్న సైన్స్ మ్యూజియంను చూడటానికి వెళ్ళినపుడు చాలా మంది పిల్లలు కనిపించారు. బహుశ రెండు మూడు స్కూళ్ళ పిల్లలు వచ్చినట్లున్నారు. ప్రారంభంలోనే కుళాయిలో నుంచి నీరు కిందికి పడుతున్నట్లుగా కనిపిచింది. ఎక్కడా నీళ్ళు రావడానికి పైపులు కనిపించవు. ఇదొక సైన్స్ అద్భుతం.

ఒక గ్లోబు గుండ్రంగా తిరుగుతూ నీళ్ళ మధ్యలో ఉన్నది. అందరు అక్కడే ఫోటోలు తీసుకుంటున్నారు. మేం కూడా పోటోలు తీసుకున్నాం. అంతలో ఆకాశంలో కేబుల్ కార్లు తిరుగుతూ కనిపించాయి. సైన్స్ సిటీ మొత్తం తిరిగి చూడటానికి కేబుల్ కార్లు ఉపయోగిస్తున్నారు. నాకు ఇంతకు ముందు వచ్చినపుడు కేబుల్ కార్లను చూసినట్లుగా జ్ఞాపకం రావడం లేదు. బహుశ నేను గుర్తించక పోయి ఉండవచ్చు కూడా.

45 ఎకరాల విస్తీర్ణంలో పరచుకున్న ఈ సైన్స్ సిటీ 1997 లో ప్రారంభమయింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్‌తో అభివృద్ధి చేయబడింది. ఇది ప్రపంచంలో కూడా పేరుగాంచినది. ప్రపంచంలో పేరు పొందిన పదిహేను సైన్స్ సిటీలలో ఇది కూడా ఒకటి. సైన్స్ సిటీ గేటు మొదట్లోనే ఈ పదిహేను ప్రముఖ సైన్స్ సిటీల వివరాలు ఫోటోలతో ఒక ఫ్లెక్సీ పెట్టబడి ఉన్నది. నేను దానిని ఫోటో తీసుకున్నాను. తర్వాత నిదానంగా చదవవచ్చు అని ప్లాను.

న్యూయార్క్, పారీస్, టోరంటో, బ్రెజిల్, సింగపూర్, చైనా లండన్ వంటి దేశాలలో ఉన్న సైన్స్ సిటీలు ప్రముఖమైనవి. నేను సింగపూర్ లో ఉన్న ఆర్ట్ సైన్స్ మ్యూజియంను చూడలేక పోయాను. కానీ చైనా వెళ్ళినపుడు మాత్రం షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజిజియంను మాత్రం చూశాను.

ఇందులో చాలా 3D షోలు ఉన్నాయి. పిల్లలకు వీటిని చూపిస్తే ఎప్పటికీ సైన్స్ అంటే భయపడరు. శాస్త్రవేత్తలుగా మారకపోయినా నీట్ లలో రాసే ఫిజిక్స్ కెమిస్ట్రీ పరిక్షలకు భయపడే సమస్యే లేదు. నేను వీటిని చూసి వ్యాసాలుగా రాస్తున్నపుడు నా చిన్నతనంలో వీటిని చూడలేక పోయామే అని చాలా బాధపడ్డాను. ఇందులో ఇప్పుడు కొత్తగా స్పేస్ థియేటర్ ఫుల్ డోమ్ లతో 3D డిజిటల్ థియేటర్ ను ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టారు. నేను అతి తక్కువ సమయం కేటాయించడం వల్ల అన్నీ చూడలేక పోయాను. 20 కోట్లతో భారత దేశ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది.

‘ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్’ అనే ప్రదర్శన చాలా బాగుంటుంది. ఒక ఎలక్ట్రిక్ కార్ లో కూర్చుని లోపలకి చీకట్లో వెళుతుండగా పరిణాము క్రమానికి చెందిన ప్రముఖ విషయాల్ని చూపిస్తారు. ఇందులో 56 బోటిక్ జంతువుల్ని వినియోగిస్తున్నారు. ఏడు విభాగాలుగా విభజించి చూపిస్తారు. చీకట్లో వెళతామన్నపుడు భయం వేసింది. అక్కడక్కడా పోకస్ చెయ్యబడిన లైట్లు, శబ్దాలతో వింత అనుభూతిని కలిగిస్తుంది. దీని పేరే ‘డార్క్ రైడ్.’ కారు మెల్లగా కదులుతూ ఒక్కొక్క యుగంలోని జంతువులను చూపిస్తూ వెళుతుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను జువాలజీ చదివిన దాన్ని కాబట్టి జరాసిక్ యుగం, కేం బ్రీయన్ యుగాల నుంచి వివరిస్తూ, చెపుతుంటే నా పుస్తకాలలోని పాఠాలు కళ్ళ ముందు తిరుగుతున్నట్లుగా అనిపించింది.

స్పేస్ థియేటర్ లో 3D డిజిటల్ థియేటర్ ను కొత్తగా ప్రవేశ పెట్టడం భారత దేశానికి గర్వకారణం. 2D సెయ్యిలాయిడ్‌తో తయారైన ఫిల్మ్ ప్రొజెక్షన్ స్థానంలో 3D డిజిటల్ ఫుల్ డోమ్‌తో థియేటర్ వచ్చింది. ‘ద లైఫ్ ఆఫ్ ట్రీస్’ మరియు ‘ఆస్టరాయిడ్ మిషన్ ఎక్స్‌ట్రీమ్’ అనే డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శింపబడుతున్నాయి. స్పేస్ థియేటర్‌లో ఇలా మొక్కల గురించి, జంతువుల గురించీ తెలుసుకోవడం మనసుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది.

‘డిజిటల్ పనోరమా’ అనే మరొక విభాగంలో మానవ పరిణామం గురించి తెలుపుతారు. గడచిన ఆరు మిలియన్ సంవత్సరాలలో మానవ పరిణామంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తారు. ఇది మొత్తం పన్నెండు నిమిషాల పాటు సాగే చిత్రం. అవి పెద్ద పనోరమిక్ స్క్రీన్ల మీద చిత్రాలు కనిపిస్తుంటే ఉత్కంఠభరితంగా చూస్తారు. ఎనిమిది శక్తి వంతమైన ప్రొజెక్టర్స్‌తో స్థూపాకార స్క్రీన్ మీద మూడు భాషల్లో వాయిన్ ఓవర్ వస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని భారతదేశంతో పాటు దక్షిణాఫ్రికా కలసి రూపొందించింది. కంప్యూటర్ తయారు చేసిన 3D చిత్రాలు వాస్తవంగా ఎదురుగా ఉన్నట్లుగా చూపించే అద్భుత చిత్రాలివి. ఆనందం, అద్భుతాలతో కూడిన వినోదభరిత సైన్స్ ప్రపంచాన్ని చూసి తీరవలసిందే.

ఇక్కడ ఉండే డైనమోషన్ హాల్‌లో భ్రమలు, శక్తులు, మంచి నీటి చేపల ఆక్వేరియమ్, సీతాకోక చిలకల ఎన్‌క్లేవ్ ఉంటాయి. భూ అస్వేషణ హాల్‌ను 2008లో ప్రారంభించారు. ఇందులో భూమి మీద నివసించే వాటినన్నిటినీ చూపిస్తారు. స్పేస్ ఒడిస్సీ థియేటర్ లో 360 రకాల శాస్త్ర ప్రదర్శనలు ఇస్తారు. అడ్వెంచర్స్ ఇన్ వైల్డ్ కారిఫోర్నియా అనే ఆట్రోవిజన్ చిత్రం ప్రదర్శింపబడుతుంది. మారిటైమ్ సెంటర్‌లో సముద్ర చరిత్ర గురించి తెలుపుతారు. సైన్స్ పార్క్‌లో అన్ని రకాల విజ్ఞాన సూత్రాల గురించి తెలుపుతారు. కోల్‌కతా సైన్స్ సిటీని దర్శించి మీ పిల్లలను విజ్ఞానమూర్తులుగా మలచండి.

Exit mobile version